విజయనగరం

తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 13: జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ నుండి ఈ ఖరీఫ్ సీజన్‌కు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేశారని, గురువారం నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద లాంఛనంగా నీటిని విడుదల చేస్తారని ఆమె చెప్పారు. బుధవారం డిఆర్‌డిఎ మీటింగ్ హాలులో విలేఖరుల సమావేశంలో మంత్రి మృణాళిని మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 10వతేదీన తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేయగా, ఆ ఏడాది 55వేల ఎకరాలకు నీరు అందించారని, మరికొన్ని పనులు పూర్తిచేసి డిసెంబర్ నాటికి 70 వేల ఎకరాలకు నీరు విడుదల చేశారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 85శాతానికి పైగా పూర్తికావడంతో ఈ సీజన్‌లో లక్ష ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి పూర్తి ఆయకట్టు 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గత ఏడాది తోటపల్లి కాలువలకు నీరు విడుదల చేసిన సందర్భంగా 160 చెరువులను నింపారని, మరో 250 చెరువులను నింపాలని రైతుల నుంచి డిమాండ్ చెబుతూ ఈ ఏడాది మరికొన్ని చెరువులలో నీటిని నింపేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో గజపతినగరం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తిచేస్తే అదనంగా మరో 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతూ రైల్వేక్రాసింగ్ పనుల కారణంగా బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తిచేయడానికి జాప్యం జరుగుతుందన్నారు. సాగునీటి వసతిలేని బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని మరికొన్ని చెరువులను తోటపల్లి కాలువ ద్వారా వచ్చే నీటితో నింపడం ద్వారా 12వేల ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించామని, మరో ఎనిమిదివేల ఎకరాల మెట్ట్భూములకు కూడా సాగునీరు అందించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
జంఝావతి ఎత్తిపోతల ద్వారా
15వేల ఎకరాలకు సాగునీరు
జంఝావతి ప్రాజెక్టు పరిధిలో 15వేల ఎకరాలకు లిఫ్ట్ సహాయంతో సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మృణాళిని చెప్పారు. జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఒడిశాతో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం ఏర్పడి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయలేక సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జంఝావతి నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించి 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈమేరకు ఇటీవల 39కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేసిందన్నారు. పోలవరం కాలువ విశాఖ వరకు వస్తున్న కారణంగా అక్కడ నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో సాగునీటి సౌకర్యంలేని ప్రాంతాలకు ఈ నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని చేపట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. గోదావరి జలాలను పట్టిసీమ పథకం ద్వారా కృష్ణాకు అనుసంధానం చేసిన రీతిలో తోటపల్లి కుడి కాలువకు లింక్ కెనాల్ ఏర్పాటుచేసి నాగావళి నీటిని చంపావతి, సువర్ణముఖి, వేగావతి, గడిగెడ్డలకు అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోందని తెలిపారు. విలేఖరుల సమావేశంలో తోటపల్లి ప్రాజెక్టు ఎస్‌ఇ తిరుమలరావు పాల్గొన్నారు.

స్వచ్ఛ్భారత్ ఛాంపియన్ జిల్లాగా
విజయనగరం ఎంపిక
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 13: కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న స్వచ్ఛ్భారత్ అమలులో పూర్తిస్థాయి నిధులు ఉపయోగించిన విజయనగరం జిల్లా ఛాంపియన్ జిల్లాగా ఎంపికైంది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖల కార్యదర్శి సునీల్‌కుమార్ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో కేంద్రప్రభుత్వ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా స్వచ్ఛ్భారత్ కింద జిల్లాలో మరుగుదొడ్లు ఏర్పాటుకు చేపట్టిన చర్యలను ప్రస్తావిస్తూ కలెక్టర్ ఎంఎం నాయక్‌ను ప్రశంసించారు. విజయనగరం జిల్లాకు సంక్షేమ పథకాల అమలుకోసం విడుదల చేసే నిధులలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్వచ్ఛ్భారత్‌లో వందశాతం ఓడిఎఫ్ నిధులు వినియోగించినందుకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో విజయనగరం, చిత్తూరు, అనంతపురం జిల్లాలు స్వచ్ఛ్భారత్ అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 37 గ్రామ పంచాయతీలలో స్వచ్ఛ్భారత్ చేపట్టి వంద శాతం ఒడిఎఫ్ నిధులు ఖర్చు చేశామని, ఇప్పటికే ఏడు పంచాయతీలను సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని చెప్పారు. మిగిలిన గ్రామాలలో ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాపరిషత్ సిఇఓ రాజకుమారి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాలలో వందశాతం ఓడిఎఫ్ నిధులు వినియోగించి స్వచ్ఛ్భారత్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జిల్లాలోని 34 మండలాలలో 3.81లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమని జిల్లాయంత్రాంగం గుర్తించిందని, మొదటగా తొమ్మిది మండలాలకు చెందిన 189 గ్రామ పంచాయతీలలో 87వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ప్రతిపాదించామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్‌ఇ రమణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

