పశ్చిమగోదావరి

నామినేషన్ల పరిశీలన పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 1: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో బుధవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. ఈపరిశీలనలో రెండు నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా లేనందున తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు తెలిపారు. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలుకాగా వాటిలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా ఈపరిశీలన సందర్భంగా ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన నర్సాపురంనకు చెందిన మైలా వసంతరావు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తాను మద్దతు తెలిపినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయానని కాళ్ల జడ్పీటీసీ వర్రి శ్రీవెంకటరమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోటేశ్వరరావును కలిసి చెప్పగా రాతపూర్వకమైన ఫిర్యాదు ఇస్తే పరిశీలిస్తానని చెప్పడంతో ఈమేరకు వెంకటరమణ వినతిపత్రం సమర్పిస్తూ వసంతరావు అనే వ్యక్తి తనకు తెలియదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను మద్దతు తెలుపుతున్నట్లు తన సంతకంతో మంగళవారం సమర్పించిన నామినేషన్ పత్రం సరైంది కాదని, తాను ఏలాంటి సంతకం పెట్టలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని రాతపూర్వకంగా ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వసంతరావును వివరణ కోరగా ఆ సంతకం వెంకటరమణదేనని, ఇప్పుడు వచ్చి ఆ సంతకం తనది కాదంటే తానేమి చేయలేనని పేర్కొన్నారు. వసంతరావు సమర్పించిన నామినేషన్‌లో పదిమంది ఓటర్లు బలపర్చాల్సి ఉండగా అందులో వెంకటరమణ ఆ సంతకం తనది కాదని చెప్పడంతో బలపర్చినవారి సంఖ్య 9కి పడిపోవటంతో నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు. అంతకుముందు వెంకటరమణ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆమె వాస్తవంగా కాళ్ల జడ్పీటీసీ అవునా, కాదా అని నిర్ధారణ చేసేందుకు జడ్పీ సిఇఓ డి సత్యనారాయణను ఎన్నికల అధికారి పిలిపించారు. జడ్పీ సమావేశాలకు హాజరైన సందర్భాల్లో ఆమె చేసిన సంతకాలు కూడా పరిశీలించారు. మొత్తంమీద కాళ్ల జడ్పీటీసీ ఆమెనని సిఇఓ ధృవీకరించారు. అనంతరం వివిధ రికార్డులు తనిఖీ చేసి నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయటంతో ఆ ఫిర్యాదును రికార్డు చేసి నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మరికొన్ని లోపాలు కూడా బయటపడటంతో నిబంధనల మేరకు వసంతరావు నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా తొలుత ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. అధికారపార్టీకి చెందిన అభ్యర్ధులు అంగర రామ్మోహన్, మంతెన వెంకట సత్యనారాయణరాజు, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు నల్లి రాజేష్, డిఎస్‌ఎస్ ప్రసాద్, మేడపాటి సాయిచంద్రవౌళీశ్వరరెడ్డిల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో డిఆర్వో కట్టా హైమావతి, భూసేకరణ అధికారులు ఆర్‌వి సూర్యనారాయణ, పుష్పమణి తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఏలూరు, మార్చి 1: జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 37953 మంది విద్యార్ధులు హాజరుకావాల్సి ఉండగా 36108 మంది హాజరయ్యారు. 1845 మంది విద్యార్దులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఉదయం నుంచి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్ధుల హడావిడి ప్రారంభమైంది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పడంతో ఉరుకులు, పరుగులు మీద విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డిఐఓ ఖాదర్ తెలిపారు.
