పశ్చిమగోదావరి

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 20 : జిల్లాలో రెండు శాసనమండలి స్థానాలకు మార్చి 17వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి అయిదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి రాజకీయ పక్షాల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై ఆయన వివరించారు. జిల్లాలో మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, మంగళవారం నుండి 28వ తేదీ వరకు అభ్యర్ధుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా, డి ఆర్‌వో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఎలక్షన్ కమిషన్ నియమించిన దృష్ట్యా అభ్యర్ధుల నుండి దరఖాస్తులను వారికి అందజేయాల్సి వుంటుందని చెప్పారు. దాఖలైన నామినేషన్లను మార్చి 1వ తేదీన పరిశీలన జరుగుతుందని, మార్చి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుందని చెప్పారు. పోటీ అనివార్యమైతే మార్చి 17వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, కుకునూరు ఎంపిడివో కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. మార్చి 20వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని మార్చి 24వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అప్పటి వరకు మోడల్ కోడ్ అమలులో వుంటుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుత శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహనరావు, మేకా శేషుబాబు పదవీ కాలం ముగియడంతో ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పారు. జిల్లాలో 1246 మంది ఓటర్లు వున్నారని, అత్యధికంగా ఏలూరులో 440 మంది, నరసాపురంలో 360 మంది, కొవ్వూరులో 325 మంది, జంగారెడ్డిగూడెంలో 119 మంది, కుకునూరులో ఇద్దరు ఓటర్లు వున్నారని చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో 46 మంది జడ్పీటిసిలు, 895 మంది ఎంపిటిసిలు, 305 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నగర పంచాయితీ సభ్యులు, ఎక్స్ ఆఫీసియో మెంబర్లు, ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు. అభ్యర్ధులు పది వేల రూపాయలు నామినేషన్ పత్రంతో సమర్పించాలని, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులైతే 5 వేల రూపాయలు నామినేషన్‌తో డిపాజిట్‌గా సొమ్ము చెల్లించాల్సి వుంటుందని చెప్పారు. డి ఆర్‌వో కె హైమావతి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్ధులు తమ వాహనాలను వంద మీటర్లు దూరంలో పార్క్ చేసి రిటర్నింగ్ అధికారి వద్దకు రావాల్సి వుంటుందని, అభ్యర్ధితోపాటు అయిదుగురు మించి నామినేషన్ సమయంలో అనుమతించబోమని చెప్పారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే విషయంలో వివక్షత చూపుతున్నారని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నుల జాన్‌గురునాధ్ చెప్పగా జిల్లా అంతటా ఎటువంటి వివక్షత లేకుండా ఎన్నికల నిబంధనలు అమలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జెసి స్పష్టం చేశారు. సమావేశంలో బిజెపి నాయకులు నాగం శివ, రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఫీయుల్లాభేగ్, రాజనాల రామ్మోహనరావు, తెలుగుదేశం పార్టీ తరఫున అచ్యుతరావు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరుసు చిరంజీవి, గురునాధ్, బి ఎస్‌పి నాయకులు కారెం లెనిన్ తదితరులు పాల్గొన్నారు.