విశాఖపట్నం

గణేశ్వరరావు అండతో చెలరేగుతున్న బినామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దెకు ఇళ్లపై బ్యాంకు రుణాలు
* చాలా బ్యాంకులను మోసం చేసిన గణేశ్వరరావు బినామీలు
* నర్సీపట్నం, అనకాపల్లిలో దొంగ డాక్యుమెంట్ల రూపకల్పన
* బినామీ పేర్లతో ఖరీదైన కార్లు
* లక్షల రూపాయలతో ఫ్యాన్సీ నెంబర్ల కొనుగోళ్లు
* పెంపుడు కుక్కలకు లక్షల్లో ఖర్చు

విశాఖపట్నం, నవంబర్ 22: చిన్నపాటి సర్వేయర్..కోట్ల రూపాయలు కూడబెట్టాడు. ఆదినుంచి అక్రమ మార్గానే్న ఎంచుకుని, కోట్లకు పడగలెత్తాడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా, చట్టంలోని లొసుగులను గుర్తించి, వాటిని అడ్డం పెట్టుకుని కోటీశ్వరుడయ్యాడు. అంతేకాదు, రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే, గణేశ్వరరావు తన చుట్టూ ఓ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనలాగే, మాటలతో, చేతలతో మోసం చేయగలిగేవారిని తన చుట్టూ చేర్చుకున్నాడు. తను సంపాదించిన ఆస్తులను వారి పేరిట పెట్టి, వారిని బినామీలుగా ఉపయోగించుకున్నాడు. లగ్జరీ కార్లు, ఎక్కడపడితే అక్కడ ఇళ్లు ఇలా లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టాడు. గణేశ్వరరావు జీవన శైలి గురించి తెలిస్తే ఆశ్ఛర్యపోతారు. ఆయన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలకు నెల ఖర్చు లక్షల రూపాయల్లో ఉంటుందంటే, ఆయన లైఫ్ స్టైల్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక గణేశ్వరరావు అండ చూసుకుని బినామీలు కూడా రెచ్చిపోతున్నారు. వీరు చేసే ఆగడాలు మరింత భయంకరంగా ఉన్నాయి. నగరంలో ఓ అద్భుతమైన ఇంటని నిర్మించి, ఆ తరువాత విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో సెటిల్ అయినటువంటి వారి ఇళ్ళపై బినామీలు కనే్నస్తారు. రియల్ ఎస్టేట్ దళారుల ద్వారా ఆయా ఇళ్ళలో అద్దెకు దిగుతారు. యజమాని చెప్పిన అద్దెకు ఒక్క రూపాయి కూడా తగ్గించుండా అద్దెకు దిగుతారు. ఈ నేపథ్యంలో అదే ఇంటికి అదనపు హంగులు ఏర్పాటు చేస్తున్నామని ఎక్కడో ఉన్న ఇంటి యజమానిని నమ్మిస్తారు. ఆ ఇంటికి ఉన్న నేమ్ బోర్డును మార్చి, వారికి నచ్చిన పేరు పెడతారు. ఆ ఇంటి పేరిట ఫేక్ డాక్యుమెంట్లను సృష్టిస్తారు. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి తదితర ప్రాంతాల్లో డాక్యుమెంట్లను కొనుగోలు చేస్తారు. కొవ్వొత్తి వేడితో డాక్యుమెంట్లకు సెగ పెడతారు. అవి పాత డాక్యుమెంట్ల రంగులోకి మారిపోతాయి. వారు నివాసం ఉంటున్న ఇంటికి సంబంధించిన వివరాలతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తారు. అప్పటికే బ్యాంకు యజమానులతో డీల్ కుదుర్చుకున్న వీరు ఆ ఇంటిని, ఈ డాక్యుమెంట్లతో బ్యాంకులో కుదువ పెడతారు. లక్షలు, కోట్ల రూపాయల్లో రుణాలు పొందుతారు. తీసుకున్న రుణానికి కొంత కాలం ఈఎంఐలు కూడా చెల్లిస్తారు. నెమ్మదిగా ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. గణేశ్వరరావు బినామీలు ఇటువంటి మోసాలు నగరంలో చాలా చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీతమ్మధార ప్రాంతంలో ఇటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు భోగట్టా. ఏసిబి అధికారులు గణేశ్వరరావు బినామీలపై కనే్నస్తే, ఇటువంటి సంఘటనలు అనేకం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, నగరంలోని అనేక బ్యాంకులను గణేశ్వరరావు అండ్ బృందం ఇప్పటికే పూర్తిగా వాడేసినట్టు సమాచారం.
కాగా, గణేశ్వరరావు, తన బినామీలకు ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లన్నీ ఉన్నాయి. గణేశ్వరరావు బినామీ ఇంట్లో ఈ మధ్య ఒక వేడుక జరిగితే, అత్యంత ఖరీదైన ఆడి కారు కొని ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన బినామీలకు ఎటువంటి వ్యాపారం, ఉద్యోగం లేకపోయినా, లక్షల రూపాయలు వెచ్చించి కార్లకు ఫ్యాన్సీ నెంబర్లను ఏవిధంగా దక్కించుకుంటున్నారో ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.

