విశాఖపట్నం

రాతి విగ్రహం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటో వచ్చి నా ముందరే ఆగింది. డ్రైవర్ వెనక్కి తిరిగి- ‘‘దిగండి బాబూ’’ అని అసహనంగా అన్నాడు.
ఆటో నుండి వౌనంగా దిగిపోయారాయన.
‘‘డబ్బులిచ్చేసి ఎక్కడికెళ్తారో వెళ్లండి!’’ కాస్త దురుసుగానే అన్నాడు ఆటో డ్రైవర్. ఆటో దిగిన పెద్దాయనెవరోకాదు. నా చిన్నప్పటి మాస్టారు రామశర్మగారు. పైగా వారుండేది మా వీధి పక్క వీధిలో మూడో ఇల్లు. ‘‘నమస్తే మాస్టారూ!’’ నవ్వుతూ అన్నాను. మాస్టారీలోకంలో ఉన్నట్టు లేరు. అయోమయంగా నాకేసి చూశారు.
‘‘మాస్టారూ! నేనండి రాజా గణేష్‌ని’’ అన్నానీసారి. నువ్వెవరివో నాకు తెలీదన్నట్టున్నాయి మాస్టారి చూపులు. ‘బహుశా మర్చిపోయుంటారు. వారి సర్వీసులో నాలాంటి విద్యార్థులెంతమందో ఓ లెక్కా జమా గుర్తు పెట్టుకోవడానికి’ అనుకున్నాను.
మాస్టారు జేబులోంచి వంద రూపాయల నోటిస్తే విసురుగా లాక్కున్న ఆటోవాలా ‘‘అబ్బ... తెగ విసిగించాడండీ! ఎక్కడికెళ్లాలోఅతనికే అర్థంకావటం లేదు...’’ విసుక్కున్నాడు.
మాస్టారికేసి ఈసారి దీక్షగా చూశాను.
ఈ లోకంలో ఉన్నట్టు లేరు.
ఆటోవాలాని పంపించేసి దగ్గర్లోనే ఉన్న మాస్టారింటికి తీసుకుపోదలిచాను. నాతో పాటుగా మాస్టారు నడుస్తుంటే... ‘‘నన్ను గుర్తుపట్టలేదేమండి?’’ అనడిగాను. మాస్టారు పెదవి విరిచేసిన జారుడుమెట్టు నవ్వు నవ్వారు.
‘‘అదేనండీ... రెండో క్లాసు చదివేటప్పుడు నాకు చప్పిడి ముక్కని పేరెట్టారు కదా! అయిదో క్లాసువరకూ అదే పేరుతో మీరూ, నా క్లాస్‌మేట్స్ కూడా పిలిచేవారు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులెదురైనప్పుడు ‘చప్పిడీ’ అనే అంటుంటారు.’’ గతం గుర్తుచేశాను.
మాస్టారు అలాగా అన్నట్టు చూసారే తప్ప మారు మాట్లాడలేదు.
వారింటి గుమ్మంలోకి చేరుకోగానే కుక్క గాబరాగా వచ్చి అమాంతం వార్ని వాటేసుకుంది. ఒళ్లంతా నాకేస్తూ కాళ్లు పైకందించుకుంటూ తోకూపుతూ ఎగుర్తోంది.
‘‘హైడీ! ఉండరా!’’ అంటున్నారు మాస్టారు. అయినా అది వదలడం లేదు. గేటు తీసుకుని మెట్లెక్కుతున్న ఆయన్ని అనుసరించాను.
‘‘అయ్యయ్యో! పేపర్ కొనుక్కుని వస్తానని ఉదయనగా వెళ్లినోరు ఇంతసేపా?’’ అంటూనే మాస్టారిగారి భార్య బయటికొచ్చారు.
‘‘మాస్టారు గారు ఇల్లు మర్చిపోతే నేనే తీసుకొచ్చానండీ!’’ నమస్కరిస్తూ చెప్పాను.
