విశాఖ

జి.ఒ.132పై మంత్రితో ఉపాధ్యాయ సంఘం నేతలు వాగ్వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 12: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జి.ఒ.నెంబరు 132ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని, అయితే విద్యార్థుల చదువులు పాడైనట్టుగా ఉపాధ్యాయులు వ్యవహరించరాదని ఆయన హితవు చెప్పారు. జి.ఒ.నెంబరు 132ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు గత మూడు రోజులుగా స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట రిలే నిరాహర దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల రిలే దీక్ష శిబిరాన్ని మంత్రి బుధవారం సందర్శించి వారితో కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రికి, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగించే జి.ఒ.ను పది రోజుల్లోగా రద్దు చేస్తామని, ఉపాధ్యాయులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి సూచించారు. దీంతో తమ సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు పట్టుబట్టారు. దీంతో మంత్రి కిడారి మాట్లాడుతూ సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించాలంటే ఏలా సాధ్యవౌతుందని ప్రశ్నించారు. దేనికైనా కొంత సమయం అవసరమని, అప్పటి వరకు సహనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల ఆందోళన వలన ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థుల విద్య దెబ్బతింటుందని పేర్కొన్న మంత్రి పలు వ్యాఖ్యలు చేసారు. ఈ దశలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రితో కొద్దిసేపు వాగ్వివాదానికి దిగి జి.ఒ.నెంబరు 132ను రద్దు చేయాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అయితే తనకు కొంత సమయం ఇస్తే సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూస్తానని కిడారి హామీ ఇచ్చి ఆందోళన విరమించాలని కోరారు. మంత్రి హామీతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయంత్రం వరకు సమాలోచనలు చేసి తాత్కాలికంగా రిలే దీక్షలను విరమించాలని నిర్ణయించారు. పది రోజుల్లోగా తమ సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ రిలే నిరాహర దీక్ష ప్రారంభించనున్నట్టు వారు చెప్పారు. దీంతో ఉపాధ్యాయుల ఆందోళన ప్రస్తుతానికి సద్దుమణిగినట్టయ్యింది.