ఈ వారం స్పెషల్

ప్రతిష్ఠాత్మక పురస్కారం సృజనకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటే...
సగటు భారతీయ ప్రేక్షకుడికి ఓ కాలక్షేపం.
ఓ సరదా.. ఓ వేడుక..
కానీ- కొందరికి అదే జీవితం..
ఊహకు.. ఆలోచనకు..
వాస్తవానికి, భవిష్యత్‌కు లంకెవేసి, లంగరేసి
సెల్యులాయిడ్ రూపం ఇవ్వడానికి వారు పడే తపనకు కొలమానం లేదు. అలా పరితపించినవారికి.. ఫలితాలు సాధించినవారికి దక్కే గౌరవమే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.
భారతీయ సినీరంగానికి వనె్నలద్దిన ఫాల్కే పేరిట ఇచ్చే అవార్డు చిత్రసీమకు మణిమకుటం లాంటిది. ఆ కిరీటం కోసం వేచిచూసేవారెందరో ఉన్నారు. అది దక్కడం అంత సులువేం కాదు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విజేత దేవికారాణి నుంచి ఈఏటి మేటినటుడు మనోజ్‌కుమార్ సినీజీవితాన్ని మధిస్తే తెలుస్తుంది.. వారి గొప్పతనమేమిటో.. ఆ పురస్కారం విశిష్ఠత ఎలాంటిదో..
ప్రేక్షకుడికి ఏం కావాలో, ఏం చెప్పాలో, ఏం చూపాలో, ఎలా ఆవిష్కరించాలో ఊహించి రూపమివ్వడం తేలికైన పనికాదు. 24 విభాగాల సమాహారం ప్రేక్షకుడి మనసును తాకకపోతే ఉపయోగం ఉండదు. ఇప్పుడున్న హంగులు, ఆర్భాటాలు, సాంకేతిక సౌకర్యాలు, పెట్టుబడులు అందుబాటులో లేని రోజుల్లోనూ చిత్రసీమపై మెరిసిన మహానుభావులు అపురూపమైన ఆవిష్కరణలు ఎన్నో చేశారు. తపించి, శోధించి ప్రయోగాలు చేశారు. కట్టుబాట్లు, సంప్రదాయాలను గౌరవిస్తూనే ప్రయోగాలు చేశారు. మూకీ, టాకీ, బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమాస్కోప్, 70 ఎంఎం, త్రీడీ, డాల్బీ సౌండ్, గ్రాఫిక్స్ మాయాజాలం.. ఇలా అడుగడుగునా ఆధునికతను పుణికి పుచ్చుకుంటూ- ఇప్పుడు ‘డిజిటల్ హవా’ నడుస్తోంది. ఇవేవీ అందుబాటులో లేనిరోజుల్లో.. కేవలం మెదడుకు పదునుపెట్టి సమాజాన్ని ముందుకు నడిపించేందుకు కృషిచేసిన మాధ్యమం సినిమా. ఆ వెండితెరపై వెలిగినవారి సరసన మన ‘మిస్టర్ భరత్‌కుమార్’ కూడా చోటు దక్కించుకున్నారు.
సృజనశీలి ఫాల్కే..
