వీక్లీ సీరియల్

డార్క్ అవెన్యూ-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసిపి అవినాష్ క్రైమ్ సీన్ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించాడు. డార్క్ అవెన్యూ వైపు చూశాడు. స్మశానంలో కాలుతోన్న చితిలా వుంది ఆ ఇల్లు.
అటువైపు అడుగులు వేశాడు.. మీడియా కూడా అటువైపు పరుగులు పెట్టింది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఓ క్యాబ్ వచ్చి ఆగింది. అందులో నుంచి సమీర్ భార్గవి దిగారు. అక్కడ వున్న హడావుడిని చూశారు. అంబులెన్స్‌లోకి దుర్జన్‌కుమార్‌ను స్ట్రెచర్ మీద ఎక్కిస్తున్నారు.
సమీర్ ముందుకు నడిచాడు. భార్గవి సమీర్‌ను అనుసరించింది.
చాలాకాలం తరువాత తన స్నేహితురాలిని ఒక అపరిచితురాలిలా పరిచయం చేసుకోబోతుంది. చూడకూడని పరిస్థితిలో చూడబోతుంది.
* * *
మీడియా పోలీసు అధికారులు జనం డార్క్ అవెన్యూ దగ్గర నిలబడి వున్నానరు. పోలీసులు తలుపు తట్టారు. చాలాసేపటి వరకు తలుపు తెరచుకోలేదు.
‘సర్.. తలుపులు తెరవడం లేదు.. ఏం చేద్దాం?’ డిసిపి అవినాష్‌ను అడిగాడు ఒక పోలీసు అధికారి.
సరిగ్గా అప్పుడే మెల్లిగా ఒక తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఆ తలుపు సందులో నుంచి ఒక తల బయటకు వచ్చింది. బయట నిలబడి వున్న వారి వైపు భయంగా చూస్తూ ‘ఎవరు మీరు.. మీరెందుకు వచ్చారు? ఆ సైతాన్ పంపించాడా...?’ భయంగా కళ్లు పెద్దవి చేసి అడిగింది చంద్రప్రభ.
‘ముందు మీరు తలుపులు తెరవండి.. లేదంటే తలుపులు బద్దలు కొట్టవలసి వస్తుంది’ డిసిపి అవినాష్ తన అధికార దర్పం చూపించాడు.
‘అలా అయితే నేను మా దెయ్యాలకు చెబుతాను.. మీతో పచ్చి’ అని చంద్రప్రభ తలుపు వేయబోయింది. వెంటనే ఇద్దరు పోలీసులు తలుపులు బలంగా నెట్టి లోపలికి అడుగుపెట్టి హడలిపోయారు. లోపల ముగ్గు వేసి ఉంది.. పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు.. యాభై దాటిన చంద్రకళ వెంట్రుకలు విరబోసుకుని ఉంది...
లోపలికి తోసుకువచ్చిన జనం అక్కడి వాతావరణం చూసి బెదిరిపోయారు. చంద్రప్రభ ఓ మూలకు వెళ్లి నేల మీద ముడుచుకుని కూచుంది.
చంద్రలేఖ హాలులోకి వచ్చింది. అందరి వైపూ చూసింది. డిసిపి అవినాష్ చంద్రలేఖ వైపు చూసి, తరువాత వహీద్ వైపు చూసి ‘వీళ్లలో రాత్రి స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు?’ అని అడిగాడు.
వహీద్ చంద్రలేఖ వైపు చేతిని చూపించాడు. డిసిపి చంద్రలేఖ వంక చూసి ‘నువ్వు రాత్రి పోలీసుస్టేషన్‌కు వచ్చావా?’ అని అడిగాడు.
‘వచ్చాను’ అన్నట్టు తలూపింది చంద్రలేఖ.
‘ఎందుకు?’ డిసిపి అడిగాడు.
కళ్లు పెద్దవి చేసి భయం భయంగా తన కళ్లను గుండ్రంగా తిప్పుతూ ‘నన్ను ఓ బ్యాడ్ దెయ్యం రేప్ చేస్తానని బెదిరించింది’ చెప్పింది.
