విజయనగరం

దోషరహిత ఓటరు జాబితా ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఫిబ్రవరి 22: దోషరహిత ఓటరు జాబితా ధ్యేయంగా పని చేయడానికి చర్యలు చేపట్టామని స్ధానిక తహశీల్ధార్ సి.చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం తహశీల్ధార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందశాతం దోషరహిత ఓటరు జాబితా తయారు చేయడానికి ఈ నెల 23, 24వతేదిలలో ప్రత్యేక క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలోని 264 పోలింగ్ కేంద్రాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. గజపతినగరం మండలంలో 62పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపెయిన్లు ఏర్పాటు చేశామని అన్నారు. అక్కడకు బూత్ లెవిల్ అధికారులు రెండు సెట్లు ఓటరు జాబితాలు తీసుకెళ్లి ఒకటి తనిఖీ కోసం, మరొటి ప్రజలకు చదివి వినిపించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు కలిగి ఉన్నట్లు కాదని ఎందుకైనా మరొసారి కేంద్రం వద్దకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ లేకపోతే అక్కడే ఫారం నింపి అందిస్తే సరిదిద్దడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి చక్కని అవకాశం అని తెలిపారు. ప్రత్యేక క్యాంపెయిన్లు కోసం గ్రామాలలో దండరోల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. దివ్యాంగుల కోసం కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఓటరు నిర్భయంగా ఓటు వేసేలా పరిస్ధితులు కల్పించామని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆర్డీవొ జె.వెంకట మురళి వ్యవహరిస్తారని అన్నారు. క్యాంపెయిన్లు పరిశీలనకు పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఉప తహశీల్ధార్ ఒ.శ్రీనివాసరావు, ఎ ఎస్‌వొ ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పట్ల గర్వంగా ఉంది
* ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు
గజపతినగరం, ఫిబ్రవరి 22: గతంలో ఏ ప్రభుత్వాలు నియోజకవర్గ పాలకులు చేపట్టని అభివృద్ధి పనులు తన హయాంలో జరగడం గర్వంగా ఉందని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నాయుడు పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేశారు. జాతీయ రహదారి-26 నుంచి మండల పరిషత్ కార్యాలయానికి 12లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారికి, చంపావతినది వద్ద 40లక్షల రూపాయలతో నిర్మించనున్న పార్కుకు ఎమ్మెల్యే నాయుడు శిలాఫలాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశాననే సంతృప్తి ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే సాధించని అభివృద్ధిని సాధించి చూపానన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దత్తిరాజేరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అన్ని అనుమతులు సాధించానన్నారు. మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మించగలిగానన్నారు. బొండపల్లి వంక చెరువు వద్ద 50లక్షల రూపాయలతో బోటు షికారు, పార్కు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గజపతినగరంలో 40లక్షల రూపాయలతో పార్కును ఆహ్లాదకరంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతామని చెప్పారు. కాఫీ-డే క్యాంటీన్లు పార్కు వద్ద హైవేపై ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సంక్షేమ పధకాలు అమలులో ముందంజలో ఉన్నామని తెలిపారు. ఈ అభివద్ధిని చూపి ప్రజల వద్దకు ఎన్నికలలో వెళ్ళే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీలు మక్కువ శ్రీధర్, బండారు బాలాజీ, ఎఎంసి వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు,సీనియర్ నాయకుడు పి.వి.వి.గోపాలరాజు, ఎంపిటిసిలు కర్రి శ్రీదేవి, నగర ప్రసన్నకుమారి, గొర్లె ఆదినారాయణ, ఆత్మా కమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మునాయుడు, సిహెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, పట్టణ అధ్యక్షుడు కర్రి నానాజీ, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి
గజపతినగరం, ఫిబ్రవరి 22: త్వరలో జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని స్ధానిక ఎస్‌ఐ హెచ్. ఉపేంద్రరావు కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని ఎం.కొత్తవలస గ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎస్‌ఐ ఉపేంద్రరావు ప్రసంగించారు. ఎటువంటి గొడవలు, అల్లర్లుకు తావ్వికుండా చూడాలని తెలిపారు. అదే విధంగా అక్రమంగా మద్యం విక్రయించినా, జూదంతోపాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాలలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తనకు తెలియజేసి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలు అందరి ధ్యేయం ప్రకృతి వ్యవసాయం కావాలి
