విజయనగరం

మెంటాడలో మహిళ సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఫిబ్రవరి 21: అర్థరాత్రి సమయంలో ఇంట్లో ప్రమాదవశాత్తూ చెలరేగిన మంటలో నిరుపేద నిండుప్రాణాన్ని బలిగొన్నాయి. స్థానికులు ఎగసిపడే అగ్ని కీలాలను అదుపుచేసి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అదే ఇంటిలో ఉన్న మద్యం ఖాళీ గాజు సీసాలు పేలుడుధాటికి భయపడి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అందరు చూస్తుండగానే మహిళ మంటల్లో మాడి మసి అయిపోయింది. మెంటాడలో సోమవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచి వేసింది.
మెంటాడ గ్రామానికి చెందిన బోని లక్ష్మి(55)కి ఐదుగురు సంతానం, వీరంతా ఉపాధి రీత్యా వేర్వేరు ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు. కొనే్నళ్ల కిందట భర్త ముసలయ్య మృతి చెందడంతో లక్ష్మి ఒక్కరే పూరిపాకలో జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే లక్ష్మి నిద్రపోయాక అనుకోకుండా పూరిపాకలో మంటలు వ్యాపించాయి. మంటలు వేడికి మెలుకువ వచ్చిన లక్ష్మి భయబ్రాంతులకు గురై తనను రక్షించాలని కేకలు వేసింది. ఈ ఇంటికి ఆనుకుని ఉన్న కొణిశి అప్పన్న మేల్కొని బయటకు వచ్చి చూడగా రెండిళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆపద నుంచి తప్పించుకున్నారు. వీరు కేకలు వేయడంతో సంతతోట వాసులు వచ్చే సరికి లక్ష్మి ఇల్లు మంటలలో చిక్కుకుంది. అయినప్పటికీ స్థానికులు లక్ష్మిని ఎలాగైనా కాపాడాలని సాహసించారు. కొంతమంది నీరు జల్లుతూ ఇంటిలోకి చొరబడే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఖాళీ సీసాలు మంటలలో పేలడం మొదలయ్యాయి. పేలిన సీసాలు ముక్కలు బయటకు తూలడంతో స్థానికులు భయపడి లక్ష్మిని రక్షించలేకపోయి వెనక్కి పరుగులు తీశారు. దీంతో లక్ష్మీ ఇంట్లో సజీవ దహనం అయిపోయింది.

ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు

అగ్ని ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భిక్షాటనతో లక్ష్మి కాలం వెళ్లదీస్తూ వస్తుంది. దొరికిన మద్యం సీసాలు కూడబెట్టుకుని ఖాళీ సీసాలు విక్రయించిన సొమ్ముతో అప్పుడప్పుడు ఇంటి వద్ద వంట చేసుకుంటుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి వంట చేసుకుని నిద్రించే ముందు ఆర్పిన నిప్పురవ్వలు తిరిగి రాజుకుని ఈ ప్రమాదం సంభవించిందా లేదా ఇంట్లో వెలుగుతున్న కిరోసిన్ దీపం వలన ఈ ఘటన చోటు చేసుకుందా, తన ఇంటికి ఆనుకుని ఉన్న విద్యుత్ వైరు షార్ట్ సర్క్యూట్ కారణమా అన్నది స్పష్టత రావడంలేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రమాద విషయాన్ని మంగళవారం స్థానిక రెవెన్యూ సిబ్బంది ద్వారా అధికారులు సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిరుపేదరాలు బోని లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పరామర్శించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

లక్ష్మి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పారు. అదే విధంగా సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణమే బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబానికి గజపతినగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.వి.లీలారావు, ఆండ్ర ఎస్సై భాస్కరరావులు బాధితులకు నగదు, బియ్యం, దుస్తులు అందజేశారు.

ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 21: పట్టణంలో ఆస్తిపన్ను వసూలు కోసం మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం ఎట్టకేలకు రంగంలోకి దిగింది. పన్ను వసూలు కోసం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆర్థిక సంవత్సరం గడువుముంచుకు వస్తున్నా పన్నుల వసూళ్లలో ఏమాత్రం పురోగతి సాధించలేదు. ఈ నేపధ్యంలో ‘ఆస్తిపన్ను వసూళ్లలో కనిపించని పురోగతి’ అనే శీర్షికతో ఈనెల 16న ఆంధ్రభూమిలో వచ్చిన వార్తపై మున్సిపల్ కమిషనర్ నాగరాజు స్పందించారు. ఈ మేరకు పన్ను వసూలులో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ రెవెన్యూ ఇన్‌సెక్టర్లు గోవిందరావు, కిరణ్, శంకరరావు, చిన్నంనాయుడులతో 18 బిల్లుకలెక్టర్లకు ఛార్జిమెమోలు ఇచ్చారు. మార్చి నెలాఖరునాటికి ఎట్టి పరిస్థితులలోను 100 శాతం పన్ను వసూలు చేయవలసిందేనని ఆల్టిమేటం జారీ చేశారు. పన్ను వసూళ్లలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని, బాధ్యతలను సక్రమం నిర్వహిస్తూ నిర్థేశించిన మేరకు పన్ను వసూలు లక్ష్యాలను నెరవేర్చకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్చినెలాఖరునాటికీ 100 శాతం పన్ను వసూలు చేసేందుకు 18 ప్రత్యేక బృందాలను నియమించారు. పన్ను చెల్లించనివారి నివాస గృహాల మంచినీటికుళాయి కనెక్షన్‌లను తొలగించాలని నిర్ణయించారు.
మహాశివరాత్రికి 215 ప్రత్యేక బస్సులు