డిసిపి షాకింగ్‌గా ఆమె వైపు చూసి ‘దెయ్యం ఫోన్‌లో బెదిరించిందా? ఎప్పుడు?’ ఆమె మానసిక స్థితిని అంచనా వేస్తూ అడిగాడు.
‘నిన్న మొన్న అంతకు మొన్న...’ అంది.
‘నీ ఫోన్ ఇవ్వు.. ఏ నంబర్ నుంచి బెదిరించింది?’
‘దెయ్యం నంబర్ నుంచే బెదిరించింది’
‘దెయ్యం నంబర్ నుంచా?’ చంద్రలేఖ ఫోన్ లాక్కున్నాడు. అది లాక్ అయి ఉంది.. ఫింగర్ లాక్...
‘లాక్ ఓపెన్ చెయ్’ అన్నాడు.
‘అది నేను ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. దెయ్యమే ఓపెన్ చేయాలి.. దెయ్యం ఫింగర్‌తోనే ఓపెన్ అవుతుంది’ చెప్పింది.
అవినాష్ అందరి చేతివేళ్లను స్మార్ట్ ఫోన్ మీద పెట్టి చూసాడు...
‘ఒకవేళ నంబర్‌తో లాక్ అయి ఉండొచ్చు సర్’ అన్నాడు ఒక పోలీస్.
‘నీతో వచ్చిన సిఐని ఏం చేసావు?’ అడిగాడు డిసిపి.
‘నేనేం చేయలేదు పాపం సిఐ... ఆ దెయ్యం నన్ను రేప్ చేయబోతుంటే వద్దన్నాడు. దెయ్యానికి కోపం వచ్చింది. నాకు భయం వేసి పారిపోయి ఇంటికి వచ్చాను... మరి దెయ్యం ఏం చేసిందో?’ భయంగా అంది.
డిసిపికి బుర్ర తిరిగిపోతోంది. మీడియా తన పని తాను చేసుకుపోతోంది. తమ ఛానెల్ రేటింగ్‌కు కెమెరా ఎక్కడ పెట్టాలో.. వీటిని షూట్ చేయాలో చేస్తూనే వుంది... ముగ్గురినీ క్లోజప్‌లో షూట్ చేస్తున్నారు.
గట్టిగా అరిచింది చంద్రకళ.. ‘మీరంతా వెళ్లిపొండి.. దెయ్యాలు మమ్మల్ని కొడతాయి.. వెళ్లిపొండి’ అని అరుస్తూ వుంది.
‘సర్ ఈ ఇంట్లో వున్నవాళ్లు మానసిక పరిస్థితితో బాధపడుతున్నారని.. వీళ్ల మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రభుత్వ డాక్టర్ సర్ట్ఫికెట్ కూడా ఇచ్చాడు’ వహీద్ చెప్పాడు.
‘మరైతే మన సిఐను అంతలా గాయపరచింది ఎవరు?’ డిసిపి ఆలోచనగా అడిగాడు.
‘ఆ విషయం సిఐ సర్‌కు స్పృహ వస్తే తెలుస్తుంది సర్.. ఇక్కడే వీళ్లను ఇంకా ఇంటరాగేట్ చేస్తే వీళ్లకు పిచ్చి ముదురుతోంది. మీడియా వాళ్లు కూడా వచ్చారు’ లోగొంతుకతో చెప్పాడు వహీద్.
అదీ నిజమే అనిపించింది డిసిపికి.
అప్పటికే మీడియా వాళ్లు మైకులను ముగ్గురి నోట్లో కుక్కుతున్నారు... కానీ వాళ్ల అరుపులకు భయపడిపోయారు. ఆ అరుపులను కూడా రికార్డు చేస్తున్నారు... వాళ్లకు ఏమీ తీసిపోనట్టు.. అందరినీ బయటకు నెట్టి తలుపులు వేసుకున్నారు వాళ్లు.
డార్క్ అవెన్యూలో ఏం జరుగుతోంది?
సిఐ ప్రమాదానికి కారణం ఎవరు?
దెయ్యం చేసిన దాడి...
దెయ్యాలున్నాయా? లేవా?
టీవీల్లో స్క్రోలింగ్‌లు మొదలుపెట్టాయి.
