విజయనగరం

అభివృద్ధి కావాలా! అవినీతి కావాలా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 11: అభివృద్ధి కావాలా అవినీతి కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి రామకృష్ణ, ఎం ఎస్ ఎన్ రాజు కోరారు. మంగళవారం మండలంలోని భూదేవిపేట, బంగారమ్మపేట గ్రామాలలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పధకాలు ప్రవేశపెడుతున్నా నిధులు ఇస్తున్నా నిధులు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాన్ని చేస్తుందని తెలిపారు. కేంద్రాన్ని నిందించడమే చంద్రబాబు పనిపెట్టుకొన్నారని ఆరోపించారు. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. మేధావులు, ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిందని, త్వరలోనే రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్ త్వరలోనే మంజూరు చేస్తుందన్నారు. బీజేపీ ఎన్నికల హామీలను నిలబెట్టుకొంటుందని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు గెద్ద సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రతతోనే వ్యాధులకు చెక్!
గజపతినగరం, డిసెంబర్ 11: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారానే వ్యాధులు దరిచేరవని స్ధానిక మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కనకల పోలినాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో గజపతినగరం హోమియో వైద్యులు డాక్టర్ సత్యేంద్రకుమార్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. హోమియో మందులను గ్రామస్ధులకు, విద్యార్ధులకు స్వైన్‌ఫ్లూ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రతకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుందని అన్నారు. ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. డాక్టర్ సత్యేంద్రకుమార్ మాట్లాడుతూ జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త బి. ఉమ, ఆరోగ్యకార్యకర్త జి.కృష్ణారావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
సమన్వయంతో మాతాశిశుమరణాలను తగ్గించాలి
పాచిపెంట, డిసెంబర్ 11: క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి మాతాశిశుమరణాలను తగ్గించాలని పార్వతీపురం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పాచిపెంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ముందుగా ఆయాశాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఏవిధంగా పనిచేస్తున్నారో అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేస్తే మాతాశిశుమరణాలు ఉండవన్నారు. అటువంటి మరణాలు సంభవిస్తే చర్యలుతప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం శతశాతం లబ్ధిదారులకు అందాలని, ప్రతీ ఒక్కరికీ అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టేవరకు తీసుకోవల్సిన జాగ్రత్తలను అందరూ బాధ్యతగా ఆరోగ్యసేవలందిస్తే తల్లీబిడ్డలు శ్రేయస్కరంగా ఉంటారన్నారు. గ్రామాల వారీగా ప్రతీ నెలా నివేదికలను తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలు, మూఢనమ్మకాలకు ఉంచాలన్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనార్ధాలను వైద్యాధికారులు హేమలత, పివి లక్ష్మిలు వివరించారు. ఈ సమావేశానికి హాజరుకానివారిపై పీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్‌ఓ రవికుమార్, ఐసీడీఎస్ పీఓ రమాదేవి, ఇఓపీఆర్‌డీ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

రెండు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
సీతానగరం, డిసెంబర్ 11: మండలంలోని కాశాపేట, పనుకుపేట గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయాగ్రామాల్లో మినుము, పెసర, తదితర పంటలను ఏఇఓ రామ్మూర్తి ఎంపీఇఓలు జగదీష్, ఉదయ్‌ల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈసందర్భంగా ఏఓ ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ పెసర, మినుమలో పల్లాకుతెగుళ్లు గుర్తించామన్నారు. తెగుళ్లు సోకిన ఆకులు పసుపురంగులోకి మారుతాయని, ఇటువంటి ఆకులను తెంచి పొలానికి దూరంగా పారవేయాలన్నారు. కార్భన్‌డిజం అనే మందును ఎకరాకు 250గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. రసం పీల్చే పురుగు ఆశిస్తే ఆకులకు రంద్రాలు ఏర్పడతాయని, వీటి నివారణకు క్లోరీఫైరీపాస్ వినియోగించాలన్నారు.
