క్రీడాభూమి

ధోనీసేనకు సిసలైన పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంఖడేలో నేడు సఫారీలతో చివరి టి-20 వామప్ మ్యాచ్

ముంబయి, మార్చి 11: ప్రపంచ టి- 20 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారత్ తన చివరి వామప్ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఇక్కడ బలమైన దక్షిణాఫ్రికాను ఎదుర్కోబోతోంది. ఈ నెల 15న ప్రధాన పోటీలు ప్రారంభం కావడానికి ముందు తన బలాబలాలను పరీక్షించుకోవడానికి జట్టుకు ఇది కఠిన పరీక్ష అనే చెప్పాలి. భారత్ ఇటీవలి కాలంలో టి-20 మ్యాచ్‌లలో తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. ఇప్పటివరకు అది ఆడిన 11 మ్యాచ్‌లలో పది మ్యాచ్‌లను గెలుచుకొంది. ఇందులో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు 3-0 తేడాతో ఓడించడం కూడా చేరి ఉంది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా అదే ఊపుతో ఆసియా కప్‌ను కూడా దక్కించుకుంది. ఢాకాలో ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో సహా వరసగా అయిదు విజయాలు సాధించి ఆసియా ఖండంలో టి-20 ఫార్మెట్‌లో తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. మరోవైపు సొంతగడ్డపై మిగతా ప్రత్యర్థులకు అది మరింత ప్రమాదకరమన్న విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో ఓటమి పాలయిన నేపథ్యంలో ఆ దేశంతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ భారత్‌కు ఎంతో ముఖ్యమైనదనే భావించాలి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుత ఫామ్‌లో కొనసాగుతుండడం, మిగతా బ్యాట్స్‌మెన్ కూడా దారిలో పడిన నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ఇప్పుడెంతో పటిష్ఠంగా ఉంది. మరోవైపు కొంతకాలం క్రితం వరకు బలహీనంగా ఉన్నట్లు కనిపించిన బౌలింగ్ విభాగం కూడా ఇప్పుడు దారిలో పడింది. మహమ్మద్ షమీ జట్టులోకి తిరిగి రావడంతో ఆ బలం మరింత పెరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రాలు కూడా ఇటీవలి మ్యాచ్‌లలో చక్కగా రాణించారు. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎడంచేతి వాటం స్పిన్నర్లు రవీంద్ర జడేజా, పవన్ నేగిలు కూడా రాణించడం తెలిసిందే.
ఇక దక్షిణాఫ్రికా కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలు రెండింటిలోను పటిష్ఠంగా ఉంది. ఫఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆ జట్టులో ఎబి డెవిలియర్స్, హషీమ్ ఆమ్లా, డేవిడ్ మిల్లర్, డికాక్ లాంటి ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీరికి తోడు క్రిస్ మోరిస్, డుమినీ, డేవిస్ వీస్‌లాంటి మంచి ఆల్‌రౌండర్లూ ఉన్నారు. ఇక ప్రపంచంలోనే నంబర్ వన్ అయిన డేల్ స్టెయిన్, రబడా, అబోట్, క్రిస్ మోరిస్‌లాంటి గొప్ప ఫాస్ట్‌బౌలర్లు, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫంగిసో లాంటి స్పిన్నర్లతో ఆ జట్టు అన్ని విధాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. అయితే దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక ప్రపంచ కప్‌ను కానీ, ప్రపంచ టి-20 ఈవెంట్‌ను కానీ గెలుచుకోలేదు సరికదా కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేదు. కాగా, శనివారం వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగే వామప్ మ్యాచ్ తమకు పెద్ద మ్యాచ్ అని, ఆ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నామని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ చెప్పాడు.