విశాఖపట్నం

సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, జూన్ 23: సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలంగా ఉంటుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. మండలంలోని తాళ్లపాలెంలో ఈ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనకాపల్లి మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ 2009 ఫ్రిబవరి 21న సబ్బవరం మండలంలో శంకుస్థాపన చేయడమే కాకుండా పరిపాలనా అనుమతులు ఇచ్చారన్నారు. ఈ పనులు పర్యవేక్షించేందుకు చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని కూడా విశాఖలో ఏర్పాటు చేశారన్నారు. ఆయన మరణాంతరం అప్పటి సిఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. రైతుల బాధలు గ్రామాల్లోనే గాని స్మార్ట్ సిటీలో ఉండవన్నారు. ఈ ప్రాజెక్టుకు మంజూరైన 50కోట్ల నిధులు పనులు జరగకపోవడంతో మురిగిపోయాయన్నారు. అయితే టిడిపి కూడా ఎన్నికల మందు వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రాజెక్టును సత్వరం పుర్తిచేస్తామని చెప్పారని అయితే రెండేళ్లు పరిపాలన పూర్తి అయినా దీనిపై శ్రద్ధచూపలేదన్నారు. దీనిపై తాను కూడా సిఎం చంద్రబాబుతో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడానని దీంతో ఆయన కూడా స్పందించారన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు పనులపై ఎటువంటి కదలిక లేదన్నారు. 2009లో ప్రారంభమైతే 2011కి పూర్తి అయ్యేదన్నారు. ఇదిఇలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో తాగడానికి కూడ నిళ్లులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు నీళ్లులేకపోవడంతో శారదానది నీళ్లు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాగుచేసుకునేందుకు భూములు ఉన్నా నీరులేక వ్యవసాయదారులు వలసలు పోతున్నారన్నారు. ఇటీవల కాలంలో మద్రాస్‌లో స్లాబ్‌కూలి మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లావారేనని అలాగే లారీలో కూలికి వెళ్లిన విజయనగరం వాసులు రోడ్డుప్రమాదంలో మృతి చెందారన్నారు. అదే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు ఎనిమిదిలక్షల ఎకరాలకు సాగునీరు, 12వందల గ్రామాలకు త్రాగునీరు లభిస్తుందన్నారు. గతంలో ఈ ప్రాజెక్టును 53.40 టిఎంసిలు వ్యవసాయం కోసం, 4.46 టిఎంసిలు తాగునీటి కోసం, 5.34 టిఎంసిల నీరు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా డిజైన్ చేసామన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఉత్తరాంధ్రకు జీవనధారమైన ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ఉద్యమం పార్టీలకు అతీతంగా చేపట్టామని తనకోసం, తనవారికోసం కాదని ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు, ప్రజలు కోసం చేపట్టామని ఎవరైనా ఎప్పుడైనా పాల్గొని పోరాటం చేయవచ్చునని మాజీ మంత్రి కొణతాల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు బ్రోచర్‌ను విడదల చేసి, తాళ్లపాలెం జంక్షన్ నుండి పోలవరం ఎనిమిదవ ప్యాకేజీ పనులు చేస్తున్న ప్రాంతం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు. కొణతాల సమక్షంలో తొలిసారిగా బయ్యవరం గ్రామానికి చెందిన గొల్లవిల్లి సాయిబాబునాయుడు అనే రైతుచే సంతకం చేయించి మూడు జిల్లాలో కూడా ఈ సంతకాల సేకరణ జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘం అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ, చీడికాడ జడ్‌పిటిసి పి సత్యవతి, మాజీ జడ్‌పిటిసి బొడ్డేడ సూర్యనారాయణ, మాజీ ఎంపిపి అడపా నరశింహమూర్తి, మాజీ కార్పొరేటర్ అంగా అప్పలరాజు, పెట్ల భద్రాచలం, నర్శిపట్నం మార్కెట్‌కమిటి మాజీ చైర్మన్ అంకంరెడ్డి జమీలు, మునగపాకకు చెందిన పెంటకోట రమణబాబు, ఆడారి గణపతి అచ్చింనాయుడు, నర్సింగబిల్లి సర్పంచ్ మజ్జి సూర్యప్రకాష్, పిఎసిఎస్ అధ్యక్షులు కలిగట్ల సింహాద్రి పాల్గొన్నారు.