పశ్చిమగోదావరి

నెలాఖరుకు స్పిల్‌వే పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 18: ఈ నెలాఖరునాటికి స్పిల్‌వేకు సంబంధించి కాంక్రీటు పనులను సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న మంత్రి స్పిల్‌వే ప్రాంతంలో రాయి పరీక్షలు నిర్వహిస్తున్న శాస్తవ్రేత్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి నెలా 3వ సోమవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించే సిఎం పర్యటన ఈసారి వాయిదాపడినట్లు చెప్పారు. సోమవారం వర్చువల్ తనిఖీ చేసిన అనంతరం సిఎం ఎప్పుడొచ్చేది నిర్ణయించనున్నట్టు తెలిపారు. స్పిల్‌వే గేట్ల డిజైన్‌ను సిడబ్ల్యూసి ఆమోదానికి పంపామని, అనుమతి త్వరలోనే రావచ్చుననే అభిప్రాయపడ్డారు. సంక్రాంతి నుండి గేట్ల తయారీ కూడా ఇక్కడే జరుగుతుందని, అందుకు సంబంధించి యంత్రాలు త్వరలో ఇక్కడకు వస్తాయన్నారు. ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో సియర్ జోన్ ఉందని, దానిని తొలగించిన అనంతరమే కాంక్రీటు పోస్తారని చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన సీనియర్ జియాలజిస్టులు ఇక్కడే ఉండి, అన్నీ పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తున్నారన్నారు. ఆ మేరకే పనులు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి దేవినేని వెంట పోలవరం ప్రాజెక్టు అధార్టీ డైరెక్టర్ డిపి భార్గవ్, సభ్యులు ఆర్‌కె గుప్త, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అజయ్‌కుమార్, జియాలిజిస్టు జిజెఎస్ ప్రసాద్, గేట్ల తయారీ నిపుణుడు కె కన్నమనాయుడు, కాంట్రాక్టు ఏజన్సీ ఎండి చెరుకూరి శ్రీ్ధర్ తదితరులు ఉన్నారు.
దేవుడిదే భారమా...!

ఏలూరు, డిసెంబర్ 18: పెద్దనోట్ల రద్దు ప్రభావం ఏమిటోగాని నోట్లు నడిచే ప్రతి వేదికపైనా సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇంతకాలం బ్యాంకులు, బంకులు, అంతకుముందు సొసైటీలు ఇలా ఒకరితర్వాత ఒకరిపై అనుమానాల నీలిమేఘాలు కమ్ముకుంటూనే రాగా అప్పట్లో కొన్ని వేదికలను వీటినుంచి మినహాయించారు. అవిధంగానే సొసైటీలు, బంకులు ఈ జాబితాలోంచి బయటకు వెళ్లిపోయాయి. మరో ప్రధాన వేదికగా కన్పిస్తున్న ఆలయ హుండీలు కూడా ఈ జాబితాలో గట్టి ప్రాధాన్యతే సంతరించుకున్నాయి. అయితే వీటిపై పర్యవేక్షణ వంటి ప్రక్రియలు సమర్ధంగా సాగుతున్నాయా, లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతూనే వస్తున్నాయి. దేవునిపైనే భారం వేసి ఊరుకున్నారా, లేక జరుగుతున్నది ఏమిటో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా అన్నది పలు సందేహాలకు కారణమవుతోంది. మరోవైపు పలుచోట్ల నుంచి ఆలయ ఇఓలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉండగా కొంతమందిపై పరిశీలన, మరికొందరిపై విచారణకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు సాధారణంగా ఆలయ హుండీలను వారానికి, పదిరోజులకు ఇలా అ ఆలయ సామర్ధ్యాన్ని, స్ధాయిని బట్టి లెక్కిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కొన్ని ఆలయాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి హుండీ ఆదాయ లెక్కింపు ప్రక్రియ జరిగిపోతోంది. ఈవిధంగా మార్పు చోటుచేసుకున్న ఆలయ అంశాలపైనా ఈ అనుమానాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. ఈవిధంగా హుండీలను లెక్కించి ఆమేరకు నోట్లను గుట్టుచప్పుడు కాకుండా ఆలయ అధికారులు మార్చివేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా దేవాదాయశాఖ నుంచి అయా బ్యాంకుల్లో జమ అవుతున్న నోట్లను పరిశీలించినా ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం కావడానికి గల కారణాలు కూడా బయటపడతాయి. వాస్తవానికి కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కొద్దిరోజుల వరకు ఆలయ హుండీలన్నీ రద్దు అయిన 500, 1000 రూపాయల నోట్లతో నిండిపోయాయన్న ప్రచారం పెద్దఎత్తున జరిగిపోయింది. ఇది ఎంతవరకు వాస్తవమో గాని మరోవిధంగా ఆలోచిస్తే