భారతీయ చలనచిత్రసీమలో ‘దాదాసాహెబ్ ఫాల్కే’గా ప్రసిద్ధి చెందిన ధూండిరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్టల్రోని త్రయంబక్‌లో 1870, ఏప్రిల్ 30న ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి సంస్కృత పండితుడు కావడంతో ఫాల్కేకు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి కలిగింది. ముంబయిలోని సర్ జమ్‌షెడ్జీ జీజీభాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో 1885లో చేరారు. అక్కడ అయిదేళ్ల చదువు పూర్తయ్యాక 1890లో వదోదరలోని మహారాజా శివాజీరావు విశ్వవిద్యాలయంలో చేరి శిల్పకళ, చిత్రలేఖనం, సివిల్ ఇంజనీరింగ్, ఫొటోగ్రఫీని నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన గోధ్రాలో ఫొటోగ్రాఫర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలోనే ప్లేగు వ్యాధి ప్రబలి తన భార్య, కుమారుడు మరణించడంతో ఆయన గోధ్రాను వదిలివెళ్లిపోయారు. ఫొటోగ్రఫీ వృత్తికి స్వస్తి చెప్పాక జర్మన్ ఐంద్రజాలికుడు కార్ల్ హెర్జ్‌ను కలుసుకుని అతని వద్ద కొన్నాళ్లు ఉపాధి పొందారు. అనంతరం భారత పురావస్తు శాఖలో డ్రాఫ్ట్స్‌మేన్‌గా చేరారు. అక్కడ పని ఒత్తిడి అధికం కావడంతో ముద్రణ (ప్రింటింగ్) రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ముద్రణ రంగంలో కొత్త పద్ధతులను ఆకళింపు చేసుకుని ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ వద్ద కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత సొంతంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ప్రారంభించి, ఆధునిక సాంకేతిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఫాల్కే జర్మనీ వెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణలో భాగస్వాముల నుంచి సమస్యలు ఎదుర్కొనడంతో ఆయన చలనచిత్ర రంగంవైపు దృష్టి సారించారు. ‘ది లైఫ్ ఆఫ్ క్రిస్ట్’ అనే మూకీ సినిమా చూశాక, ఎలాగైనా ఓ చలనచిత్రాన్ని నిర్మించాలన్న సంకల్పం ఆయనలో కలిగింది. ‘రాజా హరిశ్చంద్ర’ పేరిట సినిమా నిర్మాణాన్ని 1912లో ప్రారంభించి, దాన్ని 1913 మే 3న ముంబయిలోని ‘కరొనేషన్ సినిమా’ థియేటర్‌లో ప్రదర్శింపజేశారు. ఇలా ఆయన భారతీయ తొలి సినిమా రూపకర్తగా చరిత్రలో నిలిచారు. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో ఫాల్కే అప్పటి సామాజిక పరిస్థితులపై ఎన్నో మూకీ (సంభాషణలు లేని) చిత్రాలను నిర్మించారు. ప్రజలకు సమకాలీన పరిస్థితులపై అవగాహన కల్పించాలన్నా, విజ్ఞానం, వినోదం అందించాలన్నా సినిమా ఒక బలమైన మాధ్యమం అని నమ్మిన ఆయన తన సృజనను రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. వాణిజ్యపరంగానూ సినిమా రంగం లాభదాయకమన్న ఆలోచనను వ్యాపారవేత్తల్లో కలిగించారు. సినిమాలను నిర్మించడం ఓ పరిశ్రమగా వర్ధిల్లుతుందని ఆయన ముందుగానే ఊహించారు.
హిందుస్థాన్ ఫిల్మ్స్ ఆవిర్భావం..
అయిదుగురు వ్యాపారవేత్తలతో కలిసి ఫాల్కే ముంబయిలో ‘హిందుస్థాన్ ఫిల్మ్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. మిగతా భాగస్వాములంతా సినిమాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టగా, సృజనాత్మక విషయాలన్నింటినీ ఆయనే స్వయంగా చూసుకునేవారు. నటులు, సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు మోడల్ స్టూడియోను ఏర్పాటు చేశారు. భాగస్వాముల నుంచి సమస్యలు తలెత్తడంతో ‘హిందుస్థాన్ ఫిల్మ్స్’ నుంచి 1920లో తప్పుకున్నారు. నిపుణుల పర్యవేక్షణ లేకపోవడంతో ‘హిందుస్థాన్ ఫిల్మ్స్’ ఆర్థిక ఇబ్బందుల్లో పడగా ఫాల్కే మళ్లీ ఆ సంస్థలో చేరాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటుకున్నా, అక్కడి పరిస్థితులతో వేగలేక బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. 1937లో సినీరంగం నుంచి నిష్క్రమించే వరకూ తన 19 ఏళ్ల కెరీర్‌లో పాల్కే 95 సినిమాలను, 26 డాక్యుమెంటరీలను నిర్మించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ‘రాజా హరిశ్చంద్ర’ (1913), ‘మోహినీ భస్మాసుర’ (1913), ‘సత్యవన్ సావిత్రి’ (1914), ‘లంకా దహన్’ (1917), ‘శ్రీకృష్ణ జన్మ’ (1918), ‘కాళీయ మర్దన్’ (1919), ‘బుద్ధదేవ్’ (1923), ‘సేతు బంధన్’ (1932), ‘గంగావతరణ్’ (1937) వంటివి ఆయన సృజనాత్మకతకు అద్దం పట్టాయి.
