విశాఖపట్నం

ప్చ్..ఇదేం పోలీసింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ నగరం అంటే ప్రశాంతతకు మారుపేరు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ నగరాన్ని అశాంతి నగరంగా మార్చేశారు. వీధి రౌడీలు.. రౌడీ షీటర్లు.. హంతకులు.. దోపిడి ముఠాలు... హత్యలు.. అత్యాచారాలు.. కిడ్నాప్‌లు.. వీటన్నింటితో విశాఖ నగర ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. నగరంలో కొంతమంది రాజకీయ నాయకులకు బినామీలుగా వ్యవహరిస్తున్న కొద్ది మంది పోలీసుల అండతో రౌడీషీటర్లు రెచ్చి పోతున్నారు. రౌడీషీటర్ల బలంతో వీధి రౌడీలు దందాలు చేస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. మాట వినని వారిని మట్టుపెడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌కో, కమిషనరేట్‌కో వస్తే వారిచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా బుట్ట దాఖలు చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులు, రౌడీ షీటర్లకు అండగా నిలబడి వారి కనుసన్నలలో నేరాలు చేయించడం చూస్తే, ఇదేం పోలీసింగ్.. అని జనం ముక్కున వేలేసుకోవలసి వస్తోంది.
మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె పద్మలత కేసులో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడం వలన వ్యవహారం ఇంత వరకూ వచ్చింది. రవిబాబు తనను మోసం చేశాడని పద్మలత ఫిర్యాదు చేసినప్పుడే, అప్పటి పోలీస్ ఉన్నతాధికారి స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవికావు! అప్పుడు రవిబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయనకు నగరంలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుని అండ ఉందని పోలీస్ శాఖలో ఎవ్వరిని అడిగినా చెపుతారు. పద్మలత అనుమాన్పదంగా మరణించిందన్న వార్త బయటకు పొక్కిన తరువాతైనా పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును దర్యాప్తు జరిపి ఉంటే, నేరస్తులు బయటకొచ్చేవారు. ఆమె గుండెపోటుతో చనిపోయిందని పద్మలత కుటుంబీకులను నమ్మించి, ఫిర్యాదే లేకుండా చేశారంటే, సదరు పోలీసు అధికారికి రాజకీయ నాయకుల అండదండలు లేవంటారా? ఇప్పటికీ పద్మలత తండ్రి కాకర నూకరాజు బయటకొచ్చి నిజాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. పద్మలత మరణానికి కారణమైన వారిపై సిబిఐ విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయి తప్ప, పద్మలత కుటుంబీకులు ఎందుకు స్పందించడం లేదు? పోలీస్ అధికారికి, రౌడీ షీటర్లకు భయపడా? ఈ కేసును ఎందుకు ఛేదించే ప్రయత్నం చేయలేకపోతున్నారు?
ఇక రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకు గాజువాకలో కుట్ర జరిగింది. అక్కడే రాజును హతమార్చారు. సబ్బవరం సమీపంలో రాజు శవనాన్ని తగులబెట్టారు. ఆ తరువాతైనా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రాజు హత్యపై దర్యాప్తు ప్రారంభించారా? అంటే అదీ లేదు. పత్రికల్లో వరుస కథనాలు వస్తుంటే, చేసేది లేక పోలీసులు రంగంలోకి దిగి చిన్నపాటి రౌడీలను పట్టుకున్నారే తప్ప, ఏ1, ఏ2లను ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. ఓపక్క టాస్క్ ఫోర్స్, మరోపక్క, స్పెషల్ బ్రాంచ్ వగైరా విభాగాలన్నీ పదునుగా పనిచేసి ఉంటే, వీరిద్దరూ దొరకరా? ఇప్పటికీ రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు కలిసే ఉన్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ నేరుగా కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మీడియా ముందుకు ప్రవేశపెట్టగలరా?
నగరంలో సంచలనం సృష్టించిన పద్మలత, గేదెల రాజు హత్య కేసులో నిందితులుగా ఉన్న రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజును పోలీసులు పట్టుకోగలరా? లేక వారు కోర్టులో లొంగిపోడానికి అవకాశం కల్పిస్తారా? వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తే, మీడియా మందు ప్రవేశపెట్టగలరా? ఏ1గా ఉన్న రవిబాబు మీడియా ముందు నిలబడితే, పోలీస్ వ్యవస్థ పరువు పోతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల ప్రతిష్ట ఇప్పటికే దిగజారిపోయినప్పుడు, రవిబాబును మీడియా ముందు ప్రవేశపెట్టడం వలన కొత్తగా పోయేదేమీ ఉండకపోవచ్చు.
