విజయవాడ

ఉల్లికి ఆధార్ లింకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 14: ఇక నుండి సబ్సిడీ ఉల్లిపాయలు అందాలంటే ప్రతిఒక్కరూ ఆధార్ కార్డు, లేదా రేషన్‌కార్డు నమోదు చేసుకోవాల్సిందేనని నగరంలోని రైతుబజార్ల సిబ్బందికి మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దివాకరరావు సూచించారు. గత వారం క్యూలైన్లలో ఉన్న వారందరికీ రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలు అందించారు. తరువాత ప్రతి ఒక్కరికీ కిలో చొప్పున అందించారు. ఇకపై మాత్రం రేషన్ కార్డు చూపించాలంటున్నారు. నగరంలోని రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు కిలో ఉల్లి రూ. 25లకే అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద, బడుగు వర్గాల ప్రజలకు ఎంతో ఊరట కలిగిందని వినియోగదారులు అభినందిస్తున్నారు. రేషన్, ఆధార్ కార్డుల వల్ల కొంత అక్రమ కొనుగోళ్లను నివారించ గలుగుతారని అంటున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులు క్యూలైన్‌లో నిలబడి ఉల్లిపాయలు కొని బయట చిల్లర వర్తకులకు కిలో రూ. 70, 80లకు అమ్మిన సందర్భాలున్నాయి. ఇక రేషన్ కార్డుల నమోదు వల్ల ఇలాంటి వారిని నియంత్రించే అవకాశముంది. భవానీపురం మోడల్ రైతుబజారులో శుక్రవారం 120 బస్తాలు, కేదారేశ్వరపేట రైతుబజారులో 80 బస్తాల ఉల్లి అమ్మకాలు జరిగాయి. రాజకీయ నాయకులు, పలు శాఖల అధికారులు, అనధికారులు ఉల్లి కోసం తమ హోదాలను ప్రదర్శించి క్యూలైన్‌లో నిలబడకుండానే ఎస్టేట్ ఆఫీసర్, సిబ్బందిని బెదిరింపు ధోరణిలో అక్రమార్గాన ఉల్లి తీసుకెళ్లిన సంఘటనలున్నాయి. ఆధార్, రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ మొదలవ్వగానే అలాంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్టుగా ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నామొన్నటి వరకు కిలో రూ. 200 పలికిన మేలిమి ఉల్లిపాయలు శుక్రవారం కిలో రూ. 150కి తగ్గాయి. 10రోజుల్లో ఉల్లిఘాటు తగ్గుతుందని, కిలో రూ. 40లకే లభించే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. భవానీపురం మోడల్ రైతుబజారులో ఎస్టేట్ ఆఫీసర్ వరికల్లు కోటేశ్వరరావు ఆధార్, రేషన్ కార్డుల నమోదుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయగా సిబ్బంది నందేటి శివసాయి, మండే శ్రీనులు సేవలు అందించారు. అలాగే 50వ డివిజన్‌లోని కేదారేశ్వరపేట రైతుబజారులో కూడా ఎస్టేట్ ఆఫీసర్ సూరగాని కరుణాకర్ ఆధార్, రేషన్ కార్డుల నమోదుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.