* మండల వ్యవసాయ అధికారి మల్లిఖార్జునరావు
గజపతినగరం, ఫిబ్రవరి 22: అన్నదాతలు అందరు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని మెంటాడ మండల వ్యవసాయ అధికారి మల్లిఖార్జునరావు కోరారు. శుక్రవారం మెంటాడ మండలంలోని పిట్టాడ క్లస్టర్ పరిధిలో గల చల్లపేట గ్రామంలో ఖరీఫ్ కార్యచరణ ప్రణాళిక తయారు చేయడంతోపాటు ఘన జీవామృతం తయారి గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అన్నదాతలు గ్రహించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించడం వలన ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటంతో దేశం ఎంతో అభివృద్ధి పధంలో నడుస్తుందని అన్నారు. అదే విధంగా రసాయనిక మందులు పూర్తిగా మానేసి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసి పిచికారి చేయడం ద్వారా పురుగులు, తెగుళ్లు సోకవని అన్నారు. రైతులలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, జీవామృతాలు తయారుపై అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ సాగు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. అవగాహన కలిగిన రైతులు మిగిలిన రైతులలో అవగాహన కల్పించాలని కోరారు. అంతకు ముందు పలు నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో ఎఇవొ సతీష్, సౌజన్య, సిఆర్‌పి చిన్నంనాయుడు, పిఆర్‌పి, ఐసిఆర్‌పి, ఎన్‌ఎఫ్‌ఎఫ్ గ్రామ రైతులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత ఎన్నికలకుప్రత్యేక చర్యలు
బొండపల్లి, ఫిబ్రవరి 22: ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్ధానిక ఎస్ ఐ సాగిరాజు కృష్ణవర్మ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండకిండాం, కిండాం అగ్రహారం, రాచకిండాం గ్రామాలలో ఎన్నికల నిర్వహణపై ప్రజలకు అవగాహన సదస్సులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగువులకు కారకులైన వారిపై ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో బెల్టుషాపులు నిర్వహించినా, మద్యం నిల్వలు ఉంచినా, జూదం, తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని అన్నారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వలన ఎక్కుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణీకులు ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాతబగ్గాంలో సైకిళ్లు పంపిణీ
గజపతినగరం, ఫిబ్రవరి 22: మండలంలోని పాతబగ్గాం ప్రాధమికోన్నత పాఠశాలలో శుక్రవారం మాజీ సర్పంచ్ లెంక చిన్నంనాయుడు చేతుల మీదుగా సైకిళ్లు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్ధినిలకు సైకిళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పద్మావతి, పాఠశాల కమిటీ చైర్మన్ సంగం రెడ్డి రమణ, ప్రధానోపాధ్యాయుడు వై.శాంతేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సైన్స్‌డేకు... సృజనోత్సవం
బొండపల్లి, ఫిబ్రవరి 22: ఈ నెల 28న జరగనున్న సైన్స్‌డేను పురస్కరించుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సృజనోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నదని మండల విద్యాశాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల వనరుల కేంద్రంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 6,9 తరగతుల విద్యార్థులకు వకృత్వం, వ్యాసరచన పోటీలె నిర్వహించారు. అలాగే సృజనాత్మకత వెలికితీసేందుకు వాల్ పోస్టర్ తయారీ, ధృవపత్రాల గురించి వివరించడం తదితర అంశాలపై శిక్షణ అందజేశారు. మండల స్థాయిలో విజేతలకు, జిల్లా రాష్ట్ర స్థాయి పోలీల్లో ప్రవేశం పొందనున్నారని చెప్పారు. మండల స్థాయి పోటీల్లో ఎనిమిది ఉన్నత పాఠశాలలకు, కెజిబివి పాఠశాలల, మూడు ప్రాథమికోన్నత పాఠశాలల నుండి 40మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బొండపల్లి, నెలివాడ, గరుడుబిల్లి, గొల్లుపాలెం పాఠశాలల సైన్స్ ఉపాద్యాయులు రాజశేఖర్, రాఘవకుమార్, బి.ఆర్.ప్రసాద్, ఎ.రవికుమార్‌లతోపాటు సి ఆర్పీలు ప్రదీప్, కొండమ్మ, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ హయాంలోనే మహిళలకోసం ప్రత్యేక పథకాలు
* ఎమ్యెల్యే లలితకుమారి