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఏదీ!
రౌడీ షీటర్లకు పోలీసులు అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. నగరంలో ఇటువంటి ప్రక్రియే జరగడం లేదు. నగరంలో 23 పోలీస్ స్టేషన్లలో 230 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సత్ ప్రవర్తనతో ఉన్నారు. మిగిలిన వారంతా నగరంలో నేరాలకు పాల్పడుతునే ఉన్నారు. నగరంలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులు రౌడీ షీటర్లకు అండదండలు అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరికి కౌన్సిలింగ్ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, రౌడీ షీటర్లు చెప్పినట్టే పోలీసులు నడుచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న రౌడీ షీటర్లపై రౌడీషీట్లు తొలగిస్తున్నారన్న అపవాదులు పోలీసులు మోయాల్సి వస్తోంది. రవిబాబు పనిచేసిన చోటికి తనకు అండగా ఉన్న రౌడీ షీటర్లను తీసుకువెళ్లేవాడు. ఆయన పనిచేసే ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ రౌడీ షీటర్ల హవా నడిచేది. అప్పుడైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారా? కేవలం రాజకీయ నాయకులకు భయపడి హత్యలను ప్రోత్సహించారన్న విమర్శలను పోలీసు ఉన్నతాధికారులు మోయాల్సి వస్తోంది.
దర్యాప్తులో ప్రగతి ఏదీ!
నగరంలో హత్యలు ఏటేటా పెరిగిపోతున్నాయి. హంతకులను పట్టుకోవడంలో, కేసును కొలిక్కి తీసుకురావడంలో నగర పోలీసులు విఫలమవుతున్నారు. ఇదేంటని అడిగితే, నగరానికి విఐపిల తాకిడి ఎక్కువగా ఉన్నందువలన ప్రోటోకాల్ బాధ్యతలతో సతమతమవుతున్న తాము దర్యాప్తుపై ఏవిధంగా దృష్టిపెట్టగలమని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కారణాలేమైనా కావచ్చు కేసుల దర్యాప్తులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన కింది సిబ్బంది తమకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు! హత్య కేసులే కాదు, కనీసం దోపిడీ కేసులను కూడా చేధించలేకపోతున్నారు.
పోలీస్ సెటిల్‌మెంట్స్!
గత కొన్ని సంవత్సరాలుగా విశాఖలో భూముల విలువ గణనీయంగా పెరిగిపోవడంతో భూ కబ్జాలు పెరిగిపోయాయి. తమ భూమి పోయిందని బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే, అక్కడున్న పోలీసులే సెటిల్‌మెంట్లకు దిగుతున్నారు. ఈరకంగా చాలా మంది పోలీసు అధికారులు కోట్ల రూపాయలు ఆర్జించినట్టు భోగట్టా. పద్మలతను, గేదెల శ్రీనును వదిలించుకోడానికి రవిబాబు కోట్ల రూపాయలు వెదచల్లాడంటే, ఆయనకు అంత పెద్ద మొత్తం ఏవిధంగా వచ్చింది? ఇప్పటికీ నగరంలోని చాలా పోలీస్ స్టేషన్లలో సెటిల్‌మెంట్లు జరుగుతున్న విషయం పోలీస్ ఉన్నతాధికారి తన దగ్గరున్న గూఢచారులను పంపించి తెలుసుకోవచ్చు.
పోలీస్ బాస్‌ను గుర్తుతెచ్చుకోండి!
నగర పోలీస్ కమిషనర్‌గా సాంబశివరావు పనిచేసినప్పుడు ఓ కిడ్నాప్ జరిగింది. ఈ కేసును చేధిస్తున్న సమయంలో కిడ్నాప్‌నకు పాల్పడిన వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేసేశారు. దాంతో నగరంలో రౌడీషీటర్లు పరారైపోయారు. ఇలాంటి చర్యలేవో చేపట్టకపోతే, రౌడీషీటర్లు పోలీసులను చేతకానివారిగా భావించి ఇంకా పేట్రేగిపోతారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోవలసి వస్తోంది.