పశ్చిమగోదావరి

రసవత్తరంగా టెన్నిస్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 7: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నీలో తమ ప్రతిభ కనబరుస్తున్నారు. మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్ విభాగాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారు. మహిళల విభాగంలో ఆంధ్రా, పురుషుల సింగిల్స్‌లో తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు రాణిస్తున్నారు. రాకెట్‌లా దూసుకుపోతున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హుమేరా షేక్ తమిళనాడుకు చెందిన ఆరతిమునియంపై 4-6, 7-6 (4), 6-1 స్కోరుతో గెలుపొందింది. తమిళనాడుకు చెందిన శే్వతశ్రీహరి కర్ణాటకకు చెందిన అపూర్వపై 6-3, 6-1 స్కోరుతోను, గుజరాత్‌కు చెందిన ఈతీ మెహతా కర్ణాటకకు చెందిన ప్రతిభా నారాయణపై 6-2, 6-1 స్కోరుతో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యమలపల్లి సహజ పశ్చిమబెంగాల్‌కు చెందిన 3వ నెంబర్ సీడెడ్ క్రీడాకారిణి యుబ్రెరాని బెనర్జీపై 6-0, 6-0 స్కోరుతోను, 4వ సీడెడ్ క్రీడాకారిణి సారాయాదవ్ (మధ్యప్రదేశ్) తెలంగాణాకు చెందిన సింధు జనగమ్‌పై 6-2, 6-0తో గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తటవర్తి శ్రయ ఒడిస్సాకు చెందిన ఆనం ఆల్మాస్‌పై 6-0, 6-1 స్కోరుతోను, హర్యానాకు చెందిన హర్షిత పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్వాస్‌పై 5-7, 6-3, 6-4 స్కోరుతో, తమిళనాడుకు చెందిన నిత్యారాజ్‌బాబు అక్షయపై 6-3, 6-1 స్కోరుతో విజయం సాధించారు. ఇక పురుషుల విభాగానికి వస్తే కర్ణాటకకు చెందిన సూరజ్ ప్రబోధ్, రత్విక్ ఆనంద్ (తమిళనాడు), ఢిల్లీకి చెందిన గౌరంగ్, హరదీప్‌సింగ్, మహారాష్టక్రు చెందిన గునల్, తమిళనాడుకు చెందిన దక్షిణేశ్వర్ సురేష్, మహారాష్టక్రు చెందిన జయష్‌పునగ్లీ, ఆంధ్రాకు చెఐందిన షేక్ అబ్దుల్లా గెలుపొందారు. వీరంతా క్వార్టర్ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులతో తలపడతారు.

వారు పనిచేయరు..బదిలీ కారు!