నేడు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం
* ప్రారంభించనున్న కేంద్రమంత్రి అశోక్
* అసంపూర్తిగా మరికొన్ని పనులు
సీతానగరం, జూలై 13: సీతానగరంలో నిర్మిస్తున్న రైల్వేఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్ర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు గురువారం బ్రిడ్జి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రంలోని రహదారులను అభివృద్ధి చేశారు. ఆహ్వానపత్రాలు లేకుండా సాదాసీదాగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే వంతెన పైభాగంలో విద్యుత్‌దీపాలు, ట్రాఫిక్ సంకేతాలతో కూడిన మార్కింగ్ విధానం ఇతర పనులు ఇంకా చేపట్టలేదు. హనుమాన్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రిటైనింగ్‌వాల్ కూడా ఇంకా నిర్మాణం చేపట్టలేదు. కొన్ని పనులు నిలిచిపోయినప్పటికీ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేయడం విశేషం.

రైతుల మధ్య చిచ్చురేపిన ఇరిగేషన్‌శాఖ
* పెద్దబుచ్చమ్మ చెరువు చప్టా ఎత్తు పెంచడంతో రైతుల్లో ఆందోళన
* తమ భూములు మునిగిపోతాయని ఆవేదన
* కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం
సాలూరు, జూలై 13: ఇరిగేషన్ శాఖాధికారుల అనాలోచిన నిర్ణయాలవల్ల రెండు గ్రామాల రైతుల మధ్య చిచ్చురగలబోతుంది. సాగునీటిపరమైన వివాదం తెరమీదకు రాబోతోంది. పాచిపెంట మండలం మోసూరు, పాంచాలి గ్రామాల మధ్య పెదబుచ్చమ్మ చెరువు పనులను ఉపాధిహామీ పథకం కింద ఇటీవల చేపట్టారు. ఈ చెరువుకు చప్టా, రెండు మదుముల నిర్మాణ పనులు చేశారు. ఈ చెరువు సప్టా ఎత్తును గతంలో కంటే రెండు మీటర్లకు పెంచడంతో వివాదం రగులుతోంది. ఈ ఎత్తు పెంచడం వల్ల చెరువుకు ఎగువన ఉన్న పాంచాళి గ్రామానికి చెందిన 70 ఎకరాల జిరాయితీ భూములు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చప్టా పాత ఎత్తులో ఉన్నప్పుడే ఎగువన ఉన్న కొన్ని భూములు మునిగిపోతున్నాయని, ఇప్పుడు రెండు మీటర్ల ఎత్తు పెంచడం వల్ల మొత్తం ఎగువన ఉన్న భూములు మునిగిపోతాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని రైతులు చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని, పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని బాధిత రైతులు అధికారి వీరన్న, అధికారి నరసింహులు, కోల తవిటిరాజు, రంగయ్య, తాతబాబు, అధికారి అచ్చియ్యమ్మ, చెల్లారావు, పార్వతీశం, కోలా వెంకటేశ్వరమ్మ బుధవారం విలేఖర్లకు చెప్పారు. ఇరిగేషన్ శాఖాధికారులు అత్యుత్సాహం మోసూరు గ్రామానికి రైతుల ప్రయోజనాల కోసమో ఈ చప్టా ఎత్తు పెంచడం వివాదాస్పదం అవుతోంది. 16 లక్షల రూపాయలతో ఈ చప్టా మదుముల నిర్మాణ పనులను చేపట్టారు. ఇంతవరకు 12 లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేశారు. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న మోసూరు, పాంచాళి గ్రామాల రైతుల మధ్య తాజా వివాదం నీటి యుద్ధంగా కనబడుతోంది. రానున్న వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడితే బుచ్చమ్మ చెరువు మీదన ఉన్న పాంచాలికి చెందిన రైతులు ముంపుతో నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు గ్రామాల మధ్య సాగునీటి యుద్ధానికి దారితీసే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. దీనిపై ఇరిగేషన్ జెఇ శంకరరావును వివరణ కోరగా ఎత్తు పెంచడం వల్ల ఇబ్బందులు ఉన్నట్టు రైతులు తమ దృష్టికి తీసుకురాలేదని, ఒకవేళ తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు.