ముమ్మరంగా వాహన తనిఖీలు
సీతానగరం, డిసెంబర్ 11: మండలంలో వాహన తనిఖీలను పోలీస్‌శాఖ ముమ్మరంగా చేపడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారిలో ఎస్‌ఐ సాయికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిబంధనలకు అనుగుణంగా వాహనదారులకు అపరాద రుసుం విధించామని, ఆన్‌లైన్‌లో కొంతమంది వీటిని చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అపరాద రుసుం చెల్లించని వారిని గుర్తించి దగ్గరలో ఉండే మీసేవాలలో చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడిపితే ఎటువంటి ప్రమాదాలు సంభవించన్నారు. ఈ తనిఖీలో ట్రైనీ ఎస్‌ఐ బి అనీల్‌కుమార్, సిబ్బంది కిశోర్, త్రినాద, సురేష్, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మానవహక్కులను పరిరక్షించాలి
సీతానగరం, డిసెంబర్ 11: మానవహక్కులను పరిరక్షించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఐద్వా మండల అధ్యక్షురాలు వి రామలక్ష్మి కోరారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భస్త శిశువులకు జీవించే హక్కు కల్పించాలని, మహిళలపై జరుగుతున్న దాడులను కూడా అరికట్టాలన్నారు. ప్రతీ కుటుంబానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అన్నిరకాల నిత్యవసర సరుకులు అందించి ఆహార భద్రతా చట్టాన్ని అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు పార్వతి, రాధ, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

బీసీల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
సాలూరు, డిసెంబర్ 11: బీసీల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. మంగళవారం వైటీసీ ఆవరణలో పట్టణంలోని పట్టణంలోని ఆదరణ లబ్ధిదారులకు పనిముట్లును ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్‌లు పంపిణీ చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించలేదన్నారు. చేతివృత్తుదారులను ప్రోత్సహించేందుకు ఆదరణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జీవనోపాధిని మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ విజయకుమారి, కమిషనర్ ఎంఎం నాయుడులు పాల్గొన్నారు.

ఆర్టీసి కార్మికుల ధర్నా
సాలూరు, డిసెంబర్ 11: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసి డిపో గేటు వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. పీఆర్‌సీ ఒప్పందాన్ని వెంటనే అమలుచేయాలన్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను విరమించుకోవాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు పి సుందరరావు, కార్యదర్శి ఎస్ నారాయణల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రెండురోజులపాటు ధర్నా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎంఎస్ నారాయణ, రాజు పాల్గొన్నారు.
తరల్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన
గుమ్మలక్ష్మీపురం, డిసెంబర్ 11: ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సులభతర విద్యావిదానంపై అమలుచేస్తున్న తరల్ ప్రాజెక్టును గుమ్మలక్ష్మీపురంలోని ఎయిడెడ్ పాఠశాలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొగ్రాం కో- ఆర్ఢినేటర్ జి చిరంజీవిరావు విద్యార్థులకు విద్యావిధానంలో మెళకువలను నేర్పించారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు శ్రద్ధవహించి ప్రత్యేక శిక్షణలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాలి
గుమ్మలక్ష్మీపురం, డిసెంబర్ 11: గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జి నరేష్, అనంత్‌లు వారు మాట్లాడుతూ నిరుద్యోగ ప్రత్యేక డీఎస్సీని నిర్వహించి గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీఓ నెం 132ను రద్దుచేసి హెచ్‌ఎంలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఎంలకు డీడీఓ అధికారాలను రద్దుచేసి ఏటీడబ్ల్యుఓకు ఇవ్వడం వలన ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్వీర్యమవుతుందన్నారు. అదేవిధంగా భద్రగిరి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు పార్వతీపురం వెళ్లడం వలన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, కావున భద్రగిరి డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రం మంజూరు చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఈనెల 17వ తేదీన ఏజెన్సీలోని విద్యాసంస్థల బంద్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం రమణ, కె అవినాస్‌లు పాల్గొన్నారు.
ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోవాలి
కురుపాం, డిసెంబర్ 11: గిరిజన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో ఏడీఇ ఎం నిరంజన్‌బాబు కోరారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 125 యూనిట్ల వరకు ఉచితంగా పొందవచ్చునన్నారు. ఈ ప్రాంతంలో అవగాహన లేకపోవడంతో 125 యూనిట్ల లోపు వచ్చిన బిల్లులు కడుతున్నారన్నారు. అటువంటి వారు తమ కార్యాలయానికి వచ్చి కులదృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు పత్రాలను అందిస్తే ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చునన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతీ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు.

పర్సన్ రిజస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలి
పార్వతీపురం, డిసెంబర్ 11: ఐటిడిఎ ఐఎస్‌వో స్టాండర్డ్స్ మెయింటెనెన్సు కృషిలో భాగంగా కార్యాలయంలోని ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పర్సనల్ రిజస్టర్ మెయింటెన్ చేయాలని పార్వతీపురం ఐటిడి ఎ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి వి.సురేష్‌కుమార్ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలో తన ఛాంబర్‌లో ఎపివో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాల మేరకు ఈ ఆఫీస్ ఇప్పటికే అన్నిశాఖలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అలాగని పర్సనల్ రిజస్టర్లు ఉద్యోగులు నిర్వహించకపోతే చర్యలు తప్పవన్నారు. పర్సనల్ రిజస్టర్ ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తుదారుడి ఫిర్యాదులు, వాటిపై చేపట్టే చర్యలు కూడా స్పష్టంగా రిజస్టర్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈవిషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పేర్కొన్నారు. ఇకముందు పర్సనల్ రిజస్టర్ల నిర్వహణను పీవోపరిశీలిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఐటిడి ఎ మేనేజర్ హేమలత, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే సేవలకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రోత్సహించాలి
పార్వతీపురం, డిసెంబర్ 11: తితిదే సేవ కార్యక్రమాలకు 45 ఏళ్ల లోపుయువతీ, యువకులకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రోత్సహించాలని డాక్టర్ బి ఎస్ ఆర్ మూర్తి బృందం మంగళవారం ఐటిడి ఎ కార్యాలయంలో పీవో డాక్టర్ జి.లక్ష్మీశను కలిసి కోరారు. ఈ సందర్భంగా పీవో అందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గిరిజనులకు ఆరోగ్య పరంగా ఎంతో దోహదపడే హైజానిక్ రైస్‌ను గిరిజనులు పండించేందుకు తగిన ప్రోత్సాహం అందించాలని కూడా పీవోను కోరారు. దీనివల్ల గిరిజనుల ఆరోగ్యం, పౌష్టికాహారం పెరుగుతుందన్నారు. అలాగే ఈ పంట మార్కెటింగ్‌ను జిసిసి ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వరి సీడ్‌ను పీవోకు డాక్టర్ బి ఎస్ ఆర్ మూర్తి అందజేశారు. ఈసందర్భంగా పీవో డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత ప్రాజెక్టు వ్యవసాయాధికారిని తగు చర్యలకు ఆదేశించారు.
132 జీవోను రద్దు చేయాలని కొనసాగుతున్న దీక్షలు
పార్వతీపురం, డిసెంబర్ 11: జీవో నెంబరు 132ను రద్దు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంల డిడివో వపర్స్‌ను పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం ఐటిడి ఎ కార్యాలయం ఎదుట గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రెండోరోజు కూడా రిలే నిరాహారదీక్షలు ఆ సంఘ ఉపాధ్యాయులు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ కృష్ణబాబు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల హక్కులు కాలరాసే విధంగా ఇచ్చిన జీవో 132ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈపోరాటం కొనసాగుతుందన్నారు. ఈ దీక్షకు గిరిజన సంక్షేమ సంఘ నాయకుడు రంజిత్‌కుమార్, మైదాన ప్రాంత గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రఘుపతుల శశిభూషణ్ తదితరులు మద్దతు తెలిపారు.
