విశాఖపట్నం

మెరవని బంగారం ( కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే ప్లాట్‌ఫారం అంతా సందడి ఉంది. భార్య, కొడుకుతో పాటు రైలెక్కిన మధుమూర్తి ‘‘ఇదిగో జానూ! బాబుని ఆ బెర్తు మీద పక్క వేసి పడుకోబెట్టు. బాటు కిట్ ఈ సీటు కింద ఉంచితే వాడికి కావలసినప్పుడు పాలసీసా, నీళ్లు అన్నీ తీసుకోవచ్చు’’ అంటూ భార్యకి జాగ్రత్తలు చెబుతున్నాడు.
‘‘అలాగేనండీ మనం రైల్లో సెటిల్ అయ్యాంగా. ఇంక అన్ని జాగ్రత్తగా సర్దుకోవచ్చు. మీరు కాస్త బాబుని పట్టుకోండి. నేను వాడికి బెడ్ రెడీ చేస్తాను’’ అంది సృజన పిల్లవాడిని భర్తకి అందిస్తూ.
బాబు రబ్బరు బొమ్మలా ఉండి అందరినీ ఆకర్షిస్తున్నాడు.
రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారు, సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన వారితో రైల్వేస్టేషన్ సందడిగా ఉంది.
ఇది నాకేం కొత్త కాదు అన్నట్టు గట్టిగా కూత వేసి బయలుదేరింది బండి.
ఆగవలసిన స్టేషన్‌లో ఆగుతూ ఎక్కే వారిని ఎక్కించుకుంటూ, దిగే వారిని దింపేస్తూ తన ప్రయాణం సాగిస్తోంది రైలుబండి.
మధ్యాహ్నం వరకు ప్రయాణం సజావుగా సాగింది.
ఇంతలో ఏదో స్టేషన్‌లో ఓ పాతికేళ్ల కుర్రాడు ఓ చిన్న సూట్‌కేస్‌తో ఆదరా బాదరా బండెక్కాడు.
మధుమూర్తి పక్కన ఉన్న తన సీటు వద్దకి చేరుకున్నాడు.
అదే సమయంలో ముందుగానే ఆర్డర్ చేసిన మీల్స్ వచ్చాయి.
‘‘బాబుకి పాలు పట్టు జానూ! తరువాత మనం భోజనం చేద్దాం’’ అన్నాడు మధుమూర్తి చదువుతున్న మేగజైను పక్కన పెట్టి.
‘‘మీరు భోజనం చేయండి సార్ ఫ్రీగా. ఆ పక్కన నేను కూర్చుంటాను. ఇఫ్‌యూ డోంట్ మైండ్ ఆ మ్యాగజైను ఓ సారిస్తారా’’ అన్నాడు ఇందాక బండి ఎక్కిన కుర్రాడు.
‘‘వైనాట్? ష్యూర్’’ అంటూ మ్యాగజైను ఆ అబ్బాయికి అందించి భోజన కార్యక్రమం ప్రారంభించాడు.
భోజనాలు అయ్యాక ఆ కుర్రాడు తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు.
‘‘ఎందాకా సార్ ప్రయాణం’’ అంటూ పలకరించాడు.
‘‘కోల్‌కతా! మరి మీరు’’ అన్నాడు మధుమూర్తి.
‘‘అరె నేనూ కోల్‌కతాకే. బిజినెస్ పని మీద వెళుతున్నా’’ అన్నాడు.
‘‘అయితే మాకు మంచి కంపెనీ మీరు’’ అంటూ నవ్వాడు మధుమూర్తి.
బాబుతో కాసేపు ఆడుకున్నాడు ఆ అబ్బాయి.
‘‘మా తమ్ముడు కూడా మీలాగే ఉంటాడు. అందుకే బాబు మారాం చేయకుండా మీ దగ్గరకి వచ్చాడు’’ ఆ అబ్బాయితో అన్నాడు మధుమూర్తి.
ఇంతలో ఓ కుర్రాడు బండిలోకి వచ్చాడు. పాపం ఆ కుర్రాడికి పోలియో వచ్చినట్లుంది చిన్నప్పుడు. కాళ్లు కొద్దిగా వంకర తిరిగి ఉన్నాయి. సరిగా నడవలేకపోతున్నాడు. బండిలో ఎక్కి కంపార్టుమెంటు క్లీన్ చేశాడు. ఎవరికి తోచింది వారు ఇచ్చారు ఆ కుర్రాడికి.
మాసిన చొక్కా, రకరకాల గుడ్డ ముక్కలు అతికిన నిక్కరు, ఎప్పుడూ నూనె ఎరుగని జుట్టు, దీనంగా ఉన్నాడు ఆ కుర్రాడు.
‘‘రైల్వే పనివారు ఉండగా ఇలాంటి వారిని ఎందుకు బండిలోకి ఎక్కనిస్తారో’’ అని ఒకరంటే ‘‘అలా తుడిచినట్లు తుడిచి ఏదైనా దొరికితే చేజిక్కించుకుంటారు’’ అని మరొకరు అన్నారు.
