విశాఖపట్నం

అధిష్ఠానం ఆదేశిస్తే ఉత్తరం నుండే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, తాను వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. చాలా కాలంగా విష్ణుకుమార్ రాజు పార్టీ మారుతారన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. జగన్ విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని విష్ణుకుమార్ రాజు బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో చెప్పడంతో అనేక ఊహాగానాలకు ఆయన అవకాశం ఇచ్చినట్టయింది. అలాగే బీజేపీ, టీడీపీకి తెగతెంపులు అయిపోయిన తరువాత కూడా చంద్రబాబుతో, విష్ణుకుమార్ రాజు సాన్నిహిత్యంగా మెలగడంతో అన్ని పార్టీల వారి దృష్టి రాజుపై పడింది. బీజేపీ నాయకులకు కూడా ఆయన వ్యవహారం అంతుపట్టడం లేదు. కొద్ది రోజుల కిందట నగరంలో జరిగిన పట్టాల పంపిణీ సభలో కూడా రాజు పాల్గొన్నారు. దీంతో ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీల మధ్య తెగతెంపులు జరిగిన తరువాత చంద్రబాబు వెంట తిరగడ సరికాదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ విషయాలపై విష్ణుకుమార్ రాజును ‘ఆంధ్రభూమి’ ప్రశ్నించగా, తనను ఈ నియోజకవర్గ ప్రజలు ఐదేళ్ల కోసం ఎన్నుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో ఆఖరి రోజు వరకూ ఇదే పార్టీలో కొనసాగుతానని, ప్రజా ప్రతినిధిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తను పార్టీకి పనికొస్తానని అథిష్ఠానం భావించి టిక్కెట్ ఇస్తే, ఉత్తర నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అలాగే, తన కుమార్తెను ఇప్పట్లో రాజకీయాల్లోకి తీసుకురానని కూడా విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు సభలో పాల్గొంటున్న విషయమై ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నగరంలో ఏర్పాటు చేసే సభలకు, తాను నగరంలోని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా హాజరవుతున్నానని చెప్పారు. ఒక ప్రజాప్రతినిధిగా అది తన బాధ్యత అని అన్నారు. మొన్న జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో తన పాత్ర కూడా ఉందని అన్నారు. తన నియోజకవర్గానికి 1040 పట్టాలు మంజూరయ్యాయని, అందువలన ఆ పట్టాల పంపిణీ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామినయ్యానని రాజు చెప్పారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఆయన పక్కనే ఉండేవాడిని. అంత మాత్రాన తాను టీడీపీ మనిషిననుకుంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.