మంత్రి తనిఖీతో మున్సిపల్
చైర్మన్‌లో కదలిక
* కంటోనె్మంట్ హైస్కూల్‌లో చైర్మన్ తనిఖీ
విజయనగరం (్ఫర్టు), జూలై 13: పట్టణంలో కస్పా మున్సిపల్ హైస్కూల్‌ను మూడురోజుల క్రితం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని తనిఖీ చేయడంతో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణలో కూడా కదలిక వచ్చింది. ఇంతవరకు పాఠశాలల తనిఖీ చేయని చైర్మన్ రామకృష్ణ బుధవారం కంటోనె్మంట్ మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా రెండేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ ఇంతవరకు పట్టణంలో ఒక్క పాఠశాలను కూడా తనిఖీ చేయలేదు. కొన్ని పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలలో పాల్గొనడం మినహా, ఆయా పాఠశాలలలో సదుపాయాలపై, ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీసిన సందర్భాలు లేవు. ఈనెల 11వతేదీన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కస్పా మున్సిపల్ హైస్కూల్‌ను ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఉపాధ్యాయుల డొల్లతనం బయట పడింది. మంత్రి తనిఖీ చేసే సమయానికి 24 మంది ఉపాధ్యాయులు హాజరు కాలేదు. విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో పాఠశాల ప్రధాన గేట్లను మూసి వేయడంతో ఉపాధ్యాయులు బయట గేట్లు వద్ద నిలిచిపోవల్సి వచ్చింది. ఈ సంఘటన పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారడమే కాకుండా మున్సిపల్ పాలనపై మాయని మచ్చగా మిగలడంతో బుధవారం ఉదయం 9.30 గంటలకే మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ కంటోనె్మంట్ మున్సిపల్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. చైర్మన్‌తోపాటు మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరుపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. పట్టణం నడిబోడ్డులో ఉన్న కస్పా హైస్కూల్‌లో మంత్రి తనిఖీలో బయటపడిన ఉపాధ్యాయుల పనితీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్నారు. విధులకు ఆలస్యంగా రావడమే గాకుండా కొంతమంది ఉపాధ్యాయులు సమర్థించుకునే పనిలో ఉన్నారు. వీరికి అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు భరోసాగా నిలిచారు. బుధవారం పాఠశాలను సందర్శించిన ఆ నేతలు సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే...రాష్టస్థ్రాయి ఉద్యమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

కృష్ణా పుష్కరాలకు 800 ప్రత్యేక బస్సులు
* ఆర్టీసీ ఆర్‌ఎం అప్పన్న వెల్లడి
విజయనగరం (్ఫర్టు), జూలై 13: కృష్ణా పుష్కరాలకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 800 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న తెలిపారు. వచ్చేనెల 11 నుంచి 23వ తేదీ వరకు బస్సులను నడుపుతామని చెప్పారు. బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపధ్యంలో పుష్కర యాత్రకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. విజయనగరం రీజియన్ నుంచి ప్రతీ రోజూ 75 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పారు. అదేవిధంగా గోదావరి అత్యంత పుష్కరాల కోసం ఈనెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు రాజమండ్రికి విజయనగరం రీజియన్ నుంచి ప్రతిరోజూ 60 బస్సులను నడుపుతామని తెలిపారు. ఈ అవకాశాన్ని యాత్రికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రామకృష్ణ, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్, పర్సనల్ అధికారి ఎం.సన్యాసిరావు పాల్గొన్నారు.