అదంతా విని ‘‘జానూ! మన జాగ్రత్తలో మనం ఉండాలి. సామాన్లు జాగ్రత్త’’ అన్నాడు మధుమూర్తి భార్యతో.
ఆ కుర్రాడు ఒక మూల కూర్చున్నాడు. బండి బరంపురం స్టేషన్‌లో ఆగింది. చాలా మంది దిగిపోయారు. ఓ పెళ్లి వారి బృందం ఎక్కింది. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు మధుమూర్తి ఎదురు సీట్లో కూర్చున్నారు. మిగతా వారు ఎక్కడి వారు అక్కడ సర్దుకున్నారు. నూతన దంపతులు గుసగుసగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
మధుమూర్తి టాయిలెట్‌కి వెళ్లాడు.
సృజన కోల్‌కతా కుర్రాడికి బాబుని అందించి వాడి పక్క సర్ది బట్టలు మార్చి పడుకోబెట్టింది.
‘‘జానూ! నువ్వు కింద బెర్తు మీద పడుకో. పైన సామానుందిగా నేను పడుకుంటాను. బాబు జాగ్రత్త. మిడిల్ బెర్తు మీద ఆ అబ్బాయి పడుకుంటాడు’’ అన్నాడు మధుమూర్తి.
బాబుతో కింద బెర్తు మీద పడుకుంది సృజన. అంతా నిద్రలోకి జారుకున్నారు. కొత్త జంట మాత్రం అలా కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఇంతలో ‘కెవ్వు’మన్న కేకకి సృజన ఉలిక్కిపడి లేచింది. ‘‘ఏమయిందిరా? ఏమయిందమ్మా?’’ అంటూ బాబుని అక్కున చేర్చుకుంది. ఈ హడావుడికి అంతా లేచి కూర్చున్నారు. కంపార్టుమెంటులో లైట్లు వెలిగాయి.
ఆ పోలియో కుర్రాడి చేతిలో బ్రీఫ్‌కేస్. ఏదో చెప్పబోయాడు అతను.
‘‘ఇదిగో ఆ బ్రీఫ్‌కేస్ తీస్తుంటే బాబుకి తగిలి ఏడ్చాడు. అందులో ఏదో దొంగిలిద్దామని’’ అంది సృజన.
ఆ కుర్రాడు ఏదో చెప్పబోయాడు.
‘‘చూడు జాను ఏమేం పోయాయో’’ అన్నాడు మధుమూర్తి.
‘‘ఏమండీ బాబు మెడలో చైను లేదండీ’’ అంటూ భర్తకి చెప్పింది.
‘‘ఇది ఆ వెధవ పనే! చూడండి ఎక్కడ దాచాడో’’ అంటూ ఎవరికి తోచింది వారు చెప్పసాగారు.
ఇదంతా విన్న ఆ నూతన దంపతులు ‘‘ఆ చైను ఈ కుర్రాడు తీయలేదండీ. ఇందాక మీరు పక్క శుభ్రం చేస్తున్నప్పుడు బాబుని ఎత్తుకున్న వాడి అంకుల్ తీసాడు. ఇందాక ఏదో స్టేషన్‌లో దిగుతూ, ‘మా వాళ్లు బాగా నిద్రలో ఉన్నారండీ. సామాను కాస్త చూడండి, ఇప్పుడే వస్తాను’ అంటూ దిగి మరి బండెక్కలేదు. బండి కదిలితే మరో పెట్టెలో ఎక్కాడేమో అనుకున్నాం’’ అన్నారు.
‘‘అంకులూ కాదు పెంకులూ కాదు. వాడూ మాలాగే ఓ ప్రయాణికుడు అంతే’’ అన్నాడు మధుమూర్తి.
‘‘మీ బ్రీఫ్‌కేసు కింద పడుతూ ఉంటే ఈ కుర్రాడు పట్టుకున్నాడు. అది సీటు చివరగా పడుకుని ఉన్న బాబుకి కొద్దిగా తగిలింది’’ అంది కొత్త పెళ్లి కూతరు.
‘‘మీరంతా కలసి కార్డ్సు ఆడి, సరదాగా ఉండి ఆ కుర్రాడితో అంత క్లోజ్‌గా ఉంటే మీ సొంతమే అనుకున్నాం లెండి’’ అన్నాడు కొత్త పెళ్లి కొడుకు.
‘‘పాపం ఆ అబ్బాయిని అనవసరం తూలనాడాం జాను. వాడికో వంద రూపాయలివ్వు’’ అన్నాడు మధుమూర్తి.
‘‘వద్దు బాబూ నా దగ్గర వంద రూపాయలుంటే నేను దొంగనని నన్ను తంతారు’’ అన్నాడు వాడు భయంగా.
‘‘పోనీ ఓ పది రూపాయలు తీసుకో’’ అంటూ అందించాడు మధుమూర్తి.
‘‘మనం కోల్‌కతా చేరకుండానే కోల్‌కతా మోసం మనకి రైల్లోనే జరిగిపోయింది. మెరిసేదంతా బంగారం కాదు జానూ’’ అన్నాడు మధుమూర్తి.
‘‘అవునండీ ఈ కుర్రాడు మెరవని బంగారం’’ అంది సృజన బాబుని ఒళ్లోకి లాక్కుంటూ.