* * *
ఒక్కసారిగా హడావిడిగా వున్న సందడి మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దానికి కారణాలు రెండు. పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు.. మీడియా కూడా ఇక అక్కడ ఉండి లాభం లేదు, కావలసినంత స్ట్ఫ్ దొరికిందని భావించి వెనుతిరిగింది. ఇక మీడియా పోలీసులు లేకుండా అక్కడ స్పైసీ ఉండదు కదా.. అదీ కాకుండా చీకటి పడిందంటే అక్కడ ఏమవుతుందో.. ఎవరి భయాలు వారివి. జనం మనస్తత్వాలు చిత్రంగా అనిపిస్తాయి.
జనమంతా వెళ్లిపోయారని నిర్ధారించుకున్నాక డార్క్ అవెన్యూ సమీపంలో వున్న ఒక పొదచాటు నుంచి బయటకు వచ్చారు భార్గవి, సమీర్‌లు. అప్పటివరకూ అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూస్తూనే వున్నారు.. మెల్లిగా డార్క్ అవెన్యూ వైపు కదిలారు.
భార్గవి, సమీర్ ఇద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకుని మెల్లిగా తలుపు మీద శబ్దం చేశారు. లోపలి నుంచి ఎటువంటి అలికిడి లేదు. మరోసారి తలుపు తట్టారు. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. అప్పటికే ఆ కాలనీలో జనసంచారం లేదు.. ఆ ప్రాంతంలో వుండేవాళ్లు కొందరు ఇళ్లు అమ్ముకుని వెళ్లిపోయారు. డార్క్ అవెన్యూ ఇల్లు కాస్త డార్క్ అవెన్యూ కాలనీగా మారిపోయింది. ఆ ప్రాంతం గురించి అప్పుడే కథలు ప్రచారంలోకి వచ్చాయి.
చాలా సంవత్సరాల క్రిందట చాలామంది తమ ఇళ్ళ ముందు, తలుపుల మీద ‘ఓ స్ర్తి రేపు రా’ అని రాసేవారు. దెయ్యం ఇంట్లోకి రాకుండా అలా రాసేవారు.
మాస్ హిస్టీరియా.. పూనకం రాగానే మిగతా వాళ్లూ ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు.. మనుష్యుల్లోని బలహీనతలు కూడా దీన్ని ప్రభావానికి గురి చేస్తాయి.
భార్గవి సమీర్ వంక చూసింది ‘ఏం చేద్దాం?’ అన్నట్టు.
సమీర్ అలా ఆలోచిస్తూండగానే లోపలి నుంచి అడుగుల శబ్దం, మెల్లిగా తలుపునకు దగ్గరగా వస్తోంది. తలుపు తీస్తోన్న శబ్దం.. కిర్రుమనే చిన్న శబ్దంతో తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఆ తలుపునకు సన్నటి గొలుసు ఉంది. తలుపు మొత్తం ఒకేసారి తెరుచుకోకుండా చేసిన ఏర్పాటు అది.
కొద్దిగా తెరచిన తలుపు సందులో నుంచి బయటకు చూసింది చంద్రలేఖ ‘ఎవరూ?’ అంటూ.
‘నేను చంద్రా... భార్గవిని’ మెల్లిగా అంది తలుపు సందులో నుంచి చంద్రలేఖను చూసి
లోపలి నుంచి చంద్రకళ గొంతు వినిపిస్తోంది ‘నాన్న వచ్చాడా?’
‘కాదు.. రెండు ఆత్మలు వచ్చాయి.. నాన్న వాళ్లతో ఏదో చెప్పి పంపించాడుట.. నేను ఆ ఆత్మలతో మాట్లాడి వస్తాను.. మీరు బయటకు రాకండి’ చంద్రలేఖ గొంతు.
‘మనం తొందరగా చచ్చి నాన్న దగ్గరికి వెళ్లిపోదాం’ చంద్రప్రభ గొంతు అది.
