పశ్చిమగోదావరి

అయితే ఆన్‌లైన్... లేకుంటే నగదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 5: నెలల తరబడి రేషన్ సరుకుల కోసం నరకం చూసిన కార్డుదారులకు ఎట్టకేలకు కొంత ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఇకనుంచి జిల్లాలో రేషన్‌డిపోల్లో కుదిరితే ఆన్‌లైన్, లేకుంటే నగదుతో సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంతకాలం కార్డుదారుల బాధలు అన్నీఇన్నీ కాదని, నగదురహితంతో కష్టాలు తప్ప కార్డుదారులకు ప్రయోజనం ఏమిలేదని అటు రాజకీయపార్టీలు, ఇటు సామాన్య జనంతోపాటు డీలర్లు కూడా గగ్గోలుపెడుతూనే వచ్చారు. కాగా ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి డిపోల్లో ఈవెసులుబాటు కల్పించారు. ఈ వెసులుబాటుకు ముందు ఈనెలలో ఈ అయిదు రోజుల్లోనూ 20శాతం మంది సరుకులు తీసుకుంటే నాలుగుగంటల తర్వాత దాదాపు మరో 20శాతానికి పైగా కార్డుదారులు సరుకులు తీసుకున్నారంటే నగదురహిత విధానం వారిని ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తోందో అర్ధమవుతుంది. వాస్తవానికి దేశవ్యాప్తంగానే ఈనగదురహిత ఈవిధానం గత ఏడాది నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు అనంతరం తెరపైకి రాగా జిల్లాలో మాత్రం అదేతరహా సాంకేతికతను అంతకుముందునుంచే బలవంతంగా అమలులోకి తీసుకువచ్చారు. ఇక పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రచారం అంతా నగదురహితంపై సాగిపోవటంతో అప్పటినుంచి ప్రధానంగా రేషన్‌డిపోల్లో నిర్బంధ నగదురహిత విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేశారు. ఇక గత రెండు,మూడునెలల నుంచి యంత్రాంగం పూర్తిస్ధాయిలో దీనిపైనే దృష్టి పెట్టింది. కొన్నిరోజుల పాటు కార్డుదారులు ఈకష్టాలను అనుభవించినా చివరకు వారిలోనూ అసంతృప్తి, అసహనం శృతిమించి పరిస్ధితి డీలర్లపై దాడుల వరకు కూడా వెళ్లింది. ఆ సమయంలోనే నిర్బంధ నగదురహిత విధానంలో వెసులుబాటు ఇస్తేనే మంచిదని అటు పార్టీలు, ఇటు సామాన్య జనం కూడా ఎన్ని డిమాండ్లు చేసినా యంత్రాంగం నిర్ణయంలో మార్పు లేకుండా పోయింది. అయితే తాజాగా ఈనెల రేషన్‌సరుకులు తీసుకునే విధానాన్ని పరిశీలించినా రోజులు గడుస్తున్న కొద్ది స్వల్ఫశాతంలోనే రేషన్‌సరుకులు విడుదలవుతూ అత్యధికశాతం మంది డిపోల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే వచ్చారు. ఈనేపధ్యంలోనే కొయ్యలగూడెంలో ఈసరుకుల రగడ కూడా చివరకు పోలీసుస్టేషన్‌కు చేరింది. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు రాష్టమ్రంత్రి పీతల సుజాత కూడా ఈవిషయంలో స్పందించాల్సిన పరిస్దితి వచ్చింది. నిర్బంధ నగదురహిత విధానం సరికాదని, అవకాశం ఉన్నచోట్ల నగదు లావాదేవీలు కూడా నిర్వహించాలని సూచించారు. ఆనేపధ్యమో, లేక జిల్లాలో వివిధ డీలర్ల నుంచి వస్తున్న విమర్శలే గాని అధికారయంత్రాంగం ఆదివారం సాయంత్రం నాటికి తన నిర్ణయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిప్రకారం ఇకనుంచి కుదిరితే ఆన్‌లైన్‌లోను, అలాకాకుంటే నేరుగా నగదు లావాదేవీలతో రేషన్‌సరుకులు ఇచ్చే విధానాన్ని అమలుచేయనున్నారు. అయితే నగదురహిత విధానంపై అతిమక్కువతో ఉన్న యంత్రాంగం ఈ వెసులుబాటును ఎంతకాలం కొనసాగిస్తుందో వేచిచూడాలి. జిల్లా యంత్రాంగం తీసుకున్న వెసులుబాటు నిర్ణయం పట్ల జిల్లాలోని రేషన్‌షాపు డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్యకర్తలే పార్టీకి కొండంత బలం
నరసాపురం ఎంపి గోకరాజు
ఆకివీడు, మార్చి 5: కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అని నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు అన్నారు. ఆదివారం స్థానిక క్రిస్టియన్ పేటకు చెందిన మార్టిన్ లూధర్, బిజెపి ఆకివీడు మండల ప్రతినిధి నేరేళ్ళ పెదబాబు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా లూధర్‌కు ఎంపి గోకరాజు గంగరాజు కండువాకప్పి పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కులమత వర్గాల బేధాలు లేకుండా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రధానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. బిజెపి మండల ప్రతినిధి నేరేళ్ళ పెదబాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గంలో బిజెపిని మరింత బలపడేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి పట్ట అధ్యక్షులు ఎర్రా రఘు పాల్గొన్నారు.

పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులు
మే నెలాఖరులోగా పూర్తిచేయాలి
మంత్రి దేవినేని
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మార్చి 5: పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులు మే నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరు అక్విడెక్ట్ నిర్మాణ పనులను ఆదివారం మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ నిర్మాణంలో భాగంగా ఇంతవరకు 143 స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తయిందని, 86 స్ట్రక్చర్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన బ్రిడ్జిలు, లైనింగ్ తదితర 23 పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రానున్న వ్యవసాయసీజన్ నాటికి పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా కృష్ణాడెల్టాకు 100 టిఎంసిల నీటిని సాగు,తాగునీటి అవసరాలకు వినియోగిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నుండి 2018నాటికి గ్రావిటీ ద్వారా సాగు,తాగునీటిని అందిస్తామని, 2019నాటికి ప్రాజెక్టును పూర్తిస్ధాయిలో నిర్మిస్తామన్నారు. పట్టిసీమ నీటి ద్వారా మెట్టప్రాంతంలోని రైతులు ఆయిల్‌పాం, మొక్కజొన్న, ప్రత్తిపంటలు పండిస్తూ అధికదిగుబడులు సాధిస్తున్నారని, అంతేకాకుండా కారంచేడు రైతులు 50నుండి 60బస్తాల పంట దిగుబడి సాధించారన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పధకం కుడి ప్రధాన కాల్వ ద్వారా గోదావరి జలాలు దెందులూరు రైతాంగానికి, ప్రజలకు ప్రధాన జీవనాధారం అయ్యాయన్నారు. గోదావరి జలాలతో దెందులూరు నియోజకవర్గంలో 45నుండి 50 బస్తాలకు పైగా ధాన్యాన్ని రైతాంగం పండిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పట్టిసీమ ఎత్తిపోతల పధకం ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హెల్దీ పూళ్ల 5కె రన్
భీమడోలు, మార్చి 5 : ఆరోగ్య పరిరక్షణలో నడకకు ప్రాధాన్యత వుందని, ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజూ నడవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సూచించారు. భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన సూర్య వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్దీ పూళ్ల పేరుతో ఆదివారం హ్యాపీ 5కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూళ్ల గ్రామం నుంచి ఎం ఎం పురం గ్రామం వరకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. పోటీలో పాల్గొన్నవారితోపాటు ఎమ్మెల్యే కూడా నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ధృఢత్వానికి నడక సహకరిస్తుందని సూచించారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సూర్యా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పత్సా వెంకటేశ్వరరావు, వి సుగుణాకర్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వివి ఆర్ పార్ధసారధి, సొసైటీ అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్, పూళ్ల పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ అధ్యక్షుల నోచర్ల శ్రీనివాసరావు, వి సుగుణాకర్, ఎస్ నరసింహారావు, కందులపాటి శ్రీను, కేతినీడి విశే్వశ్వరరావు, పి ఆంజనేయులు, గోవర్ధన రామారావు, గ్రంధపాలకులు కె శ్రీనివాసరావు, మండే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 72 సంవత్సరాలు వయస్సున్న పి సత్యావతి, 66 సంవత్సరాల వయస్సున్న గుళ్ల నూకరాజులు ఈ రన్‌లో పాల్గొనడం విశేషం.

