వీక్ పాయింట్

శభాష్ ఎంపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భళా సోదరా భళా!
మన ఎంపీల పరువు భలే బాగా నిలబెట్టావ్!
మన లెవెలేమిటో ‘చిల్లర మనుషులకు’ తెలిసొచ్చేట్టు చేశావ్!
‘ఎయిరిండియా’ డ్యూటీ ఆఫీసరెవడినో నువ్వు చెప్పుతో కొట్టావని గింజుకుని, దేశంలోని ఎయిర్‌లైన్లన్నీ కట్ట గట్టుకుని కత్తికట్టి, నిన్ను వాళ్లవిమానాల్లో ఎక్కనివ్వబోమని బ్యాన్ పెడితే ఏమైంది? చెప్పు దెబ్బలు తిన్నవాడికి క్షమాపణ చెబితేగాని మళ్లీ నిన్ను ఏ విమానంలోకీ ఎక్కనిచ్చేది లేదని వాళ్లు హుంకరించినంత మాత్రాన నువ్వు జంకావా? మీలాంటి చిల్లరగాళ్లు ఎంతమంది ఏకమై మీడియానిండా ఎంత అల్లరిపెడితే మాత్రం ది గ్రేట్ ఎంపీని అందునా శివసేన పులిబిడ్డను మీరేమి చేయగలరురా అని వెక్కిరించి, నువ్వు మీ పుణె నుంచి ఏకంగా ఒక చార్టర్డ్ ఫ్లయిటే తీసుకుని దర్జాగా పార్లమెంటుకు వచ్చావు గదా? ఎంపీ తలచుకుంటే ప్రైవేటు విమానాలకు కొదవా?
అయినా నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి? జనాలను తన్నటం ఎంపీల జన్మహక్కు. చట్టాలను చేసే మనం చట్టాలకు అతీతులం! ఆ మాత్రం కామన్‌సెన్సు లేకుండా రూల్సు మాట్లాడే ఆఫీసరుగాళ్లను మనం కాకపోతే ఎవరు శిక్షిస్తారు? ఇది కొత్తగా నీతోనే మొదలైందా? రాజంపేట వైకాపా ఎంపీ మన మిథున్‌రెడ్డి రెండేళ్లకింద తిరుపతి ఎయిర్‌పోర్టులో కౌంటరు క్లోజ్ అయిందని చెప్పి తన చుట్టాలకు బోర్డింగ్ పాసు ఇవ్వటానికి నిరాకరించినందుకు ఎయిరిండియా మేనేజరును లాగి లెంపకాయ కొట్టలేదా?
ప్రజాప్రతినిధుల రాజభోగాల సమస్త ఖర్చులూ ప్రజలే భరించాలి కాబట్టి గవర్నమెంటు బోలెడు ప్రజాధనం వెచ్చించి నీ తిరుగుళ్లకోసం బిజినెస్ క్లాసు ఎయిర్ టిక్కెట్లను తేరగా ఇచ్చింది. నీ అంతటివాడు విమానంలో అడుగుపెట్టాక నీ హోదాకు తగ్గట్టు బిజినెస్ క్లాసులో కూచోబెట్టవద్దా? ఆ పని చెయ్యకపోగా... నువ్వు నోరు తెరిచి అడిగినా... అది మొత్తం ఎకానమీ ఫ్లయిటే కాబట్టి, అందులో బిజినెస్ క్లాసు సీట్లు ఉండదని నీకే ఎదురు చెబుతారా?! విమానంలో ఆ బాపతు సీట్లు లేకపోతే ఏదో ఒకటి చేసి గాలిలో నుంచి పుట్టించయినా నీకు దర్జాసీటు అమర్చాలిగాని... కుదరదంటూ రూల్సు మాట్లాడతారా? అక్కడికీ మధ్యదారిలో నువ్వేమన్నా ఆగం చేశావా? ఢిల్లీ చేరేదాకా ఓపికపట్టి, అప్పుడు కదా నీ తడాఖా చూపించావ్? విమానం నుంచి దిగేది లేదని నలభై నిమిషాలకు పైగా బైఠాయించి... తిరుగు ప్రయాణం ఆలస్యమవుతోందంటూ వారించిన ఆఫీసరు చొక్కాచించి, లెక్కపెట్టి పాతిక చెప్పు దెబ్బలు కొట్టావ్ అంతేకదా? బుద్ధి చెప్పటం కోసం విమానాన్ని కదలనివ్వకుండా నలభై నిమిషాలపాటు అడ్డగించటంవల్ల నీకు కలిగిన వెలకట్టలేని టైమ్ వేస్టుతో పోల్చితే, విమానం ఎక్కడం కోసం బోర్డింగ్ గేటు దగ్గర నిలబడి కాళ్లు నొచ్చిన ముసలీ ముతకా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం ఒక లెక్కా? ఇదే ఇంకో దేశంలోనైతే - షెడ్యూలు ప్రకారం విమానాన్ని వెళ్లనివ్వకుండా అడ్డగించి, విమాన భద్రతకు ఇబ్బంది కలిగించినందుకు పోలీసులు అక్కడికక్కడే నిన్ను లాక్కెళ్లి లాకప్‌లో వేసి, ఏ ఇరవై ఏళ్ల జైలు శిక్షో వేయంచే వాళ్లనుకో! కాని ఇది మన ఇష్టారాజ్యమైన ఇండియా కదా?
