విశాఖపట్నం

గణబాబు, కిడారికి విప్ పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: ఎమ్మెల్యేలు గణబాబు, కిడారి సర్వేశ్వరరావుకు ప్రభుత్వ విప్ పదవులు లభించాయి. ఈ పదవుల రేసులో లేని వీరిద్దరికి ఈ పదవులు లభించడం గమనార్హం. చీఫ్ విప్‌గా పల్లె రఘునాథరెడ్డిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విప్‌లుగా ఎవరిని నియమించాలన్న విషయంలో చంద్రబాబు కొంత సమయం తీసుకున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను చంద్రబాబు పరిశీలించారు. ఎట్టకేలకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పేరును ఆయన ఖరారు చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కొద్ది కాలం కిందట జరిగిన మంత్రివర్గ విస్తరణలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని భావించారు. అప్పటికప్పుడు మారిన సమీకరణాల్లో కిడారికి స్థానం దక్కలేదు. దీంతో ఇప్పుడు ఎస్టీ కోటాలో కిడారిని ఎంపిక చేశారు. విశాఖ జిల్లాలో ఒకేసారి ఇద్దరికి విప్ పదవులు దక్కడం గమనార్హం.

రైతులకు మంచి రోజులు రావాలి
* అగ్రిటెక్ సదస్సులో చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 15: రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు రావాలని నిరంతరం కోరుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్థానిక ఏపిఐఐసి గ్రౌండ్స్‌లో బుధవారం ప్రారంభమైన ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017లో చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో 13 శాతం సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అన్నారు. 11.61 శాతం వృద్ధి రేటును రాష్ట్రం సాధించిందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆరు పోర్టులతో పాటు కొత్తగా మరో ఎనిమిది పోర్టులను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఆరు క్తొత విమానాశ్రయాలను రాష్ట్రంలో నెలకొల్పనున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి గ్రామంలోను సేంద్రియ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఏ పంట ఎక్కడ వేయాలనేది నిర్ణయించి, వివిధ వ్యవసాయ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐయోవా స్టేట్ యూనివర్శిటీ సహకారంతో మెగా సీడ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. వర్షపాతం, భూగర్భ జలాలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేశామని, వ్యవసాయాన్ని వాణిజ్యంగా మార్పు చేయాలన్నదే తన ఆలోచన అని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంతోపాటు, దాని అనుబంధ రంగాలను కూడా విస్తృతంగా అభివృద్ధి చేసి, తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు.

రైతు బిడ్డగా గర్వపడుతున్నాను!
* ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 15: తను రైతు బిడ్డనని చెప్పుకునేందుకు ఎప్పుడూ గర్వపడుతుంటాను. పచ్చని చేలు, నీటితో నిండిన జలాశయాలు చూస్తే నా మనసు పులకరిస్తుంది. దేశానికి అన్నం పెట్టేది రైతేనన్న విషయాన్ని ఎవ్వరూ మరిచిపోకూడదని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. స్థానిక ఏపిఐఐసి గ్రౌండ్స్‌లో బుధవారం ప్రారంభమైన ఏపి అగ్రిటెక్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను మరింతగా పెంచాలని అన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పతుల అదనపు హంగులు కల్పించి మార్కెట్ చేయాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఇటీవల కాలంలో పంటలకు పెట్టుబడి విపరీతంగా పెరుగుతోందని, రాబడి తగ్గిపోతోందని ఆయన అన్నారు. పెట్టుబడి ఖర్చును వీలైనంతగా తగ్గించాలని ఆయన సూచించారు. పండిన పంటలకు మార్కెట్ సదుపాయం ఉండాలంటే గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ పెరగాలని అన్నారు. వాజ్‌పాయి ప్రధానిగా ఉన్నప్పుడు స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన మంత్రి వర్గంలో తను గ్రామీణాభివృద్ధి శాఖను ఏరి కోరి తీసుకునాన్ననని వెంకయ్య నాయుడు చెప్పారు. నేటి ప్రధాని మోదీ గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా బీడువారిన పొలాలను సాగులోకి తీసుకురావచ్చని, ఇందుకు పట్టిసీమ ఒక ఉదాహరణ అని ఉప రాష్టప్రతి అన్నారు. వ్యవసాయంతోపాటు, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన సూచించారు.

