వీక్ పాయింట్

అనువుగాని అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి తెలుగురాదు. కాబట్టి తెలుగు మీడియా బతికిపోయింది. అతడో భూతమో, బ్రహ్మరాక్షసుడో, హిట్లర్ మేనల్లుడో అయినట్టూ, ఇండియన్లను కాల్చిరమ్మని అతగాడే తుపాకులిచ్చి మనుషుల్ని పంపిస్తున్నాడేమో అన్నట్టూ, కొన్ని వారాలుగా మన మీడియా చేస్తున్న అతి ఆ అగ్గిరాముడికి తెలిస్తే ఏమయ్యేదో!
మనవాళ్లు ఎంతమంది ఉన్నా, ఎప్పటినుంచి ఉన్నా అమెరికా మన దేశం కాదు. అక్కడి ప్రభుత్వం మనది కాదు. మనం కోరుకున్నట్టు, మనకు కావలసినట్టు అది నడవదు.
మూలాలను తరచిచూస్తే అమెరికాలో ఉన్నవాళ్లందరూ వలసదారులే... ఏదో ఒక తరంలో ఏదో ఒక దేశం నుంచి వలసొచ్చిన బాపతే. అలాగని కొత్తగా వలసవెళ్లేవారిని పాతవలసదారుల జాతి భరించి తీరాలన్న రూలేమీ లేదు.
మనలాగే అమెరికాకు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉంది. దానికో విధానం ఉంది. అమెరికన్ మీడియాకు, ఒక వర్గం అమెరికన్ ప్రజలకు ఎంత కంటగింపు అయినా, ససేమిరా ఒప్పుకోబోమని ఎంత భీష్మించినా డోనాల్డ్ ట్రంప్ అనేవాడు రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రెసిడెంటు. కొన్ని నెలల కింద హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అతడు తన నైజమేమిటో, అధికారం అందితే ఏమి చేయాలనుకుంటున్నాడో, ఎవరిని గెంటేయాలనుకుంటున్నాడో, ఎవరిని రానివ్వకూడదను కుంటున్నాడో దాచుకోకుండా మొహంమీద గుద్దినంత సున్నితంగా తనదైన శైలిలో డప్పుకొట్టి చెప్పాడు. అది అనాగరికం, ఆటవికం, సభ్యసమాజానికి అత్యంత ప్రమాదకరం అని అక్కడి మీడియా ధ్వజమెత్తింది. ప్రత్యర్థి హిల్లరీ అమెరికన్ల చెవిన ఇల్లు కట్టుకుని వేయి విధాల హెచ్చరించింది. అయినా, చిత్రంగా ట్రంపే ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఎన్నికల సమయాన ప్రజలకు చెప్పిందే గద్దెనెక్కాక చేయసాగాడు. అందులో తప్పేమిటి? దానివల్ల మనకు కష్టం కలిగినా, నష్టం వచ్చినా అతడలా చేయనే కూడదు అనడానికి మనం ఎవరం?
1960ల దశకంలో వియత్నాం యుద్ధం తరవాత అమెరికాకు డాక్టర్ల కొరత వచ్చింది. అడగకుండానే వరాలిచ్చి, ఇండియా నుంచి డాక్టర్లను పిలిపించుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తమ దేశంలో పనిచేయడానికి వచ్చిన భారతీయ వైద్యులకు అమెరికా ప్రభుత్వ ఉన్నత అధికారులు విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికేవారు. అలాగే 1990ల్లో ఇంటర్నెట్ విప్లవంతో ఐ.టి. రంగం జాంబవంతుని అంగలతో దూసుకెళ్లినప్పుడు అపారంగా పెరిగిన అమెరికా అవసరాలు తీర్చటానికి మళ్లీ ఇండియాలాంటి దేశాల ఇంజనీర్లే శరణ్యమయ్యారు. అడిగిన జీతాలిచ్చి, బోలెడు సౌకర్యాలు కల్పించి మన కంప్యూటర్ నిష్ణాతులను నెత్తిన పెట్టుకున్నారు. అక్కర తీరాక, తమ దేశంలో నిరుద్యోగం మితిమీరాక, బయటిదేశాల వారు తమ ఉద్యోగావకాశాలను తన్నుకు పోవడమే దానికి కారణమన్న అపోహ ప్రబలాక ‘ఇక దయచేయండి’ అని వారినే ఇప్పుడు గెంటేయదలిచారు.