దేవునిపై భయంతోనో, భక్తితోనో వచ్చే సామాన్య భక్తులు తమవద్ద పనికిరాని నోట్లను దేవునికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారా అన్న సందేహం కలగకమానదు. కొంతమంది అలాఉండవచ్చేమో గాని అధికశాతం మందిలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం కావటం అంత నమ్మదగ్గదిగా కన్పించదు. ఏదీఏమైనా ముందు జరిగిన ప్రచారం ప్రకారం హుండీల్లో పెద్దసంఖ్యలో 500, 1000 నోట్లు వస్తున్నాయని ఇప్పటికీ అధికారులు చాలాచోట్ల చెపుతూనే ఉన్నారు. అవిధంగానే అలాంటి నోట్లు కొన్ని ఆలయ హుండీల లెక్కింపు సందర్భంగా ఆయా బ్యాంకుల్లో జమ చేస్తూ వస్తున్నారు.
అయితే ఇక్కడే పెద్దఎత్తున సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రైతు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సొసైటీలలో కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించిన ప్రభుత్వం వాటిని మార్పిడి నుంచి మినహాయించింది. అయితే అంతకుమించి రాజకీయప్రమేయం, బడాబాబుల ప్రాబల్యం గట్టిగా నడిచే ఆలయాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అదే అంశం కొంతమందికి వరంగా మారిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే పదిమంది దగ్గరనుంచి వచ్చే హుండీ సొమ్ము విషయంలో ఇలాగే జరుగుతోందని స్పష్టంగా చెప్పే అవకాశాలు లేకపోయినా బయట జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే లోపాయికారీ మార్పిళ్లకు ఇదొక ప్రధాన వేదికగా నిలుస్తోందనటంలో సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే కొంతమంది ఆరోపణలు రావటం, మరికొందరిపై విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇవ్వటం జరిగిపోయింది. అయితే ఈవిధంగా ఏస్దాయిలో జరుగుతోంది, ప్రస్తుతం చర్యలు చేపట్టిన స్ధాయికి ఇది పరిమితం అయిందా అన్నది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది.

కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 18: విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించడంతో నియోజకవర్గంలో ప్రజలు గోవింద నామస్మరణతో పులకించిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ హైస్కూలులో ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దంపతుల నేతృత్వంలో జరిగిన శ్రీనివాస కల్యాణానికి భక్తజనకోటి తరలివచ్చారు. వారం రోజుల్లో టీటీడీ ఆధ్వర్యంలో, మంత్రి మాణిక్యాలరావు నేతృత్వంలో శ్రీనివాస కల్యాణం అత్యంత అద్భుతంగా నిర్వహించడంతో భక్తజనావళి శ్రీనివాసుని కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. జిల్లాపరిషత్ హైస్కూలు మధ్యాహ్నం 3 గంటల నుండి భక్తులతో నిండిపోయింది. సుమారు 50 వేల మంది భక్తులు కల్యాణానికి హాజరైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 4 గంటలకు సహస్రావధాని గరికిపాటి నర్సింహారావుచే హైందవ సంస్కృతి, వెంకటేశ్వర సుప్రభాతం, ధార్మిక కార్యక్రమాలపై ఉపన్యాసం జరిగింది. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆస్థాన గాయకులు సందర్భానుసారం ఆలపించిన అన్నమయ్య గీతాలు అలరించాయి. టీటీడీ దేవస్థానం అర్చకులు స్వామివారి కల్యాణాన్ని తిరుమలలో జరిగినట్లుగా కళ్లకు కట్టినట్లుగా భక్తులకు చూపించారు. టీటీడీ ఆస్థాన వ్యాఖ్యాతలు శ్రీనివాస కల్యాణంలో ఘట్టాలను భక్తులకు వివరించారు. సుమారు 2 గంటలు జరిగిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో ప్రజలు వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లాపరిషత్ 4 ప్రధాన మార్గాల్లో దద్దోజనం, పులిహోర, లడ్డూ, కుంకుమలను భక్తులకు అందజేశారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సిఐలు ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి, మధుబాబు, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, గట్టిం మాణిక్యాలరావు, కాపునేత ముద్రగడ పద్మనాభం, మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, యెగ్గిన నాగబాబు, కర్రి ప్రభాకర బాలాజీ, కర్రి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రులను కలిసిన ఆక్వా రైతులు