- శివాని, శృంగవరపుకోట.
మినీకథ

ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు. తెల్లారితే మా పాప పుట్టినరోజు. ఎన్నో ఆశలు.. ఊహలు..! బంధువులని, స్నేహితులని అందరినీ ఆహ్వానించాను... రండి... రండి మా పాపని ఆశీర్వదించండి అని పిలిచాను. ఖర్చు లక్ష రూపాయల వరకూ ఉంటుందని అంచనా... అయినా పర్వాలేదు నాకు ఒకే ఒక పాప... లేక... లేక... కలిగిన సంతానం. అయినాసరే ఏదో అసంతృప్తి నన్ను వెంటాడుతోంది. వచ్చిన అతిథుల భోజనాలకే దాదాపు 50 వేలు అవుతుంది. ఇక డ్రింక్‌లు... డెకరేషన్... మందు పార్టీలకి మరో 50 వేలు నో డౌట్...! అయినా పర్వాలేదు పాపంటే నాకు చాలా ఇష్టం. రాత్రి 11 గంటలు దాటింది. అయినాసరే ఎందుకో నిద్ర పట్టడం లేదు. మా పాప పుట్టినరోజు మా ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. ఇంతలో మా ఆవిడ నిద్ర లేచింది. ఏమండీ ఇంకా నిద్రపోలేదా అని అడిగింది. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కేటరింగ్ వాళ్లకి... డెకరేషన్ వాళ్లకింకా డబ్బులు ఇవ్వలేదు. నా దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది. ఎందుకో సరదాగా.. టివి పెడితే... అక్కడ ఓ వార్త నా గుండెల్ని పిండేసింది. ఓ పాపకి గుండె ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం చేయమంటున్నారు సదరు టివి ఛానెల్‌వారు... ఇక నేను ఏం ఆలోచించలేదు మా పాప పుట్టినరోజు డబ్బులు లక్ష రూపాయలు గుండె ఆపరేషన్ ఖర్చులకి రాశాను. అప్పుడు నాకు నిద్రపట్టింది.

- కోనే సతీష్, శ్రీకాకుళం,
సెల్: 7675924944.