పత్రికల్లో, చానెళ్లలో పొద్దస్తమానం ఎంత పంచాయతీ పెడితే మాత్రం నిన్ను ఏమి చేయగలిగారు? వారికేమి తెలుసు - మిగతా విషయాల్లో ఎంత కాట్లాడుకున్నా మన వైభోగాలను కాపాడుకోవటం దగ్గర మన ఎంపీల్లో గొప్ప ఐకమత్యం ఉంటుందని! జీతాలు, అలవెన్సులు అమాంతం పెంచుకోవటంలో లాగే మన ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకునే విషయంలోనూ పార్టీల తేడా లేకుండా మనందరిదీ ఒకటే కట్టు అని!! నీకు జరిగిన అపచారాన్ని సరిదిద్ది, విమానాలవాళ్లు పెట్టిన బ్యాన్‌ను వెంటనే ఎత్తేయించకపోతే మర్యాద దక్కదని మీ శివసేన సోదరులు గర్జిస్తే పార్లమెంటులో ఒక్కరైనా నోరెత్తారా? పౌరవిమానాల గజపతి మంత్రి ఎయిరిండియాని వెనకేసుకొచ్చి తమ దృష్టిలో ఎంపీ కూడా అందరు ప్రయాణికుల లాంటివాడేనని, భద్రత విషయంలో రాజీపడేది లేదని నీతులు వల్లిస్తే మీ పార్టీ ఎంపీలు ఎంత బాగా బుద్ధి చెప్పారు? సాటి మంత్రి అని అయినా చూడకుండా మీ మంత్రి అనంత్‌గీతేగారు నిండుసభలో గజపతి మీదకి వెళ్లి కొట్టబోయినంత పనిచేశాడు. నీ మీద నిషేధాన్ని ఎత్తేయకపోతే ముంబయలో విమానాలను తిరగనిచ్చేదే లేదంటూ మీ శివసేన ఎంపీలు ఎంత గొప్పగా శివాలెత్తారు? మీ పార్టీ బాసూ నీ కొమ్ముకాయటానికి అవసరమైతే సెంటర్లో అధికార కూటమి మీటింగును కూడా బహిష్కరించబోయాడు కదా? ఆఖరికి లోక్‌సభ స్పీకరాంబ కూడా సభలో మీవాళ్లు చేసిన ఆగమాగాన్ని పట్టించుకోకపోగా - విమానంలో తిరగనివ్వకపోతే ఎంపీ ఎలా పనిచేయగలడని సెలవిచ్చి నీ నోట్లో పంచదార పోసింది కదా? ఇంతమంది అండగా ఉన్నప్పుడు నిన్ను ఎవడేమి చేయగలడు?
ఏమైనా సోదరా! నీ తెలివే తెలివి. చెయ్యాల్సిందంతా చేశావ్. కొట్టాల్సిన చెప్పు దెబ్బలు కొట్టావ్! కట్టాల్సిన తాటాకులన్నీ కట్టాక వెనక జరిగిన దానికి విచారిస్తున్నానంటూ మంత్రి మొగాన ఓ ఉత్తరం పడేశావ్. విచారం మాత్రం వెలిబుచ్చి క్షమాపణ ఊసే ఎత్తకుండా ఎంచక్కా తప్పించుకున్నావ్. అదే మహద్భాగ్యమనుకుని విమానాలమంత్రి తన మాటల్ని తానే మింగేసి, తలకాయ తీసి జేబులో దాచుకుని ఎయిరిండియా వాణ్ని కేకేసి నీమీద నిషేధం అర్జంటుగా ఎత్తేయించేట్టు చేశావ్.
మొత్తానికి అందరం కలిసి, తలా ఒక చెయ్యివేసి మన సత్తా ఏమిటో నిరూపించాం. ఎయిర్‌లైన్ల కంపెనీలన్నీ కట్టకట్టుకుని దండెత్తినా, లోకులు, మీడియా పలుగాకులు ఎంత గోల పెట్టినా బరి తెగించిన మనల్ని ఏమీ చేయలేరని చాటాం. ఇక్కడితో ఆగకూడదు. మనం ఎవర్ని ఎన్ని డజన్ల చెప్పు దెబ్బలు కొట్టినా, మనల్ని విమానం ఎక్కకుండా ఎవడూ అడ్డుకోలేడని అర్థమైంది కనుక మనం ఇంకా ముందుకు పోదాం. ఎయిర్‌లైన్సు, ఎయిర్‌పోర్టుల ఉద్యోగస్థులననే ఏమిటి; తమ తాహతేమిటో గుర్తించి మనం చెప్పినట్టల్లా నడచుకోకపోతే విమానాల పైలట్లనే చెప్పుదెబ్బలు కొడదాం. దారిలో మన ఇష్టమైన చోటల్లా విమానాలను దింపమందాం. మనం కోరిన వాళ్లనల్లా ఎక్కించుకోమందాం. వినకపోతే చితక్కొడదాం.
ఔనూ! అసలు ఈ చిల్లరగాళ్లతో కలిసి విమాన ప్రయాణాలు మనమెందుకు చెయ్యాలి? మొన్న నువ్వు చేసినట్టు మనందరం ఇక చార్టర్డ్ ఫ్లయిట్లలోనే ఎందుకు తిరగకూడదు? మన చేతిలోపనే కనుక అందరం కూడబలుక్కుని ఆ మేరకు ఓ బిల్లు పాసు చేయించుకుంటే పోలా? ప్రజల సొమ్ము ఉన్నది ప్రజలకు అల్లుళ్లమైన మనం విలాసంగా ఖర్చు పెట్టుకోవడానికి కాకపోతే ఇంకెందుకు?

-సాక్షి