భీమవరం, డిసెంబర్ 18: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడును జిల్లాకు చెందిన ఆక్వా రైతులు ఆదివారం ఢిల్లీలో కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో భీమవరంలో నిర్వహించే ‘ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్-2017’ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఆనంద గ్రూప్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీవిశ్వనాధరాజు, శాస్తవ్రేత్త ఎస్.మోహన్ నాయర్, ఆక్వా రైతులు మంత్రులను కలిసినవారిలో ఉన్నారు. భారత దేశం నుంచి ఏటా రూ. 32 వేల కోట్ల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయని, ఈ పరిశ్రమ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం వస్తుందని విశ్వనాధరాజు మంత్రులకు వివరించారు. ఇటువంటి పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, యాంటిబయోటిక్స్ తదితర వాటిని వినియోగించడం వల్ల పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయన్నారు. దీనికోసం నీలి విప్లవ రాజధానిగా ఉన్న భీమవరంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చెప్పారు. ప్రపంచంలో యుకె, చైనా, బ్యాంకాక్, తైవాన్, ఇండోనేషియాతో పాటు అనేక దేశాల నుంచి ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు, ఎగుమతిదారులు హాజరుకానున్నారని తెలిపారు. ఆనంద ఫౌండేషన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బ్యాంకాక్), ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా భారీ ఎత్తున ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తాయని కేంద్ర మంత్రులకు వివరించారు. ఆక్వా రైతు కంతేటి వెంకటరాజు, బిజెపి రాష్ట్ర సమన్వయ కర్త పురిఘెళ్ల రఘురాం వారి వెంట ఉన్నారు.
ఎమ్మెల్యే పితానిని కలిసిన ముద్రగడ
యలమంచిలి, డిసెంబర్ 18: కాపు ఉద్యమానికి బిసిలు సహకరించాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కోరారు. పోడూరు మండలం కొమ్ము చిక్కాల గ్రామంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను ఆయన స్వగృహంలో ఆదివారం కలిశారు. ఆయనతోపాటు ఆకుల రామకృష్ణ, చినిమిల్లి వెంకట్రాయుడు, వైవిదాస్, నల్లా విష్ణు, నల్లా పవన్, కల్వకొలను తాతాజీ తదితరులు ఉన్నారు. సమావేశానికి ముందు ముద్రగడ కారుకు పితాని ఎదురెళ్లి పుష్పగుచ్చమిచ్చి సాదరంగా ఆహ్వానించారు. సమావేశం అనంతరం ముద్రగడ పద్మనాభం విలేఖర్లతో మాట్లాడుతూ కాపు ఉద్యమం వల్ల బిసిలకు ఎటువంటి నష్టంలేదని, ఒకరి నోటి వద్ద అన్నం లాక్కునేవారంకాదని, కాపు జనాభా ప్రాతిపదికపై పేదవారికి రిజర్వేషన్ కోరుతున్నామన్నారు. తన ఉద్యమంలో భాగంగానే బిసీల సహకారం కోరుతూ అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి తదితర నాయకులను కలిసినట్టు తెలిపారు. చంద్రబాబునాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బిసిల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ అమలుచేయాలని కోరుతున్నామన్నారు. కాపు కార్పొరేషన్ పేరుతో ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారని, హామీలు అమలు జరగకపోవడంతో రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని ముద్రగడ చెప్పారు. తమ కోరికలు నెరవేర్చుకునేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా దశల వారీ ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమైన తమ ఉద్యమంలో భాగంగా ఈ నెల 30న ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 3న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ, 25న పాదయాత్ర నిర్వహిస్తామని ముద్రగడ వివరించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కాపు ఉద్యమం వల్ల బిసిలకు నష్టం లేదని, సహకరించాలని ముద్రగడ కోరినట్టు తెలిపారు.