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 21: మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు, శివాలయాలకు ఈనెల 24,25 తేదీలలో 215 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించామని విజయనగరం రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. తన ఛాంబర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు, శివాలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈనెల 24, 25వతేదీలలో రెండురోజుల పాటు విజయనగరం నుంచి రామతీర్థం వెళ్లేందుకు 25 బస్సుల చొప్పున నడుపుతామన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి రణస్థలం మీదుగా 20 చొప్పున, పాలకొండ నుంచి రాజాం, చీపురుపల్లి మీదుగా పది బస్సుల చొప్పున నడుపుతామని తెలిపారు. రామతీర్థం జంక్షన్ మీదుగా వెళ్లే బస్సులను క్రమబద్దీకరించేందుకు రామతీర్ధంలో విజయనగరం డిపోమేనేజర్ కె.పద్మావతి ఆధ్వర్యంలో ట్రాఫిక్‌పాయింట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరి వెళ్లేందుకు 30 చొప్పున బస్సులను నడుపుతామన్నారు. విశాఖపట్టణం నుంచి పది చొప్పున, విజయనగరం నుంచి ధర్మవరం మీదుగా ఐదు చొప్పున బస్సులను నడుపుతామని తెలిపారు. అదేవిధంగా జామి మండలం చుట్టు ప్రక్కల గ్రామాల భక్తుల సౌకర్యార్థం పాతభీమసింగి జంక్షన్ నుంచి పుణ్యగిరికి ప్రత్యేకంగా బస్సులను నడుపుతామని వరప్రసాద్ చెప్పారు. సాలూరు నుంచి పారమ్మ కొండకు 15 చొప్పున, పార్వతీపురం నుంచి గొంపకు పది చొప్పున, పలాస నుంచి సాబకోటకు 30 చొప్పున, టెక్కలి డిపో నుంచి రావివలస, శ్రీముఖలింగంనకు మూడుచొప్పున ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావు, అసిస్టెంట్‌మేనేజర్ పి.శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.

వైకాపా పటిష్టతకు కృషి చేయాలి
* ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల
-

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 21: ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతెనా ఉందని ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన నాయకులు మంగళవారం కోలగట్ల స్వగృహానికి వచ్చిన మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ వలి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి బోని దేవ, విశాఖ సిటీ సెక్రటరీ హానీఫ్, పార్టీ అధికారి ప్రతినిధి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ నాటికి దీపం కనెక్షన్లు మంజూరు చేయాలి

విజయనగరం, ఫిబ్రవరి 21: జిల్లాలో జూన్ నాటికి దీపం కనెక్షన్లు మంజూరు చేయాలని డిఎస్‌ఒ శాంతకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 4.78 లక్షల మంది కార్డుదారులు ఉన్నారని, వీరిలో 2.21 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు లేని వారు ఉన్నారని తెలిపారు. వీరందరికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసి పొగ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. కాగా, పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గిరిజన గ్రామాలకు అధిక సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాలలో 5 కిలోల గ్యాస్ సిలిండర్లను స్టౌతో సహా ఉచితంగా అందించాలని, గ్యాస్‌కు మాత్రమే ధరను లబ్ధిదారుని నుంచి వసూలు చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం గ్రామ స్థాయి అధికారులు చౌక ధరల దుకాణాల డీలర్ల సహకారం తీసుకోవాలన్నారు. దాంతోపాటు ప్రజాసాధికార సర్వేలోని వివరాల ద్వారా కూడా గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాల వివరాలను తెలుసుకోడానికి ఉపయోగపడగలదని ఆమె సూచించారు. తొలి విడతగా 27న పార్వతీపురంలోను, రెండో విడతలో బొబ్బిలిలో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పిస్తామన్నారు. అదే విధంగా ఈ నెల 26న విజయనగరం పట్టణంలోని రెవెన్యూ భవన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
పూరిళ్లకు గ్యాస్ కుదరదు
ఈ సందర్భంగా గ్యాస్ కంపెనల ప్రతినిధులు మాట్లాడుతూ తమ కంపెనీ నిబంధనల ప్రకారం పూరి గూడిసెలలో నివసిస్తున్న వారికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం కుదరదన్నారు. సిలిండర్ కంటే స్టౌ తక్కువ ఎత్తులో ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏదేని దుర్ఘటనలు జరిగిన సందర్భంలో ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన లాంబార్డ్ బీమా ఏజెన్సీ ద్వారా కేవలం 3 నెలల్లో పరిహారం అందజేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 1 నుంచి పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏనజెద్సదారులు నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని అందుకు అవసరమైన పోస్ యంత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎఎస్‌ఒ నాగేశ్వరరావు, ఒఎన్‌జిసి జనరల్ మేనేజర్ ఆర్ దూపార్, వివిధ ఆయిల్ కంపెనీల అధికారులు కృష్ణకుమార్, వి నాగరాజన్, సాయి ప్రకాష్, శ్రీదర్ రాజు, దేవకీ నందకుమార్, మహేష్, డీలర్లు రామకృష్ణ , శ్రీనివాసరావు, కె.రోహిత్‌కుమార్, నాగిరెడ్డి, సీతారామయ్య, వినియోగదారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యుత్ బకాయిలపై లబోదిబో!
* పంచాయతీ బకాయిలు రూ.5కోట్ల్ల పైమాటే