సాంకేతికతను ఉపయోగించుకోవాలి
* సిఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 15: రాష్ట్రంలో చిన్న గ్రామాలు, పట్టణాలు కూడా సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. స్మార్ట్ సిటీపై పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా రూపొందించిన పోస్టర్‌ను సిఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని ప్రభుత్వరంగంలో నడుస్తున్న కర్మాగారాలు స్మార్ట్ సిటీ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయని అన్నారు. పరిశుభ్రత, ప్లానింగ్, అడ్మినిస్ట్రేన్‌లో ప్రజల పాత్రను తెలియచేయడంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ పాత్రను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సమాచార పౌర సంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ జాతీయ అధ్యక్షడు డాక్టర్ అజిత్ పాథక్, దక్షిణ భారత ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ, విశాఖపట్నం చాప్టర్ కార్యదర్శి పి.ఎల్.కె.మూర్తి, జాతీయ కమిటీ సభ్యుడు బి.వి.విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రైతుకు వ్యవసాయం లాభసాటి కావాలి
* అందుకే ఈ ప్రయత్నం
* వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 15: రైతుకు వ్యవసాయం లాభసాటి కావాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతున్న ఎపి అగ్రిటెక్ సమ్మిట్ 2017 ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయ విధానాల కారణంగా రైతాంగం నష్టాల పాలవుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. యాంత్రీకరణ, ఆధునిక విధానాలతో సాగు లాభసాటి కానుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న అత్యాధునిక సాగు విధానాలను రాష్ట్ర రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావడం, వీటిపై వారికి అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సులు దోహదం చేస్తాయన్నారు. వ్యవసాయంలో సాంకేతికత చొప్పించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం పొందేలా చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే విత్తనాలు, రసాయన ఎరువుల వినియోగం వంటి అంశాలపై కూడా రైతుకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఒక్క వ్యవసాయంలోనే కాకుండా, ఉద్యానవన పంటలు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్థక విభాగాల్లో రైతులకు లాభాలు పండించేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై నిపుణులు, శాస్తవ్రేత్తలు, ఆయా రంగాల్లో నిష్ణాతులు కీలక సూచనలు చేస్తారన్నారు. ముఖ్యంగా భూసార వివరాలు తెలుసుకోవడం ద్వారా రైతు ఏ పంట పండించాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వస్తాడన్నారు. దీనితో పాటు పైరుకు అవసరమైన రసాయన ఎరువుల వినియోగంలో కూడా జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతుందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించినప్పటికీ, దీన్ని నిరంతర ప్రక్రియ చేయనున్నట్టు తెలిపారు. ఇక సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతాంగం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందేలా చూడాలన్నదే లక్ష్యమన్నారు. రసాయన, క్రమిసంహారక మందుల వినియోగం వల్ల పర్యావరణంపై ప్రభావంతో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 క్లస్టర్లను ఏర్పాటు చేసి లక్ష ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా జరుగుతున్న అగ్రిటెక్ సదస్సు ద్వారా బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్ (బిఎంజిఎఫ్) సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకువచ్చే సంస్కరణలకు ఫౌండేషన్ సహకరిస్తుందన్నారు. సదస్సు చివరి రోజున ఫౌండేషన్‌తో ఎంఓయు కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. సదస్సులో కీలక అంశాలపై విస్తృత చర్చలు జరుగుతాయని, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై తుది ప్రణాళిక రూపొందించనున్నట్టు వెల్లడించారు.

యాంత్రీకరణే శరణ్యమా!
* భవిష్యత్‌లో కూలీల కొరతే కారణం
* చిన్న కమతాలు కనుమరుగయ్యే ప్రమాదం
* రైతుల భిన్నాభిప్రాయాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 15: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణే శరణ్యమా! సంప్రదాయ వ్యవసాయంతో నష్టాల పాలవుతున్న రైతాంగం తక్కువ ఖర్చుతో గట్టెక్కాలంటే యాంత్రీకరణ ఒక్కటే మార్గమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో అందునా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతోంది. దీనికి కారణం రాష్ట్రంలో చిన్న,చిన్న కమతాలే అధికం. కేవలం 10 శెంట్ల నుంచి రెండెకరాలు కలిగిన రైతాంగమే అధికం. ప్రపంచ అనుసరిస్తున్న యాంత్రీకరణ ఇటువంటి చిన్న కమతాల్లో సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగానే పెద్ద కమతాలు ఉంటాయి. ఒకవేళ చిన్న కమతాలున్నప్పటికీ క్లస్టర్ల విధానంలో వీరు యాంత్రీకరణ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. మన రాష్ట్రంలో ఇది ఎంతవరకూ సాధ్యమన్న అంశంపై పలువురు రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరంలో బుధవారం ప్రారంభమైన ఎపి అగ్రిటెక్ సమ్మిట్ 2017 సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