ఆకివీడు పంచాయతీ పారిశుద్ధ్య విభాగంలో అలసత్వం-పాలకవర్గం, అధికార్లపై ప్రజల ఆగ్రహం
ఆకివీడు, ఫిబ్రవరి 7: ఆకివీడు పంచాయతీలో పలువురు ఉద్యోగుల పనితీరు పాలకవర్గానికి, అధికారులకు తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీ స్థాయికి ఎదిగినా పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగు పడకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆధికారుల తీరుపై విరుచుకు పడుతున్నారు. పంచాయతీలో ఇద్దరు శానిటరి మేస్ర్తిలు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు పర్మినెంటు, కాంట్రాక్టు పద్ధతిలో 60మందికి పైగా పనిచేస్తున్నారు. వీరందరికీ నెల నెలా లక్షలాది రూపాయలు జీతభత్యాలుగా చెల్లిస్తున్నారు. అయితే పంచాయతీ సమావేశాల్లో సిబ్బంది పనితీరు పట్ల పాలకవర్గ సభ్యులు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తంచేస్తునే ఉన్నారు. తమ వార్డుల పరిధిలో పారిశుద్ధ్యం మెరుగు పరచాలంటూ కార్యదర్శి ఠాగూర్‌కు మొరపెట్టుకుంటూనే ఉంటారు. గత కొనే్నళ్లుగా పంచాయతీలో ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టును అధికారులు నేటి వరకు భర్తీచేయలేదు. శానిటరీ మేస్ర్తిలుగా ఉన్న ఇద్దరి పనితీరుపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరికీ ఆకివీడు పంచాయతీలో ఉద్యోగం చేయడం ఇష్టం లేనట్లు ఉంటారు. పలుమార్లు వీరిద్దరూ ప్రమోషన్ కోసం ఒకరు, బదిలీ కోసం మరొకరు ఉన్నత అధికారులు చుట్టూ ప్రదక్షణలు చేశారు. వీరిద్దరితోపాటు మరో జూనియర్ అసిస్టెంట్ అంగవైకల్యం కావడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పలుమార్లు సర్పంచ్ గొంట్లా గణపతితోపాటు పలువురు వార్డు సభ్యులు వీరి తీరుతెన్నులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదు. పంచాయతీలో పనిచేయని ఉద్యోగుపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ఠాగూర్‌కు, ఉన్నత అధికారులకు ఫిర్యాదుచేశారు. పలు వార్డుల్లో అపారిశుద్ధ్యం పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల అమృతరావు కాలనీలో మెదడువాపు వ్యాధికి గురైన చిన్నారి సుప్రియను భీమవరంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దీనిపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని దుమ్మెత్తిపోస్తున్నా పాలకవర్గ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీలో జీతాలు తీసుకుంటూ పనిచేయని వారిని ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఏ పంచాయతీలోనూ పనిచేయని వారందర్నీ ఆకివీడు పంపించేస్తున్నారని పాలకవర్గ సభ్యులు ధ్వజమెత్తుతున్నారు. దీనివల్ల అపారిశుద్ధ్యం పేరుకుపోయి గ్రామమంతా కంపు కొడుతోందటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆకివీడు పంచాయతీపై దృష్టిసారించి పంచాయతీ అభివృద్ధికి కృషిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
దీనిపై కార్యదర్శి ఠాగూర్‌ను వివరణ కోరగా పనిచేయని ఉద్యోగుల వివరాలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై తాను ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పనిచేయని సిబ్బంది వైఖరి వల్ల తాను ఉన్నతాధికారుల మొట్టికాయలు తింటున్నానన్నారు.

నకిలీ బంగారంతో టోకరా!
-డిసిసిబి చాగల్లు శాఖలో రూ.2.32 కోట్ల రుణాలు
-రెవెన్యూ, బ్యాంకు అధికార్ల సమక్షంలో పోలీసుల స్వాధీనం
చాగల్లు, ఫిబ్రవరి 7: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి) చాగల్లు శాఖలో నకిలీ బంగారం కుదువపెట్టి బ్యాంకు సిబ్బంది సహకారంతో అక్రమ పద్ధతిలో రుణాలు పొందిన సొత్తును మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు సిఐ ఎం బాలకృష్ణ మాట్లాడుతూ 2014లో 27మంది నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి అక్రమ పద్ధతిలో రూ.2.32 కోట్ల రుణాలను పొంది బ్యాంకును మోసం చేశారన్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా రెవెన్యూ, బ్యాంకు అధికారుల సమక్షంలో అప్రయిజర్ పరిశీలన అనంతరం సొత్తును సీలువేసి స్వాధీనపరచుకొన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకులోని ముగ్గురు సిబ్బందికి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తును కోర్టుకి విచారణ సమయంలో అందజేయనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు ఎం హనుమంతరావు, కె సత్యనారాయణ, అప్రయిజర్ సత్యనారాయణ, వీఆర్వోలు బుద్ధేశ్వరరావు, మురళీ, ఎస్సై ఎం జయబాబు తదితరులు పాల్గొన్నారు.