డీలర్ల సమస్యలను పరిష్కరించాలి
మక్కువ, డిసెంబర్ 11: రేషన్ డిపోలలో పనిచేస్తున్న డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డీలర్ల సంఘం అధ్యక్షులు పి రామ్మూర్తి కోరారు. ఈమేరకు తహశీల్దార్ కెవి రామారావుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు. గతంలో ఎన్నో సార్లు సమస్యలను రాష్ట్ర జెఏసీ తరుపున కమిషనర్, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదన్నారు. గతంలో మూకుమ్మడిగా సెలవులు పెట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈమేరకు మండలంలోని డీలర్లంతా సెలవుల్లో వెళుతున్నందున పండగ కానుకలు, నిత్యవసర సరుకులకు చలానాలు తీయకూడదని రాష్ట్ర జె ఏసీ నిర్ణయాన్ని అమలుపరిస్తున్నామన్నారు. ఈమేరకు డిసెంబర్ 20వ తేదీన విజయవాడలో జరిగే డీలర్ల మహాసభకు డీలర్లంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల డీలర్లు సంఘం ఉపాధ్యక్షులు సుజాత, ఎస్ రామకృష్ణ, గీతారాణి, తదితరులు పాల్గొన్నారు.
అగ్రవర్ణాల భారి నుంచి కాపాడాలి
* కొట్టక్కి గ్రామానికి చెందిన దళితుల ఆవేదన
రామభద్రపురం, డిసెంబర్ 11: మండల పరిధిలోని కొట్టక్కి గ్రామంలో అగ్రవర్ణాలు దళితులపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తు భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిపబ్లిక్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప ప్రకాశరావు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం రామభద్రపురం పోలీస్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కొట్టక్కికి చెందిన అగ్రవర్ణాల వారు దళితులపై ఇష్టారాజ్యంగా దాడులు చేయడంతోపాటు తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఈనెల 10వ తేదీన సోంబార్కి కళ్యాణి అనే ఆమె పబ్లిక్ కుళాయి వద్ద నీరు పడుతుండగా నీరు తుళ్లిందనే షాకుతో ఆమెను సోమిరెడ్డి శకుంతల, ఆమె భర్త కృష్ణ, మరికొంతమంది కొట్టి గాయపరిచారన్నారు. అలాగే సాయంత్రం గ్రామానికి చెందిన పోలినాయుడు, చెంచునాయుడు, వంగపండు అప్పలనాయుడు, మరికొంతమంది అగ్రవర్ణాల వారు వారి ఇళ్లపై దాడి చేస్తు మీ అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా కులంపేరుతో దూషించి భ్రయభ్రాంతులకు గురిచేశారని గ్రామానికి చెందిన సింగారపు రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు పోలిపల్లి, మరికొంతమంది తెలిపారు. అలాగే గత దీపావళి రోజున కూడా అగ్రవర్ణాల వారు దాడులు చేశారని, అప్పట్లో సాలూరు సీఐ సయ్యద్ ఇలియాజ్ మహ్మద్ ఇరువర్గాల మధ్య రాజీకుదర్చారన్నారు. చాలా ఏళ్లుగా అణగారిన వర్గాల వారిమైన తమపై అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది తీవ్రంగా దుర్భాషలాడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మరికొంతమంది పొలాల్లో పనులుచేయకుండా చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ కుళాయి వద్ద కూడా నీరు పట్టుకోవద్దా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అగ్రవర్ణాల వలన ప్రాణ హానితోపాటు మహిళలపై కూడా దాడులు చేయడానికి వారు వెనుకంజవేయడం లేదని, ఈ విషయంపై న్యాయం చేయకపోతే ఊరు విడిచివెళ్లిపోతామని వాపోతున్నారన్నారు. సోంబార్కి కళ్యాణిపై దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదుచేసి దోషులను వెంటనే అరెస్టుచేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో సాలూరు సీఐ మహ్మద్, తహశీల్దార్ బి రత్నకుమార్, ఎస్‌ఐ లక్ష్మణరావులు ఇరువర్గాల పెద్దలతో చర్చలు జరిపారు.