ఈఎన్‌సీని సందర్శించిన చీఫ్ హైడ్రోగ్రాఫర్

విశాఖపట్నం, నవంబర్ 22: భారత ప్రభుత్వ చీఫ్ హైడ్రోగ్రాఫర్ వైస్ అడ్మిరల్ వినయ్ బద్వార్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం తూర్పు నౌకాదళానికి చేరుకున్నారు. తూర్పు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తూర్పు నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ యాక్టివిటీస్ ఏవిధంగా జరుగుతున్నాయో, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐఎన్‌ఎస్ సంధ్యాయక్ నౌకపై హైడ్రోగ్రాఫిక్ సిబ్బందితో కలిసి సముద్రంలో ప్రయాణించనున్నారు.

25న వైకాపా నగర అధ్యక్షునిగా మళ్ల బాధ్యతల స్వీకారం
* వార్డు అధ్యక్షులతో సమావేశమైన ముఖ్య నేతలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 22: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షునిగా మళ్ల విజయప్రసాద్ ఈనెల 25న బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో మళ్ల విజయప్రసాద్ స్థానిక వైశాఖి జల ఉద్యానవనంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. 25న స్థానిక ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రదేశంలో మళ్ల విజయప్రసాద్ వైకాపా నగర అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అంశంమై పార్టీ వార్డు అధ్యక్షులతో ఆయన చర్చించారు. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా పార్టీ విజయం సాధించేందుకు అనువుగా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. బూత్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని పార్టీ నాయకులను కోరారు. అలాగే, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి గాజువాకలో పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, అనకాపల్లి పార్లమెంట్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ కో-ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, ఉషాకిరణ్, చంద్రమోళి. తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి, మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, అనుబంథ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

వైకాపాలో అంతర్గత విభేదాలు
* పాడేరు, విశాఖ ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో చిచ్చు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 22: జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు స్థానిక నాయకులకు మింగుడు పడడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులను కాదని, కొత్త వారిని జిల్లాకు పంపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న వారంతా వచ్చే ఎన్నికల్లో తమకే టిక్కెట్‌లు వస్తాయని భావిస్తున్నారు. కానీ వారి స్థానే కొత్తవారు దిగుతున్నారన్న విషయం తెలుసుకుని భగ్గుమంటున్నారు.
పాడేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరి స్థానంలో వచ్చే ఎన్నికల్లో కుంభా రవిబాబును దింపాలని అధిష్టానం భావిస్తోంది. ఈశ్వరిని అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపాలన్న ఆలోచన కూడా అధిష్టానం చేస్తోంది. అయితే, పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను పోటీకి దింపితే, విజయావకాశాలు మెండుగానే ఉంటాయి. ఈశ్వరి స్థానంలో రవిబాబును దించడం వలన పార్టీకి ఇబ్బందే. అయితే, రవిబాబును అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెడితే, ఖాయంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆయనకు ఆ నియోజకవర్గంపై పట్టు, ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. కాగా, కుంభా రవిబాబును పార్టీలోకి తీసుకుంటే, తాను పార్టీని విడిచి వెళ్లిపోతానంటూ ఈశ్వరి, విజయసాయిరెడ్డికి తేల్చి చెప్పినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, చంధ్రవౌళిని సమన్వయకర్తలుగా నియమించారు. కొద్ది రోజులుగా వీరు పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికీ టిక్కెట్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే, అధిష్టానం వెంకటపతిరాజు అనే కొత్త వ్యక్తిని ఉత్తర నియోజకవర్గానికి పంపిస్తోంది. ఆయను వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కోలా గురువులును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యునిగా నియమించారు. తానే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థినని గురువులు భావిస్తున్నారు. కానీ ఆయన స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