కాపుల ఆకలి కేకలు
ఏలూరు, డిసెంబర్ 18 : కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఏలూరులోని కాపు సంఘ నాయకులు ఆదివారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఆకలి కేకల నిరసనలో భాగంగా పళ్లాలపై గరిటెలతో మోత మోగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాపులను వెంటనే బిసి జాబితాలో చేర్చాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం హామీలను అమలుచేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాపులు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని ప్రతినబూనారు. మంజునాథ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు కాపులను బిసిల్లో చేర్చకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు జల్లా హరికృష్ణ, రాజనాల రామ్మోహనరావు, తోట పద్మారావు, మంచెం మైబాబు, కంసాని బాబి, తూము సత్యనారాయణ, దాసరి రమేష్, పాతూరి శ్రీనివాస్, రేకపల్లి నారాయణరావు, కుటుంబరావు, దాశరధి, పులి శ్రీరాములు, చించన రామకృష్ణ, కందుల నాని, లక్ష్మణ్ పాల్గొన్నారు.
భీమవరంలో...
భీమవరం: ‘ఆకలి పోరాటం - ఆఖరి పోరాటం’ అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు, చిన్నారులు, పెద్దలు, పురుషులు అన్ని స్థాయిలకు చెందిన వారంతా రోడెక్కారు. కంచాలను కొడుతూ వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. రాష్ట్ర కాపు, తెలగ, బలిజ ఒంటరి జెఎసి పిలుపు మేరకు స్థానిక ప్రకాశం చౌక్‌లో ఆదివారం కంచాలను కొట్టారు. పట్టణ కాపునాడు అధ్యక్ష, కార్యదర్శులు బేతు కృష్ణారావు, మాగాపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బేతు కృష్ణారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేర్చుతామన్న వాగ్దానం నెరవేర్చాలన్నారు. కాపు రిజర్వేషన్‌కు మద్దతు పలికిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, సినీ నటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులను బిసిల్లో చేర్చాలని నాయకులు పళ్లాలతో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లం రాంబాబు, బోడపాటి పెదబాబు, యాతం జగన్నాధం, ముత్యాల బాబులు, ఆకుల శ్రీను, కోయ శ్రీరామ్మూర్తి, ఘంటా చిరంజీవి, సంగినీడి నరేష్, బండి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయడ్ మొబైల్ వినియోగదార్లకు కొత్త ఎస్‌టివిలు
ఏలూరు, డిసెంబర్ 18: బిఎస్‌ఎన్‌ఎల్ ప్రమోషనల్ ఆఫర్‌గా ప్రీపెయిడ్ సెల్ వినియోగదారులకు కొత్తగా రెండు ఎస్‌టివిలను ప్రవేశపెట్టినట్లు టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు వి సుందర్ తెలిపారు. ఎస్‌టివి-139 రూపాయలతో 300 ఎంబి ఉచిత డాటా, అపరిమిత వాయిస్ కాల్స్ లోకల్, ఎస్‌టిడి(బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్కులో) మాట్లాడుకోవచ్చునని, దీని కాలపరిమితి 28రోజులు ఉంటుందని తెలిపారు. అలాగే ఎస్‌టివి-339 రూపాయల కింద ఒన్ జిబి ఉచిత డాటా, అపరిమిత వాయిస్ కాల్స్ లోకల్, ఎస్‌టిడి అన్ని నెట్‌వర్కులకు మాట్లాడుకోవచ్చునని, దీని కాలపరిమితి 28రోజులు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మహిళలను గౌరవించే దేశంలో సిరి సంపదలు
