విశాఖపట్నం

కయాంత్ తుపానుతో భయం భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 27: కయాంత్ తుపాను గురించి నగరవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ఆందోళన చెందుతున్నారు. 2014 అక్టోబర్ 12న విశాఖలో సంభవించిన హుదుద్ తుపాను పరిస్థితులను ఇంకా మరచిపోక ముందే కయాంత్ తుపాను దూసుకువస్తుందనే భయం నగరవాసుల్లో పట్టుకుంది. అటువంటి బీభత్సాన్ని సృష్టిస్తే ఎదురయ్యే పరిస్థితులపై మధనపడుతున్నారు. మూడు రోజులకు సరిపడా నిత్యావసరాలను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. కయాంత్ తుపానుపై మూడు రోజులుగా జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. అలాగే ముందస్తు చర్యలు చేపట్టింది. నగరంలోని శివారు ప్రాంతాలు, మురికివాడలకు చెందిన పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలు బియ్యం, పప్పులు, నూనెలు, పెట్రోల్, కిరోసిన్, కూరలు వంటివి ముందుగానే సమకూర్చుకున్నారు. వీటి కోసం తెల్లవారుజాము నుంచి పరుగులు తీయడంతో దుకాణాలు, మార్కెట్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద రద్దీ ఏర్పడింది.
రైతుబజార్ల వద్ద పెరిగిన రద్దీ
నగరంలోని సీతమ్మధార, అక్కయ్యపాలెం, గోపాలపట్నం, కంచరపాలెం, మర్రిపాలెం, ఎంవిపి కాలనీ, మధురవాడ రైతుబజార్లతో పాటు సాధారణ మార్కెట్లైన పూర్ణామార్కెట్, అల్లిపురం, మర్రిపాలెం తదితర చోట్ల గురువారం విపరీతమైన రద్దీ ఏర్పడింది. అనేకచోట్ల తోపులాట నెలకొంది. ఇసుక వేస్తే రాలనంతగా మార్కెట్లు వినియోగదారులతో నిండాయి. కూరల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని మాసాలుగా కిలో ఉల్లి పది రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముడుపోతుండగా కయాంత్ తుపానుతో దీని ధర 20 రూపాయలకు చేరుకుంది. కొన్నిచోట్ల పాతిక రూపాయలకు కూడా అమ్మకాలు సాగించారు. అలాగే కిలో బీరకాయ నిన్నటి వరకు 30 రూపాయలుండగా ఇప్పుడది ఏకంగా రూ. 50 వరకు చేరుకుంది. టమాటా, బెండ, ఆనప, బర్బాటీ, క్యారెట్, బీన్స్, అల్లం, పచ్చిమిర్చి, బీట్‌రూట్, ఆగాకరకాయలు, చిక్కుళ్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణ మార్కెట్లు, రైతుబజార్లల్లో ఒక్కోచోట ఒక్కో విధంగా ధరలు పలుకుతున్నాయి. అలాగే నూనెలు, పప్పులు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. నాణ్యత లోపించి, కొలతల్లో తరుగు ఉంటున్నా ఏమాత్రం పట్టించుకోని వినియోగదారులు దొరికితే చాలన్నట్టుగా భావించడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. అలాగే పాల ప్యాకెట్లు ముందుగానే కొనుగోలు చేసుకుంటున్నారు.
* బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు
వరుసగా మూడు రోజుల పాటు తుపాను ప్రభావం ఉంటుందన్న ఆందోళనతో వాహనచోదకులు జాగ్రత్త పడుతున్నారు. అవసరానికి మించి పెట్రోల్ కొనుగోలు చేసుకుంటున్నారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి. నగరంలోని వెంకోజీపాలెం, సిరిపురం, గురుద్వారా జంక్షన్, మర్రిపాలెం, ఎండాడ, కొమ్మాది, బోయిపాలెం, ఎన్‌ఎడి జంక్షన్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనాలు బారులుతీరాయి. ద్విచక్ర వాహనాలు, టాక్సీలు, వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలలో పెట్రోలు నింపుకోవడంతో పాటు సీసాలు, డబ్బాలతో సహా నింపుకుని మరీ వెంట తీసుకువెళ్తున్నారు. అలాగే అటోలు డీజిల్‌తో నిండుతున్నాయి.
ఇళ్లల్లో నీటి నిల్వలు
తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే దీని ప్రభావం నీటిపైన పడుతుందని భావిస్తున్న వారంతా నీటి నిల్వలపై దృష్టి పెట్టారు. గురువారం ఉదయం నుంచి కుళాయిలు, మోటార్ ద్వారా సరఫరా అయ్యే నీటిని దాచుకోవడం ప్రారంభించారు. ప్రత్యేక ట్యాంకులు, డ్రమ్ములు, ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసుకోవడం కనిపించింది. అలాగే కొవ్వొత్తులు కొనుగోలు ఒక్కసారిగా పెరిగింది. నీరు, కొవ్వొత్తులు, నిత్యావసర సరకులు, కూరలు, పాలప్యాకెట్లను మూడు రోజులకు సరిపడేలా సిద్ధం చేసుకుంటుండటంతో బుధ, గురువారాల్లో దుకాణాలు, మార్కెట్ల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఒక్క ఆదివారం మాత్రమే రద్దీగా ఉండే మార్కెట్లు, బంక్‌లు, దుకాణాలు ఇపుడు తుపాను భయంతో కిటకిటలాడుతున్నాయి.
హుదుద్‌కు రెండేళ్లు... అయినా తొలగని భయం
2014 అక్టోబర్ 12న విశాఖలో సంభవించిన హుదుద్ తుపానుకు రెండేళ్లు పూర్తయ్యింది. అయితే నగరవాసులు దానిని మరువకముందే కయాంత్ తుపాను దూసుకొస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరిక, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న జాగ్రత్తలు నగరవాసుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి పరిస్థితులు పునరావృతం కాకూడదని, ఆ ఇబ్బందులు మళ్లీ చవిచూడరాదని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.