విశాఖ

బిర్సాముండా జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 15: స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా 144వ జయంతి వేడుకలను పాడేరులో గురువారం నిర్వహించారు. గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బిర్సాముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాడేరు పట్టణంలో ముండా చిత్ర పటంతో ప్రదర్శన చేపట్టి ప్రార్థనలు చేసారు. ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల వీరగాధలను పాఠ్యాంశాలుగా చేర్చాలని, పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాంగణంలో బిర్సాముండా, కొమరం భీం, గంటం దొర, ముల్లు దొర, మర్రి కామయ్య వంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను నెలకొల్పాలని, గిరిజన విశ్వ విద్యాలయాన్ని గిరిజన ప్రాంతంలో స్థాపించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కె.కిశోర్, జి.బాలదేవ్, అనీల్‌కుమార్, కార్తీక్, మాధవరావు, శివశంకర్, మత్స్యరాజు, సత్యనారాయణ, సాయినాధ్, అప్పారావు, పలు సంఘాల నాయుకులు రామారావు దొర, సి.హెచ్.శ్రీనివాసపడాల్, పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
హుకుంపేట, నవంబర్ 15: నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని తీగలవలస పంచాయతీ పామురాయి గ్రామానికి చెందిన పాంగి శ్రీను కల్లంలో పంట నూర్పు చేస్తుండగా ఆయన కుమార్తె పాంగి రాజి (5), కుమారుడు డేవిడ్‌రాజు (3) కల్లం పక్కనే ఆడుకుంటున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా పక్కనే ఉన్న తుప్పల్లో వీరికి నాటు బాంబు దొరకడంతో అక్కా తమ్ముళ్లు బాంబు కోసం చేసిన పెనుగులాటలో కింద పడి పేలిపోయింది. ఈ సంఘటనలో రాజి, డేవిడ్‌రాజు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని హుటాహుటిన పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
నిత్యావసర వస్తువులు పక్కదారి పడితే చర్యలు
డుంబ్రిగుడ, నవంబర్ 15: నిత్యావసర వస్తువులు పక్కదారి పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఆహార కమీషన్ సభ్యుడు ఎల్.బి.వెంకటరావు హెచ్చరించారు. మండలంలోని కించుమండ, డుంబ్రిగుడలో అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్న సైజు గుడ్లు ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేసారు. అంగన్‌వాడీలకు చిన్న సైజు గుడ్లు పంపిణీ చేసిన కంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. డి.ఆర్.డిపోల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా సరుకులు పంపిణీ కావడం లేదని సి.డి.పి.ఒ. రత్నాకుమారి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన డి.ఆర్.డిపోల నుంచి అంగన్‌వాడీలకు పప్పు, నూనె సక్రమంగా పంపిణీ చేయాలని జి.సి.సి. అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారుల అలసత్వం వలన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని ఆయన అన్నారు. లోపాలను అధిగమించేందుకు ఏజెన్సీలో తాము పర్యటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బాలాజి తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారికి రుణాలు ఇప్పించాలి
కోటవురట్ల , నవంబర్ 15: ఎస్సీ, ఎస్టీ ,బీసీ కాపు, మైనార్టీ కార్పొరేషన్ల రుణాల కోసం అర్హులైన వారితో థరఖాస్తులు చేయించాలని దేశం పార్టీ నాయకులకు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండలానికి చెందిన పార్టీ నాయకులతో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మండలంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. సాగునీరు ప్రాజెక్టులతో పాటు మండలానికి పలు అబివృద్ది కార్యక్రమాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. మండలానికి 1,500 పక్కా గృహాలు కొత్తగా మంజూరైనట్లు తెలిపారు పక్కా గృహాల కేటాయించేందుకు లబ్దిదారులను గుర్తిం చేకార్యక్రమం చేపట్టాలన్నారు. నిరుపేదలకు పంపిణీ చేసేందుకు ఇంటి స్థలాలను ఎంపిక చేయాలన్నారు. తిమ్మాపురంలో ఎర్ర చెరువు అభివృద్ది పనుల్లో జాప్యం చేయవద్దన్నారు.పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షులు లాలం కాశీనాయుడు , పార్టీ నాయకులు పినపాత్రుని బుర్రయ్యదొర, డీవీ సూర్యారావు, కళ్ళెంపూడి హైమావతి, సుంకర బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా మండలంలో 6,990 ఎకరాల సాగు
కోటవుటర్ల, నవంబర్ 15: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కోటవురట్ల మండలంలో 6,990 ఎకరాలకు సాగునీరు అందుతుందని మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు తెలిపారు. మండలంలో జల్లూరులో గురువారం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కాశీనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మండలానికి సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేస్తుందన్నారు. దేశం ప్రభుత్వం ద్వారా మండలంలో 20 వేల మంది లబ్దిపొందారన్నారు. పందూరు,జల్లూరు,తంగేడు వంతెనల నిర్మాణం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ అన్నీ దేశం ప్రభుత్వహయాంలోనే జరిగాయన్నారు. ఈవిషయాలన్నీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో గ్రామ స్థాయి నాయకులు చురుగ్గా వ్యవహరించి దేశం పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. మండలంలో 10 వేల మందికి తక్కువ కాకుండా పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు వేచలపుజనార్ధన్, పి.బాబ్జి, జి.నానిబాబు, సీహెచ్ సత్యనారాయణ, ఎస్.బాబ్జి, పి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన
రావికమతం,నవంబర్ 15: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది . కరెంట్ ఆఫైర్స్, చరిత్ర, రాజకీయ, సామాజిక , వ్యవసాయ తదితర విభాగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. ఈసందర్భంగా గ్రంథ పాలకురాలు జోగేశ్వరి మాట్లాడుతూ గ్రంథాలయాలకు పూర్వ వైభవంగా తీసుకువచ్చేందుకు ఈవారోత్సవాలు దోహదపడుతున్నాయన్నారు. పుస్తక పఠనం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించారు.