విశాఖపట్నం

మాతృభాష మనుగడకు చేయూతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: మాతృభాషను బతికించుకునేందుకు చేపట్టిన సంకల్పానికి మద్దతివ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. తెలుగు దండు సమన్వయ కర్త పరవస్తు ఫణిశయన సూరి ఆధ్వర్యంలో ప్రాధమిక విద్యలో తెలుగుభాషను తప్పనిసరి చేయడంతో పాటు భాష మనుగడకు చేయూతనివ్వాలని కోరుతూ గత 21 రోజులుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగుదండు దీక్షకు సంఘీభావంగా యార్లగడ్డ మంగళవారం దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జాతీ చేసిన ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలన్నారు. గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తెలుగు భాష విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలుగు భాష ఉద్యమ నేత గిడుగు రామ్మూర్తి జయంతి నాడు మాత్రమే ప్రభుత్వానికి భాషపై అభిమానం పొంగిపొర్లుతుందన్నారు. గత 21 రోజులుగా తెలుగు భాష కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ నెల 23న ‘తెలుగుతల్లి’ విగ్రహాన్ని ఊరేగించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి పూలరధంపై తెలుగు తల్లి విగ్రహాన్ని సెంట్రల్ పార్కు చుట్టూ ఊరేగిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు తన బృందంతో తెలుగు భాష పరిరక్షణపై పాడిన గేయాలు ఆకట్టుకున్నాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కేవలం తమ ప్రసంగాల్లోనే వినిపిస్తున్నారని, ఫణిశయన సూరి మండిపడ్డారు. తమ గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలన్న ఒకే ఒక లక్ష్యంతో గత మూడు వారాలుగా నిరసన దీక్ష చేస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం వద్ద పలువురు భాషాభిమానులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జాలాది విజయ, బాదంగీర్ సాయి, కళాకారులు శివ జ్యోతి, నాగలక్ష్మి, పుష్పలత, అడవి రాజు, చెన్నా తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించండి
* ఏయూ ఒప్పంద ఉద్యోగులు
ఆరిలోవ, నవంబర్ 21: ఆంధ్రా యూనివర్శిటీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏయూ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. సహాయ అధ్యాపకుల పోస్టుల్లో కొనే్నళ్లుగా ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిని తొలగించి కొత్తవారికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని 14 యూనివర్శిటీల్లో సుమారు 1400 మంది ఒప్పంద సహయ అధ్యాపకులు పనిచేస్తున్నారని కాంట్రాక్ట్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి అర్జునుడు పేర్కొన్నారు. ఒక్క ఏయూలోనే 117 మంది ఒప్పంద సహాయ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని, ఏపీపీఎస్సీ ద్వారా సహాయ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించిందన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒప్పంద సహాయ ఉపాధ్యాయులంతా రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒప్పంద సహాయ ఉపాధ్యాయుల పోస్టులను క్రమబద్దీకరించి, వారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఒప్పంద సహాయ అధ్యాపకులు పాల్గొన్నారు.