విజయనగరం, ఫిబ్రవరి 21: జిల్లాలో గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. గతంలో ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌కు రాగా వాటిని గ్రామ పంచాయతీలకు వాటాల వారీగా పంపిణీ చేసేవారు. అయితే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలని నేరుగా 14వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేశారు. దీంతో మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీలు ఆ నిధులను అభివృద్ధి పనులకు వెచ్చించింది. అయితే 14వ ఆర్థిక సంఘం నిధులు అన్ని పంచాయతీలకు విడుదల చేయడంతో విద్యుత్ బకాయిలు ఆయా పంచాయతీలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ పంచాయతీలపై వత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 921 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 17 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ పంచాయతీలలో విద్యుత్ బకాయిలు లక్షల్లో పేరుకుపోగా, మైనర్ పంచాయతీల బకాయిలు వేలల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో అవి చాంతాడులా పెరిగిపోయాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు దాదాపు రూ.5కోట్లు పైబడి ఉన్నట్టు సమాచారం. ఎప్పటికపుడు విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని పంచాయతీ సెక్రటరీలు చెబుతుండటంతో విద్యుత్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఇపుడు ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో గ్రామ పంచాయతీలు బకాయిలు చెల్లించాలని నోటీసులు చేశారు. లేనిచో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొనడంతో పంచాయతీలు లబోదిబోమంటున్నాయి. తమకు 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు విద్యుత్ బకాయిలకు చెల్లించినా ఇంకను బకాయిలు ఉండిపోతాయని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే తాగునీటికి కూడా ఇక్కట్లు కలగకమానదు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పంచాయతీలను ఏ విధంగా ఆదుకుంటుందో వేచి చూడాలి.
చట్టంపై విద్యార్థులకు అవగాహన ఉండాలి
- సీనియర్ సివిల్ జడ్జి శ్రీహరి

విజయనగరం, ఫిబ్రవరి 21: విద్యార్థులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాసాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి అన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం పిజి సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘వృత్తినైపుణ్య మార్గదర్శనం, వ్యాపార అభివృద్ధి, స్ర్తి పురుష సమానత్వం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య వక్తగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టం, న్యాయంపై సదాభిప్రాయం కలిగి ఉండాలన్నారు. తద్వారా సంపూర్ణ వికాసానికి దోహదపడుతుందన్నారు. స్ర్తిల హక్కులు, రక్షణ తదితర అంశాలపై విద్యార్థులు తెలుసుకోవడం ద్వారా తమతోపాటు చుట్టు పక్కల వారికి కూడా అవి తోడ్పడగలవన్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్‌విఎస్ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మోడ్యూల్స్‌లో ఎయు సోషల్‌వర్క్ విభాగం హెడ్ హరనాధ్, ట్రెజరీ సీనియర్ అకౌంటెంటె పద్మనాభం, సైకాలజిస్ట్ హిమబిందు తదితరులు విద్యార్థులకు శిక్షణనిచ్చారు. ఈకార్యక్రమంలో డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ హేమలత, డాక్టర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

8కోట్ల రూపాయల వ్యయంతో
ఉద్యానవన కళాశాలల అభివృద్ధి పనులు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలలో దాదాపు 8కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామని రాష్ట్ర ఉద్యానవన కమిషనర్, రామన్నగూడెం డాక్టర్ వై.ఎస్సార్ ఉద్యానవన కళాశాల వైస్‌చాన్సలర్ చిరంజీవి చౌదరి అన్నారు. మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కళాశాల సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా కళాశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉల్లిభద్ర సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలలో పలు అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ఈ పనులను మార్చి నెలాఖరునాటికి పూర్తిచేయాలన్నారు. ఉద్యానవన కళాశాలలో పూర్తిస్థాయిలో వౌళిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉద్యానవన కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.ప్రసన్నకుమార్, జిల్లా ఏ.పి.ఎం.ఐ.పి. ప్రాజెక్టు డైరెక్టర్ పాండురంగా, పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఏ.పి.ఓ. ప్రభాకరరావు, ప్రాజెక్టు ఉద్యానవన శాఖాధికారి ప్రసాదరావులు పాల్గొన్నారు.