అక్షర

పల్లె మనసుకు అద్దం పట్టే ఊరవిశ్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాయిగిర్కమీద ఊర విశ్క
బూర్ల వెంకటేశ్వర్లు కవిత్వం
పేజీలు: 140,
వెల: రూ.100/-
సాహితీ సోపతి,
కరీంనగర్ ప్రచురణ
ప్రతులకు: బి.సంతోష- 9491598040

కరీంనగర్ జిల్లా కవితా కేతనాన్ని తెలుగు సాహితీ వీధుల్లో మరింత ఉన్నతంగా ఊరేగించడానికి తోడైన మరో కలం బూర్ల వెంకటేశ్వర్లు. బూర్ల ఊరిలో పుట్టినవాడు, ఊర్లో పెరిగినవాడు, ఊరి మట్టిలోంచి కవితల్ని పండిస్తున్నవాడు. కంకబద్దల్ని చీల్చి తడికెలల్లినట్లు, ఈత నులుకతో మంచాన్ని అల్లినట్లు, దారంపోగుల్ని కల్పి మగ్గంమీద బుట్టనేసినట్లు గ్రామీణ జ్ఞాపకాల తెరలపై కవితా రంగుల్ని అద్దుతున్నారు.
ఇటీవల విడుదలచేసిన బూర్ల వెంకటేశ్వర్లు కవితా సంపుటి ‘బాయిగిర్కమీద ఊరవిశ్క’ ఇందుకు నిదర్శనం. పల్లెబొమ్మను పట్టిచ్చే పేరు. ఈ ఊరవిశ్క కూడా కవియే. ఊరంతా తిరిగి ఊరి ముచ్చట్లన్నీ చెబుతాడు.
‘ఎనే్నండ్ల మర్రిచెట్టో/ నా పల్లె/ అడుగుపెట్టినప్పుడల్ల/ గుండెల్లో దప్పుల మోత’ అనే వాక్యాలు చాలు ఉద్యోగపరంగా ఎటు బతుకపోయినా పల్లెలో అడుగుపెడితే’ వాకిట్లో కోడిపిల్ల ఆత్మీయ పలకరింపు’లా ఉంటుందనడానికి.
‘గోడమీద గరుకపోస/ గూన పెంకల వానధార/ సందులోంచి మొలిచిన రావి చెట్టు/ గుండెలోంచి తన్నుకచ్చిన జ్ఞాపకం మాత్రమే కాదు, చూసిన వారికే తెలుసు వాటి అందాలు.
కవితా దీపం చేతబట్టుకొని తిరిగేవారికి ఆ దీపం వెలుతురు పడ్డ వస్తువల్లా కవితై కవి వెంట నడుస్తుంది. బొంబాయిని చూసిన కవి బూర్ల నగరాన్నంత వర్ణిస్తూ చివరకు కసబ్ కసాయితనం యాదికచ్చి/ కంటిలో ముళ్లు కనుక్కున కుచ్చుకుంటది’ అనడం కవి హృదయాన్ని తెలియజేస్తుంది.
కరీంనగర్ కోర్టు చౌరస్తా తన చిన్ననాటినుండి ఇప్పటికి మారిన తీరును కవి వలపోసుకుంటాడు. ‘ఇప్పుడు చక్కదనాల నీ మొకం/ వక్కలు వక్కలై/ అర్థంకాని పజిల్ ఐపాయె గదా!’అని బాధపడ్తాడు.
‘జీవిత ప్రయాణాన్ని, ప్రయాణ జీవితానికి అంకితం చేసి/ ఇంటికీ బస్సుకూ మధ్య/ కాలపుముందు చక్రంలా/ గిరగిరా తిరుగుతుంది ఆమె’ అంటూ లేడీ కండక్టర్ వెతలను చెబుతాడు. కవి చూపుకు ఓ నిర్దిష్ట లక్ష్యముంది. అందుకే శ్రమజీవి బంధువైంది.
‘జోడించిన విత్తనం చేతుల్లోంచి/ రెండు ఆకుల్నీ/ సునాయాసంగా/ కిరణాల దారాలతో పైకిలాగుతున్న సూర్యుడు’ అనే పంక్తులు కవి వ్యక్తీకరణ ప్రతిభకు నిదర్శనాలు.
‘ఎన్నీల ముచ్చట్లు’లో- ‘నా తల్లి బూమమ్మ/ తల్లి తోడబుట్టిన చందమామ/ కుద్దు నా మేనమామ/ ఎన్నీలనా మరదలుపిల్ల’ వెనె్నల బంధాన్ని చెబుతాయి.
కవి చిన్ననాడే చనిపోయిన అమ్మ యాది కవిత వ్యక్తిగతమే అయినా తెలంగాణ తల్లుల మనసుకు, అనుబంధాల పెనవేతకు అద్దంపడ్తుంది. ‘కాళ్లకు కడియాలు/ చేతికి దండ కడెం/ మెడల నాను, పుస్తెలతాడు/ ముక్కుకు మూడు రాళ్ల పుల్ల/ నొసట ఎర్రని కుంకుమ/ చెవులకు తెల్లరాళ్ల కమ్మలు/ నెత్తి సిగల బంగారి బిల్లతోని మల్లారా!’ అని తల్లిని తలుచుకుంటాడు కవి. ఈ వర్ణనలో చిత్రకారుడు వైకుంఠం బొమ్మ కనిపిస్తుంది.
కవిత్వీకరణలో పట్టుదొరికినాక వస్తు ఎంపికలో కవి జాగ్రత్తపడాలి. అంగిమీద, బండిమీద కూడా కవిత్వం రాయాలని మనసు పీకుతుంటదిగాని, హద్దుల్లో పెట్టుకున్నప్పుడే చిక్కనైన కవిత సృష్టి జరుగుతుంది. కవి పాదముద్రలు నిలిచి ఉంటాయి.
‘నా గుండెను తవ్వితే/ ఊరే కన్నీటి జలలు కొన్ని/ దొరికే అపురూప ముత్యాలు ఇంకొన్ని/ నేనొక నవ కవితావృక్షం’ ప్రకటనలో గుండెతో మొదలైన చిత్రం వృక్షంగామారి బద్దలైంది.
ఏ సిద్ధాంతం, తాత్వికత తెలియకుండానే ఈ కవిత్వం రాసినానంటున్న కవి అక్షరాలు మాత్రం పల్లెమనసుకు పట్టుకొమ్మలు.

-బి.నర్సన్