వెలుగు సిబ్బంది సమ్మెతో డ్వాక్రా సంఘాలు ఆందోళన
రామభద్రపురం, డిసెంబర్ 11: గత వారం రోజులుగా వెలుగు సిబ్బంది సమ్మె చేస్తుండటంతో డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లతోపాటు ఉద్యోగాలను రెగ్యూలర్ చేయాలని కోరుతూ ఐకెపీ సభ్యులు ఈనెల 6వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో బ్యాంకు లింకేజీ, స్ర్తినిధి రుణాలు, పెళ్లికానుకల రిజిస్ట్రేషన్లు, చంద్రన్నబీమా పథకం లావాదేవీలు నిలిచిపోవడంతో డ్వాక్రామహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అలాగే ఈసమ్మె వలన మహిళలకు రుణాలు అందకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రతీ రోజు కార్యాలయం చుట్టు తిరుగుతున్న కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నామన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డీపీఎం నుంచి ఎంఎస్‌సీసీల వరకు సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
రామభద్రపురం, డిసెంబర్ 11: డీలర్ల ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాపు రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం తహశీల్దార్ బొంతు రత్నకుమార్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లకు 15 నుంచి 20వేల రూపాయల వరకు జీతాలు అందించాలని, అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. ఈనెల 13వ తేదీన రేషన్‌డిపోలను మూసివేయనున్నామన్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల డీలర్లు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా నవరత్నాలను అమలుచేస్తాం
తెర్లాం, డిసెంబర్ 11: వైసీపీ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమపథకాలను అమలుచేస్తామని వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. మండలం లోచర్ల గ్రామంలో మంగళవారం గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దీంతో పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. వైసీపీ నవరత్నాలను అర్హులందరికీ అందజేయనున్నామన్నారు. తెలుగుదేశంపార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోతుందని, వారు ప్రకటించే పథకాలను ప్రజలు నమ్మరన్నారు. అనంతరం బాడంగి వైసీపీ నాయకులు నాగిరెడ్డి విజయ్‌కుమార్ మాట్లాడుతూ వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో టీడీపీ విఫలమైందని, వైసీపీ అధికారంలోకి వస్తే గ్రామాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో ఆపార్టీ కార్యకర్తలకే అభివృద్ధి సంక్షేమపథకాలను అందజేస్తుందే తప్ప మిగిలిన వారికి అందజేయడం లేదన్నారు. ఇందులో భాగంగా పలువురు పింఛన్లు, పక్కా గృహాలు, రేషన్‌కార్డులు మంజూరుచేయలేదని తమ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. అలాగే ఆదరణ-1,2 పథకాల్లో పంపిణీ చేసిన వస్తువుల్లో నాణ్యత లేదని, కేవలం కాంట్రాక్టర్ల అభివృద్ధి కోసమే పథకాలను అందజేశారన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పిటీసీలు టి సత్యంనాయుడు, బి అప్పలనాయుడు, ఎం జగన్నాథం, జి దాలయ్య, మండల వైసీపీ అధ్యక్షులు నర్సుపల్లి బాబ్జీరావు, ఎస్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

చింతచెట్టుకు ఢీకొన్న లారీ
తెర్లాం, డిసెంబర్ 11: మండలం టెక్కలవలస సమీపంలో సోమవారం అర్థరాత్రి ఓ లారీ రోడ్డు ప్రక్కన ఉన్న చింతచెట్టును ఢీకొనడంతో ట్రాఫిక్ నిలిచిపోయిందని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం సోమవారం అర్థరాత్రి రామభద్రపురం నుంచి రాజాం వెళుతున్న లారీ టెక్కలవలస సమీపంలో రోడ్డు ప్రక్కన చింతచెట్టును ఢీకొనడంతో ఆ చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మంగళవారం ఉదయం నాటికి సుమారు 2కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని జెసీబీతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును ప్రక్కకు తొలగించి ట్రాఫిక్ సమస్యను తొలగించారు.

లింగాపురం గ్రామంలో రైతు సదస్సు
తెర్లాం, డిసెంబర్ 11: రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువులపైనే రైతులు దృష్టిసారించి మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాసరావు కోరారు. మండలం లింగాపురం గ్రామంలో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటల సాగులో అధిక దిగుబడులు పొందాలంటే సేంద్రీయ ఎరువులనే వినియోగించాలన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గిస్తే పంట దిగుబడులతోపాటు పెట్టుబడులు కూడా ఘననీయంగా తగ్గుతాయన్నారు.