ఆమెకి అర్థమైనట్టుంది. ‘‘లోపలికి రాబాబూ!’’ అన్నారు.
‘‘ఆండాళ్లూ! హైడీకి అన్నంపెట్టావా?’’ అడిగారు మాస్టారు.
‘‘ఇదిగో... ఇక్కడే పెట్టాను. మీర్రాలేదని ఒక్క మెతుకయినా ముట్టలేదు చూడండి’’
‘‘మరి నువ్వు... నువ్వ భోంచేశావా?’’ మళ్లీ అడిగారు మాస్టారు.
‘‘అయ్యో రామా! మీరు తినకుండా నేనెప్పుడైనా తిన్నానా ఏమిటీ...’’ అందామె.
‘‘ఇప్పుడే పెద్దోడు స్పందన్ అమెరికా నుండి ఫోన్ చేశాడు. ఆయమ్మట్నే చిన్నోడు హృదయ్ ఆస్ట్రేలియా నుండి ఫోన్ చేశాడు. అమ్మాయి హేమా, అల్లుడు కూడా సౌదీ నుండి ఫోన్ చేశారు’’ ఆమె చెప్పుకుపోతూనే ఉంది. మాస్టారు ‘‘ఊ’’ అని కూడా అనడంలేదు.
‘‘అయ్యో రామా! ఇంత మతిమరుపేమిటండీ మీకు? టేబిల్ మీద వడ్డించి ఉంచాను. పదండి అన్నం తిందురుగాని...’’ అని నావైపునకు తిరిగి- ‘‘చాలా థాంక్స్ బాబూ’’ అన్నారు.
నేను నవ్వుతూ చూస్తుండిపోయాను.
‘‘మొన్నటికి మొన్నా అలాగే చేశారు. నేను చచ్చీచెడీ పాతగాజువాక నుండి కొత్త గాజువాక వరకూ తిరిగి ఆఖరికి సిన్మా హాలు దగ్గర దొరకబుచ్చుకున్నాను. మా పెద్దబ్బాయి స్పందన్ అమెరికాలో పెద్ద డాక్టర్. అమెరికా తీసుకెళ్తానన్నాడు. ఇదిగో అదుగో అంటూనే ఆరునెల్లు గడిచిపోయింది. ఈలోగా ఇక్కడ డాక్టర్‌కి చూపించాను. ఏవో మాత్రలిచ్చి వయసు పైబడింది కదమ్మా అన్నారు’’ చెప్పిందావిడ.
మాస్టారు వౌనంగా భోంచేస్తున్నారు. వారు తినడం చూసిన కుక్క బుద్ధిగా అన్నం తింటోంది.
‘‘వెళ్లొస్తానండీ! మాస్టార్ని ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనివ్వకండి!’’ అన్నానే్నను.
మాస్టారు చేయి కడుక్కుని వచ్చి కుర్చీలో రాతి విగ్రహంలా కూర్చున్నారు.
మాస్టార్ని అంటిపెట్టుకుని సేవచేస్తున్న కట్టుకున్న భార్య ఆండాళ్లుని మర్చిపోలేదు. తను పెంచిన ప్రేమకు విశ్వాసాన్ని చూపుతున్న కుక్కని మర్చిపోలేదు!
నిచ్చెనలా ఉపయోగించుకుని మర్చిపోయిన నాలాంటి విద్యార్థుల్ని మర్చిపోవడం సబబే! కని పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసిన కన్న పిల్లల్ని మర్చిపోయారంటే ఏమనుకోవాలి? వాళ్లు మాస్టార్ని నెగ్లెక్టెడ్ ఫాదర్ని చేశారనుకోవాలా? ఏమనుకోవాలి? వెనుదిరుగుతూ మాస్టారి వైపు మళ్లీ చూశాను. వారి ముఖంలో ఏ భావమూ లేదు. రాతి విగ్రహంలా చూస్తున్నారు.

