విజయనగరం

హాస్టళ్లలో వౌలిక వసతులు మెరుగుపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 24: జిల్లాలోని స్థానిక సంక్షేమ, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు, వౌలిక వసతులు మెరుగుపరచాలని కలెక్టర్ ఎంఎం నాయక్ వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల విషయంలో అధికారులు, సిబ్బంది ఆత్మీయ భావంతో వ్యవహరిస్తే చదువులు సక్రమంగా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల అధికారులతో కలెక్టర్ నాయక్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలో ఉంటూ చదువుకునే విద్యార్థులలో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామనే భావన సహజమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వసతి గృహాల అధికారులు విద్యార్థులతో ఆత్మీయంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం నియమించిన ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలను తరచుగా సందర్శించి అక్కడి ఇబ్బందులను, అవసరమైన వసతుల గురించి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వసతి గృహాల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వసతి గృహాల విద్యార్థుల చదువులు మరింతగా మెరుగుపరచేందుకు అవసరమైన చోట ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ పెరిగేలా చూడాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపుజెసి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, బిసి సంక్షేమశాఖ అధికారి రవిచంద్ర పాల్గొన్నారు.
క్యాప్టివ్ నర్సరీలు ఏర్పాటు చేయాలి
జిల్లాలో మత్స్యసంపదను మరింతగా పెంచే చర్యల్లో భాగంగా ప్రతి చెరువు ప్రాంగణంలో క్యాప్టివ్ ఫిష్ నర్సరీలను ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లాలోని మత్స్యశాఖ అధికారులు, ఎంపిడిఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల పెంపకానికి అనువైన చెరువులను గుర్తించే కార్యక్రమం ఇప్పటికే పూర్తయినందున మత్స్యశాఖ అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి చేపల ఉత్పత్తి మరింతగా పెంచేందుకు మత్స్యకారులను ప్రోత్సహించాలని తెలిపారు. క్యాప్టివ్ నర్సరీల ఏర్పాటుకు అవసరమైన చిన్నపాటి చెరువుల తవ్వకాలకు ఎంపిడిఓలు, పంచాయితీరాజ్ అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, పంచాయితీల ఆమోదంతో ఈ చెరువులను ఏర్పాటుచేసి మత్స్యశాఖ అధికారులకు అప్పగించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపుజెసి నాగేశ్వరరావు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయితీరాజ్ అధికారి సత్యనారాయణరాజు, సిపిఓ విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి పాల్గొన్నారు.