విజయనగరం

అధికారుల సమన్వయ లోపంతో రైతులకు ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,జూలై 17: వ్యవసాయ శాఖ ఏడిఎ, ఏవొల మధ్య సమన్వయ లోపం కారణంగా మండలంలోని రైతులకు ఈ ఏడాది వరి విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఎంపీటీసీ పైడిపునాయుడు అధికారులపై మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ ఏడాది వరి విత్తనాలు సకాలంలో అందించకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించి 1,000 నుండి 1,500రూపాయలు అధికంగా హెచ్చించి విత్తనాలు కొనుక్కోవలసిన పరిస్థితి నెలకొందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదని, ఇది రైతులపైపన ప్రభావం చూపిందని, అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారుల పనితీరు అసలు మారడంలేదని ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు బకాయిలు కట్టడంలేదని శాఖ అధికారులు వీధిలైట్ల కనెక్షన్లు కట్ చేసి విద్యుత్ చాలా గ్రామాలలో నిలిపివేశారని అన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందాలేదని దేనికోసం పనిచేస్తుందని అన్నారు. విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే పంచాయతీలకు చెల్లించాల్సి ఉందని,చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్‌ను నిలిపివేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉపాధి హామీపథకంలో పనులు చేస్తున్న కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వడంలేదని కూలీలు అడిగితే అధికారులు కనీసం సరైన సమాధానం చెప్పకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఏపీవొ కృష్ణవేణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదని అధికారులు కూలీలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పురిటిపెంట సర్పంచ్ మండల సురేష్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవొ కృష్ణవేణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలకు స్థల పరిశీలన
బొండపల్లి,జూలై 17: ప్రభుత్వం మంజూరు చేసిన డిగ్రీ కళాశాల నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని మంగళవారం తహశీల్దార్ డి.బాపిరాజు పరిశీలించారు. మండలంలోని కనిమెరక పంచాయతీ బోడసింగిపేట గ్రామంలో గల మార్కెట్ కమిటీ వెనుకవైపున గల స్థలాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పది ఎకరాల భూమి అవసరం కాగా ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరాలు ఉందని మరో రెండు ఎకరాలు జిరాయితీ భూమి ఉందని గుర్తించారు. మండల సర్వేయర్ గణపతిరావు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను గుర్తించారు. ఈ మేరకు తహశీల్దార్ బాపిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనువైన స్థలంగా గుర్తించారు. కాగా గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ. నాయుడు హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం రూపా నిధులతో ఈకళాశాలను నిర్మిస్తారు. డిగ్రీ కళాశాల స్థల వివరాలను తహశీల్దార్ బాపిరాజు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. కార్యక్రమంలో వి ఆర్వో నాగరాజు పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువుల కోసం కృషి
బొండపల్లి, జూలై 17: సేంద్రీయ ఎరువుల వాడకాన్ని రైతులు పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎంపీడీవొ ప్రకాశరావు అన్నారు. మండల సముదాయం వద్ద గల ఎస్‌డబ్ల్యుపి కేంద్రంలో మంగళవారం ఎంపీడీవొ ఎం.ప్రకాశరావు వానపామును వదిలిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. రైతుల్లో అవగాహన పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులతో కృషిచేయడం జరుగుతుందని చెప్పారు. గ్రామాలలో తడి, పొడి చెత్తలు ఒకే దగ్గరకు చేర్చి వానపాముల సహాయంతో సేంద్రీయ ఎరువులు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యవేణి, ఇవొపీ ఆర్డీ రవికుమార్, సూపరింటిండింట్ కృష్ణమూర్తి, వర్రి సన్యాసిరావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.