యాంత్రీకరణ మంచిదే
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఒక విధంగా మంచిదే. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో కూలీల కొరత పెద్ద సమస్యగా మారనుంది. వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో రైతాంగం ప్రత్యామ్యాయ మార్గాలను అనే్వషిస్తోంది. వ్యవసాయంపై ఆసక్తి సన్నగిల్లడంతో యువతరం కూడా విముఖంగానే ఉంది. ఈ తరుణంలో యాంత్రీకరణ అవసరమే అన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. అయితే యాంత్రీకరణ వల్ల చిన్న కమతాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అత్యంత ఖర్చుతో కూడిన యాంత్రీకరణ చిన్న కమతాలు సాగుచేసుకునే రైతాంగాన్ని దెబ్బతీస్తుంది. అయితే గ్రామాల్లో సాగు భూమిని క్లస్టర్లుగా చేసి యాంత్రీకరణను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయడమే
వ్యవసాయంలో యాంత్రీకరణ అంటే రైతును తప్పించి, సాగు భూములను కార్పొరేట్ వర్గాల చేతుల్లో పెట్టడమే. పురాతన సాగు పద్ధతులను విస్మరించడం వల్లే రైతాంగం నష్టాల పాలవుతోంది. వేల ఏళ్ల కిందట ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో మన రైతాంగం ఇప్పటికంటే రెట్టింపు దిగుబడులు సాధించారు. మానవ తప్పిదాల వల్ల భూ సారం తగ్గి పంట దిగుబడులు పడిపోతున్నాయి. దీనికి రైతే కారణం. సాగులో ప్రకృతి వ్యవసాయం ఆచరిస్తే, ఎటువంటి యాంత్రీకరణ అవసరం లేకుండానే లాభాలు ఆర్జించవచ్చు.
నరేగాకు అనుసుంధానం చేయాలి
వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలి. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల వేతనాలే భారం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఉపాధిహామీ పథకం కింద వెచ్చిస్తోంది. దీంతో ఉపాధి పథకం పనుల్లోకి వెళ్తున్న కూలీలు, వ్యవసాయ పనులకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీంతో కూలీలు దొరక్క పనులు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉపాధిహామీ నిధులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతుకు మేలు చేకూర్చినట్టవుతుంది. అలాగే రైతు పండించే పంటకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ఎక్కువ ధర లభించే ప్రాంతానికి పంటను పంపితే కొనుగోలు దారు తరపున ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే రైతుకు లాభసాటిగా ఉంటుంది.

రైతుకు అవగాహన ముఖ్యం
వ్యవసాయంలో యాంత్రీకరణపై తొలుత రైతుకు అవగాహన కల్పించాలి. చిన్న కమతమైనా, పెద్ద కమతమైనా యాంత్రీకరణ వల్ల ఉపయోగం తప్ప ప్రమాదం లేదు. అయితే ఇప్పటికీ సంప్రదాయ సాగుకే ప్రాధాన్యతనిస్తున్న రైతాంగానికి నూతన సాగు పద్ధతులపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. అలాగే ప్రకృతి సాగు వైపు రైతాంగం మళ్లాల్సి ఉంది. తద్వారా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి, లాభాలు పొందేందుకు అవకాశం ఉంది.

ప్రకృతి వ్యవసాయంతో సాగులాభం
ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు సుభాష పాలేకర్ సాగును లాభసాటిగా మార్చేందుకు పలు అంశాలను ప్రస్తావించారు. దీనిలో ప్రధానమైంది ప్రకృతి వ్యవసాయం. ప్రతి రైతు ఒక ఆవును పెంచుకుంటే ఎటువంటి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండానే లాభాలను పండించుకోవచ్చు. వీటన్నిటి కంటే ముందు ప్లాస్టిక్‌ను పూర్తి నిషేధించాలి. ప్లాస్టిక్ కారణంగా భూసారం చచ్చుబడిపోతోంది. పాలేకర్ సూత్రీకరణ ప్రకారం జీవామృతం భూమిలో సారాన్ని పెంచేందుకు, పైరుకు చీడపీడ తెగుళ్ల నుంచి రక్షణ కల్పించేందుకు మంచి మార్గం. తక్కువ ఖర్చుతో సేంద్రీయ విధానంలో సాగు చేయడం వల్ల ఆరోగ్యవంతమై జీవితం సాధ్యమవుతుంది.

