పశ్చిమగోదావరి

నేడు పోలవరానికి సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 12 : పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అన్న విషయంలో అందరిలోనూ ఏకాభిప్రాయం వుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని అన్ని పార్టీలతోపాటు ప్రధానంగా ప్రజలు కూడా ఎంతో కాలంగా కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా మారాయని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ సందర్భంగానే పనుల పురోగతిపై ఇరిగేషన్, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి పోలవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత బయలుదేరి వెళతారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ధ్రానేతగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దాదాపుగా పదిసార్లకు పైగా ఈ ప్రాంతంలో పర్యటించారు. పనులను పరిశీలించారు. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదన్న ఆవేదన అన్ని స్థాయిల్లోనూ వ్యక్తమవుతూ వచ్చింది. బడ్జెట్లలో ప్రాజెక్టుకు జరుగుతున్న కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ పరిస్థితిపై కొంత ఆందోళన కూడా వ్యక్తమైంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత కూడా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడం పట్ల అసంతృప్తికూడా వ్యక్తమైంది. ఈ నేపధ్యంలో ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ దానిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ప్రధానంగా పేర్కొనడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున పూర్తి నిధులను కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిణామంతో ప్రధానంగా జిల్లాలో పోలవరం ప్రాజెక్టుపై వున్న ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అనుకున్న కాలపరిమితి లోగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా? అన్న అంశంలో స్పష్టత రాకపోయినా నిధుల విషయంలో ఒక భరోసా అందడంతో ఎంతోకొంత ఆలస్యమైనా ప్రాజెక్టు వాస్తవ రూపం ధరించడం ఖాయమన్న నమ్మకం మాత్రం అందరిలోనూ వ్యక్తమైంది.
దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చురుగ్గానే వ్యవహరిస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని రికార్డు స్థాయిలో పూర్తిచేసిన రీతిలోనే పోలవరాన్ని కూడా పూర్తిచేస్తామని ఇంతకుముందే ప్రకటించారు. అదే విధంగా ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ చేపడతానని ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగానే ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన చంద్రబాబు తాజాగా మంగళవారం మరోసారి ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.
కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలవరం, ప్రాజెక్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లుచేశారు. దీనిలో భాగంగా ఇద్దరు అదనపు ఎస్‌పిలు, అయిదుగురు డిఎస్‌పిలు, 11 మంది సిఐలు, 30 మంది ఎస్ ఐలు, 40 మంది ఎఎస్ ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లు, వంద మంది హోంగార్డులతోపాటు ఒక స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్స్ స్క్వాడ్ మాత్రమే కాకుండా జడ్‌ప్లస్ సెక్యూరిటీ భద్రత కూడా ఏర్పాటుచేశారు. మొత్తం మీద పోలీసు బందోబస్తు పూర్తి పకడ్బందీగా చేపట్టారు. అలాగే జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పనుల పరిశీలన, పురోగతిపై సమీక్షలు ముఖ్యమంత్రి నిర్వహించనుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. కాగా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం విషయంలో ఒక స్పష్టత రావడంతో ఈ పనులను మరింత పరుగులు తీయించే విధంగా మంగళవారం నాటి పర్యటనలో ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశంవుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పరిణామాలు జిల్లాకు సంబంధించి ఆశాజనకంగా వున్నాయని చెప్పుకోవచ్చు.

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
పోలవరం, సెప్టెంబర్ 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ అధికార్ల హడావుడి భారీగా కనిపించింది. జిల్లా కలెక్టర్ కె భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని సిఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. బందోబస్తు కోసం సోమవారం ఉదయం నుండే పోలీసులు పోలవరం చేరుకున్నారు. సిఎం పర్యటనా ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె వెంకట్రావు, ఆర్డీవో ఎస్ లవన్న, సిఐ కె బాలరాజు, ఎస్సై కె శ్రీహరిరావులు పర్యవేక్షిస్తున్నారు.