అవార్డు గ్రహీతలైన వైద్యాధికారులకు పిఓ అభినందన
పార్వతీపురం, జూలై 13: ఉత్తమ సేవలు అందించినందుకు వరుసగా మూడోసారి రాష్టస్థ్రాయి అవార్డు అందుకున్న స్థానిక ఏరియా ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి, సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావును అలాగే కుని ఆపరేషన్ల నిర్వహణలో జిల్లాలో అత్యధిక ఆపరేషన్లను నిర్వహించి అవార్డు అందుకున్న డాక్టర్ వై విజయమోహన్‌లను ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.ప్రసన్నకుమార్ అభినందించారు. ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన సేవలు అందించి గిరిజన, పేదలకు ఆరోగ్యదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఐటిడిఏ తరుపున వైద్యసహాయం అందించడానికి తన వంతు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తానని పిఓ భరోసా ఇచ్చారు.

కౌలురైతులకు ప్రభుత్వ హామీపై
పంట రుణాలు ఇవ్వాలి
* రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగాభవానీ డిమాండ్
విజయనగరం (్ఫర్టు), జూలై 13: కౌలురైతులకు ప్రభుత్వం హామీగా ఉంటూ పంటరుణాలను ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పి.గంగాభవానీ డిమాండ్ చేశారు. వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, రుణమాఫీ వర్తింపజేయాలని తెలిపారు. కౌలురైతులందరికీ రుణమాఫీతోపాటు పంటరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాయింట్‌కలెక్టర్‌కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగాభవానీ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. దేవాలయ భూములను సాగు చేస్తున్న రైతులకు నష్టం కలిగించేవిధంగా జీవో-425 విడుదల చేసిందన్నారు. ఈ జీవో ప్రకారం సాగులో ఉన్న రైతులు వేలం పాటలద్వారా కౌలు పొందేందుకు దళిత క్రిష్టియన్లు, మస్లింలు సాగు హక్కును కోల్పోతారని తెలిపారు. హిందువులు కానివారు దేవాలయ భూములను సాగు చేసేందుకు వీలులేదన్నారు. జీవోలో ఉన్న మరికొన్ని షరతులు పేద కౌలురైతులకు నష్టదాయకంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని 22వేలకు పైగా దేవాలయ పరిధిలో 3,04,855 ఎకరాల సాగుభూమి ఉందన్నారు. ఈ భూములను సుమారు లక్షమంది రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 16లక్షల మంది కౌలురైతులలో కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే కౌలు గుర్తింపుకార్డులను అందించారన్నారు. కౌలురైతుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎల్.లక్ష్మి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పాల్గొన్నారు.

చంద్రబాబును నిలదీసే రోజు దగ్గరలో ఉంది
* వైకాపా జిల్లా అధ్యక్షుడు కోలగట్ల
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 13: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నిలదీసే రోజు దగ్గరలోనే ఉందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గడపగడపకూ వైకాపాలో భాగంగా బుధవారం కోలగట్ల పట్టణంలోని 22వ వార్డు తోటపాలెంలో పర్యటించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి గడపగడపకూ పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. తోటపాలెంలో ప్రాంతంలో నివసిస్తున్న మహిళలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గేదెల పైడితల్లి, అప్పలకొండ అనే మహిళలు పింఛన్ రాలేదని, అర్హులకు సంక్షేమ పథకాలు అందడంలేదని కోలగట్లకు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. ప్రజలు నిలదీయడాన్ని ఆయన స్వాగతించారు. మోసపూరిత వాగ్ధానాలు చేసి ప్రజాప్రతినిధులుగా చలామణి అయ్యే రాజకీయనాయకులకు ఇదొక గుణపాఠంగా ఉంటుందన్నారు. రాజకీయనాయకులు అంటే ప్రజలలో చులకనభావం ఏర్పడడానికి చంద్రబాబు పాలన తీరే కారణమని కోలగట్ల విమర్శించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసినప్పుడే రాజకీయ నాయకులకు ప్రజలలో గౌరవం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ నాయకులు గురుమూర్తి, పార్టీ నాయకులు బాలబ్రహ్మారెడ్డి, రవిచంద్ర, మోహన్, అప్పారావు, రంగారావు, శ్రీనివాసరావు, చాణిక్య, ఈశ్వరరావు, పూసర్ల అప్పారావు పాల్గొన్నారు.