సమస్యలకు ఎదురీది..
సాంకేతిక నైపుణ్యం అప్పుడే అడుగుపెడుతున్న సమయంలో ‘మూకీ’లను నమ్ముకుని ఫాల్కే తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అంత సులువుకాదని, అది ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని భావించి తనదైన పంథాలోనే సాగిపోయారు. ‘టాకీల’ యుగం మొదలయ్యాక పాత పద్ధతుల్లో పరుగులు తీయడం కష్టమేనని తెలిసినా ఫాల్కే తాను నమ్మిన సిద్ధాంతాలను వీడలేదు. మూకీల ద్వారా అద్భుతాలను ఆవిష్కరించిన ఈ వ్యక్తి భారతీయ సినీరంగ పితామహుడవుతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఆయన నిర్మించిన చివరి మూకీ ‘సేతు బంధన్’ 1932లో విడుదలైంది. ఆ తర్వాత అదే సినిమాను ‘డబ్బింగ్’ హంగులతో విడుదల చేశారు. సినీరంగం నుంచి తప్పుకుని జీవిత చరమాంకాన్ని నాసిక్‌లో గడపడానికి వెళ్లేముందు ఆయన నిర్మించిన టాకీ సినిమా ‘గంగావతరణ్’ 1937లో విడుదలైంది. నాసిక్‌లోనే ఆయన 1944 ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి చెందిన ఫాల్కే గౌరవార్థం 1971లో పోస్టల్ స్టాంప్‌ను భారత ప్రభుత్వ విడుదల చేసింది.
మళ్లీ సినిమా తీస్తా: మనోజ్‌కుమార్
‘నేను నిద్రపోతూంటే స్నేహితులు ఒక్కొక్కరూ ఫోన్లు చేసి, ఫాల్కే అవార్డు వచ్చిందని చెబితే నమ్మలేదు. వారంతా నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నా. కానీ, టీవీలో వార్తలు చూశాక అది నిజమేనని తేలింది. పట్టలేని ఆనందం కలిగింది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నా. నా జీవితంలో సాధించినదానికి దక్కిన ప్రతిఫలం ఇది. నా కుటుంబం కూడా ఎంతో సంతోషపడింది. ఈ దేశ పౌరులకు, ప్రభుత్వానికి రుణపడి ఉన్నా. గతంలో నేను ఏం చేశానో, భవిష్యత్‌లో అది కొనసాగించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తా. దేశాన్ని ఉన్నతస్థానానికి తీసుకువెళుతున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. జనజీవన స్రవంతికి దూరంగా ఉండిపోవడం నా పొరపాటు. భవిష్యత్‌లో మరింత చురుగ్గా ఉండేందుకు ఓ సినిమా తీయాలనుకుంటున్నా.. అదీ త్వరలోనే..’ అన్నారు ఫాల్కే అవార్డుకు ఎంపికైన అలనాటి నటుడు మనోజ్‌కుమార్.
