మెయన్ ఫీచర్

వరంగల్ తీర్పు ఏం చెబుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తమ అభిప్రాయాలు వెల్లడించరు. టీవి చర్చల్లో గట్టిగట్టిగా అరవరు. మేధావుల చర్చల్లోనూ కనిపించరు. కానీ సమ యం వచ్చినప్పుడు దిమ్మతిరిగిపోయేలా తీర్పు చెబుతారు. ఇప్పుడు వరంగల్‌లో ప్రజలు చేసింది అదే. వాళ్ల అంతరంగం మేధావులకు అర్ధం కాదు. కానీ ఈ సామాన్యులను నమ్ముకొని రాజకీయం చేసే వారికి బాగా అర్ధమవుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికల సందర్భంగా దాదాపు నెల రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్, నారాయణఖేడ్ రెండు నియోజక వర్గాల్లో మనం గెలుస్తున్నాం, వరంగల్‌లో 65శాతం ఓటర్లు, నారాయణఖేడ్‌లో 57 శాతం మంది ఓటర్లు మనవైపు ఉన్నారు అని కెసిఆర్ ప్రకటించారు. మంగళవారం నాటి తీర్పుతో వరంగల్ సర్వే నిజమైంది. ఇక నారాయణఖేడ్ తీర్పు తేలాలి.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రెండు పార్లమెంటు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపిగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల గెలవడంతో మెదక్ పార్లమెంట్ నియోజక వర్గానికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ ఉప ఎన్నిక జరిగింది. అప్పటికి ప్రభుత్వం ఇంకా సర్దుకోలేదు. అధికారుల కేటాయింపు జరగలేదు. 2014 తో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది, ఆ మేరకు మెజారిటీ కూడా తగ్గింది. కానీ పదిహేడు నెలల టిఆర్‌ఎస్ పాలన తరువాత జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. ఈ పదిహేడు నెలల్లో ఏం చేశామో చెప్పి టిఆర్‌ఎస్ ఓట్లు అడిగింది. వరంగల్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో కెసిఆర్ ఇదే మాట చెప్పారు. 17నెలల్లో ఇదిగో మేం చేసింది ఇది. ప్రభుత్వం చేసింది మంచి పనే అని మీరు భావిస్తే, దీవించండి, మేం తప్పు చేశామని భావిస్తే శిక్షించండి అని కోరారు. నేను చెప్పింది తప్పయితే నన్ను శిక్షించండి, ప్రతిపక్షాలు మాటలు తప్పయితే ఓటు ద్వారా వారిని శిక్షించండి అని ముఖ్యమంత్రి బహిరంగ సభలోనే పిలుపు ఇచ్చారు.
నాలుగు లక్షల 59వేల ఓట్ల మెజారిటీ ద్వారా ప్రజలు తమ తీర్పును చాలా స్పష్టం గా వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టిడిపి కూటమి అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కనంత సూటిగా ప్రజలు తీర్పు చెప్పారు. వెంటనే ఎన్నికలు జరిగిన మెదక్ ఓటర్ల తీర్పు కన్నా 17నెలల పాలన చూసి ఓటు వేసిన వరంగల్ ఎన్నికల ఫలితాలు విలక్షణమైనవి. సాధారణంగా ఎక్కడైనా అధికార పక్షంపై ప్రజల్లో క్రమంగా కొంత వ్యతిరేకత ఏర్పడుతుంటుంది. కానీ వరంగల్‌లో మాత్రం విపక్షాలన్నీంటిపైన ప్రజలు మూకుమ్మడిగా తమ వ్యతిరేకతను చాటే విధంగా తీర్పు చెప్పారు. ఏ ఒక్క పార్టీకి కూడా డిపాజిట్ దక్కని స్థాయలో టిఆర్ ఎస్ విజయం సాధించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ తెలంగాణ ఏర్పాటును కోరుకునే శక్తులన్నింటిని ఏకం చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ బాగును కోరుకునే ప్రజలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రంగా ఈ అంశంలో విపక్షాలు చిత్రంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో కెసిఆర్‌కు తాము ప్రత్యామ్నాయంగా నిలవాలని విపక్షాలు కోరుకుంటే కెసిఆర్ కన్నా మిన్నగా తెలంగాణను అభిమానించాలి. కెసిఆర్ కన్నా తమ వల్లనే తెలంగాణకు మేలు జరుగుతుంది అనే నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలి. కానీ విపక్షాలు ఈవిషయంలో ఘోరంగా విఫలం అవడమే కాకుండా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులతో చేతులు కలపడమే కాకుండా వారిలానే రాజకీయాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని ప్రకటించి.