‘సరేసరే నేను ఈ ఆత్మలతో మాట్లాడి వస్తా.. ఈలోగా ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దు.. నిన్న ఓ పిల్ల దెయ్యం వచ్చింది. తెగ అల్లరి చేసింది. బయట నుంచి తలుపు వేసుకుని వెళ్తున్నా.. లైట్స్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయలు తల దగ్గర పెట్టుకుని పడుకోండి’ చెప్పి మెల్లిగా బయటకు వచ్చింది చంద్రలేఖ.
* * *
డార్క్ అవెన్యూకు కూతవేటు దూరంలోకి వెళ్లారు. అక్కడక్కడా పొదలున్నాయి. అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ముగ్గురు నిలబడి వున్నారు. కాసేపు వౌనం అక్కడ రాజ్యమేలింది. చంద్రలేఖ మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
‘చంద్రా! ఏమిటే ఇదంతా.. అసలు ఏం జరుగుతోంది? నాకంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నువ్వు నువ్వేనా.. ఎంత యాక్టివ్‌గా వుండేదానివి. అలాంటి నువ్వు...’ బాధగా అన్నది భార్గవి.
‘చూడండి చంద్రలేఖగారు.. నేను సిబిఐ నుంచి వచ్చాను.. నన్ను మీరు నమ్మొచ్చు.. అసలు ఏం జరిగిందో క్లియర్‌గా చెప్పండి. మీరు ఈ చిక్కుముడి గురించి చెబితే తప్ప ఈ చిక్కుముడి ఎక్కడ బిగుసుకుందో మేము కనిపెట్టలేము. చిక్కుముడి విప్పలేము...’ సమీర్ చెప్పాడు.
‘తప్పకుండా చెబుతాను. మీ సహాయం కోరి మీకు మెయిల్ చేసినదానిని.. చెప్పకుండా ఉంటానా? కాకపోతే చాలా వండర్‌గా ఉంది. మా మెయిల్‌కు మీరు రియాక్ట్ అవ్వడం’ అభినందన పూర్వకంగా చెప్పింది చంద్రలేఖ.
‘ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పండి’ అడిగాడు సమీర్.
చంద్రలేఖ చెప్పడం మొదలుపెట్టింది.
‘మేము హైదరాబాద్‌కు రావడానికి ముందు ఢిల్లీలోనే ఉండేవాళ్లం. మా అమ్మానాన్నలది లవ్ మ్యారేజ్.. మా తాతయ్యకు ఈ పెళ్లి ఇష్టంలేదు. అందుకే అమ్మ నాన్నతో కలిసి లండన్ వెళ్లింది. నాన్నకు అక్కడ వ్యాపారాలున్నాయి. నేను అక్కయ్య అక్కడే పుట్టాం. చాలాకాలం తర్వాత తాతయ్య నుంచి పిలుపు వచ్చింది. నాన్న తన వ్యాపారాలను వదిలి రావడం కుదరక అక్కడే వుండిపోయాడు. అమ్మ మామని తీసుకుని తాతయ్యను చూడడానికి వచ్చింది. మా తాతయ్యకు వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు.. అన్నింటికన్నా ముఖ్యమైనది నిధి..’
ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం.
‘నిధి??’ భార్గవి ఆశ్చర్యంగా అంది.
‘అవును భార్గవి.. ఆ నిధి వజ్రాల ఆభరణాల రూపంలో ఉంది. వాటిని విలువ కట్టడం ఎవరివల్లా కాదు...’ అని తాతయ్య అమ్మతో చెబుతూ ఉండడం విన్నాను. అయితే ఆ నిధికి కాపలాగా కొన్ని శక్తులు ఉన్నాయని.. వాటిని దాటుకుని వెళ్లడం అసాధ్యమని తాతయ్య చెప్పారు. అంతేకాదు.. ఆ నిధిని వెలికి తీయకూడదని అది అలాగే ఉండాలని తాతయ్య కోరిక.. ఆ నిధి కోసం ప్రయత్నించిన వాళ్లు చచ్చిపోతారని కూడా చెప్పాడు. ఈ విషయం అమ్మ నాన్నతో కూడా చెప్పింది.. నాన్న ఇండియా వచ్చిన పదమూడవ రోజు అదృశ్యమయ్యాడు. తన దుస్తులు దొరికాయి. రక్తంతో తడిసిపోయి. తరువాత మా మామయ్య చెప్పాడు. ‘నాన్న ఆ నిధి కోసం ప్రయత్నించడం వల్లే చనిపోయాడని. నాన్న మరణంతో అమ్మ కృంగిపోయింది. అసలే అమ్మకు నమ్మకాలు ఎక్కువ.. అప్పుడే పిడుగుపాటులా మరో వార్త మోసుకువచ్చారు మామయ్య.. లండన్‌లో వున్న మా ఆస్తులు అగ్నిప్రమాదంలో ఆహుతయ్యాయి. అక్కయ్య పైఅంతస్థు నుంచి కిందికి దూకి కొనప్రాణంతో బ్రతికింది.. మా తాతయ్య కూడా అనూహ్యంగా చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో హైద్రాబాద్ వచ్చాం.. ఎవ్వరికీ చెప్పకుండా.. చివరికి మామయ్యకు కూడా చెప్పకుండా...