పదోతరగతి ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్ విధానం
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, మార్చి 1: జిల్లాలో ఈనెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి ఇన్విజిలేటర్లకు(టీచర్లకు) జంబ్లింగ్ విధానాన్ని అమలుచేస్తామని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై డిఇఓతో ఆయన సమీక్షించారు. టీచర్ల జంబ్లింగ్ విధానం మాన్యువల్‌గా కాకుండా పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా అమలుచేస్తామని, దీనివల్ల ఎక్కడాకూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, సిఫార్సులకు తావు ఉండదని కలెక్టరు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని పరీక్షాకేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామని, ప్రతిరోజు సాయంత్రం నిర్ధిష్టమైన డేటాను హార్డ్‌డిస్క్‌లో తనకు సమర్పించాలని, ఏరూంలో ఏం జరిగిందో పరిశీలిస్తానని, ఎక్కడైనా మాస్‌కాఫీయింగ్ జరిగినట్లు గుర్తిస్తే సంబంధితులపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధికశాతం ఉత్తీర్ణత సాధించడానికి మాస్ కాపీయింగ్ విధానం మంచిది కాదని, ప్రతిభగలవారే పాస్ కావాలే తప్ప దొడ్డిదారిన మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించి ఫలితాల్లో ఆగ్రస్ధానంలో ఉన్నామని చెప్పుకునే పరిస్దితి తమకు వద్దని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసుబందోబస్తును ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, డిఇఓ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
చిరుతపులి చర్మం స్వాధీనం
జంగారెడ్డిగూడెం, మార్చి 1: ఐదు నుండి పది లక్షల రూపాయల మధ్య బేరంపెట్టి విక్రయించేందుకు తరలిస్తున్న చిరుత పులి చర్మాన్ని వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖలోని వన్యప్రాణి సంరక్షణ విభాగం అసిస్టెంట్ కన్జర్వేటర్ ఎన్ రామచంద్రరావు విలేఖరులతో మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన బవిరిశెట్టి పవన్‌కుమార్ ఒక బ్యాగ్‌లో చిరుతపులి చర్మం తీసుకువెళుతుండగా పక్కా సమాచారంతో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో అరెస్టు చేసినట్టు తెలిపారు. అతని వద్ద బ్యాగ్ తనిఖీ చేయగా చిరుతపులి చర్మం లభించిందని, చర్మం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ చిరుత పులి చర్మాన్ని ఐదు నుండి పది లక్షల రూపాయలకు బేరం పెట్టారని, విక్రయించేందుకు తీసుకువెళుతుండగా ట్రాఫిక్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ సమాచారం మేరకు నిఘావేసి అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. చిరుతపులి, పులి, తాచుపాము, ఇతర జంతు చర్మాలను వివిధ రకాల వెబ్‌సైట్‌లలో అమ్మకానికి పెడుతున్నారని, దీనిలో భాగంగానే ఈ చర్మం కూడా ఆన్‌లైన్ విక్రయం జరిగి, కొనుగోలు చేసిన వ్యక్తికి రహస్యంగా తీసుకువెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ చిరుతపులి చర్మాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ సిసిఎంబి ల్యాబ్‌కు పంపుతామని చెప్పారు. ల్యాబ్ ఫలితాలను బట్టి చిరుతపులి వయస్సు, ఎప్పుడు చంపింది నిర్థారణ అవుతుందన్నారు. ఈ చిరుతపులిని పాపికొండల అభయారణ్యంలో చంపి ఉండవచ్చని, దీని వయస్సు సుమారు నాలుగేళ్లు ఉంటుందని, ఆరునెలల క్రితం చంపి చర్మం దాచి పెట్టి ఉంటారని భావిస్తున్నట్టు ఎసిఎఫ్ వివరించారు. పులి చర్మం, చిరుతపులి చర్మంపై కూర్చొని పూజలు చేస్తే అతీంద్రియశక్తులు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకంతోను, బ్యాగ్‌ల తయారీకి చర్మాలను ఎంత ఖరీదైనా మోజుతో కొనుగోలు చేస్తుంటారని చెప్పారు. వీటికి విదేశాలలో మోజు ఎక్కువగా ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి ధరలు ఉంటాయన్నారు. పవన్‌కుమార్‌ను అరెస్టుచేసి ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో పాపికొండ అభయారణ్యంలో వన్యప్రాణులు ఉన్నాయని ఎసిఎఫ్ చెప్పారు. పులి, చిరుతపులి, జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, కణుసు, అడవి దున్న, గొర్రగేదెలు సంచరిస్తుంటాయని చెప్పారు. వీటి సంరక్షణకు ఆ ప్రాంతంలో వేటగాళ్లను నిరోధిస్తున్నట్టు వివరించారు. వీటి సంరక్షణపై అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ దాడిలో వన్యప్రాణి సంరక్షణ విభాగం డిఎఫ్‌ఒ ఎన్ నాగేశ్వరరావు, స్థానిక అటవీ రేంజ్ ఆఫీసర్ నరసింహారావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల నుండి చేపల చెరువుల ప్రాంతానికి
గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, మార్చి 1: జిల్లాలో చేపల రవాణాకు అనువుగా ప్రతీ పల్లె నుంచి చేపల చెరువుల ప్రాంతానికి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధాన్యతా రంగాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ప్రతీ గ్రామంలో 200 ఎకరాలకు పైబడి వున్న చేపల చెరువులకు గ్రామం నుంచి రహదారి సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్ ఆర్ ఇజి ఎస్ కింద ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, రోడ్డు నిర్మాణానికి అవసరమైన మెటల్‌ను తీసుకురావడానికి అయిదు కిలోమీటర్ల పరిధి మాత్రమే అనుమతి వున్నందున అంతకుమించి దూరం వున్న ప్రాంతాల నుంచి గ్రావెల్ తీసుకురావడానికి అయ్యే ఖర్చును మత్స్య శాఖ సమకూరుస్తుందన్నారు. జిల్లాలో చేపల చెరువులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు 350 కోట్ల రూపాయల వ్యయం కాగల ప్రణాళికను ప్రభుత్వ అనుమతి కోసం సమర్పించడం జరిగిందని చెప్పారు. ఈ నిధులతో కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పంటలు వేయకుండా వేసినట్లు కాగితాలపై చూపించి కోట్లాది రూపాయలు సొమ్మును మంజూరు చేసిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల నుంచి సొమ్ము ఖచ్చితంగా రికవరీ చేస్తామన్నారు. జిల్లాలో మార్చి 29న పంట కాలువలు మూసివేస్తున్న దృష్ట్యా రబీ పంట విషయంలో ఎక్కడాకూడా సేద్యపునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జెసి-2 ఎంహెచ్ షరీఫ్, సిపి ఓ బాలకృష్ణ, ఫిషరీస్ డిడి జాకబ్ బాషా, ఉద్యానవన శాఖ ఎడిలు దుర్గేష్, విజయలక్ష్మి, మార్క్‌ఫెడ్ డిఎం నాగ మల్లిక తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే ఆదర్శంగా గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ
మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు
గోపాలపురం, మార్చి 1: గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి మల్లికార్జునరావు అన్నారు. బుధవారం ఆయన గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మినీ రైతుబజార్, నిమ్మ, మామిడికాయల గోదాములను పరిశీలించారు. అనంతరం కమిషనర్ మల్లికార్జునరావు విలేఖరులతో మాట్లాడుతూ నిర్జీవంగా ఉన్న కమిటీకి ఛైర్మన్ వెంకట్రావు జీవం పోసారని ప్రశంసించారు. గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిమ్మతోపాటు పశువుల సంత కూడా ఏర్పాటు చేశారన్నారు. త్వరలో మామిడికాయల క్రయ విక్రయాలతోపాటు మినీ రైతుబజారును ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కమిటీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో సుమారు 90 కమిటీల్లో నిత్యం వ్యాపారం జరిగేలా ఛైర్మన్లు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి కమిటీలు అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతున్నాయని కొనియాడారు. ఛైర్మన్ వెంకట్రావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పెట్రోలు బంకు నిర్వహించడానికి ప్రతినిధులు ముందుకు వచ్చారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉపయోగించే ఇంధనాన్ని సబ్సిడీపై అందజేస్తే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు, డైరెక్టర్ రాజశేఖర్, ఎఇ శ్రీనివాసరావు, కార్యదర్శి పాపారావు తదితరులు పాల్గొన్నారు.
పెరవలిలో రహదారిపై డ్రోన్ కెమెరాతో సర్వే
పెరవలి, మార్చి 1: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు బుధవారం డ్రోన్ కెమెరా సహాయంతో ప్రమాద ప్రదేశాలను గుర్తించారు. పెరవలిలో జాతీయ రహదారి మీద డ్రోన్ కెమెరాతో ఫొటోలు, వీడియోలను చిత్రీకరించారు. జాతీయ రహదారి వెంబండి సిద్ధాంతం నుండి హనుమాన్ జంక్షన్ వరకూ ఉన్న ప్రమాద ప్రదేశాలను గుర్తిస్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నందున నివారణా చర్యలు చేపట్టడంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ట్రాఫిక్ ఎస్సై పైడిబాబు, డ్రోన్ కెమెరా ఇన్‌ఛార్జి పి సతీష్, పెరవలి ఎస్సై పేరూరి నాగరాజు పాల్గొన్నారు.