15 రోజుల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటుచేయకపోతే
టోల్‌ప్లాజాలు మూసివేస్తాం
రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 7: జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానమయ్యే 384 గ్రామీణ రోడ్ల ప్రాంతంలో రంబుల్ స్ట్రిప్స్ 15 రోజుల్లో ఏర్పాటు చేయకపోతే టోల్‌ప్లాజాలను మూసివేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ రహదారిపై 163 చోట్ల గ్రామీణ రహధారుల అనుసంధానం అవుతున్నాయని అక్కడ రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటుచేస్తే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలు వేగాన్ని తగ్గించుకోగలుగుతారని లేకపోతే షడన్‌గా జాతీయ రహదారిపై వాహనాలు రావడం వలన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పదిహేను రోజుల్లోగా ఆయా ప్రాంతాల్లో నేషనల్ హైవే అధికారులు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటుచేయాలని అదేవిధంగా రాష్ట్ర హైవే రహదారులను అనుసంధానం చేసే 221 గ్రామీణ రోడ్ల వద్ద కూడా ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ అధికారులు పదిహేను రోజుల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటుచేయాలని లేనిపక్షంలో ఆయా శాఖల అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పదిహేను రోజుల్లోగా జిల్లాలోని 384 ప్రాంతాలలో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారా లేదా అని జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఏలూరు ట్రాఫిక్ డిఎస్‌పి శ్రీనివాసరావును కలెక్టర్ ఆదేశించారు. గత రెండున్నరేళ్ల నుంచి చెబుతున్నా ఎందుకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం లేదని కలెక్టర్ వివిధ శాఖల అధికారులను ప్రశ్నించారు. ఒంగోలు నుండి వైజాగ్ వరకు జాతీయ రహదారిలో చాలా అధ్వాన్నంగా ఉన్న జాతీయ రహదారి పశ్చిమగోదావరి సెక్షనేనన్నారు. నేటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ నెల 20వ తేదీ లోగా అమలుచేయాలని తిరిగి ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహిస్తానని ఆనాటికి పూర్తిస్థాయిలో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు ఇతర నిర్ణయాలు కచ్చితంగా అమలు జరిగి తీరాలని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 తర్వాత ఎన్‌హెచ్‌పై మద్యం షాపుల తొలగింపు
జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై 357 మద్యం షాపులు, బార్లు వున్నాయని అవన్నీ ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కచ్చితంగా తొలగించి తీరాలని వాటిని జాతీయ రహదారిపై కనిపిస్తే లైసెన్సు రద్దు చేయడమే కాకుండా సంబంధితాధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని ఏలూరు నగరంతోపాటు అన్ని పట్టణాల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేసి వాటిని సమీపంలోని పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేస్తామని దీని వలన ఎక్కడ ప్రమాదాలు జరిగినా నేరాలు జరిగినా తక్షణమే పోలీసులు స్పందించడానికి వీలు కలుగుతుందని ఈ విషయంపై అన్ని పురపాలక సంఘాలలో సిసి టివిలతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ అమలు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఏలూరులో అసలే ఇరుకు రహదారులుంటే ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు దర్శనమిస్తున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారం పర్మిషన్లు ఎలా ఇస్తున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఏలూరు నగరంలో వాహనాల మరమ్మత్తులు నిర్వహించకుండా ప్రత్యేకంగా ఆటో నగర్‌లోనే ఆయా షాపులు ఏర్పాటు చేయడం జరిగిందని, కావున అక్కడ మరామ్మత్తులుజరిగేలా చూడాలన్నారు. జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక ముందు జాగ్రత్త చర్యలు పటిష్టవంతంగా అమలుచేస్తామని జిల్లాలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ విధానాన్ని పటిష్టవంతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో రవాణా శాఖ ఉప కమిషనర్ సత్యనారాయణమూర్తి, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వైబి భాస్కరరావు, డి ఎంహెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి, ట్రాఫిక్ డి ఎస్‌పి శ్రీనివాసరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై సాయి శ్రీకాంత్ పాల్గొన్నారు.