ప్రకృతి కరుణిస్తేనే రైతు బాగు
విధానం ఏదైనా ప్రకృతి కరుణిస్తేనే రైతుకు సాగు లాభసాటి అవుతుంది. యాంత్రీకరణ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. అయితే చిన్న కమతాలకు ఇది వర్తింప చేయాలంటే యంత్రాంగం చొరవ అవసరం. చిన్న కమతాలను ఏకం చేసి, యంత్రాలను సమకూర్చగలిగితే రైతు తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగలడు. ఇదే సందర్భంలో సాగునీటి వసతి కల్పన కూడా తప్పనిసరి. పూర్తిగా వర్షాధారంపై రైతు అదృష్టాన్ని నమ్ముకునే వ్యవసాయం చేయాల్సి వస్తోంది.

సాగులో డ్రోన్ దే రాజ్యం
* రసాయనాల పిచికారీ
* పంట పర్యవేక్షణ
* భూసార వివరాల వెల్లడి
* ఆసక్తిగా పరిశీలించిన రైతులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 15: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణం. ఒకప్పుడు పొలం పనులు చేయాలంటే కూలీలను వినియోగం తప్పనిసరి. విత్తనాలు జల్లడం, సస్యరక్షణకు ఎరువుల పిచికారీ, పంట పర్యవేక్షణ ఇటువంటి అంశాలు రైతులే స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక భూసారం, భూమిలో ఉండే తేమ వంటి అంశాలు తెలుసుకోవాలంటే వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలను సంప్రదించాల్సిందే. ఇప్పుడు ఆపరిస్థితులు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఒక్క యంత్రంతోనే అన్ని పనులు చేసుకునేలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన సాంకేతికతను మన సంప్రదాయ సాగు విధానంలోకి చొప్పించే ప్రయత్నాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. అందుకు నగరంలో మూడు రోజుల పాటు జరిగే ఎపి అగ్రిటెక్ సమ్మిట్ - 2017 వేదిక కానుంది. ఉప రాష్టప్రతి చేతుల మీదుగా ఎపిఐసిసి గ్రౌండ్స్‌లో ఎపి అగ్రిటెక్ సమ్మిట్ బుధవారం ప్రారంభమైంది. సమ్మిట్‌లో ప్రధానమైన యాంత్రీకరణ ఎగ్జిబిషన్‌ను ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వ్యవసాయంలో కూలీల సంఖ్యను తగ్గించడంతో పాటు సాంకేతిక అంశాలు కూడా పర్యవేక్షించే డ్రోన్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది.

గ్లోబల్ టెక్నాలజీస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఫాప్‌టెక్ సంస్థ పొలానికి క్రిమి సంహారక మందును పిచికారీ చేసే డ్రోన్‌ను ప్రదర్శనలో ఉంచింది. మూడు నుంచి 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన ట్యాంకులతో ఉండే ఈ డ్రోన్‌లు రెండో మనిషి సాయం లేకుండానే పనిపూర్తి చేస్తుంది. కేవలం ఏడు నిముషాల వ్యవధిలోనే ఎకరం పొలానికి రసాయన మందు పిచికారీ చేస్తుందీ యంత్రం. మూడు లీటర్ల సామర్ధ్యం కలిగిన డ్రోన్ ఖరీదు రూ.3 లక్షలు కాగా, 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన యంత్రం రూ.6 లక్షలకు లభిస్తోంది. చిన్న కమతాలున్న రైతులు కూటమిగా ఏర్పడితే అద్దె ప్రాతిపదికన ఎకరాకు రూ.200 చొప్పున తామే యంత్రాన్ని తీసుకువచ్చి, పని పూర్తి చేస్తామని ఫాప్‌లీ టెక్ యాజమాన్యం గోపిరాజు, మురళీకృష్ణ వెల్లడించారు.

ఒకే డ్రోన్ మూడు ఉపయోగాలు
ఒకే డ్రోన్‌తో మూడు ఉపయోగాలు. ఆక్సిజన్ యుఎఎస్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ డ్రోన్ 45 నిముషాల వ్యవధిలో ఏకధాటిగా 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో క్రిమిసంహారక మందును పిచికారీ చేస్తుంది. ఇది కేవలం రసాయన పిచికారీకే కాకుండా పంటను పర్యవేక్షించి ఎక్కడ చీడపీడలు ఆశ్రయించిందీ తెలియజేస్తుంది. దీంతో రైతు తక్షణమే అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇదే డ్రోన్ ఎరియల్ మేపింగ్ చేస్తుంది. దీన్ని ఇక్రిసాట్ యాప్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో భూసార పరీక్షలు అవసరం లేకుండానే సస్య రక్షణకు అవసరమైన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడే అవకాశం ఉంటుంది.