గీతం ఫిన్‌టెక్ అకాడెమీతో సింగపూర్ సంస్థ ఎంఓయూ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 22: దేశంలో తొలిసారిగా గీతం డీమ్డ్ యూనివర్శిటీలో ఏర్పాటైన గీతం ఫిన్‌టెక్ అకాడెమీతో కలిసి సంయుక్తంగా పనిచేసేందుకు సింగపూర్‌కు చెందిన నీ యాన్ పాలిటెక్నిక్ సంస్థ ఆసక్తి కనబరచింది. ఈ మేరకు సింగపూర్‌లో ఇటీవల జరిగిన ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో గీతం ఫిన్‌టెక్ అకాడెమీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు అకాడెమీ కోఆర్డినేటర్ లెబెన్ జాన్సన్ తెలిపారు. గీతం ఫిన్‌టెక్ అకాడెమీలో ఎంబీఏ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులను త్వరలో సింగపూర్ అధ్యయన యాత్రకు తీసుకువెళుతున్నామని, అక్కడ వారం రోజుల పాటు గీతం విద్యార్థులకు నీ యాన్ పాలిటెక్నిక్‌లో సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాలిటీ, త్రీడీ ప్రింటింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే సింగపూర్ ఫిన్‌టెక్ కంపెనీలతో గీతం విద్యార్థులు భేటీ అవుతారన్నారు. వచ్చే ఏడాది మార్చిలో సింగపూర్ విద్యార్థులు విశాఖలోని గీతం ఫిన్‌టెక్ అకాడెమీని సందర్శిస్తారన్నారు.

వెంకటేశ్వర మెట్ట సమస్యను పరిష్కరించాలి
* దేవాదాయ శాఖ మంత్రికి టీడీపీ వినతి
విశాఖపట్నం, నవంబర్ 22: దశాబ్ధాలుగా నగరంలోని 28వ డివిజన్ వెంకటేశ్వర మెట్టలో నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నగర అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి దేవాదాయ శాఖ మంత్రికి వినితిపత్రం సమర్పించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో కలిసి విజయవాడలోని మంత్రి మాణిక్యాల రావు దృష్టికి తీసుకువెళ్లినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వర మెట్టపై ఏళ్ల తరబడి శాశ్వత నివాసాలు ఏర్పరచుకుని నివసిస్తున్న నిరుపేదల పరిస్థితి దేవాదాయ శాఖ నిర్ణయంతో అయోమయంలో పడిందన్నారు. పదిహేనేళ్ల కిందట స్థానికుల విజ్ఞాపన మేరకు ఇక్కడ నివసిస్తున్న 2,500 మంది కుటుంబీకులకు ఇదే స్థలంలో ఉండేందుకు అనుమతిస్తూ అప్పటి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కొమ్మాదిలో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారన్నారు. అయితే ఇది జరిగి ఏళ్లు గడుస్తున్నప్పటికీ స్థానికులకు ఎటువంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2003 నుంచి ఈ స్థలాలపై హక్కులు లేకుండా భయంభయంగా స్థానికులు బతుకుతున్నారని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్థలాలు క్రయ,విక్రయాలు నిలిచిపోయాయని, నిరుపేదలు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు సొంత ఇంటిని హామీగా పెట్టి రుణాలు పొందేందుకు వీలు కావట్లేదని వివరించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని దేవాదాయ శాఖ మంత్రిని కోరారు. దీనిపై మంత్రి మాణిక్యాల రావు సానుకూలంగా స్పందించారని చక్రవర్తి తెలిపారు.

