విశాఖపట్నం

అబ్బురం..అంతర్భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: భారత నౌకాదళంలో విశేష సేవలందించి ఇప్పుడు మ్యూజియం రూపంలో మన ముందుకు వస్తున్న టి.యు-142 యుద్ధ విమానం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఆఖరిసారిగా ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయంలోని ల్యాండ్ అయిన ఈ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా మార్చే బాధ్యత వుడా తీసుకుంది. డేగా విమానాశ్రయంలో ఈ విమానాన్ని మూడు భాగాలుగా విడగొట్టి, అక్కడి నుంచి భారీ వాహనాలపై వాటిని బీచ్ రోడ్డులోని కురుసుర జలాంతర్గామికి ఎదురుగా ఉన్న స్థలంలోకి తరలించారు. ఆ విడిభాగాలను అతికించి, సరికొత్త విమానంగా తయారు చేసే పని చురుకుగా సాగుతోంది. ఈ విమానాన్ని మ్యూజియంగా మలిచేందుకు పదుల సంఖ్యలో నిపుణులు, కార్మికులు ఇక్కడ నిరంతరం పనిచేస్తున్నారు. విమాన అంతర్భాగం దాదాపూ మ్యూజియంకు అనువుగా మారింది. ఈ విమాన మ్యూజియంకు ఈనెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ ఏడవ తేదీన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మ్యూజియంను ప్రారంభిస్తారు. ఈ విమాన అంతర్భాగంలోకి ‘ఆంధ్రభూమి’ వెళ్లి, అందులో అబ్బురపరిచే అనేక ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. విమానం చీఫ్ మెకానిక్ మధు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాక్‌పిట్: విమానం ముందు భాగంలో కాక్‌పిట్ ఉంటుంది. ఇక్కడ పైలెట్, కోపైలెట్, నేవీగేటర్, ఇంజనీర్ ఉంటారు. చాలా ఇరుకుగా ఉంటే ప్రదేశమిది. ఈ విమానం ఒక్కసారి బయల్దేరిందంటే, 16 గంటలు ఏకధాటిగా ప్రయాణిస్తుంది. ఒక్కసారి విధుల్లో చేరిన క్రూ తిరిగి ల్యాండ్ అయ్యేంత వరకూ కంటిమీద కునుకు లేకుండా ప్రయాణించాల్సిందే. కాక్‌పిట్‌కు వెనుక మరో ఇద్దరు క్రూ ఉంటారు. వీరు పైలెట్, కోపైలెట్ సహాయకులుగా ఉంటారు.

కార్గో కంపార్ట్‌మెంట్: కాక్‌పిట్ నుంచి వెనక్కు వెళితే, కార్గో కంపార్ట్‌మెంట్ ఉంటుంది. ఇక్కడే బాంబ్ ఎక్విప్‌మెంట్, మిసైల్స్ ఉంటాయి. అలాగే రేడియో, సోనిక్ బాయ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. శత్రు స్థావరాలపై దాడి చేసేందుకు కావల్సిన సరంజామా అంతా ఇక్కడే ఉంటుందన్నమాట.

ఫ్యూల్ కంపార్ట్‌మెంట్: ఇది దాటి వెనక్కు వెళితే, విమానంలో ఫ్యూయల్ కంపార్ట్‌మెంట్స్‌లో ఒకటి ఇక్కడ ఉంటుంది. ఇక్కడో ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే, విమానం మధ్యలోనే కాదు, ఈ విమాన రెక్కల్లో కూడా ఫ్యూయల్ ట్యాంకర్లు ఉంటాయి. మరే ఇతర యుద్ధ విమానాల్లో ఎక్కడా ఇలాంటి ఫ్యూయల్ ట్యాంకర్లు ఉండవు. ఈ విమానం 80 టన్నుల ఫూయల్ కలిగి ఉంటుంది. మార్గ మధ్యంలో ఫ్యూయల్ కొరత ఏర్పడితే, ఉపరితలంలోనే మరో విమానం ద్వారా ఫ్యూయల్ తీసుకునే సౌకర్యం కూడా ఈ విమానానికి ఉంటుంది. గంటకు 825 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానాన్ని పైలెట్‌లు ఎంత అప్రమత్తంగా నడపాలో తలచుకుంటేనే ఆశ్ఛర్యం కలుగుతుంది కదూ!

ఫైర్ ఫైటింగ్ బాక్స్: ఈ కంపార్ట్‌మెంట్ తరువాత ఫైర్ ఫైటింగ్ బాక్స్ ఉంటుంది. విమానంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవిస్తే, వెంటనే ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్‌ను వినియోగించి మంటలను అదుపులోకి తెస్తారు.

ఆక్సిజన్ బాక్స్‌లు: దీని తరువాత ఐదు ఆక్సిజన్ బాక్స్‌లతో కూడిన విభాగం ఉంటుంది.

నిఘా కెమేరా: దీని పక్కనే అత్యాధునిక నిఘా కెమేరా ఉంటుంది. ఈ కెమేరా పనిచేయాల్సి వచ్చినప్పుడు విమానం అడుగు భాగాన ఉండే రెక్కలు విచ్చుకుంటాయి. వెంటనే కెమేరా తన పని తాను చేసుకుపోతుంది.

బ్లాక్ బాక్స్: విమానంలో అనుక్షణం జరిగే సంభాషణలను రికార్డు చేసే బ్లాక్ బాక్స్ విమానం చివరి భాగంలో ఉంటుంది. విమానం చిట్టచివరన ఫైర్ వౌంటెడ్ గన్ ఉంటుంది. ఈ విమానానికి చేరువగా వస్తున్న శత్రు విమానంపై ఇక్కడి నుంచే ఫైర్ చేస్తారు. అలాగే భారత సముద్ర జలాల్లో స్మగ్లర్లు, ఉగ్రవాదులను గుర్తిస్తే, వారిపై ఫైర్ చేయడానికి ఈ గన్‌ను వినియోగిస్తారు. ఈ గన్ ఫైర్ చేసే వ్యక్తి కనీసం కూర్చోడానికి కూడా చోటు ఉండదు. వాల్ వౌంటెడ్ సీట్ మీద కేవలం పడుకునే ఉండాలి. విమానం ఎంతసేపు ప్రయాణిస్తే అంతసేపు ఈ వ్యక్తి పడుకుని ఉండాల్సిందే.