లక్కవరపుకోట, ఫిబ్రవరి 22: టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు అనేక ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. మహిళలకు ఉపయోగపడే న్యాప్‌కీన్ ప్యాడ్‌లను అందజేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే ఈనాడు టీడీపీ మహళలకు ఉపయోగపడే న్యాప్‌కీన్ ప్యాడ్‌లను రేషన్ డిపోల ద్వారా ప్రతి ఒక్కరికి ఎనిమిది న్యాప్‌కీన్‌లు ఉండేవింధంగా అందజేయడం జరిగిందని చెప్పారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న పేద మహిళలకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున కార్పొరేషన్ల ద్వారా మహిళా రుణాలు, స్ర్తినిధి, పావలా వడ్డీ రుణాలు, మంజూరు చేసే ప్రతి పథకంలోను మహిళలకు ప్రాధాన్యత ఉండే విధంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మహిళా సంఘాలను ప్రవేశపెట్టిన చంద్రబాబు వారికోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారని, మధ్యలో వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా మహిళలను పట్టించుకున్న పాపాన్ని పోలేదని ఇదంతా మహిళలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రానున్న కాలంలో మహిళలకోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

వైభవంగా మరిడిమాంబ తీర్థం
* పాల్గొన్న టీడీపీ నాయకులు
లక్కవరపుకోట, ఫిబ్రవరి 22: మండలంలోని రంగారాపురం గ్రామంలో గురు, శుక్రవార్లా మరిడిమాంబ తీర్థ వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండవ రోజు ఘటాల ఊరేగింపులో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు కబడ్డీపోటీ, రెండవ రోజు యడ్ల బళ్ళ పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలితకుమారి దంపతులు, ఆలయధర్మకర్త కరెడ్ల ఈశ్వరరావు దంపతులు, మాజీ ఎంపీ ఎం.వి. ఎస్.మూర్తి మనమడు ఎం.వి. ఎస్.్భరత్,అన్ని మండలాల టీడీపీ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ఎమ్మెల్యే చేతులుమీదుగా బహుమతులు పంపిణీ చేశారు.

జవాన్ల త్యాగాలు మరువలేనివి
* ఎస్సై ప్రయోగమూర్తి
లక్కవరపుకోట, ఫిబ్రవరి 22: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన 42మంది సి ఆర్‌పి ఎఫ్ జవాన్ల మరణం భారతదేశ ప్రజలు మరువలేనిదని, వారి త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటుందని ఎల్.కోట ఎస్సై ప్రయోగమూర్తి అన్నారు. గురువారం రాత్రి జవాన్ల మృతికి సంతాపంగా గంగుపూడి గ్రామ యువత, ప్రజలతో ఎస్సై ప్రయోగమూర్తి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోపల 120కోట్ల మంది జనాభా ప్రశాంతంగా నిదరపోతున్నారంటే సరిహద్దుల్లో సైనికుల త్యాగఫలమేనని వారి త్యాగం మరువలేనిదని ఎస్సై ప్రయోగమూర్తి అన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు యుద్ధ చేసే దమ్ము ధైర్యంలేక దొంగచాటుగా కాల్పులకు, పేలుళ్ళలకు దాడిచేసి అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారని, ఇది చాలా దారుణమైన చర్య అని దీనికి భారత ప్రభుత్వం ధీటైన సమాధానం ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సైనికుల వెంట దేశాన్ని కాపాడుకునే విషయంలో 120కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
పార్వతీపురం, ఫిబ్రవరి 22: పార్వతీపురంలోని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ పరిశీలించారు. ఈమేరకు ఆయన పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాప్రాంగణంలో స్రాంగ్ రూమ్‌ను, పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కార్డు ( ఎపిక్‌కార్డు) ఉన్నంత మాత్రాన ఓటరు కాదని, ఓటర్ల జాబితాలో తన పేర్లు ఉండాలని ఈవిషయం గమనించాలని ఓటర్లకు కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 23,24తేదీల్లో రెండురోజులు పాటు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చునన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బి ఎల్ వోలు ఆయా తేదీల్లో అందుబాటులో ఉంటారన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఫారం 6,7,8,8 ఎలు అందుబాటులో ఉంటాయన్నారు. 1950 కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఓటరుగా నమోదు చేసుకోవచ్చునన్నారు. అలాగే ఇసిఐ.ఇండియాలో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్ల నిర్వాహక అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం అసెంబ్లీ ఎన్నికల అధికారి, ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ, పార్వతీపురం సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్, పార్వతీపురం తహశీల్దారు కరణం వెంకట ఈశ్వరరావు, డిప్యూటీ తహశీల్దారు శ్రీరామ్మూర్తి,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షల పడగ్భందీగా నిర్వహించాలి