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసిన పార్టీ మాదే అని ఇప్పటికీ టిడిపి గర్వంగా చెప్పుకుంటుంది. అలాంటి టిడిపితో చేతులు కలిపి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉద్యమాలు చేసింది. చివరకు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోగానే కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేసి టిఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ప్రకటించారు. అనుకూలంగా లేఖ ఇచ్చినా తెలంగాణ ఏర్పాటును టిడిపి చిత్తశుద్ధితో వ్యతిరేకించింది. చివరి నిమిషం వరకు అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అలాంటి పార్టీతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రె స్ చేతులు కలపడంలో ఉద్దేశం ఆ పార్టీ మేధావులకే తెలియాలి. ప్రతి అంశంలోనూ కెసిఆర్ తెలంగాణను ఓన్ చేసుకునే విధం గా తెలంగాణ కోణంలో స్పందిస్తుంటే తె లంగాణ వ్యతిరేక శక్తులు ఏకమై తెలంగాణ పార్టీని ఓడించాలనే ప్రయత్నాన్ని వరంగల్ ఓటర్లు బలమైన తీర్పు ద్వారా వ్యతిరేకించారు.
నన్నపనేని రాజకుమారి టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆమెను ఎదుర్కోవడానికి వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు గంగాభవానిని రంగంలో దించారు. వీరి ప్రత్యేకత ఏమంటే ప్రత్యర్థులను ఏ మాత్రం మర్యాద పాటించకుండా తిట్టేయగలరు. చివరకు కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం సైతం ఈ కోటా కింద ఒక నాయకురాలిని ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ లో నైనా ప్రత్యర్థులను బూతులు తిట్టేందుకు ఒక నేతను ఎంపిక చేసుకునే వారు. విభజన తరువాత కూడా టిడిపి ఈ సంస్కృతి నుంచి బయటపడలేదు. తిట్టడమే హీరోయిజంగా భావించిన టిడిపికి వరంగల్ ఓటర్లు చక్కని తీర్పుతో గుణపాఠం నేర్పించారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ప్రజలు నిన్ను చెట్టుకు కట్టేసి కొడతారు అని ఎన్నికల ప్రచారంలో టిడిపి శాసన సభాపక్షం నాయకుడు దయాకర్‌రావు విమర్శించారు. చివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తిలో సైతం టిఆర్‌ఎస్‌కే మెజారిటీ వచ్చింది. మీడియా ముందు దయాకర్‌రావు మాట్లాడితే బ్యాలె ట్ బాక్స్‌లో పాలకుర్తి ఓటర్లు సమాధానం చెప్పారు. తెలంగాణలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు ప్రయత్నించడం ఆయన ధర్మం కానీ చివరకు తెలంగాణ టిడిపి నాయకులు ఈ లేఖలను సైతం సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని తమ పార్టీ అని ఎలా భావిస్తారు? చివరకు తెలంగాణ టిడిపి నాయకులు ఏ చిన్న అంశం కోసమైనా విజయవాడ వెళ్లి చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉద్యమాలతో పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. కనీసం ఏడాది కూడా గడవకముందే తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులతో టిడిపి తెలంగాణ నేతల సమావేశం మీడియాలో ప్రచారానికి ఉపయోగపడవచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఇది మన పార్టీ కాదు పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీ అని బలంగా తమ మనసులో ముద్ర వేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఉద్యమానికి