విశాఖపట్నం

పాలిటెక్నిక్ భవనాల నిర్మాణాలకు రూ.100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 19: రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టు మనవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలో ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టే అదనపు భవనాల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.100కోట్లతో చేపట్టే పనులు టెండర్ దశలో ఉన్నాయని, ఏడాది కాలంలో వీటిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని విద్య, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ అన్ని విద్యా సంస్థలను ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకే మానవ వనరుల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేశారన్నారు. రూ.17వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ విద్యకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.25వేల కోట్లను విద్యకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మరింత విస్తృత పరిచేందుకు అదనంగా 10 పాలిటెక్నిక్ కళాశాలలు, 50 జూనియర్ కళాశాలలు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేశామన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి సమాజానికి ఉపకరించేలా ఆవిష్కరణలు తీర్చిదిద్దేలా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే జ్ఞానభేరి పేరిట విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నామన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోను జ్ఞానభేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్టు గంటా తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగానే విశాఖలో మూడు విడతలుగా భాగస్వామ్య సదస్సులు ఏర్పాటు చేశామని, లక్షల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఏర్పాటై ఉద్యోగాలు కల్పించగా, మరికొన్ని సంస్థలు పురోగతిలో ఉన్నాయన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలకు మధ్యనున్న అసమానతలు తొలగించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా విస్తృతంగా చేపడుతున్నామన్నారు. విద్యా వంతులైన నిరుద్యోగులకు రూ.1000 భృతి కల్పిస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సమావేశంలో ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బీ దేముడు, సాంకేతిక విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు జే సత్యనారాయణ మూర్తి, ఈఈ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామదర్శిని షెడ్యూల్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి
* ఇన్‌చార్జి కలెక్టర్, జెసీ జీ.సృజన
విశాఖపట్నం, నవంబర్ 19: గ్రామదర్శిని షెడ్యూల్‌ను ఒకరోజు ముందుగానే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జీ.సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఇఓఆర్డీలు, ఏపీఓలతో ఆమె సమావేశమై ఉపాధి హామీ, గ్రామదర్శిని పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గాల, మండలాల, గ్రామ పంచాయితీల అధికారులు అంతా గ్రామదర్శిని షెడ్యూళ్ళను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. షెడ్యూలు అప్‌లోడ్ చేస్తేనే తప్ప గ్రామదర్శిని నిర్వహించిన నివేదికలు, ఫొటోలు అప్‌లోడ్ అవుతాయన్నారు. లేకుంటే అప్‌లోడ్ కావన్నారు. ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకుని షెడ్యూల్ తప్పక ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు ఆమె సూచించారు. అలాగే విలేజ్ డెవలప్‌మెంట్ ప్లాన్లను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రోలుగుంట మండలానికి సంబంధించి 14 విలేజ్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ ఇప్పటి వరకు రూపొందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. వెంటనే ప్లాన్లను రూపొందించి ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. నేడు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని, వచ్చే గురువారం, శుక్రవారాల్లో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమాల్లో మరుగుదొడ్ల వినియోగ, శుభ్రంగా ఉండేలా ఏ విధంగా వాటిని నిర్వహించాలనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆమె సూచించారు. ఉపాధిహామీ కన్వర్జన్సు పనుల్లో భాగంగా చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాలు అంగన్‌వాడీ కేంద్రా, ఘన వ్యర్ధాల నిర్వహణ షెడ్లు నిర్మాణ పనులు, శ్మశానవాటికల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. స్థల వివాదాలు ఏమన్నా ఉండే రేపటి లోపు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, లేకుంటే అధికారులే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీటి నిర్మాణ పనులను దశలవారీగా నివేదికలో పొందుపర్చాలని, ప్రగతిలో ఉన్నాయంటే ఏ దశలో ఉన్నాయో ఎలా తెలుస్తుందని ఆమె అధికారులను ఆమె ప్రశ్నించారు. జిల్లాప్రజాపరిషత్ సీఇఓ డీవి రమణమూర్తి, డ్వామా పీడి దయానిధి, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి, ఘన వ్యర్ధాల నిర్వహణ జిల్లా కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భిన్నత్వంలో ఏకతత్వం