పార్వతీపురం, ఫిబ్రవరి 22: ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణను అధికారులు పగడ్భందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు. శుక్రవారం పార్వతీపురం ఐటిడి ఎ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశం హాలులో హాజరైన పార్వతీపురం డివిజన్‌లోని 28పరీక్షా కేంద్రాలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులనుద్ధేశించి ఏర్పాటు చేసిన వీడియో కానె్ఫరెన్సులో ఆమె మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతవాతావరణంలో సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు ఎం వెంకటరావు, డి.మంజుల వీణ, హైపర్ కమిటీ కన్వీనర్ పి.ముఖలింగేశ్వరరావు, జూనియర్ లెక్చరర్ల సంఘ జిల్లా జనరల్ సెక్రటరీ తెర్లి రవికుమార్, పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన అభ్యర్థులకు ఆటోరుణాలు
పార్వతీపురం, ఫిబ్రవరి 22: గిరిజన సంక్షేమశాఖ గిరిజన అభ్యర్థులకు ఆటోలకు రుణాలు మంజూరు చేయనున్నట్టు ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిట్ విలువ రూ.1,16,750లు కాగా ఐటిడి ఎ 60శాతం సబ్జిడీగా( రూ.70,050) అందిస్తుందన్నారు. అలాగే బ్యాంకు రుణం 40శాతం అనగా రూ.40,700గా ఉంటుందని తెలిపారు. అందువల్ల ఆసక్తికలిగిన ఎస్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఐటిడి ఎ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురంలో అందించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08963-221152కు సంప్రదించాలని కోరారు.

మండలంలోకి మరలా ప్రవేశించిన ఏనుగులు
* గజరాజులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కొమరాడ, ఫిబ్రవరి 22: మండలంలోని గత 6నెలలుగా గజరాజులు వివిధ పంచాయతీలలో సంచరిస్తు పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్న సంఘటనలు పట్టిపీడిస్తున్నాయి. ఇటీవల అటవీప్రాంతాలకు తరలివెళ్లిన ఏనుగులు మరలా కుమ్మరిగుంట పంచాయతీ పరిధిలో గల కుమ్మరిగుంట, రాజ్యలక్ష్మి, కందివలస, తదితర గ్రామాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి రావడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు పట్టపగలు కూడా రహదారికిపైకి రావడంతో పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారిపైనే ఏనుగులు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఈగ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిపై నుంచే ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

పాచిపెంటలో తాగునీటి కష్టాలను తీర్చాలి
పాచిపెంట, ఫిబ్రవరి 22: మండల కేంద్రమైన పాచిపెంటలో తాగునీటి కష్టాలను తీర్చాలని సీపీఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్యపై శుక్రవారం పాచిపెంటలో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొకరవీధి, రెల్లివీధి, రాచవీధి, తదితర వీధుల్లో గత మూడు నెలలుగా తాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కుళాయిలకు వేసిన పైపులైన్లు పూర్తిగా లీకవ్వడంతో కలుషిత నీరు వస్తుందని, అంతేకాకుండా నీరు కూడా సక్రమంగా రావడం లేదని ఆరోపించారు. పలు పర్యాయాలు ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని, వేసవిలో మరిన్ని కష్టాలు ఎదుర్కొనవల్సి వస్తుందని మహిళలు వాపోతున్నారు. పాత పైపులైన్లను తొలగించి నూతనంగా పైపులైన్లను ఏర్పాటు చేసి అన్నివీధులకు సక్రమంగా తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే మున్ముందు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నామని, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు నమోదుకావాలి
పాచిపెంట, ఫిబ్రవరి 22: అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన రైతులు నమోదుకావాలని మండల వ్యవసాయ అధికారి బి గోవిందరావు కోరారు. ఈ పథకానికి సంబంధించి శుక్రవారం పాచిపెంట వ్యవసాయ కార్యాలయంలో పలుగ్రామాలకు చెందిన రైతుల వివరాలను సంబంధిత దృవపత్రాలతో నమోదుచేశారు. మండల పరిధిలో 881 ఎకరాలకు గాను 3,147మంది ఈ పథకానికి వర్తించనున్నారన్నారు. ఇప్పటికే 42గ్రామాల రైతుల వివరాలను తీసుకున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదారుపాసుపుస్తకాల కాపీలను తమ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాలని సూచించారు. రైతుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదుచేసిన తరువాత కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని, వారి వివరాలను కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇఓలు హైమావతి, శైలజ, ఎంపీఇఓలు పాల్గొన్నారు.