పాలకొల్లు, డిసెంబర్ 18: ఏ దేశంలో మహిళను గౌరవిస్తారో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, సకల సంపదలతో తులతూగుతారని గొట్టిపాటి సత్యవాణి (్భరతీయం సత్యవాణి) అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తన తండ్రి పేరుతో నడుపుతున్న ధర్మారావు ఫౌండేష్‌న్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ గరల్ ఛైల్డ్ సదస్సు, 2కె రన్’లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమెన్‌లో మేన్ ఉన్నాడని, షిలో హి ఉన్నాడని, స్ర్తి పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవనం సాగుతుందన్నారు. మహిళాశక్తి చాలా గొప్పదని, మహిళా రిజర్వేషన్లకోసం స్ర్తి పెద్దగా పట్టించుకోవటం లేదని, తన భర్త తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలన్న తపనతోనే పురుషులకు ఈ అవకాశం లభించిందని అన్నారు. మహిళా బిల్లు ఎప్పటికీ వచ్చేది కాదని ఆమె చమత్కరించారు. అమ్మ మరో అమ్మను భూమిపైకి రాకుండా భ్రూణ హత్యలకు పాల్పడటం అనాగరికమని, అమ్మ లేనిదే సృష్టి లేదన్నారు. అమ్మలోనే వేదముంది, అమ్మలోనే ఖురాన్ ఉంది, అమ్మలోనే బైబిల్ ఉందన్నారు. అడవారిని పురుషులు రక్షించాలని, పురుషులను అడవారు గౌరవించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆడపిల్ల ఇంటికి అందమని, తల్లికి అండని, నాన్నకు స్నేహితురాలన్నారు. ఆడపిల్లను సంరక్షించుకోవటం సామాజిక బాధ్యతన్నారు. ఆడవారికి ఆర్థిక స్వావలంబన కావాలని, విద్య, ఆస్తిలో వాటా, ఉద్యోగం ఉన్నప్పుడు వారు కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తారన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని, కానీ వాటిని సరిగా అమలు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పురుష అహంకారం తగ్గించుకొని మహిళలను రక్షించటం, గౌరవించటం నేర్చుకోవాలని కోరారు. సినీ గాయని మధుప్రియ మాట్లాడుతూ తాను కృష్ణాష్టమి రోజున జన్మించానని, మంచిది కాదన్నారని, కానీ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను మంచి గాయని కాగలిగానన్నారు. ‘నోరులేని ఊరపంది వల్ల, వీధి కుక్కల వల్ల భయం లేని మహిళ మనిషిని చూస్తేనే భయపడుతోంది’ అనే పాటను ఆమె ఆలపించారు. ఒలింపింక్ అథ్లెట్ సత్తి గీత మాట్లాడుతూ తామంతా అమ్మాయిలమేనని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను క్రీడాకారిణి అయ్యానని చెప్పారు. సంగీత దర్శకురాలు మోహినీ ప్రియ మాట్లాడుతూ తాను 7వ సంవత్సరం నుండి పాటలు పాడుతున్నానన్నారు. తాను ముఖ్యంగా భ్రూణ హత్యలు, మహిళల పట్ల జరిగే అన్యాయం పట్ల ఎక్కువ పాటలు రాసుకుని పాడుతున్నట్టు చెప్పారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, 15వ సంవత్సరంలోనే పిహెచ్‌డి చేస్తున్న నైనా జైస్వాల్ మాట్లాడుతూ పచ్చని పొలాల మధ్య, కాల్వల మధ్య ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అల్లూరి, నన్నయ్య జన్మించిన ఈ జిల్లా, ఎందరో సినీ జగత్తుకు అందించిన పాలకొల్లులో తాను మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. 7వ సంవత్సరంలోనే 10వ తరగతి పూర్తిచేశానని, రెండు చేతులతో సమానంగా రాయగలనని, 12వ సంవత్సరంలో జర్నలిజం డిగ్రీ సాధించానన్నారు. అమ్మ చిరునవ్వు చెరగదని, ఆడపిల్లను ఆదిశక్తిగా గౌరవించాలని, నాన్న తనకు సమయపాలన, కఠోర దీక్ష నేర్పారని ఆమె చెప్పారు. వేదికపై రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, ఎఎంసి ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాణమూర్తి, వైస్ ఛైర్‌పర్స్‌న్ రోజారమణి, పాలకొల్లు ఎంపిపి శ్రీదేవి, యలమంచిలి ఎంపిపి సుజాత, జడ్పీటిసీలు కోడి విజయలక్ష్మి, బోనం నాని, పి.నాగేశ్వరరావు, తహసీల్దార్లు దాసి రాజు, స్వామినాయుడు, శ్రీరమణి, ఎంపిడిఓ ఎవి అప్పారావు, కాత్యాయని, ఆనందరాజు తదితరులు వేదికనలంకరించారు. సభలో పాల్గొన్న అతిధులను ఎమ్మెల్యే నిమ్మల సన్మానించారు. మోహినీకుమారి స్వరకల్పన చేసిన వంద పాటల సిడిని జిల్లా టిడిపి అధ్యక్షురాలు, ఎంపి తోట సీతారామలక్ష్మి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 2కె రన్‌లో భారీసంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.