- ఎల్ రాజాగణేష్, పాతగాజువాక, విశాఖపట్నం. సెల్: 9247483750.

మినీకథ

మా సం‘గతేంటి’?

చేతికందాక చేజారిపోయిన జీవితాలు ఎలా ఉంటాయో మనకు కళ్లకు కట్టినట్టుంది ఈ కథ. మధుసూదన్ ఓ మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాడు కాని జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో ఇంతకీ మధుసూదన్ ఆ స్థాయికి ఎలా వెళ్లాడో తెలుసుకోవాలి.
రంగయ్యది కూలి చేసుకునే కుటుంబం. ఎలాగైనా కొడుకు మధుసూదన్‌ను బాగా చదివించి ఈ కష్టాల నుండి బయటపడేయాలనే ఆరాటం. కనీసం సెంటు భూమైనా లేక కౌలు చేసుకుంటూ ఉన్నత చదువులు చదివించాలనే తపన రంగయ్యది. రంగయ్య ఆశలకు అనుగుణంగా కొడుకు మధుసూదన్ కష్టపడి చదివాడు. ఇంజనీరింగ్ చదివేటప్పుడు కనీసం నెలకు ఒకసారైనా వెళ్లి తన బాగోగులు చూస్తుండేవాడు. క్యాంపస్ సెలక్షన్‌లో జాబు వచ్చింది. జాయిన్ అవడానికి వాళ్ల నాన్నతో వెళ్లిన మధుసూదన్‌ను ఎవరు ఈయన అనగా ‘మా బంధువు’ అని చెప్పేసరికి రంగయ్యకు కళ్ల నీళ్లు తిరిగాయి. తెలియక ఏదో చెప్పి ఉంటాడు అనుకొని సర్దుకుపోయాడు.
కొంత కాలానికి అదే కంపెనీలో పని చేస్తున్న అమ్మాయితో పరిచయం అయి చివరకు అది ప్రేమవరకూ దారితీసింది. రంగయ్యకు ఫోన్ చేసి ‘నాన్న నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాను’ అని చెప్పేసరికి రంగయ్య నోట మాట రాలేదు. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటే ఇదే కాబోలు అనుకుని తనకు తాను సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. ‘చూడు నాన్న మా ఇద్దరికీ పెళ్లి చేస్తానంటేనే మన ఊరు వస్తాను. లేదంటే ఇక్కడే పెళ్లి చేసుకుంటా’ అని మధుసూదన్ కరాఖండిగా చెప్పడంతో చేసేది లేక ఆ అమ్మాయి తన కులం కాకపోయినా పెళ్లి చేశాడు రంగయ్య.