చాలా కాలం క్రితం నాన్న అప్పుడెప్పుడో నగర శివార్లలో కొన్న స్థలంలో కట్టిన ఇల్లు.. నేను క్రిమినాలజీ పూర్తి చేద్దాం అని ఢిల్లీలోనే మామయ్యకు కూడా తెలియకుండా హాస్టల్‌లో కొన్నాళ్లు.. భార్గవితో కలిసి కొన్నాళ్లు వున్నాను.. ఈలోగా అమ్మ అక్కయ్యల్లో విపరీతమైన మార్పులు... తమనెవరో చంపడానికి వస్తున్నారని.. అంతకన్నా భయంకరంగా నమ్మలేని నిజం.. నాన్న అమ్మకు కనిపించాడట. అమ్మకే కాదు.. అక్కకు కూడా...
అప్పుడే టీవీలో కూడా రకరకాల వార్తలు.. మా ఇంటికి డార్క్ అవెన్యూ అన్న పేరు స్థిరపడింది. రాత్రి అయ్యిందంటే మా ఇంటి వైపు ఎవరూ రారు.. దానికి తగ్గట్టు అమ్మ అక్కయ్య ఇరవై నాలుగ్గంటలూ తలుపు మూసుకుని ఉంటారు. నాన్న ప్రయత్నించిని నిధి కాపలాకాసే దుష్టశక్తులు డార్క్ అవెన్యూలోకి ప్రవేశించాయని వాళ్ల నమ్మకం.
‘అన్నీ ప్రశ్నలే... నాన్నకు డబ్బు మీద మమకారం లేదు. అదే ఉంటే అమ్మను నాన్న ఆస్తిలో వాటా ఇమ్మని అడగమని’ చెప్పేవాడు.

అందుకే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. మామయ్యకు కూడా చెప్పకుండా అవడానికి కారణం కూడా అదే. ఆ తరువాత మామయ్య మా కోసం వెతికిస్తున్నాడని తెలిసింది.. అయినా మా గురించి మామయ్యకు తెలియనివ్వలేదు. ఈ పిరస్థితుల్లో నేను ఎందుకు హైద్రాబాద్ వచ్చానో మీకు మెయిల్‌లో తెలియజేశాను..
అమ్మను అక్కయ్యను బ్రతికించుకోవడానికి నేను కూడా పిచ్చిదానిలా ప్రవర్తించక తప్పడంలేదు. అక్కయ్య భయాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సిఐ దుర్జన్ కుమార్ అక్కయ్యను రేప్ చేశాడు.. దెయ్యమే తనను రేప్ చేసింది అనే భ్రమలో ఉంది.. ఎటూ మా కుటుంబం మీద ఆ నింద ఉంది కాబట్టి సిఐ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందుకే సిఐని టార్గెట్ చేసి అతడిని చంపేయాలనుకున్నాను. కానీ వహీద్ అనే ఒక మంచి మనిషి మాట మీద అతడిని వదిలేశాను...
అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే నేను నాన్నను చూశాను’ అని ఆగింది చంద్రలేఖ.
సమీర్ భార్గవి షాకయ్యారు.
చంద్రలేఖ చెప్పడం మొదలుపెట్టింది.