పుస్తక సమీక్ష

ప్రముఖుల ప్రశంసలు అందుకున్న
కోటిగాడా తెలుసుకో

శ్రీకాకుళం, ఢిల్లీ, రాజాం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత, మిధునం చిత్ర నిర్మాత మయివ ఆనందరావు శతకోటి తత్వాలతో ఉన్న ఈ కోటిగాడా తెలుసుకో పుస్తకాన్ని రాశారు. ఇందులో మొత్తం నూరు పద్యాలు ఉంటాయి. వీటన్నింటికీ కోటిగాడా తెలుసుకో అను మకుటంను అలంకరించారు. ఇందులో విషయ, మానవత్వ, విద్య, ఇతర అంశాలు గూర్చి దీర్ఘ సందేశాన్ని సంక్షిప్తంగా రాశారు. నేటి యువతరానికి వ్యక్తిత్వ వికాశం, అభివృద్ధి కొరకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేడు యువ వయస్కుల ఆలోచనలు నెగెటివ్‌గా ఉన్నాయి. ఈ వ్యతిరేక భావాలు గల వారిగూర్చి పుస్తకంలోని 19వ పద్యంలో ఈ విధంగా రాశారు.
తెల్లగున్న కాగితముపై
మంచి రంగులద్దేటప్పుడు
ఎదుటి కళ్లతో రంగులెంచుట
కోటిగాడా తెలుసుకో
అని క్లుప్తంగా వివరించారు. అలానే తప్పు చేసినవారు పశ్చాత్తాపము ద్వారా తప్పులను సరిదిద్దుకొనుటను గూర్చి ఈ పుస్తకంలోని 36వ పద్యంలో వివరించారు.
తప్పుచేసి తప్పించుకొనుట
కాదు ఎప్పుడు సాధ్యమా
ఒప్పుకొనుటలో గొప్పతనమును
కోటిగాడా తెలుసుకో
ఈ విధంగా ఒక కొత్త సారాంశాన్ని వెలిబుచ్చారు. మరియు భగవంతుడు ఒక్కడేనని, సర్వమతాలను ఆరాధించమని, సర్వమత గ్రంథాలను గూర్చి 38వ పద్యంలో వివరించారు.
గౌరవించు గౌతమా
బైబిలు ఖురానునూ
సత్యసాధన ఇచ్చు సుఖమును
కోటిగాడా తెలుసుకో
ప్రతీ దినం ఏదో ఒక సమస్యతో బాధపడేవారి కోసం, చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా భావించి బాధపడేవారికోసం 81వ పద్యంలో వివరించబడింది.
చిన్నదైనా పెద్దదైనా
సమస్యొస్తే చెదరకూ
బెదిరేకొద్దీ బాధ పెరుగును
కోటిగాడా తెలుసుకో
ఇటువంటి విభిన్న తత్వాలుతో ఒక మినీ భగవద్గీతగా ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది. సప్తశతాబ్ది శ్లోకాలుగల భగవద్గీతను నేటి ప్రజానీకానికి అర్థమగు రీతిలో నూరు పద్యాలతో ఒక నూతన భగవద్గీతను బహూకరించారు. ప్రకృతిని కాపాడు, స్ర్తి రక్షణ, భగవద్గీత, గురువులను గౌరవించుట, వివిధ ప్రస్తుత సమస్యాత్మక విషయాలు గూర్చి సందేహాలను నివృత్తి చేసుకొనుటలో ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. చివరగా నూరవ పద్యంలో వారి స్వభావం అర్థమవుతుంది.
ఎవరి తత్వపు రీతి వారివి
నా కవిత్వపు తీరివి!
తప్పులుంటే తమ్ముడనుకుని
ముదముతో మన్నించండి
అని వారియొక్క రచనా గొప్పతనాన్ని ఈ పుస్తకంలో తెలియజేశారు. ఈ పుస్తకంపై ప్రముఖ సినీ నటుడు తనికెళ్ళ భరణి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
అనుభవమ్, అక్షరమై
ఆర్తయే ఆనందమై
మథనమ్... మన మిథునమయ్యెను
కోటిగాడా... తెలిసెనూ!
అలాగే మరో సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఓ సంస్కారి మూలాలు ఈ రచనల్లో మనం గుర్తుపట్టవచ్చు. మంచి ఆలోచన- ముడతలు పడిన వస్త్రాన్ని ఇస్ర్తి చేసి సాపుచేసే ప్రయత్నం వంటిదని తెలిపాడు. ప్రముఖ సినీ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ‘‘ఇది మరో భిన్నమైన ప్రయోగం. చిన్న చిన్న వాక్యాల్లో, క్లుప్తమైన పదాలతో వెలుగు దగ్గరకు వెళ్లే విధానం పాఠకుడికి చెప్పే ప్రయత్నం ఇందులో చేశారు అని అభివర్ణించారు. సినీ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం కాస్త కొత్తగా, బోల్డంత అమాయకంగా ఉంది. అమాయకంగా అంటే కల్మషం లేకుండా అని నా అభిప్రాయం అని తెలిపారు. ఇలా ప్రముఖుల ప్రశంసలను చూరగున్న ఈ పుస్తకాన్ని పది కాలాలపాటు పదిలపరచుకోవచ్చు. ఈ రచయిత నుంచి మరిన్ని పుస్తకాలు విడుదల కావాలని కోరుకుందాం.