మహిళల సంరక్షణపై అవగాహన
సీతానగరం, ఫిబ్రవరి 22: సమాజంలో మహిళలు రోజురోజుకి ఏవిధంగా మోసాలకు గురవుతున్నారన్న విషయాలపై రెడ్ అలర్ట్ సంస్థ భాగస్వామ్యంతో మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈమేరకు సీతానగరంలో మహిళల సంరక్షణపై నిర్వహించిన అవగాహన సదస్సులో రెడ్ అలర్ట్ సంస్థ మేనేజర్ నజీం మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలు చోట్ల మోసాలకు గురిచేస్తున్నారన్నారు. ఎవరూ కూడా తెలియని వ్యక్తుల వలలో పడవద్దని సూచించారు. అలాగే బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా, వరకట్నవేధింపులు, బాలికలపై జరుగుతున్న నేరాళ్లు తదితర అంశాల నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రక్షక్‌లు స్వాతి, ఫాతిమ, మహిళా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు పద్మావతిలు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి
సీతానగరం, ఫిబ్రవరి 22: ఈ ఏడాది జరిగే ఎన్నికలు గ్రామస్థాయి నుంచి ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని సీతానగరం ఎస్‌ఐ కృష్ణమూర్తి కోరారు. మండలంలోని గాదెలవలస గ్రామంలో వచ్చే ఎన్నికలపై ప్రజలకు శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ప్రధానంగా యువత రాజకీయ పార్టీలకు సంబంధించిన గొడవల్లో తలదూర్చరాదన్నారు. యువత ఎక్కడైన అవాంఛనీయ సంఘటనలు జరిగే పరిస్థితులు ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, పోలీసుల విదులు, ఇతర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాలో నగదు జమ
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు వారి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యిందని మండల వ్యవసాయ అధికారి పి శంకరరావు తెలిపారు. ఈ మేరకు మండలంలోని 5,522మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాగా 2,953మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో వెయ్యి రూపాయల చొప్పున జమ అయ్యిందన్నారు. మిగతా 2,569మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకావల్సి ఉందన్నారు. ఈ పథకం 5 ఎకరాలలోపు రైతులకు వర్తిస్తుందన్నారు. ఉద్యోగులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితర వారు ఈ పథకానికి అనర్హులన్నారు.

చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలి
జియ్యమ్మవలస, ఫిబ్రవరి 22: రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబునాయకత్వాన్ని బలపర్చాలని కురుపాం మాజీ ఎమ్మెల్యే విటి జనార్థన థాట్రాజ్ కోరారు. శుక్రవారం మండలంలో గల పెదతుంబలి గ్రామంలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దత్తి లక్ష్మణరావు, మండల మాజీ ఉపాధ్యక్షులు లంక గోపాలం, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించండి సమస్యలొస్తే చర్యలు తప్పవు:జిల్లా ఎస్పీ
*జిల్లాలో 400 సమస్యాత్మక గ్రామాలు
*ఏవోబి పరిధిలో 140 బూత్‌లు గుర్తింపు
చీపురుపల్లి, ఫిబ్రవరి 22: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతవాతవరణంలో ఎన్నికలు జరిగేవిధంగా ప్రజలు సహకరించాలని, సమస్యలు వస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలపై సమీక్షించి నియోజకవర్గంలో పలు గ్రామాలను సందర్శించేందుకు చీపురుపల్లి పోలీస్టేషన్‌కు వచ్చిన ఎస్పీ స్థానిక విలేఖరులతో శుక్రవారం మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను సందర్శించనున్నామని అందులో భాగంగానే చీపురుపల్లి వచ్చినట్టు ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటికే గత ఎన్నికల సమాచారం మేరకు 400 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్నారు. అలాగే ఆంధ్రా ఒరిస్సా బోర్డరు పరిధిలో 140 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఆయా కేంద్రాల వద్ద, సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక భద్రతాచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెవిన్యూ, పోలీసు అధికారులతో సమీక్షలు నిర్వహించి పరస్పర సహాకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే గత ఎన్నికల్లోను, పోలీసు రికార్డుల్లో కేసులు నమోదు కాబడిన వ్యక్తులను గుర్తించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా వినని వ్యక్తులు ఉంటే అటువంటి వారి వద్ద నుంచి సంబంధిత మండలాల తహాసీల్దార్ల సమక్షంలో రూ.50వేల పూచీకత్తులతో బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎక్కడ సమస్యలొచ్చినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో గన్‌లైసెన్స్‌లు పొందిన వారు వెంటనే డిపాజిట్ చేయాలని, ఇప్పటికే చాలా మంది డిపాజిట్ చేయడం జరిగిందని మరో పది మంది వరకు పలు కారణాల వలన ఇంకాడిపాజిట్ చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జిల్లాలో సిబ్బంది కొరత లేదని, మరింత సిబ్బంది రావడంతో పాటు కేంద్రబలగాలు ఎన్నికల నిర్వహణలో భాగంగా రానున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని కోరారు. ఆయనతో పాటు జిల్లా అదనపు ఎస్పీ గౌతమీశాలనీ, సీఐ రాజులనాయుడు, ఎస్సై ఇజ్జు దుర్గాప్రసాద్ ఉన్నారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