‘మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరిగాయి.. అవి ఏమిటంటే...’ చెప్పడం కొనసాగించింది చంద్రలేఖ.
చంద్రలేఖ కళ్లు మూసుకుంది. మర్చిపోదామని ప్రయత్నించినా మర్చిపోనివ్వని అనుభవం. అది భయమో.. మరేదో.. తనకే తెలియడంలేదు.
ఆ సంఘటన ఇంకా ఆమె కళ్ల ముందు కనిపిస్తూనే వుంది.
ఆ రోజు రాత్రి సరిగ్గా పనె్నండు అవ్వడానికి పదమూడు నిమిషాల వ్యవధి ఉంది.. పదకొండూ నలభై ఏడు నిమిషాలు.
* * *
చంద్రప్రభ గోడకు ఓ మూల మోకాళ్ల మధ్య తలపెట్టి భయంగా ముడుచుకుని కూచుంది. గోడ గడియారంలోని సెకన్ల ముళ్లు తిరుగుతున్నా శబ్దం కూడా వాళ్లకు భయంకరంగా అనిపిస్తూ వినిపిస్తోంది. అప్పుడప్పుడు చంద్రప్రభ కళ్లు పైకెత్తి గోడ గడియారం వంక చూస్తోంది.
చంద్రలేఖ ల్యాప్‌టాప్‌లో ఆత్మలకు సంబంధించిన విషయాలను గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తోంది.
ఆత్మలు వున్నాయన్న కథనాలు.. యూ ట్యూబ్‌లో వీడియోలో.. ఘోస్ట్ హంటర్స్ డీటైల్స్.. అన్నీ సెర్చ్ చేస్తోంది. అంత చలిలోనూ ఆమె మొహంలో చెమట.
అప్పుడే తల్లి అరుపు ‘ఏమండీ.. ఆగండి.. ఆగండి.. ఆగండి’ అంటూ తలుపు తెరుచుకుని వెళ్తోంది.
చంద్రలేఖ ఒక్క ఉదుటున లేచి హాలులోకి వచ్చింది.. తలుపు తీసుకుని బయటకు వెళ్తోన్న తల్లిని గట్టిగా పట్టుకుంది.
‘అమ్మా.. ఏమైంది.. ఎక్కడికెళ్తున్నావ్?’ తల్లి భుజాలు కుదిపేస్తూ అడిగింది చంద్రలేఖ.
‘మీ నాన్న.. తనకు కోపం వచ్చింది.. అయినా నేనేమన్నానని అంత కాని మాట?’ ఏడుస్తూ అని.
‘నాన్న రావడమేమిటమ్మా?’ భయంగా తల్లి వంక చూసి అంది చంద్రలేఖ.
‘రావడం కాదే.. నాతో మాట్లాడి వెళ్లాడు.. నాకిష్టమని బాదంహల్వా తెచ్చాడు.. ఢిల్లీ నుంచి’ చేతిలో వున్న కవర్‌ను చూపిస్తూ అంది తల్లి చంద్రకళ.
తల్లి చేతిలో కవర్ చూసి షాకైంది చంద్రలేఖ. అది బాదంహల్వా కవరే.. ఆ కవర్‌లో బాక్స్ ఉంది.. ఓపెన్ చేస్తే బాదంహల్వా వుంది...
వెంటనే బయటకు పరుగెత్తింది.. అప్పుడే మూలమలుపును క్రాస్ చేస్తూ ఒక వ్యక్తి వడివడిగా వెళ్తున్నాడు. ఆ నడక అచ్చంగా తన తండ్రి నడకలానే వుంది.
క్షణం ఆలోచించకుండా పరుగెత్తింది. మూల మలుపునకు వెళ్లేసరికి ఎవరూ కనిపించలేదు. చుట్టూ వెతికింది.. ఆమె మనసు ఏదో కీడును శంకించి వెనక్కి వచ్చి చూసేసరికి తల్లి అక్క ఇద్దరూ హల్వాను తింటున్నారు. మామూలుగా కాదు ఎన్నో రోజులుగా ఏమీ తిననట్టు...
(ఇంకా ఉంది)

తేజారాణి తిరునగరి