విశాఖపట్నం

ఆగస్టు 3న జెపి పోలవరం సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: కోట్లాది రూపాయల ప్రజా ధనంతో చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆగస్టు 3న పరిశీలించనున్నారని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలను గుర్తించకుండానే ప్రభుత్వ హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతన పథకాన్ని చేపట్టిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో రూ.372 కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం గుత్తేదారుకు అక్రమంగా ముట్టజెప్పిందని, ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టిఎంసిల నీరు మళ్లించడం ఉద్దేశమన్నారు. తద్వారా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు, పారిశ్రామిక అవసరాలతో పాటు తాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలవుతుందన్నారు. గోదావరి జలాల కేటాయింపులో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఇది జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర నీటి అవసరాలు తీరాలంటే పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నించడంలో జనసేన విఫలం
జనసేన అధినేత లెక్కేంటో రాష్ట్ర ప్రజలకు అర్ధం కావట్లేదని భీశెట్టి విమర్శించారు. ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు జనసేన వెనుకాడదని ప్రకటించిన పవన్ కాల్యాణ్ విశాఖలో చోటుచేసుకున్న రూ.లక్ష కోట్ల భూ కుంభకోణంపై ఎందుకు వౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో అధికార టిడిపి పాత్ర స్పష్టంగా కన్పిస్తుండగా పవన్ మాత్రం స్పందించకపోవడం అభిమానులకు విస్మయం కలిగించిందన్నారు. పాలకులు తప్పుచేస్తే ప్రశ్నించడంలో వెనుకడుగువేయమని అభిమానులకు పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తునకు ఒప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ ప్రతినిధు హరిగణేష్, పక్కి శంకర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

29వ వార్డు టిడిపి అధ్యక్షుడు ఎల్లాజీ సస్పెన్షన్

విశాఖపట్నం, జూలై 18: టిడిపి 29వ వార్డు అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేసి, ఈమేరకు అందరి ఆమోదం మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్లాజీ తీరుతో పార్టీకి తీరని నష్టం కలుగుతోందని పేర్కొంటూ ఎల్లాజీని పార్టీ నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో ఎల్లాజీపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఎల్లాజీపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎల్లాజీ తీరు వల్ల పార్టీకి చేటు ఏర్పడకుండా నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. వార్డులో పార్టీ వ్యవహారాలను, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణను అర్బన్ పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌కు అప్పగిస్తూ సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ పార్టీకి పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.