సిట్ దర్యాప్తుతో ప్రయోజనం శూన్యం
* మంత్రి, శాసనసభ పక్ష నేత ఫిర్యాదు చేసినా చర్యలు ల్లేవు
* వైసీపీ సీనియర్ నేత బొత్స
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 22: విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుతో ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కబ్జాదార్లపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం కబ్జాదార్లకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. సిట్ అధికారులు ప్రభుత్వ భూములు కాజేసిన వారిపై కనికరం చూపించడం అసంతృప్తి కలిగిస్తోందన్నారు. సహచర మంత్రి, ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడినట్టు మరో మంత్రి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారని అయితే వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. అలాగే అధికార పార్టీతో కలిసి ప్రభుత్వంలో పాలుపంచుకుంటున్న బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ముదపాక, తదితర భూ కుంభకోణాలపై పూర్తి ఆధారాలతో సిట్‌కు ఫిర్యాదు చేశారని, అయినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భూ కబ్జాల్లో కీలక నేతలను వదిలేసి చిరుద్యోగులను బలిచేస్తున్నారని విమర్శించారు. నగరంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్టు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భూముల పరిరక్షణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న వాస్తవం ఈ సంఘటనతో నిరూపితమైందన్నారు. సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

గూడ ఆశ్రమంలో తనిఖీ
పాడేరు(రూరల్), నవంబర్ 22: హుకుంపేట మండలం గూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఆశ్రమ ప్రత్యేక అధికారి ఎస్.రామచంద్రరరావు బుధవారం సాయంత్రం తనిఖీ చేసారు. ఆశ్రమంలోని సరుకుల నిల్వలను ఆయన పరిశీలించి మెనూ అమలుపై విద్యార్థినీలను అడిగి ఆరా తీసారు. తమకు భోజనాలను సక్రమంగానే పెడుతున్నారని, ఎటువంటి ఇబ్బందులు లేవని బాలికలు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలతో మాట్లాడుతూ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఆశ్రమ విద్యార్థులకు ప్రభుత్వం సకల సదుపాయాలను కల్పిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులను అభ్యసించేందుకు కృషి చేయాలని కోరారు. అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు తక్షణమే ఆశ్రమ ఉపాధ్యాయులకు తెలియచేసి వైద్య సేవలు పొందాలని ఆయన చెప్పారు. విద్యార్థినీలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలని రామచంద్రరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు చెండా ఏలియా, డిప్యూటీ మెట్రిన్ అరుణ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాలికలకు నగదు ప్రోత్సాహకాలు
అరకులోయ, నవంబర్ 22: పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన గిరిజన బాలికలకు యండపల్లివలస కెనరా బ్యాంకు నగదు ప్రోత్సహాకాలు బుధవారం అందచేసింది. మండలంలోని కస్తూరిబా గాంధీ, ఆర్.సి.ఎం. పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న బాలికలకు 22 వేల ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని అందచేసింది. ఆరు నుంచి పదో తరగతి వరకు అత్యధిక మార్కులు సాధించిన వారికి ఐదు వేల వంతున, ఐదో తరగతిలో ఎక్కువ మార్కుల వచ్చిన వారికి రెండు వేల ఐదు వందల రూపాయలను వంతున పంపిణీ చేసారు. విద్యాభ్యాసంలో ప్రతిభ చూపిన బాలికలకు ప్రోత్సాహకాలను అందచేసిన కెనరా బ్యాంకు మేనేజర్ హార్షవర్థన్‌కు కస్తూరిభా పాఠశాల ప్రిన్సిపాల్ లీలావతి, ఆర్.సి.ఎం. పాఠశాల ప్రదానోపాధ్యాయుడు చంద్రవౌళి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్లక్ష్యానికి కార్మికుడు బలి
మాడుగుల, నవంబర్ 22: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాంటూ కార్మికుడు మృతి చెందిన ఘటన మాడుగులలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం మాడుగులలోని కొబ్బరితోట వీధికి చెందిన కర్ని కొండాజి (30) గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌లో దినసరి వేతన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే పెదకోమటి వీధిలోని విద్యుత్ స్థంబం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారే వచ్చిన విద్యుత్ సప్లైతో షాక్‌కు గురై కిందకు పడిపోయాడు. విద్యుత్ షాక్‌తో కింద పడిన కార్మికుడిని రక్షించేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విద్యుత్ స్థంబం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సిబ్బంది విద్యుత్ లైన్ ఆన్ చేయడం వలనే ఈ ప్రమాదం సంబవించినట్టు చెబుతున్నారు. మృతి చెందిన కొండాజి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్.ఐ. ఉమామహేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర పోటీల్లో ప్రధమంగా నిలిచిన సాగరం ఉపాధ్యాయుడు
మాడుగుల, నవంబర్ 22: జాతీయ గ్రంధాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి బుక్ రివ్యూ పోటీలలో మండలంలోని సాగరం ఎం.పి.పి. పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సీతా సతీష్‌కు ప్రధమ స్థానాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రధమంగా నిలిచిన ఉపాధ్యాయుడికి రాజదాని అమరావతిలో గ్రంధాలయ రాష్ట్ర డైరెక్టర్ పార్వతి బుధవారం ప్రసంసాపత్రం, జ్ఞాపికతో పాటు ఆరు వేల రూపాయల నగదు అవార్డును అందచేసారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీతా సతీష్‌ను సత్కరించి ఉన్నత అధికారులు అభినందించారు.

