బిజినెస్

రూ. 18 వేల కోట్ల ప్రీమియం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రూ. 18 వేల కోట్ల ప్రీమియం వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి శ్రీనివాసన్ తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలాఖరు నాటికి రూ. 11,800 కోట్ల ప్రీమియం వసూలు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో తమ సంస్థ రూ. 16,050 కోట్ల ప్రీమియంను వసూలు చేయగా, రూ. 1,031 కోట్ల లాభాలను ఆర్జించినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ రూ. 788 కోట్ల మేర లాభాలను ఆర్జించిందన్నారు. కాగా, వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖాతాదార్ల క్లెయముల పరిష్కారంలో న్యూ ఇండియా ఎస్యూరెన్స్ ముందంజలో ఉందన్నారు. గతంలో విశాఖలో సంభవించిన హుదూద్ సూపర్ సైక్లోన్, తదనంతరం కాశ్మీర్ వరదలు, తాజాగా చెన్నై నగరాన్ని చుట్టుముట్టిన వరద ముంపు సందర్భంగా ఖాతాదారుల క్లెయములను తక్షణ ప్రాతిపదికన పరిష్కరించినట్టు ఆయన తెలిపారు. విశాఖ హుదూద్ తుపానులో 1,265 క్లెయము లు అందగా, వాటిలో 1,245 పరిష్కరించామని, రూ. 450 కోట్ల పరిహారం చెల్లించినట్టు శ్రీనివాసన్ తెలిపారు. వివిధ కారణాల రీత్యా మరో 20 క్లెయములు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాశ్మీర్ వరదల్లో 4,000 క్లెయములు అందగా, అన్నింటినీ పరిష్కరించి రూ. 400 కోట్లు పరిహారం చెల్లించామన్నారు. తాజాగా చెన్నై నగరాన్ని వరద ముంచెత్తగా సుమారు 2 వేల క్లెయములు అందాయన్నారు. వీటి పరిహారం సుమారు రూ. 500 కోట్ల వరకూ ఉంటుందని, వీటిలో ఇప్పటి వరకూ 200 క్లెయములు పరిష్కరించి రూ. 6 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. కొన్ని సందర్భాల్లో నష్టం అంచనావేసే క్రమంలో కొంత జాప్యం జరుగుతోందని, సర్వేయర్లు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సేవలందించేందుకు తమ సంస్థ మైక్రో ఏజెన్సీలను ఏర్పాటు చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 1,300 వరకూ మైక్రో ఏజెన్సీలను ఏర్పా టు చేశామన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీమాను విస్తృతంగా ప్రచారం చేసి, ఖాతాదారులకు సేవలందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారం తో పలు పథకాలను న్యూ ఇండియా ఎస్యూరెన్స్ అమలు చేస్తోందని వివరించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన జనధన్ యోజన పథకం కింద 18 కోట్ల బ్యాంకు ఖాతాదారులకు బీమా సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కోటి కుటుంబాలకు చెందిన నాలుగు కోట్ల మందికి వైద్య బీమా కల్పించనున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా కింద హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 1.5 కోట్ల వ్యక్తిగత పాలసీలు జారీ చేశామన్నారు. సంస్థ అంతర్జాతీయ వ్యాపారంలో అడుగుపెట్టిన సందర్భంగా మయన్మార్, ఖతార్, కెనడాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడించారు. విదేశాల్లో 24 శాఖలను ఏర్పాటు చేశామన్నారు. విశాఖ రీజియన్‌కు సంబంధించి కోస్తాంధ్రకు చెందిన 9 జిల్లాల్లో ఈ సంవత్సరం రూ. 330 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. గతేడాది రూ. 262 కోట్ల ప్రీమియం వసూలైందన్నారు.