ఇప్పటి పాకిస్తాన్‌లోని అబొటాబాద్‌లో పుట్టి దేశవిభజన సమయంలో భారత్‌కు వలస వచ్చిన మనోజ్‌కుమార్ ఆ తరువాతి కాలంలో సినిమాల్లోకి వచ్చారు. దేశభక్తి ఇతివృత్తంగా తీసి, నటించిన సినిమాలతో ఆయన ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేశారు. హేమాహేమీలతో సినిమాలు నిర్మించారు. ఉప్‌కార్, హరియాలి ఔర్ రాస్తా, వోహ్ కౌన్ థీ , హిమాలయ్‌కి గోడ్‌మీన్, క్రాంతి వంటి హిట్స్ అందించిన మనోజ్‌కుమార్‌ను అప్పటి ప్రధాని లాల్‌బహుదూర్ శాస్ర్తీ ‘జైజవాన్ జై కిసాన్’ స్ఫూర్తితో ఓ సినిమా తీయాలని కోరారంటే మనోజ్ గొప్పదనమేంటో తెలుస్తుంది. దిలీప్‌కుమార్ అంటే తెగఇష్టపడే ఆయన ఓ సినిమాలో దిలీప్ పాత్ర పేరు మనోజ్‌కుమార్‌నే తన పేరుగా మార్చుకున్నారు. నిజానికి సినిమాల్లో భరతమాత ముద్దుబిడ్డగా నటించి మెప్పించిన మనోజ్‌ను అందరూ ‘మిస్టర్ భరత్‌కుమార్’ అని ముద్దుగా పిలుచుకునేవారంటే ఆయన ఎంతటి ప్రభావం చూపారో తెలుస్తుంది. నిజానికి అతని అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. ‘మైదాన్ ఇ జంగ్’ (1995)లో చివరిసారిగా నటించిన ఆయన ఆ తరువాత సినీరంగానికి దూరంగా ఉండిపోయారు. అయితే ఫాల్కే అవార్డు వచ్చిన స్ఫూర్తితో మళ్లీ చిత్రరంగంలో కాలుపెడతానని అంటున్నారు. వివాదాలతో వేడెక్కిన భారతావనికి మనోజ్ తీసే దేశభక్తి సినిమా కొత్తస్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.
ఇదీ ఎంపిక కమిటీ
దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ఎవరికివ్వాలన్న అంశాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేస్తుంది. ఇందులో నిష్ణాతులైన ప్రముఖులను సభ్యులుగా నియమిస్తారు. ఈసారి ఐదుగురు సభ్యులతో జ్యూరీని నియమించారు. బాలీవుడ్ ప్రముఖులు లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, సలీమ్‌ఖాన్, నితిన్ ముఖేష్, అనూప్ జలోటలతో కూడిన జ్యూరీ మనోజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
ఇప్పటికి 47 మంది..
మన దేశంలో సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును 1969లో ఏర్పాటు చేశారు. పురస్కార గ్రహీతకు పది లక్షల రూపాయల నగదు, స్వర్ణ కమలం, శాలువాను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ సినీరంగ పితామహుడిగా ప్రఖ్యాతి పొందిన దాదాసాహెబ్ ఫాల్కే (్ధండిరాజ్ గోవింద్ ఫాల్కే) స్మృత్యర్థం ఈ అవార్డును నెలకొల్పారు. 1969లో ఈ అవార్డును తొలిసారిగా దేవికారాణికి ప్రకటించగా, దీన్ని అందుకుంటున్న 47వ వ్యక్తిగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్‌కుమార్‌ను కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నియమించే సినీ ఉత్సవాల కమిటీ ఫాల్కే పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. ఫాల్కే అవార్డు గ్రహీతల వివరాలు..