గోతులమయంగా విజయనగరం రహదారులు
* తాత్కాలిక పనులుతో ఫలితం శూన్యం
విజయనగరం(టౌన్), జూలై 13: పట్టణ పరిధిలోని రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. మూడు లక్షల మంది జనాభా కలిగిన విజయనగరం పట్టణం నిత్యం వచ్చి పోయే వాహనాలతో రద్దీగా ఉంటుంది. పరిమితికి మించిన వాహనాలు,జనసమర్థంతో జిల్లా కేంద్ర పట్టణం విజయనగరం కిటకిటలాడుతోంది. ఇందుకు తగిన విధంగా పట్టణ ప్రజలకు, వాహనచోదకులకు అనువైన రహదారులు లేవు. వౌలిక సదుపాయల కల్పనపై పాలకులకు చిత్తశుద్ధి కొరవడడంతో సమస్యలు కోకొల్లలుగా ఏళ్ల తరబడి అపరిష్కృతంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయాక విజయనగరం పట్టణాన్ని ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా అభివృద్ది చేయ సంకల్పించింది. పాలకుల నిర్ణయాలు ఆచరణలో కనిపించడంలేదు. పట్టణంలోకి అడుగుపెట్టిన ప్రజలకు గతుకులమయంగా మారిన రహదారులే కనబడతాయి. ఒకనాటి ఆర్ అండ్ బి రహదారి గాజులరేగ నుండి పాతబస్‌స్టాండ్ వరకు ఎన్నోయేళ్లుగా సేవలు అందించిన బుచ్చెన్నకోనేరు రోడ్డు దుస్థితి వర్ణణాతీతం. వర్షంపడితే చాలు బుచ్చెన్నకోనేరు కూడలి నుండి గాజులరేగ వరకు రహదారి పంట కాలువను తలపించే విధంగా వర్షపునీటితో నిండిపోయి ఆప్రాంత వాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం వందలాది వాహనాలు ఈ రహదారిని వినియోగించుకుని పట్టణంలోకి వస్తాయి. ఇటీవల వర్షాలకు జలమయమైన ఈరహదారికి ఇంతవరకు మోక్షం కలగలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పట్టణంమీదుగా వెళుతున్న 26వ నెంబర్ జాతీయ రహదారి మీద కలెక్టరేట్ కూడలి సమీపంలోని మలుపులో కేబుల్‌కోసం తవ్విన గాత ఇటీవల పెద్దదై వాహనచోదకులను ఆందోళనకు గురిచేస్తోంది. వేగంగా వచ్చే వాహనాలు ఈ గొయ్యిని అంచనా వేయడంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలకే ప్రమాదం. శాంతినగర్ కూడలి నుండి కొత్త అగ్రహారం మీదుగా ఎన్‌సిఎస్ కూడలి వరకు రహదారి తారులేచిపోయి గోతులమయంగా మారింది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లే రహదారిలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇటీవల వర్షాలకు ఈ రహదారి దెబ్బతింది. మున్సిపల్ పాలకవర్గం పట్టణంలోని 40వార్డులలో దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయడానికి గతంలో 80 లక్షల రూపాయలు కేటాయించి నిర్వహించిన పనులు మూన్నాళ్లముచ్చటగా మొదటికి వచ్చాయి. ఇప్పటికైనా రహదారులను పర్యవేక్షించే ఆయా శాఖలు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.