అప్పటి నుంచీ రంగయ్యకు ఏదో తెలియని మనోవేదన. కులం కాని వాళ్లను చేశాడని పక్కవాళ్లకి తెలిస్తే తమ పరువు పోతుందనే బాధ. కాలం గడుస్తోంది. రంగయ్య ఆరోగ్యం క్షీణించింది. భార్య చంద్రమ్మ సేవలు చేస్తూ మధుసూదన్‌కు ఫోన్ చేసి ‘‘మీ నాన్న ఆరోగ్యం బాగోలేదు. ఒకసారి చూసిపో నాయినా’’ అని చెప్పగా ‘‘అమ్మా నేను బిజీగా ఉన్నాను. రావడం కుదరదు. వీలుంటే నీవే ఆసుపత్రికి తీసుకువెళ్లు’’ అని ఉచిత సలహా ఇచ్చాడు మధుసూదన్. గత్యంతరం లేక ఆటోను తెప్పించి తీసుకువెళుతూ ఉండగా ఆటోవాడు ‘‘ఏమ్మా మీ అబ్బాయి రాలేదా’’ అనేసరికి ‘‘వాడు చాలా బిజీగా ఉన్నాడంటయ్యా’’ అంటూ లోపల బాధపడింది.
రంగయ్య నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ‘‘ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి. ఎంత డబ్బైనా పంపిస్తాను’’ అంటూ ప్రేమను ఒలకబోశాడు. జీవితంలో వయసయిన తరువాత తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన అవసరం లేదా? అంటూ చుట్టుపక్కల వాళ్లు చంద్రమ్మను కోర్టులో వేయండి వాడే వస్తాడు అని సలహా ఇచ్చారు. ఎంతైనా కడుపుతీపి కదా అలా చేయడానికి చంద్రమ్మకు మనసు రాలేదు.
చివరికి రంగయ్య ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. ఫోన్ చేసి చెప్పగా ‘‘నేను కంపెనీ పనిమీద అమెరికా వెళ్లవలసి వచ్చింది’’ అంటూ వీసా నిబంధనలు చెప్పుకొచ్చాడు. ‘‘నేను తరువాత వస్తాను. మీరు కార్యక్రమం చేయండి’’ అంటూ ఫోన్ పెట్టేశాడు. అన్నీ ఉన్నా అనాథలా బతకడం ఏంటి అనుకొని కొన్నాళ్లకు మధుసూదన్‌ను వచ్చేయమంది. ‘‘అమ్మా నీవే ఇక్కడకు రా! బాగా చూసుకుంటాను’’ అన్నాడు. ఉద్యోగంలో చేరింది మొదలు కనీసం కనె్నత్తి కూడా చూడని పుత్రుని తలచుకుంటూ తన సొంత ఊరు, పరిసరాలను వదలి వెళ్లడం ఇష్టంలేని చంద్రమ్మ కొంత కాలానికి కన్నుమూసింది. కాని మధుసూదన్ మాత్రం సొంతూరికి రాలేదు.
కొడుకు కళ్లముందుండి బతుకు బండిని నడిపిస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు కలే మిగిలింది. అందుకే వేమన ఆనాడే చెప్పాడు ‘తల్లిదండ్రులమీద దయలేని’ అన్న పద్యం అక్షరాలా సత్యం. వయసు మీరిన తల్లిదండ్రులను చూసే బాధ్యత లేదా? ఇలా వదిలేస్తే వీరి గతేంటి? మరి చట్టాలు ఏమవుతున్నాయి? అవి సరే మనుషుల్లో మానవత్వం ఎక్కడ సంచరిస్తుంది? ఇలా కొన్ని రకాల ప్రశ్నలకు ఎప్పటికి సమాధానాలు లభిస్తాయో వేచిచూడాలి.