1970- దేవికారాణి, 1971- బీరేంద్రనాథ్ సర్కార్, 1972- పృథ్వీరాజ్ కపూర్, 1973- పంకజ్ మాలిక్, 1974- రూబీ మైర్స్, 1975- బిఎన్ రెడ్డి, 1976- కనన్ దేవి, ధీరేంద్రనాథ్ గంగూలీ, 1978- నితిన్ బోస్, 1979- రైచంద్ బోరల్, 1980- సోరబ్ మోదీ, 1981- పైడి జైరాజ్, 1982- నౌషద్, 1983- ఎల్‌వి ప్రసాద్, 1984- దుర్గా ఖోటే, 1985- సత్యజిత్ రే, 1986- వి.శాంతారాం, 1987- బి.నాగిరెడ్డి, 1988- రాజ్‌కపూర్, 1989- అశోక్‌కుమార్, 1990- లతా మంగేష్కర్, 1991- అక్కినేని నాగేశ్వరరావు, 1992- భల్జీ పెండార్కర్, 1993- భూపేన్ హజారికా, 1994- మజ్రూహ్ సుల్తాన్‌పురి, 1995- దిలీప్‌కుమార్, 1996- రాజ్‌కుమార్, 1997- శివాజీ గణేశన్, 1998- కవి ప్రదీప్, 2000- హృషీకేశ్ ముఖర్జీ, బిఆర్ చోప్రా, 2001- ఆశా భోంశే్ల, 2003- యశ్ చోప్రా, దేవానంద్, 2005- ఆదూర్ గోపాలకృష్ణన్, మృణాల్ సేన్, 2007- శ్యామ్ బెనగల్, 2008- తపన్ సిన్హా, 2009- మన్నాడే, 2010- డి.రామానాయుడు, వికె మూర్తి, 2011- కె.బాలచందర్, 2012- సౌమిత్రా చటర్జీ, 2013- ప్రాణ్, 2014- గుల్జార్, 2015- శశికపూర్, 2016- మనోజ్‌కుమార్. 1970లో ఈ అవార్డులను నెలకొల్పినప్పటికీ 1977, 1999, 2002, 2004, 2006లో పురస్కారాలకు ఎవరినీ ఎంపిక చేయలేదు. 1976, 2000, 2003, 2005,2010లో ఇద్దరేసి సినీ ప్రముఖులు ఫాల్కే అవార్డులు వరించాయి. బాలీవుడ్ దిగ్గజం పృథ్వీరాజ్ కపూర్‌కు మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించగా, ఆయన కుమారుడు రాజ్‌కపూర్ అవార్డును అందుకున్నారు.
*

తొలి విజేత...దేవికారాణి
విశాఖలో పుట్టి...వెండితెర వేల్పుగా ఎదిగి..
ముద్దు సన్నివేశంతో సంచలనం
మనదేశంలో సినీరంగానికి విశిష్ట సేవలందించినవారికి ఇచ్చేందుకు భారతప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు. కేంద్రప్రభుత్వం తరపున సమాచార ప్రసారశాఖ ఈ అవార్డును బహూకరిస్తుంది. ఈ అవార్డును 1969లో ఏర్పాటు చేశారు. కాగా, తొలిసారి అలనాటి మేటినటి దేవికారాణిని వరించింది. ఇప్పటి తరానికి ఆమెగురించి పెద్దగా తెలియకపోవచ్చుగానీ దేశవిదేశాల్లో సినీరంగంపై చెరగని ముద్రవేసిన ఆమె విశిష్టతలు తెలుసుకోవల్సిందే. 1930-40 దశకంలో ఆమె ‘వెండితెర వేలుపు’గా వెలిగిపోయింది. ఇండియన్ సినిమాలో ‘్ఫస్ట్‌లేడీ’గా ఖ్యాతి గడించింది. బిబిసి సహా అంతర్జాతీయంగా పేరుమోసిన మీడియా సంస్థలు ఆమె చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించి, ఆమె ఇంటర్వ్యూలను ప్రసారం చేసేవంటే ఆమె ఖ్యాతి ఎంతటిదో తెలుస్తుంది. స్వాతంత్ర సమరయోధుడు, కవి, నోబెల్ పురస్కార విజేత రవీంద్రనాథ్ ఠాగూర్‌కు మునిమనవరాలైన దేవికారాణి మన విశాఖపట్నం (వాల్తేరు)లో 1908 మార్చి 30న పుట్టింది. ఆ తరువాత బ్రిటన్‌కు వెళ్లి అక్కడే చదువుకుంది. ఆర్కిటెక్చర్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ చదివాక ఆమెకు 1928లో సినీనిర్మాత, ప్రయోక్త హిమాంశు రాయ్‌తో పరిచయం అయింది. కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో ఆమె నైపుణ్యం చూసిన రాయ్ తన సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆహ్వానించాడు. ఆ తరువాత జర్మనీ తదితర దేశాల్లో పర్యటించి సినీకోర్సుల్లో చేరి తన ప్రతిభకు సానపట్టింది. ఆ తరువాత ‘ది త్రో ఆఫ్ డైస్’ (1929) నిర్మాణంలో తోడుకలసింది. అదే ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 1933లో తీసిన ‘కర్మ’ భారత్‌లో తొలి ఇంగ్లీష్ టాకీ. విదేశాల్లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా భారత్‌లో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో ఆమె ఇంగ్లీషులో ఓ పాటకూడా పాడింది. బాలీవుడ్‌లో తొలి ఇంగ్లీషుపాటగా అది రికార్డు సృష్టించింది. ఆ తరువాత 1934లో దీనిని హిందీలోనూ ‘నాగినీకి రాగిణి’గా విడుదల చేసినా ప్రేక్షకజనాదరణ కరవైంది.
కర్మ సినిమాలో ఓ సన్నివేశంలో హిమాంశురాయ్‌ను ఆమె ముద్దుపెట్టుకుంటుంది. ఇది ఏకంగా నాలుగు నిమిషాలపాటు ఉంటుంది. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. 2004 వరకు అంత సుదీర్ఘ సమయంపాటు ముద్దుసన్నివేశం మరే సినిమాలోనూ లేదు. 1940లో భర్త హిమాంశురాయ్ మరణించడంతో ఆమె ఏకాకిగా మిగిలిపోయింది. ఐదేళ్ల తరువాత రష్యన్ చిత్రకారుడు స్వతోత్సవ్ రోయ్‌రిస్‌ను వివాహమాడింది. 1993లో రోయ్‌రిస్, ఆ మరుసటి ఏడాది దేవికా రాణి కన్నుమూశారు. 85 ఏళ్ల వయసులోనూ ఆమె తనదైన శైలిలో జీవితం గడిపారు. జీవిత చరమాంకంలో బెంగళూరులో గడిపిన ఆమెకు పిల్లలు లేరు. దీంతో వందల కోట్ల విలువైన రూపాయల ఆస్తి ప్రభుత్వం పరమైంది. ‘కర్మ’, ‘జవానీకి హవా’, ‘జీవన్‌సయ్’, ‘ప్రభాత్’, ‘ఇజ్జత్’, ‘ప్రేమ్‌కహాని’, ‘నిర్మల’, ‘వచన్’, ‘దుర్గ’, ‘అంజాన్’, ‘హమారీబాత్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఆమెకు 1958లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. 1969లో తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కైవసం చేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీనాయుడి ప్రశంసలు అందుకున్న దేవికారాణి- అరుదైన అందచందాలకు, అభినయానికి, ఆకర్షణకు, సాహసానికి, ప్రతిభకు చక్కటి ఉదాహరణ అని ‘ది టెలిగ్రాఫ్’ సహా ఎన్నో పత్రికలు కొనియాడాయి.