- చందన రవీంద్ర
సెల్: 9492118960

మనోగీతికలు

గురజాడకు నివాళి
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
ఆనాటి గురజాడ మాట
ఇప్పుడన్ని దేశాలలో
అమెరికా నిండిపోయింది
ఇప్పుడు దేశభక్తి అంటే
అమెరికా భక్తి
పాడి పంటలు పొంగిపొర్లే
దారులు మూసుకుతున్నాయి
పచ్చటి పొలాలు ధ్వంసం చేసి
కర్మాగారాలు నిర్మిస్తున్నారు
పల్లెలు కనుమరుగవుతున్నాయి
పంటలు కానరాలేదు
మతములన్నీ మాసిపోతున్నాయి
అయినా జ్ఞానమొక్కటే
నిలిచి నిలిచి వెలుగును
నేడు మత అసహనం, దాడులు
బాంబుల విష సంస్కృతి
కన్యాశుల్కంలో ఒక్కడే గిరిశం
వీధులు, పట్టణాలలో అందరూ గిరీశాలే
మతం, మూఢ నమ్మకాలపై
పోరాటం గురజాడది
మతోన్మాదం, మహిళా విముక్తి కోసం
ఉద్యమించడమే గురజాడకు
మనమిచ్చే నిజమైన నివాళి!

- తుంపాల శ్రీరామమూర్తి, గాజువాక, విశాఖ-26. సెల్ : 9440260280.

మేలుకో నేస్తమా
ఎన్నో దారులు ఉన్నాయని
బతుకు ముగసే దారి మనకెందుకు?
కొమ్మలన్నీ కోసేసారని
చెట్టు చిగురించడం మానేస్తుందా?
మబ్బులెన్నో కమ్మేసాయని
రేపటి సూర్యోదయం ఆగిపోతుందా?
నిన్ను నువ్వు నమ్మితే
భయమే భయపడుతుంది
ఎవరో ఏదో అంటారని
ఎందుకు భ్రమపడుతున్నావ్
నీ నడకే పరుగైతే ఆకాశమే సరిహద్దు
కల గంటూ కూర్చోకు కాలాన్ని జారిపోనీకు
చేతులతోనే తోడేయవచ్చు
ఏ సంద్రాన్ని అయినా
ధైర్యంతోనే ఆపేయవచ్చు
ఏ ప్రళయాన్ని అయినా
ఒక్కసారి నీ మెదడును కదిలించు
అనుకున్నది సాధించు వీరుడివై ఉదయించు!

- మజ్జి పాపినాయుడు, సెల్ : 9100475182.

ఎవరన్నారు?
కోట్లు... వేల కోట్లలో రాజ్య ప్రచారాలు
అభివృద్ధి కోసం,
ఆకలి కోసం అంటూ నినాదాలు
ఆ పార్టీ ఈ పార్టీ... ఆ మంత్రి ఈ మంత్రి
అందరి నోట జనహిత మంత్రమే
నిజాయితీ, చిత్తశుద్ధి కంపుకొట్టే మాటలు
దశాబ్దాల పాలన
మారిన పార్టీల పట్ల హేళన
అయినా ఆకలి, దరిద్రం, నిరుద్యోగం,
నక్సలిజం పోలేదు
ఎవరన్నారు ఇక్కడ రాజ్యం ఉందని?
ఎవరన్నారు ఇక్కడ పేదరికం లేదని?
లక్షాధికారులకు సబ్సిడీలు
సంపన్నుల భూముల్లో
సర్కారు పథకాలు
ఎవరన్నారు ఇది ప్రజాస్వామ్యమని?
నీటి మీద రాతలే కదా
ఈ ప్రజల బ్రతుకులు?

- కె. సతీష్, సెల్ : 7675924944.

ఆనంద దీప్తి
1. ఎందుకు మనీషి
దిగాలుగా ఉన్నావు!
జగాన చూస్తున్నదేగా
మిగులుగా ఏముంది
యుగాలుగా ఉన్నదేగా?

2. శిశువుగా పుట్టి
తల్లితండ్రి వద్ద పెరిగి
పల్లె వొడిలో పవళించి
అనుబంధాలు చవిచూసి
బంధాలు పెనవేసుకొని
నాది అనుకొన్నది నీ మనసేగా!

3. మర జీవనం ఆశల ప్రయాణం
మరల బతుకు మాయజూదం
ఎరల పయనం వ్యథాభరితం
తెరల జీవితం తెగని ఆరాటం
నాది అనుకొన్నది నగుబాటేగా!

4. మన ముందువాళ్లు
ఇవన్నీ చూసినవాళ్లే కదా!
అనుభవించిన వారేగా
అవలోకనం చేసుకొన్నవారేగా
నాది అనుకొన్నది లేదన్నవారేగా!

5. తుడిచెయ్యి ఈలోక ఆర్తిని
విడిచెయ్యి శంకలన్నీ పూర్తిగా
మిగిలిపో శాంతమూర్తిలా
ప్రశాంత వదన స్ఫూర్తిగా
అనంత ఆనంద దీప్తిలా..!

- ఆచార్య మక్కెన శ్రీను, చరవాణి : 9885219712

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- శివాని