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం, విశాఖ జిల్లా.
సెల్: 9885090752.

పుస్తక సమీక్ష

సామాజిక మూలాల్ని
స్పృశించే - మూలరత్నాలు

సమాజాన్ని ఎన్నో రకాలుగా సన్మార్గాల్లో పెట్టాలన్న కవులు, రచయితల కృషి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మూల తాతయ్య గుర్తుకొస్తాడనటం అతిశయోక్తికాదు. ఎందుకంటే అక్షర చైతన్యానుదర్పణం తాతయ్య. సామాన్య జనానికే కాదు పామరుల్ని సైతం తన నటనా చాతుర్యంతో కట్టిపడేయగల దిట్ట. అంతేకాదు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే నేర్పరి కూడా. తను పుట్టింది వీరభద్రాపురం (బొడ్డునాయుడు, కొత్తూరు). జానపద గేయాలు చిన్నప్పటి నుంచే పెద్దప్ప, లచ్చప్ప, చిన్నక్కల దగ్గర నేర్చుకున్నారు.
అంతరించిపోతున్న ఏకపాత్రాభినయనానికి జీవం పోయాలన్న ఉద్దేశ్యంతో సమాజ చైతన్యాన్ని తెచ్చి జానపద కళలను పరిరక్షించాలన్న సదాశయంతో ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్ని, నటుడిగా ప్రేక్షకుల్ని రంజింపజేస్తోన్న రచయిత, నటుడు మూల తాతయ్య. తను రాసిన ‘‘అంతం... అంతం... అంతం...’’ నాటిక ద్వారా ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో కేంద్ర మంత్రులచే, హైదరాబాద్ దూరదర్శన్, రవీంద్రభారతిలో సన్మానాలు పొందినా తనకు బాలల్లో రచనా శక్తి పెంచాలని ఆశ. 2011లో తను మూల నవరత్నాలు అంటూ 9 ఏకపాత్రామాలికల్ని ప్రచురించారు. అన్నీ ఆణిముత్యాలే. భావితరాలకు మార్గదర్శకాలే. సమీక్షించాల్సి వస్తే సంక్షిప్తంగా ఒక్కో ఏకపాత్రనూ... 1) ఆకలి కాలం: ధన వ్యామోహంలో భార్యాలోలులకు గుణపాఠం చెప్పేది. 2) ఆలి (తి)చిప్పలు: మత్స్యకారుల జీవన జీవితాల ప్రతిబింబం. 3) మరణసంథ్య: కుటుంబ సభ్యుల మూర్గత్వాన్ని చూసి వారిలో పరిష్కారానికి కృషి చేసే ఏకపాత్ర. 4) గోరుముద్ద: ఈ ఏకపాత్ర మనం మన కన్నవారిని విస్మరిస్తే మన కన్నోళ్లు మనల్ని విస్మరిస్తారనే సందేశాన్ని తెలిపేదే గోరుముద్ద. 5) ఏదినీది: అన్నీ తనకే ఉండాలన్న స్వార్థం ప్రకృతి ముందు ఎలా ఓడిపోయిందో తెలిపేది. 6) దారుణం: కర్షకులు అణచివేతకు గురై తిరిగి ఎలా తిరగబడతారో తెలియజేయగలిగేది. 7) ఎటు: బాబాలు, సాధువుల బారినపడి జనం మోసపోతుంటే, మూఢ విశ్వాసాలకు బలైపోతుంటే వచ్చే ఫలితాలను వివరించేది. 8) భయం: టీవీలు, సెల్‌ఫోన్లు ప్రజల్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపే వైనం సూపర్బ్. ఇక ఆఖరిది, చివరిది 9) మాటమార్పు: గిరిజనుల్లో చైతన్యం రేపే మంచి మాటతో వారిలోని మూర్ఖత్వాన్ని మాపే ‘మాటమార్పు’. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రదర్శింపబడి సమాజంలో మార్పు ను కాంక్షించే ఈ గ్రంథం కావాలంటే 9885302527 ఫోనులో సంప్రదించాలి.

- రఫీ (ఈవేమన)
సెల్ : 7893451307.

మనోగీతికలు

వ్యక్తి వికాసం
వస్త్రం ఏదైనా వివస్త్రం కారాదు
వస్త్రం శరీరాన్ని కప్పి రక్షించేది
వస్త్రం చూపరులకు జుగుప్ప తేరాదు
వస్త్రం తనకు, ఇతరులకు సాంత్వననివ్వాలి
వపుసు (శరీర కాంతి) జ్ఞానందే కావాలి
శరీరం రంగు, ఎరుపైనా, నలుపైనా ఏదైనా
రంగు, ఆకారం ప్రధానం కాదు గుణముండాలి
గుణవంతుడు ఎలా ఉన్నా రాణిస్తాడు!
విద్య జ్ఞానానికి తోడవాలి
విద్యలో ఎన్ని పట్టాలైనా పొందవచ్చు
విద్యలో ఎన్ని భాషలో నేర్వవచ్చు
అజ్ఞానం తొలగించని విద్య నిరర్థకం
వినయం విలువైన భూషణమవాలి
వినయ విధేయతలు పెట్టని ఆభరణాలు
వేషభాషలు వినయం లేక కొరగానివి
జ్ఞానంతో వినయం
వికాసానికి మూలాధారం!