దేశాధినేత హోదాలో ట్రంప్ మహాశయుడు వరసగా చేస్తున్న ప్రకటనలను... రిపబ్లికన్, డెమాక్రాటిక్ అన్న పార్టీల తేడా లేకుండా అమెరికా ఉభయ సభల్లో శాసనకర్తలు ఇప్పటికే ప్రతిపాదించిన ‘కోత’ల, ‘గెంటివేత’ల, ‘తలుపుల మూత’ల బిల్లుల తీరును గమనిస్తే అమెరికా వెళ్లి బావుకునే దానిమీద మనవాళ్లకు భ్రమలు తొలగక తప్పదు. రెక్కలు రాగానే డాలర్ భూమికి ఎగిరివెళ్లి, ఏదో విధంగా కాలుపెట్టి, ఏదో ఒకటి చేసి, బతికినంతకాలం విలాసంగా గడిపేయవచ్చన్న అందమైన కల ఇకపై కుదరదు. అమాంబాపతు యూనివర్సిటీలో పై చదువు నెపంతోనో, హెచ్1బి వీసాను ఎలాగోలా సంపాదించో అమెరికాలో అడుగు మోపి, చట్టపరమైన నివాసార్హతతో నిమిత్తం లేకుండా డిష్ వాషింగు అనబడు అంట్లు తోమో, పెట్రోలు బంకుల్లో గాస్ నింపో, దొంగచాటున పనులు చేసి బతికో కాలం వెళ్లదీయగల సావకాశం ఇకపై ఉండదు. ఎంతకాలంగా అమెరికాలో ఉంటూ, అమెరికన్ యాసతో, అమెరికన్ స్టయిల్లో ఎన్ని హొయలు పోయినా, అది తమకు పరాయి నేలేనని గుర్తించి, మారిన పరిస్థితుల్లో ఏమి చేయాలి, ఎలా సర్దుకుపోవాలి అన్నది ఆ దేశంలో ఇప్పటికే స్థిరపడినవారు ఇక ఆలోచించాలి.
భూమి పుత్రుల వాదం, వలసదారులపై ద్వేషం కొత్తగా అమెరికాలోనే మొదలు కాలేదు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండు లాంటి ఎన్నో దేశాల్లో మోరసాచిందే. మునుపు మహారాష్టల్రో, కొంతకాలం కింద తెలంగాణలోనూ ఉవ్వెత్తున ప్రకోపించిందే. ఆంధ్రోళ్లు వచ్చి అవకాశాలన్నీ వాడేసి అణగదొక్కారని తెలంగాణవారు అన్నట్టే అమెరికన్లూ అక్కడ వలసదారులను ఏవగించుకుంటున్నారు. ఎక్కడినుంచో వెళ్లి, ఎంతో చెమటోడ్చి తాము తెలంగాణను అభివృద్ధి చేశామన్న ఆంధ్రా సెటిలర్ల వాదం తెలంగాణలో నెగ్గనట్టే, అమెరికా అభివృద్ధికి మనవాళ్లు పడ్డ కష్టం గురించి మనం ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు.
అమెరికాలో ఇప్పటికే స్థిరపడిన భారతీయులు లక్షల సంఖ్యలో ఉన్నారు. గ్రీన్‌కార్డుతో చట్టబద్ధ నివాసార్హత పొందినవారు, ఏకంగా అమెరికన్ పౌరసత్వమే ఏనాడో సంపాదించినవారు, స్వదేశంతో బంధాలు తెంచుకుని ఆస్తులు సంపాదించి, సకుటుంబంగా, తరతరాలుగా అక్కడే పాతుకు పోయినవారూ లక్షల సంఖ్యలోనే ఉన్నారు. చట్టప్రకారం అర్హతలెన్ని ఉన్నా, జాతి విద్వేషం చెలరేగినప్పుడు ఎవరికైనా మనుగడ కష్టమే. ఈ బెడదను ఎలా కాచుకోవడం అన్నది అమెరికాలో ఉన్న మనవారందరి తక్షణ సమస్య. సమస్య వారిది కనుక పరిష్కారమూ వారే కనుక్కోవాలి. ఇందులో మనం చేయగలిగింది తక్కువ. వారి బతుకు వారు బతకటానికి, వారి జాగ్రత్త వారు పడటానికి అవకాశమిస్తూ... సమస్యను మరింత జటిలం చేయకుండా, అనవసరపు ఉద్రిక్తత రేకెత్తించకుండా కాస్త గమ్మునుంటే చాలు.
ట్రంప్ పగ్గాలు చేపట్టాక, అతడి రెచ్చగొట్టే ప్రకటనల ఫలితంగా విద్వేష వాతావరణం అలుముకున్న మాట నిజం. కూచిభొట్ల శ్రీనివాస్ వంటి మంచి మనుషుల దుర్మరణం మనసున్న ప్రతివాడినీ కలిచివేయటం యథార్థం. అమెరికాలో రగిలిన విద్వేషాగ్ని తీవ్రతను తక్కువ చేయటానికి వీలు లేదు. అదే సమయంలో పరిస్థితి మన మీడియా భయపెడుతున్నంత దారుణంగానూ లేదు. అమెరికాలో 50 రాష్ట్రాలు, వాటిలో 30 లక్షల భారతీయులు ఉండగా మూడు వారాల్లో ఘోరమైన కాల్పులు జరిగింది కేవలం మూడుచోట్ల నలుగురి మీద. కాన్సస్‌లో శే్వతజాత్యహంకారి తుపాకి బారినుంచి మనవారిని రక్షించబోయి గాయపడ్డవాడు కూడా తెల్లతోలువాడే.

-సాక్షి