బిజినెస్

లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు * ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు రూ.5,850 కోట్లు
ముంబయి, ఫిబ్రవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్‌లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో యూరోజోన్ సంక్షోభ నివారణ దిశగా అడుగులు పడుతుండటం, జర్మనీ, జపాన్ దేశాల తయారీ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధిరేటు దేశీయ మార్కెట్లకు కలిసొస్తోంది. అదీగాక దేశీయంగా వివిధ రంగాల్లోని సంస్థల త్రైమాసిక ఫలితాలు బాగుండటంతో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా వరుసగా ఐదో వారంలోనూ మార్కెట్లు లాభాలనే నమోదు చేశాయి. ముఖ్యంగా సెనె్సక్స్ ఈ ఐదు వారాల్లో 2,150.04 పాయింట్లు పెరిగింది. సెప్టెంబర్ 2010 తర్వాత వరుసగా ఐదు వారాలు మార్కెట్లు లాభాల్లో కదలాడటం, ఈ స్థాయిలో సూచి పెరగడం ఇదే మొదటిసారి. కాగా, గడిచిన వారంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ 371 పాయింట్లు వృద్ధి చెంది 17,604.96 వద్ద స్థిర పడగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ 121 పాయింట్లు పెరిగి 5,325.85 వద్ద నిలిచింది. ఇటీవలికాలంలో భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న సంకేతాలు వెలువడటం విదేశీ మదుపర్లలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఫిబ్రవరి 2 వరకు మార్కెట్‌లోకి విదేశీ నిధుల వరద విలువ రూ.15,230.30 కోట్లుగా ఉంటే, గడిచిన వారం రోజుల్లోనే భారత మార్కెట్‌లో రూ.5,850 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు కుమ్మరించారు. దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ట్రేడ్ అవడంతో క్రిందటి వారంలో మదుపర్ల సంపద రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఫిబ్రవరి 3 వరకు చూస్తే ఈ విలువ రూ.8.59 లక్షల కోట్లుండటం గమనార్హం. ఇక అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ ఈ మూడో త్రైమాసికంలో మంచి లాభాలను నమోదు చేయడం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి రూ.7,900 కోట్ల మూల ధనాన్ని సమకూర్చుతామని ప్రభుత్వం ప్రకటించడం మార్కెట్‌ను చాలా వరకూ ఆదుకున్నాయి. దీంతోపాటే రిలయన్స్ బైబ్యాక్ షేర్ల అంశం, ద్రవ్యోల్బణ గణాంకాలు అదుపులో ఉండటం, ఆటో అమ్మకాల్లో వృద్ధి వంటివి మార్కెట్లను లాభాల్లో నడిపించాయి.
Add new comment