విశాఖ

పాడేరులో విస్తరిస్తున్న డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 24: ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో అత్యంత ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి క్రమేణా విస్తరిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పాడేరు పట్టణంలో ఇటీవల ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ వ్యాధి రానురాను వ్యాప్తి చెందుతుంది. దీంతో రోజు రోజుకు డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాడేరు పట్టణంలో ఇటీవల డెంగ్యూ సోకి ఇద్దరు మృతి చెందగా అదే సమయంలో మరికొంతమందికి ఈ వ్యాధి ప్రబలింది. అయితే గత పది రోజులుగా డెంగ్యూ విజృంభించడంతో పట్టణానికి చెందిన అనేక మంది ఈ వ్యాధి బారిన పడి విశాఖపట్నంలోని ప్రయివేట్ ఆసుపత్రులలో చేరారు. పట్టణంలో డెంగ్యూ తీవ్రరూపం దాల్చడంతో ఎవరికి జ్వరం వచ్చినా ప్రాణ భయంతో భయాందోళనలు చెందుతున్నారు. జ్వరానికి గురైన వారంతా డెంగ్యూగా అనుమానించాల్సిన పరిస్థితి పట్టణంలో నెలకొంది. దీంతో జ్వరం సోకిన వారు స్థానిక ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తూ విశాఖపట్నానికి పరుగులు తీస్తున్నారు. పాడేరు పట్టణంలో డెంగ్యూతో ఇంతవరకు మృతి చెందిన ఇద్దరు సాధారణ జ్వరంగా భావించి స్థానికంగా చికిత్సలు పొంది ఆలస్యంగా విశాఖపట్నం ఆసుపత్రులను ఆశ్రయించడంతో ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి వారి ప్రాణాలను బలిగొంది. ఈ ఇద్దరి మృతితో పట్టణంలో డెంగ్యూ వెలుగుచూడడంతో జ్వరం సోకిన వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మైదాన ప్రాంతంలోని ప్రయివేట్ ఆసుపత్రులలో చేరిపోతున్నారు. విశాఖపట్నం, తదితర ప్రాంతాలలోని పలు ప్రయివేట్ ఆసుపత్రులలో వ్యాధిగ్రస్తులు చేరి పరీక్షలు చేయించుకుంటుండడంతో వీరికి డెంగ్యూ సోకినట్టుగా వైద్యులు నిర్థారిస్తున్నారు. ఈ మేరకు పట్టణానికి చెందిన దాదాపు 20 మంది డెంగ్యూతో బాధపడుతూ విశాఖలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉండగా పాడేరులో ప్రారంభమైన డెంగ్యూ మన్యానికి విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. అరకులోయ పట్టణంలో తాజాగా ఒక మహిళ డెంగ్యూతో ఆదివారం మృతి చెందడమే కాకుండా పలువురు ఈ వ్యాధి బారిన పడడంతో ఈ వ్యాధి చాపకింద నీరులా మన్యంలో వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు మలేరియా, అతిసారం, టైఫాయిడ్ వంటి వ్యాధులు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతీయులు డెంగ్యూ కూడా వ్యాప్తి చెందడంతో ఏ క్షణాన ఎవరికి ఈ వ్యాధి సోకుతుందోనని పట్టణ వాసులు తల్లడిల్లుతున్నారు. పాడేరు పట్టణంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి డెంగ్యూ పరీక్షలు స్థానికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.