విశాఖ

ఆశ్రమ విద్యలో సరికొత్త ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 16: విశాఖ మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సరికొత్త ప్రణాళికకు పాడేరు ఐ.టి.డి.ఎ. రూపకల్పన చేస్తుంది. ఆశ్రమాల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందకపోవడంతో వివిధ సబ్జెక్టులలో వారు గణనీయంగా వెనుకబడి ఉంటున్న విషయాన్ని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆశ్రమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నప్పటికీ, విద్యలో కనీస పరిజ్ఞానం, నైపుణ్యత కూడా లేకుండా ఉన్న విషయాన్ని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి పరిశీలనలో వెల్లడైంది. దీంతో ఆశ్రమ విద్యార్థులలో కనీస పరిజ్ఞానాన్ని కల్పించి విద్యలో వారి నైపుణ్యతను పెంపొందించాలని భావించారు. ఈ మేరకు 2019-20 విద్యా సంవత్సరంలో ఆశ్రమ పాఠశాలల విద్యలో గణనీయమైన మార్పును తీసుకురావాలని ప్రాజెక్టు అధికారి యోచిస్తూ ఇందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలంటూ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్‌ను ఆదేశించారు. ప్రాజెక్టు అధికారి ఆదేశాలతో ఆశ్రమ పాఠశాలల్లో వార్షిక విద్యా ప్రణాళికను తయారు చేసి అమలు చేసేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆశ్రమాల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులను ఈ ప్రణాళికలో చేర్చారు. ఈ మేరకు ఏజెన్సీలోని 11 మండలాల్లో ఉన్న 122 ఆశ్రమ పాఠశాలల్లో వివిధ సబ్జ్‌క్టులలో విద్యా బోధన చేస్తున్న 62 మంది స్కూల్ అసిస్టెంట్లను ఎంపిక చేసారు. ఎంపిక చేసిన స్కూల్ అసిస్టెంట్లలో తొమ్మిది మంది సభ్యులుగా చేర్చుతూ ఏడు బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా, తొమ్మిది మంది సభ్యులలోనే ఒకరిని బృంద నాయకుడిగా నియమించారు. అధికారులు ఎంపిక చేసిన 62 మంది స్కూల్ అసిస్టెంట్లతో ఈనెల 17 నుంచి 19వ తేది వరకు మూడు రోజుల పాటు పాడేరులోని పి.ఎం.ఆర్.సి. కార్యాలయంలో వార్షిక విద్యా ప్రణాళికపై కసరత్తు చేయనున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఏలా అందించాలి, వారిలో సామర్థ్యాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలు, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ఏం చేయాలి?, ఏలా చేయాలి? ఉపాధ్యాయులు, విద్యార్థులు అనుసరించాల్సిన విధానాలు వంటి అంశాలపై మూడు రోజుల పాటు కసరత్తు నిర్వహించి పక్కా ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళిక రచనలో ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇందుకు అనుగుణమైన కీలక అంశాలను రూపొందించాలని భావిస్తున్నారు. ఈనెల 19వ తేది నాటికి కసరత్తును పూర్తి చేసి తయారు చేసే మాస్టర్ ప్లాన్‌ను ఏజెన్సీలోని 122 ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే అమలులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇంతవరకు జరుగుతున్న విద్యాబోధనను పక్కనపెట్టి సరికొత్తగా రూపొందించే ఈ ప్రణాళిక ప్రకారం ఆశ్రమ విద్యలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈనెల 17వ తేది సోమవారం స్థానిక పి.ఎం.ఆర్.సి. కార్యాలయం ఆశ్రమ విద్యలో అధునాతన మార్పులకు వేదిక కానుందని చెప్పవచ్చు.