చీపురుపల్లి, ఫిబ్రవరి 22: ఎన్నికల విధుల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాల్మాన్‌రాజ్ హెచ్చరించారు. స్థానిక తహాసీల్దార్ కార్యాలయంలో తహాసీల్దార్ పి వేణుగోపాలరావు, ఎన్నికల డీటీ రమణమ్మలతో కలిసి శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. 23, 24 తేదీల్లో ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లోను అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బీ ఎల్‌వోలు, ఎన్నికల సిబ్బంది ఈ రెండురోజుల పాటు ఉదయం 9నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారని, సంబంధిత ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల దరఖాస్తులను తీసుకుని పూర్తిచేసి వారికే అందజేయాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రత్యేక అధికారులతో పాటు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు పర్యవేక్షిస్తారని సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గ్రామాలకు ఇప్పటికే పంపిన ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరి ఓట్లు వారికి ఉన్నాయో లేదో చూసుకోవాలని, ఓటరు కార్డు ఉన్నా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పుడే జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కోరారు.

ఇంటింటి కుళాయిలను ఏప్రిల్ 15నాటికి పూర్తిచేయాలి: ఎమ్మెల్యే
చీపురుపల్లి, ఫిబ్రవరి 22:చీపురుపల్లి మండలంలో ఇంటింటికి కుళాయి పథకం ద్వారా ప్రతీ ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసే పనులు ఏప్రిల్ 15నాటికి పూర్తిచేయాలని శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని అధికారులకు ఆదేశించారు. మండల పరిషత్ సాధారణ సమావేశం శుక్రవారం ఎంపిపి రౌతు కాంతమ్మ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అమలు చేయడం జరిగిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే సాధ్యమని పేర్కొన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పించన్లు పెంచి ఇవ్వడం, వివిధ కుల వృత్తులవారికి, కళాకారులకు కూడా పించన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ ఏవో అరుణ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూ ఎస్ జె ఈ రమేష్, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి కర్లాం పీహెచ్‌సీ వైద్యాధికారి అర్చనాదేవి, సివిల్‌సప్లై డీటీ బి ఈశ్వరరావు, రెస్కో సబ్ ఇంజనీయర్, వెలుగు ఏపీ ఎం వై ఎర్రినాయుడు, ఐసీడీ ఎస్ సూపర్‌వైజర్ ఉషారాణి, ఎన్ ఆర్ జీ ఎస్ ఏపీవో రామారావు తదితరులు ఆయా శాఖల ద్వారా జరుగుతున్న పురోగతిని వివరించారు. ఐసీడీ ఎస్‌కు సంబంధించి గొల్లలపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, గృహనిర్మాణశాఖకు సంబంధించి గొల్లలపాలెం గ్రామానికి ఎన్ని మంజూరయ్యాయో సంబంధిత వివరాలను వివరించాలని అక్కడి ఎంపిటీసీ గొర్లె శ్రీరాములనాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ఎంపిటీసీ రౌతుకామునాయుడు, ఎంపిటీసీ సభ్యులు, మండల ప్రత్యేక అధికారి ఎన్ వి వేణుగోపాల్, ఎంపిడీవో వెంకటరావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధిపనులను వేగవంతం చేయండి
* మున్సిపల్‌చైర్మన్ రామకృష్ణ ఆదేశం
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 22: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆదేశించారు. అభివృద్ధిపనులపై శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను మార్చినెలాఖరునాటికీ పూర్తిచేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. పనులు పూర్తయిన వెంటనే చెల్లింపులు చేస్తామన్నారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను మార్చిమొదటివారంలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధిపనులు జరుగుతున్నాయని, పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని ఆయన చెప్పారు. క్వాలిటీ చెకింగ్ అనంతరం నాణ్యతతో చేసిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తామన్నారు. పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ, మున్సిపల్ ఇంజనీర్ ఎస్.మత్స్యరాజు తదితరులు పాల్గొన్నారు.