విశాఖ

గిరిజన రైతన్నను బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురస్తున్న వర్షాలు విశాఖ మన్యంలోని గిరిజన రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఈ ప్రాంతంలో వర్షం చిరు జల్లుల మాదిరిగానే ఉన్నప్పటికీ దట్టంగా అలముకున్న మబ్బులతో ఏ క్షణాన భారీ వర్షానికి దారితీస్తోందనని రైతన్నలు కలత చెందుతున్నారు. రానున్న రెండు మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు గిరిజన రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మన్యంలో వరి పంట సమృద్ధిగా పండడంతో గత రెండు వారాల క్రితమే పంట కోతలను రైతులు చేపట్టారు. పంట పొలాల్లోని వరి నారును కోసి కళ్లాకు చేర్చి వాటిని కుప్పలు వేసే పనిలో రైతన్నలు నిమగ్నమయ్యారు. అయితే ఇటువంటి తరుణంలో వర్షాలు కురిస్తే వరి పంట పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో చాలా చోట్ల వరి పంట కోత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాలలో కళ్లం వరకు చేర్చినప్పటికీ దానిని కుప్పలుగా అమర్చలేదు. పంట ఒకేసారి కోసి కళ్లంకు చేర్చిన తరువాత కుప్పలు వేసి నూర్పులు ప్రారంభించవచ్చునని భావించిన గిరిజన రైతన్నలు ఏపుగా కాసిన వరి పంట కోతలలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఆకస్మికంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వలన వర్షాలు పడితే కోత దశలో ఉన్న పంట అంతా నీటిపాలై ఎందుకు పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన పంటను కుప్పగా అమర్చితే వర్షం పడినా అంతగా నష్టం ఉండదని, అయితే ప్రస్తుతం చాలా చోట్ల కోత దశలో ఉండడం, కోసిన పంటను కళ్లంకు చేర్చడంతోనే సరిపోయింది. ఈ తరుణంలో భారీ వర్షాల హెచ్చరికలతో పాటు ఆకాశమంతా మేఘావృతం కావడం రైతులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దీంతో గత మూడు రోజులుగా గిరిజన రైతులు కోసిన పంటను హడావుడిగా కళ్లంకు చేర్చుకుని కుప్పలు వేసే పనిలో పడ్డారు. అయితే భారీ వర్షాలు కురిస్తే కోసిన పంటే కాకుండా పోలంలో ఇంకా కోయాల్సిన పంట కూడా నీట మునిగే ప్రమాదం ఉందని అంటున్నారు. గతంలో ఏన్నడూ నవంబర్ నెలలో వర్షాలు కురిసిన సందర్భాలు లేవని, ఈ సంవత్సరం తలెత్తిన విపత్కర పరిస్థితి తమ బతుకులను తారుమారు చేసేదిగా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంతవరకు పొలం నుంచి కోసిన పంటనైనా కాపాడుకునేందుకు రైతులు తాపత్రయం పడుతూ హడావుడిగా వరి చేళ్లను కుప్పలు వేసుకుంటుండడం మన్యంలో కనిపిస్తోంది.