డంపింగ్‌యార్డుల నిర్మాణానికి సహకరించని సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు

కోటవురట్ల, నవంబర్ 22: డంపింగ్ యార్డులు (సాలీడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్) నిర్మాణానికి సహకరించని సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేస్తామని నర్సీపట్నం డి. ఎల్.పి. ఓ. శిరీషారాణి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం డంపింగ్ యార్డుల నిర్మాణంపై సర్పంచ్‌లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థల సేకరణ చేసిన పంచాయతీలకు గడువులోగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. డంపింగ్ యార్డులో నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిన అధికారులకు సోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. డివిజన్‌లో 310 డంపింగ్ యార్డులను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా 113 డంపింగ్ యార్డులకు స్థల సేకరణ జరిగిందన్నారు. 79 డంపింగ్ యార్డుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా 18 పూర్తయినట్లు తెలిపారు. డివిజన్‌లో మీ కోసం కార్యక్రమంలో 2,600 దరఖాస్తులు రాగా వీటిలో 1,500 కోటవురట్ల మండలానికి చెందినవేనని తెలిపారు. 94 శాతం ఇంటి పన్ను డివిజన్‌లో వసూలు చేయడం జరిగిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్, మంచినీటి సరఫరా అందజేయాల్సిన బాద్యత పంచాయతీలదేనన్నారు. ఈకార్యక్రమంలో ఎడీవో కళ్యాణి, మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ లాలం కాశీనాయుడు, ఇ. ఓ. ఆర్.డి. ప్రభాకర్‌రావు, పలువురు సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి

కోటవురట్ల, నవంబర్ 22: మండలంలో గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని సి.పి. ఎం. పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు ఎడీవోకు విజ్ఞప్తి చేసారు. బుధవారం సి.పి. ఎం. పార్టీ నక్కపల్లి డివిజన్ కన్వీనర్ ఎం. అప్పలరాజు సారధ్యంలో అల్యూమియాపాలెం, అణుకు , తడపర్తి, కోదండరామపురం తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు ఎడీవో కళ్యాణిని కలిసి వినతి పత్రం అందజేసారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక పలు అవస్థలు పడుతున్నామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కోదండ రామపురానికి 1.35 కోట్లు , తడపర్తికి 2.40 కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరై శంకుస్థాపన కూడా చేసినా నేటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. రహదారి సౌకర్యం లేక 108, 104 వాహనాలు పై గ్రామాలకు వెళ్ళలేక పోతున్నాయన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ డేవిడ్, గిరిజనులు నాగమణి, సత్యవతి, కొండబాబు, లక్ష్మి,రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆరు ఆటోలు సీజ్

కోటవురట్ల, నవంబర్ 22: నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న ఆరు ఆటోలు సీజ్ చేసినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్‌లో ఆటోల ముందు సీట్లో ప్రయాణీకులను ఎక్కించుకున్న ఆటోలపై కేసులు నమోదు చేసామన్నారు. అలాగే పరిమితికి మంచి బరువు వేయడం, నిబంధనలకు విరుద్దంగా ఆటోలు నడుపుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసామన్నారు. ఆటో డ్రైవర్లకు పలు దపాలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించామన్నారు. నిబందనల మేరకే ఆటోలు నడపాలని ఎస్సై తారకేశ్వరరావు సూచించారు.

