సబ్ ఫీచుర్
నేటి పిల్లలే భావిభారత పౌరులు. దేశ భవిష్యత్తు యావత్తు పిల్లలపై ఆధారపడి వుంది. వారి ప్రగతికి ఎలాంటి అవరోధం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా భారత రాజ్యాంగం వారికి కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. దశాబ్దాలుగా దేశంలో బాలలకు సంబంధించి పౌష్టికాహార లోపాలు కొనసాగుతూనే ఉన్నాయి. పౌష్టికాహార లోపం అనేది జాతిని పీడిస్తున్న సమస్యగా పాలకులు గుర్తించినా, ఎప్పటికప్పుడు హామీలు గుప్పిస్తూ ఆ తర్వాత సమస్యను పట్టించుకోకుండా దాటవేత ధోరణితో పాలన సాగిస్తున్నారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2010 జనవరి 21న ఢిల్లీలో సాహస బాలల అవార్డుల ప్రదానోత్సవంలో ‘‘దేశంలోని పిల్లలందరికీ పౌష్టికాహారం, విద్య తదితర సదుపాయాలు అందజేయడానికి కృషిచేస్తాం’’ అని హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పౌష్టికాహార లోపంపై నివేదికలో దేశంలో 42 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉండడం, పౌష్టికాహార లోపాలతో పిల్లలు మృత్యువాత పడడం సిగ్గుచేటన్న మాటలు ప్రధాని నోటినుంచి వెలువడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అయిదేళ్ళలోపు చిన్నారుల మరణాల్లో అత్యధికం మన దేశంలో ఉండడం ఇక్కడి దయనీయ పరిస్థితులకు అద్దంపడుతోంది. సరైన పోషణ కొరవడి చిన్నారులు తక్కువ బరువుతో పెరగడం బాధ కలిగించే పరిణామం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1.90కోట్ల శిశువులు తక్కువ బరువుతో జన్మించగా, వారిలో 83లక్షల మంది అంటే 43శాతం మంది భారత్‌లోనే ఉండడం బాధాకరం. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలలో ఇలాంటివారు ఎక్కువగా ఉన్నారు. పుట్టిన 28రోజుల్లోనే నాలుగు లక్షల మంది శిశువులు ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందులో లక్ష మరణాలు భారత్‌లో నమోదవుతున్నాయి. దేశంలో పాలకులు మాతాశిశు సంక్షేమంపై ప్రదర్శిస్తున్న ఘోర నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న విషాదమిది. తల్లి పాలల్లో అత్యధిక రోగ నిరోధక శక్తి ఉంటుంది. భారత్‌లోని ప్రతి నలుగురు శిశువుల్లో ఒక్కరికి మాత్రమే తల్లిపాలు తాగించడం జరుగుతూ వుంది. భారత్‌లో టీకాల విషయంలో కూడా బోలెడంత అలసత్వం ప్రదర్శించి చిన్నారులను శైశవ దశలోనే బలిగొంటున్నారు. సుఖ ఫ్రసవానికి అవసరమైన సదుపాయాలు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కొరవడుతున్నాయి. ఇళ్ళల్లో ప్రసవాల కారణంగా తల్లీబిడ్డల ప్రాణాలకే భరోసా లేకుండాపోతున్నది. బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో బాలింతరాలైనా తల్లికి, శిశువుకు తగిన పోషకాహారం అందకపోవడం, క్రమం తప్పకుండా చిన్నారులకు టీకాలు వేయించకపోవడంతో చిన్నారులను మృత్యువాకిట నిలుపుతున్నాయి. మాతా, శిశు సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడిపెస్) వంటివి ఇంకా లక్ష్యాల్ని చేరడం లేదు. మాతాశిశు మరణాల రేటు, పౌష్టికాహార లోపాలు, బరువు తక్కువ పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత, పిల్లల ఎదుగుదల, జీవన ప్రమాణాలను అభివృద్ధికి సూచికలుగా పరిగణిస్తున్నారు. మాతాశిశు సంక్షేమ రంగాలలో అధ్యయన నివేదిక గణాంకాలు వెక్కిరిస్తున్నా, దిద్దుబాటు చర్యలపై పాలకులు దృష్టిసారించకపోవడం బాలల భవిత పాలిట శాపంగా మారింది. పదకొండో పంచవర్ష ప్రణాళికలో మాతా శిశు సంక్షేమ రంగంలో పౌష్టికాహార లేమి సగానికి తగ్గించాలన్నది లక్ష్యం. దాన్ని సాధించడానికి పాలకులు ఎప్పటిమాదిరే ఘోరంగా విఫలమయ్యారు. పౌష్టికాహారం సమకూర్చడమనేది కేవలం స్ర్తి, శిశు సంక్షేమ శాఖకు పరిమితమైన విధి కాదు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, రక్షిత నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖలు ఈ మహాయజ్ఞంలో ముఖ్య భూమిక పోషించాలి. ఆ శాఖలు అది తమ పనికాదన్నట్లు అంటే ముట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. పౌష్టికాహార జాతీయ మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తున్నా దాని పనితీరు ఆశాజనకంగా లేదు.
Add new comment