తెలుగువాళ్లకూ దక్కిన ఖ్యాతి
భారతీయ సినీ పరిశ్రమలో తెలుగువారి పాత్ర తక్కువేమీ కాదు. చలనచిత్ర నిర్మాణంలో తెలుగు పరిశ్రమ వాటా ఎక్కువే. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు మనవాళ్లకూ దక్కాయి. ఎన్టీఆర్ వంటి అసమాన ప్రతిభాపాటవాలున్నవారికి దక్కకపోవడం దురదృష్టకరమే అయినా మరికొందరు ప్రముఖులను ఆ అవార్డు వరించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దిశానిర్దేశం చేసిన బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (బిఎన్ రెడ్డి)కి 1974లో ఈ పురస్కారం లభించింది. 15 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ‘డాక్టర్ ఆఫ్ లెటర్స్’ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ సినీ ప్రముఖునిగా ఖ్యాతిగడించారు. భారతదేశంలో మూడో అత్యున్నత పౌరపురస్కారంగా భావించే పద్మభూషణ్‌ను తొలిసారి అందుకున్న చిత్ర ప్రముఖుడిగా మన్ననపొందారు. తెలుగువాడైనప్పటికీ హిందీ చలనచిత్ర సీమలో ప్రతిభ చూపిన పైడి జయరాజ్‌కు ఈ అవార్డు 1980లో దక్కింది. ఏకంగా 11 మూకీ సినిమాల్లో నటించిన జయరాజ్ సరోజినీ నాయుడికి దగ్గరి బంధువు. కరీంనగర్ జిల్లాకు చెందిన జయరాజ్ సినీరంగంలోకి అడుగుపెట్టాక ముంబైలో స్థిరపడి అక్కడే కన్నుమూశారు. టాకీ సినిమాయుగం ప్రారంభమయ్యాక ‘షికారి’ సినిమాను హిందీ, ఉర్దూల్లో రూపొందించి నటించిన ఆయన హేమాహేమీలతో కలసి పనిచేశారు. 1982లో నటుడు, నిర్మాత, దర్శకుడిగా పేరుపొందిన ఎల్.వి.ప్రసాద్‌కు ఫాల్కె అవార్డు లభించింది. 1931లో ఒకేసారి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ‘అలమ్ ఆరా’, ‘కాళిదాస్’ వంటి చిత్రాలను రూపొందించి ఒకేసారి విడుదల చేసిన ఖ్యాతి ఆయనది. ప్రసాద్ స్టూడియోస్ అధినేతగానూ ఆయన రాణించారు. 1986లో నిర్మాత బి.నాగిరెడ్డిని ఈ పురస్కారం వరించింది. విజయవాహిని స్టూడియో అధినేత అయిన ఈయన 1950 దశకంలో అద్భుతమైన సినిమాలు రూపొందించారు. అప్పట్లో ఈ స్టూడియో ఆసియాలోనే అతిపెద్ద, అత్యాధునిక సౌకర్యాలున్నదిగా ఖ్యాతి గడించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 50 సినిమాలు రూపొందాయి. 1990లో తెలుగువారి ఆరాధ్యనటుడు అక్కినేని నాగేశ్వరరావును ఈ అవార్డు వరించింది. దాదాపు 250 సినిమాల్లో నటించిన ఆయన స్టూడియో అధినేతగా పలు సినిమాలు నిర్మించారు. ఇక 2009లో నిర్మాత, దర్శకుడు, నటుడిగా పనిచేసిన డి.రామానాయుడు 9 భాషల్లో చిత్రాలను నిర్మించి గిన్నిస్ రికార్డు సాధించారు. 130 సినిమాలు నిర్మించిన ఆయన దాదాపు 50 ఏళ్లపాటు సినీరంగానికి సేవలందించారు. తెలుగువాడు కానప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలు అందించి ఆప్తుడైన కె.బాలచందర్‌నూ దాదాసాహెబ్ ఫాల్కె పురస్కారం వరించింది.

-మాధురి