- శ్రీమతి గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395.

రాజధాని రాజకీయం
ఉన్న రాజధాని ఇచ్చేసాం
జపాన్ వెళ్లాం సింగపూర్ చూశాం
కొత్త రాజధాని నిర్మాణానికి
అలుపెరుగక శ్రమిస్తున్నాం
హస్తిన నిధులకు అర్రులు చాచాం
మట్టి నీరు నినాదం చేశాం
ఇసుక, సిమెంటు మరిచిపోయాం
ప్లాన్లు, ప్రణాళికలు పరిశీలించాం
రైతుల నుండి
భూమి, పుట్టా సేకరించాం
పూర్ణకుంభాన్ని, తెలుగు తల్లిని మరిచాం
రాజధాని పేరు అయోమయం!

- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ-532222. శ్రీకాకుళం.
సెల్ : 7680812592.

అపురూప క్షణాలు
మనసుకి నచ్చిన
మమతల అలికిడి లేక
ఆశల అలజడి తీరక
కాంతిహీనమైన
మది గదిబోసిపోయింది
ఎడారంత మది గుడారంలో
ఒంటరినైన నేను ఆ నిముషంలోనే
ఆశలపై ఎగిరొచ్చి
అందాల జాబిలితో తోరణాలు కట్టించి
పచ్చదనంతో పందిరేసి
వెనె్నలమ్మతో పరదాలు పరిచి
సన్నజజి పరిమళాలు జల్లి
సుమాల కన్నా సుకుమారమైన నీ అడుగులు
నా మది గది వైపు పడినప్పుడు
నా చూపుల్లో సిగ్గుల మొగ్గలు
నా పెదాలపై పగడాల నిగ్గులు
నా మదిలో ఆనందానుభూతులు
నిండాయని నీకెలా తెలుపను?
ఆ విలక్షణ క్షణాల విలువ ఎంతని చెప్పను?

- శివానీ,
శృంగవరపుకోట.

మనం మనుషులం !
పిలిస్తే సొమ్ము చేతికొస్తుంది !
పిలవకపోతే ఇంటికొస్తుంది !
కనీస అవసరాలకు కొంతమంది పిలిస్తే...
ఆశలు తీర్చుకోడానికి కొందరు
అత్యాశకు పోయి ఆహ్వానించేది ఇంకొందరు
దురాశతో ధైర్యం చేసినవారూ ఉన్నారు
వడ్డీలు భారమని తెలిసినా
వేరొకరి మీద భారం మోపవచ్చునని ధీమా !
ఆశాపరులు అడియాశకు లోనైతే
దిక్కులేని దీనుల స్థితే విలవిల...
కాలనాగని తెలిసినా
కడుపులు నింపుకోడానికి వేరే దారి లేదు
నారుపోసిన వాడు పోసిన నీరు
ఇదేననుకున్నారు
దైవం మీద నమ్మకమున్నవారు వీరే !
కడుపులు నింపడం మాట ఎలావున్నా !
మాట నిలబెట్టుకోడానికి
మానం ఫణమయ్యింది!
అసలు దీనికోసమే సొమ్ముల పిలుపేమో !
ఆశ ధనం మీద అయితే
మానభంగం ఎందుకు ?
ప్రజలచేత ఎన్నుకోబడ్డ
ప్రజల ప్రభుత్వం
రావణ, తారక, నరక, అసురులతో
అపహాస్యం...
స్వామ్యమంటే ఇదేనా !
బలహీనతను పెంచడం
బలంతో దోచడం
కండకావరం కాదా !
తలలో విషముంది కదాని
తోకను మర్చిపోతే ఎలా ?
చలిచీమల బలం తోకతోనే మొదలు
కాలకూట విషాన్ని కూడ
పంచుకుని పండగ చేసుకోగలవు!
జర భద్రం...!
మనం మనుషులం !!

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం
94911 71327

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- ఎల్ రాజాగణేష్