తెలుగునాడు విద్యుత్ ప్రాంతీయ కార్యదర్శిగా భాస్కరరావు
సీలేరు, నవంబర్ 22: ఎ.పి.జెన్‌కో తెలుగునాడు విద్యుత్ సంఘ సీలేరు కాంప్లెక్స్ ప్రాంతీయ కార్యదర్శిగా ఎస్.్భస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్థానిక బ్రాంచ్ అధ్యక్షుడు నడిగెట్ల వరప్రసాద్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎ.పి.జెన్‌కో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సీలేరు కాంప్లెక్స్ ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీ్ధర్ ఇటీవల విజయవాడ బదిలీ అయిన నేపధ్యంలో రాష్ట్ర తెలుగునాడు అధ్యక్షుడు ఎన్.సాంభశివరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. రీజనల్ కార్యదర్శిగ ఎస్. బాస్కరరావు, రీజనల్ అధ్యక్షుడిగా పి.డి.వి. త్రినాధరావు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజీజ్ , రీజనల్ గౌరవాధ్యక్షుడిగా పి.నారాయణరావులను ఎన్నుకున్నారు. బ్రాంచ్ కార్యదర్శిగా ఆడారి నారాయణరావు, కోశాధికారిగా వెలుగుల కృష్ణను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

జూనియర్ అథ్లెట్ మీట్ ఏర్పాట్లు పూర్తి
* రేపటి నుంచి పోటీలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 22: జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెట్ మీట్ (నిడ్‌జాం) పోటీలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్టు జేసీ 2 ఏ సిరి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26 వరకూ మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయన్నారు. గత మూడు సంవత్సరాలుగా జూనియర్ అథ్లెట్ మీట్‌ను విశాఖలో నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. విశాఖ పోర్టు స్టేడియంలో 30 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. దేశ వ్యాప్తంగా 400 జిల్లాల నుంచి 5000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. క్రీడాకారులకు మారికవలస, కొమ్మాది, ఎండాడ, కృష్ణాపురం పాఠశాలల్లో వసతి సదుపాయం కల్పించామన్నారు. క్రీడాకారులు, కోచ్‌లకు భోజన, రవాణా సదుపాయంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఏజేసీ ఆదేశించారు. క్రీడా ప్రాంగణం, వసతి కల్పించిన ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు సక్రమంగా ఉండాలన్నారు. సదుపాయాలను పర్యవేక్షించేందుకు అన్ని కేంద్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను నియమించామన్నారు. పోర్టు స్టేడియంలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ క్రీడాంశాలు నిర్వహిస్తారని, అనంతరం క్రీడాకాలులను విడిది ప్రాంతాలకు తరలిస్తారన్నారు. సమావేశంలో క్రీడల స్పాన్సర్ నాగరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గాలియట్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు దండు దీక్షకు వైసీపీ సంఘీభావం
* నేడు పూలరధంపై తెలుగుతల్లి ఊరేగింపు
ఆరిలోవ, నవంబర్ 22: తెలుగు భాష మనుగడ కోసం, మాతృభాష పరిరక్షణకు తెలుగుదండు ఆధ్వర్యంలో గత 22 రోజులుగా జరుగుతున్న ఉద్యమానికి వైసీపీ సంఘీభావం తెలిపింది. దీక్షా శిబిరం వద్దకు వైసీపీ నాయకులు గుడివాడ అమర్‌నాథ్, తైనాల విజయ్‌కుమార్ వచ్చి తెలుగు భాష పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్‌టీ రామారావు తెలుగు భాష పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తెలుగు భాష తన ప్రాభవాన్ని కోల్పోయిందన్నారు. ప్రభుత్వ పరంగా తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన యంత్రాంగం విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని తెలుగు భాషకు వైభవాన్ని తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు గురువారం ఉదయం తెలుగు తల్లి విగ్రహాన్ని పూల రధంపై ఊరేగిస్తున్నట్టు ప్రకటించారు. మన భాషను కాపాడుకునేందుకు మనమంతా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.