బియ్యపుతిప్పలో షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు
కలె క్టర్ భాస్కర్
ఏలూరు, మార్చి 1: జిల్లాలోని బియ్యపుతిప్పలో 20 కోట్ల రూపాయల వ్యయంతో షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన చేపల చెరువుల అనుమతుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. చేపల చెరువుల రైతులకు వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, సముద్రంలో వేటకు వెళ్లి చేపలను బియ్యపుతిప్ప షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్‌కు తీసుకువచ్చి వాటిని విక్రయించుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. కొన్ని చోట్ల చేపల చెరువులకు అనుమతులు పొంది రొయ్యలు సాగు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా రొయ్యలసాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్య శాఖ డిడి జాకబ్ భాషా, ఇరిగేషన్ ఇ ఇ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, భూగర్భ జల శాఖ డిడి రంగారావు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపె
పోలీసుల దాడి
నల్లజర్ల, మార్చి 1: నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం శివారులో పేకాట స్థావరంపై అనంతపల్లి ఎస్సై వి వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టుచేసి వారి వద్ద నుండి రూ. 41 వేలను స్వాధీనం చేసుకున్నారు.
ఆకివీడులో నేతల విగ్రహాలకు ముసుగులు
ఆకివీడు, మార్చి 1: ఎమ్మెల్సీ కోడ్ అమలుకావడంతో ఆకివీడులోని పలు కూడళ్లల్లో ఉన్న నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. అయిభీమవరం రోడ్డు సెంటర్ నుంచి జానకమ్మ అసుపత్రివరకు ఉన్న ఎన్టీఆర్, వైఎస్సార్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు ముసుగులు తొడిగారు. అలాగే పలు ప్రాంతాల్లోని నాయకులు ఫ్లెక్సీలు, జెండాలు, హోర్డింగులను తొలగించారు. కార్యదర్శి నందేటి ఠాగూర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
మున్సిపాల్టీల్లో నిధులు వెనక్కి!
* అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కోడ్ * మార్చి 31తో ముగియనున్న 13వ ఆర్థిక సంఘం గడువు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మార్చి 1: ఎన్నో ఏళ్ల క్రితం విడుదలయ్యాయి 13వ ఆర్థిక సంఘం నిధులు. ఇవి పురపాలక సంఘాల పురోగతికి ఎంతగానో దోహదపడతాయి. కాని ఆ నిధుల సంగతి పాలకు పట్టలేదు. ఫలితంగా 13వ ఆర్థిక సంఘం నిధులు మార్చి 31వ తేదీతో ముగియనుంది.
ఈ నెల 31వ తేదీతో 13వ ఆర్థిక సంఘం గడువు ముగియనుంది. ఈ గడువు ముగిస్తే ఇక ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయినట్టే. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలకు భారీగానే నిధులు వచ్చాయి. ఈ నిధులతో అనేక పనులు చేయవచ్చు. అయితే ఈ నిధులతో పాటు 2014కు చెందిన నిధులు 2015లో విడుదలయ్యాయి. దీంతో ఒకేసారి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని కొత్తగా వచ్చిన పాలకవర్గాలకు వీటిపై అవగాహన లేకపోవడంతో నిధులు వ్యయం పూర్తిస్థాయిలో చేయలేకపోయారు. అంతేకాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం నిధుల వరద పారించింది. అలాగే రాష్టస్థ్రాయిలో కూడా పురపాలక సంఘాలకు నిధులను ఇచ్చారు. 13వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, 14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, బిఆర్‌జిఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఈ విధంగా అనేక మార్గాల ద్వారా పురపాలక సంఘాలకు నిధులు వరదల్లా వచ్చి పారాయి. కాని కనీసం 13వ ఆర్థిక సంఘం నిధులే ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి.
ఒక అభివృద్ధి పనులే చేయలేని పరిస్థితుల్లో ఉన్న పురపాలక సంఘాలకు ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకిగా మారింది. చివరి నిమిషంలో పురపాలక సంఘాల్లోని నిధులకు సంబంధించి అనేక పనులు సిద్ధం చేశారు. వీటిని మార్చి 31వ తేదీలోపు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. వీటి విలువ సుమారు రూ.230 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తమీద పురపాలకలకు అవగాహన లేక.. ఎమ్మెల్సీ కోడ్‌తో 13వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి మళ్లనున్నాయి.