కెసిఆర్ నాయకత్వం వహించినా సోనియాగాంధీ పట్టుపట్టి ఉండక పోతే తెలంగాణ సాకారం అయి ఉండేది కాదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి ఎన్నికల ముందు చెప్పినా ఏడాదిన్నరలో కనీ సం ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తి చేయని ఆ పార్టీ స్పీడ్, అడ్డదిడ్డంగా విభజన చేశారని తరుచుగా మోదీ చేస్తున్న వాఖ్యలు చూస్తుంటే ఒకవేళ సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిజెపి వందేళ్లయినా ఇచ్చి ఉండేది కాదేమో అన్న అనుమానాన్ని కలుగజేస్తున్నాయ! తెలంగాణ ఇచ్చిన కాం గ్రెస్‌పై నిజానికి తెలంగాణ ప్రజలకు ఇంత వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ గత ఎన్నికల్లో కన్నా వరంగల్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా పడిపోయింది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదు రోజులకే దిష్టిబొమ్మలు దగ్దం చేయడం, ఆందోళన కార్యక్రమాలతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న అభిమానాన్ని సైతం కాంగ్రెస్ తుడిచేసుకుంది. అలా తుడిచేసుకుని ఉండకపోయి ఉంటే విభజన చట్టం పార్లమెంటులో పెట్టిన సమయంలో కీలక పాత్ర పోషించిన మీరాకుమారి, షిండే వంటి హేమాహేమీలు వరంగల్‌లో ప్రచారం చేసినా కనీసం డిపాజిట్ దక్కకుండా ప్రజలు తిరస్కరించే వారు కాదు.
టిడిపి వర్గం మీడియాను, టిడిపి ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి కాంగ్రెస్ తెలంగాణ కోసం ఆలోచిస్తే ఆ పార్టీ పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రత్యర్థులు సైతం జాలిపడేట్టుగా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి మారుతోంది. వరంగల్ ఫలితాలపై కుంటి సాకులు వెతుక్కోవడానికి బదులు తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏం చేయాలి ఆనే కోణంలో ఆలోచించడం కాంగ్రెస్‌కు మేలు. రెండు రాష్ట్రా ల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ దేశంలో ఎక్కడా లేదు. నిజానికి టిడిపితో కాంగ్రెస్ భుజం కలపడం టిఆర్‌ఎస్‌కు సంతోషకరమే. సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడం టిఆర్‌ఎస్ నాయకత్వానికి కొంత ఇబ్బంది.. కానీ అదే టిడిపి కాంగ్రెస్ భుజం భుజం కలిపి పని చేస్తే కెసిఆర్ పని సులభం అవుతుంది. బిజెపి ముసుగులో వచ్చిన టిడిపి అంటూ వరంగల్‌లో టిఆర్‌ఎస్ చేసిన విమర్శల్లో మర్మం అదే.
టిడిపి, సిపిఐ, సిపిఎం, టిఆర్‌ఎస్ వంటి పార్టీలన్నీ కలిపి 2009లో మహాకూటమి అని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు వరంగల్‌లో టిడిపి వర్గం మీడియా, టిడిపి, బిజెపి కలిసి పోటీ చేసినా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌నే గెలిపించారు. మేధావుల విశే్లషణలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలకు కృతజ్ఞత ఉంటుంది. ఆ కృతజ్ఞతా భావంతోనే 2009లో వైఎస్‌ఆర్‌ను గెలిపించారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను గెలిపించారు. వరంగల్ ఫలితం 17నెలల టిఆర్‌ఎస్ పాలనపై తీర్పు. సంక్షేమ పథకాలపై వ్యక్తం అయిన ప్రజాభిప్రాయమే భారీ మెజారిటీ. ఈ విజయంతో 2019లో గెలు పు మాదే అనే అతి విశ్వాసం అవసరం లే దు. చెప్పినవి చేసి చూపిస్తేనే 2019లో ప్రజలు ఆదరిస్తారు. దాని కోసం ప్రభుత్వానికి ఇంకా మూడున్నర ఏళ్ల సమయం ఉంది. ప్రభుత్వంపై తెలంగాణ సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను వమ్ము చేయకుండా మరింత నిబద్ధతతో వ్యవహరించాల్సిన బాధ్యత పాలకులది.

-బుద్దా మురళి