విశాఖపట్నం, నవంబర్ 19: భిన్నత్వంలో ఏకత్వమే ఇందిరమ్మ పాలన అని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఇందిరమ్మ చిత్రపటానికి, జైలురోడ్డులో విగ్రహానికి కేంద్రమంత్రి పల్లంరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌యుఐ ఆలీండియా ఇన్‌చార్జి రుచిగుప్త, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బెహరా భాస్కరరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ మరణించే వరకు కూడా దేశానికి ఇందిరమ్మ అంకితమయ్యారన్నారు. ఇందిరమ్మ హయాంలో కులమతాలకు అతీతంగా పాలన సాగిందన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ ప్రధామంత్రులు అంతా కూడా భిన్నత్వంలో ఏకత్వంగానే పాలన కొనసాగించారని నేడు నరేంద్రమోదీ పాలన అందుకు భిన్నంగా కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు రాష్టవ్య్రాప్తంగా ఇంటింటికీ కాంగ్రెస్ నగరంలో విజయవంతంగా జరిగిందని ఈ రోజుతో ఆ కార్యక్రమం ముగిసిందని చెప్పారు. కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బెహరా భాస్కరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు పిరిడి భగత్, వేగి వెంకటేష్, పీసీసీ మత్స్యకార సెల్ అధ్యక్షుడు కంటుముచ్చు తాతారావు, వుడా మాజీ చైర్మన్ పీఎస్‌ఎన్‌రాజు, ఎం.సత్యనారాయణరాజు, కొప్పుల వెంకటరావు, కాంగ్రెస్ నాయకులు కర్రి రామారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీఎస్ కవి, మళ్ళ ఈశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సిఎం కార్యక్రమాలకు ఆకర్షితుడై టీడీపీలో చేరా
* మాజీ కార్పొరేటర్ కంపా హానోక్
విశాఖపట్నం, నవంబర్ 19: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని మాజీ కార్పొరేటర్ కంపా హానోక్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లట్లాడుతూ ఈ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అన్ని వర్గాల వారికి ముఖ్యంగా హరిజన, గిరిజన, మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం చంద్రబాబునాయుడు వలనే జరుగుతుందన్నారు. అందువలనే టీడీపీలో తాను చేరానన్నారు. పోలవరం, విశాఖకు రైల్వేజోన్, కడపకు స్టీల్‌ప్లాంట్, బోగాపురం విమానాశ్రయం, గిరిజన యూనివర్శిటీ, వంశదార, నాగావళి నదుల అనుసంధానం ఇవ్వన్నీ సాధించాలంటే కేవలం చంద్రబాబు వలనే అవుతుందన్నారు. తిత్లీ హుదూద్ వంటి విపత్కర సమయాల్లో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. ఉన్నత విద్యావంతుడైన యువ గిరిజనుడి కిడారి శ్రవణ్‌కి కేబినెట్‌లో స్థానం కల్పించడం గిరిజనులపట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. రాష్ట్ర దేశ ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి చంద్రబాబుని గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. భవిష్యత్ పార్టీ ఏమి ఆదేశిస్తే తప్పకుండా తాను రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా విశాఖ అర్బన్ జిల్లా ఎస్సీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్.సీ, ఎస్‌టీలకు ఉన్నతమైన ప్రాధాన్యత కల్పించాలని ఆలోచనతో పీడిత ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సిఎందేనన్నారు. ఈ సమావేశంలో నాయకులు విశాఖ అర్బన్ జిల్లా ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్, విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు బైరెడ్డి పోతన్నరెడ్డి, పొట్టి మూర్తి, జాతీయ టిఎన్‌ఎస్‌ఎఫ్ సమన్వయకర్త కర్త దాసరిశ్యామ్ సుందర్‌శేషు తదితరులు పాల్గొన్నారు.

21న ముస్లింల మహా శాంతి ర్యాలీ
జగదాంబ,నవంబర్ 19: జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలేహవలసల్లం 1,447వ జన్మదిన వేడుకులు సందర్భంగా ఈ నెల 21న సీరత్ కమిటీ ఆధ్వర్యంలో మహా శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు ఎస్ ఎ మునీర్ తెలిపారు. నగరంలో సోమవారం విజె ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రవక్త బోధనలు, సర్వమాన సమానత్వము, సోదరభావము, ప్రపంచ శాంతి, మానవులందరిని సమాన దృష్టితో చూడాలని, మనిషికి మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసం, ఆదిపత్యము లేదని తెలపటమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఈ ర్యాలీ స్థానిక మహిళా కళాశాల నుంచి రెడ్నంగార్డెన్స్, సివెన్‌హిల్స్, జగదాంబ మీదుగా హజరత్ ఇషాక్ మదినా ఔలియా రెహమతుల్లా దర్గా వరకూ కొనసాగుతుందన్నారు. ఈ ర్యాలీని జిల్లా మసీదు సమాఖ్య, వివిధ మసీదు కమిటీ, యూత్ అసోసియేషన్ల ప్రతినిధులంతా విధిగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీరత్ కమిటీ గౌరవ అధ్యక్షుడు హైదర్ అలీ సింకా, ప్రధాన కార్యదర్శి మెహబూబ్ అలీ ఖాన్, కోశాధికారి ఎస్ కె అహ్మద్ వలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహబూబ్ షరీప్, సయ్యద్ అమీర్ ఖాన్, బురాని బాషా, ఎస్‌కె కాలేషా, రహతుల్లా తదితరులు పాల్గొన్నారు.