ఏప్రిల్ 1 నుండి ఇంటింటా చెత్తసేకరణ
గనుల, స్ర్తి శిశు సంక్షేమ శాఖల మంత్రి సుజాత
లింగపాలెం, మార్చి 5: జిల్లాలో ఏప్రిల్ 1 నుండి ప్రతి పల్లెల్లో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని రాష్ట్ర గనుల, స్ర్తి శిశు సంక్షేమ శాఖల మంత్రి పీతల సుజాత తెలిపారు. లింగపాలెంలోని జూబ్లీనగర్, లింగపాలెం శివారు జూబ్లీనగర్ చర్చి ఆవరణలో రెవరెండ్ ఫాదర్ బాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాలోని 903 డంపింగ్ యార్డులకు చెత్తను తరలించి వర్మీకంపోస్టుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ గ్రామం అయితే శుభ్రంగా ఉంటుందో, ఆ గ్రామంలో ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. పరిశుభ్రతపై జిల్లాలో 2019 నాటికల్లా సమగ్ర ప్రణాళిక అమలుచేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం వల్ల 70 శాతం మంది అనారోగ్యాలకు గురవుతున్నారని, ఈ వాస్తవాన్ని గుర్తించి గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పూర్తిగా సహకరించాలన్నారు. ఇందుకు అందరిలో చైతన్యం రావాలని కోరారు. ఎక్కడైతే మొక్కలు పెంచుతారో అక్కడ కాలుష్యం లేని వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ ఏడాది వెయ్యి కిలోమీటర్ల మేర జిల్లాలో సిసి రోడ్లను తీర్చిదిద్దామన్నారు. మరుగుదొడ్డి లేనివారు వెంటనే నిర్మించుకుంటే ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల పొడవునా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ విధానం అమలు చేస్తున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామన్నారు. జిల్లాలో ఈ నెలాఖరునాటికి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి 3లక్షల ఐఎస్‌ఎల్ నిర్మాణ పనులు వేగవంతంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఉపాధ్యక్షుడు సిఎల్ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 13,864 గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, రహదారులపై చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి సుజాతను, స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ సిఎల్ వెంకట్రావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ బాల, లింగపాలెం సర్పంచ్ కేతిన శ్రీహరి, తహసీల్దార్ సోమశేఖర్, ఎంపిడిఒ కార్యాలయ సూపరింటెండెంట్ వాణి, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అబ్రహం, స్థానిక నాయకులు గద్దే వెంకటేశ్వరరావు, కొణిజర్ల సర్పంచ్ లక్కపాము కుటుంబరావు, డాక్టర్ కర్రా రాజారావు, చెన్ను శ్రీనువాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రాక్షలకు రూ.25వేలు అందజేత
ఆచంట, మార్చి 5:అతుకులు లేకుండా అశోకచక్రంతో కూడిన జాతీయజెండాను నేసిన చేనేత కళాకారుడు రుద్రాక్షల సత్యనారాయణకు నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు రు. 25వేలు నగదు ప్రోత్సాహకంగా అందించారు. ఆదివారం ఆచంట వేమవరంలో చేనేతకార్మికుడు రుద్రాక్షల సత్యనారయణ ఇంటికి స్వయంగా వెళ్ళి అభినందించారు. దేశంలో ఎవరూ చేయని విధంగా నేసిన జెండా గురించి స్వయంగా ప్రధాని నరేంధ్రమోదీ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. దీనికి సంబంధించిన కొలతలతో జాతీయపతాకాన్ని రూపొందిస్తే ఎర్రకోటపై దీనిని ఎగురవేసే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తగిన ఆర్ధిక స్థోమత లేకున్నా దేశభక్తితో చేసిన ఈ ప్రయత్నానికి ప్రోత్సాహకంగా రూ.25వేలు అందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ తల్లి దండ్రులను శాలువాతో సత్కరించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పీటిసి బండిరామారావును కలుసుకున్నారు. కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు ముచ్చర్ల నాగసుబ్బారావు, జివి మాధవశర్మ, మనె్న వీరాస్వామి, అందే బసవ గణపతి, జక్కంశెట్టి సత్యనారాయణ, దేవి జయరాం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించను
ప్రభుత్వ విప్
చింతమనేని
ఏలూరు, మార్చి 5 : అధికారులుగానీ, ఉద్యోగులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపిపి మోరు హైమావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రానున్న వేసవిలో ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మంచినీటి చెరువులను నీటితో నింపాలని సూచించారు. ఇదే క్రమంలో కాలువ నుంచి వస్తున్న నీటిని చేపల చెరువులకు పంపవద్దని హెచ్చరించారు. మండలంలో నిర్మాణంలో వున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు నూరుశాతం ఈ వారంలోనే పూర్తికావాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దుర్వినియోగానికి పాల్పడిన వారికి, ప్రోత్సహించిన వారికి జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు. పాత మరుగుదొడ్లకే రంగులు వేసి కొత్త యూనిట్లుగా చూపించి బిల్లులు చేయించుకుంటున్నారన్న విషయం ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయని, దానిపై కలెక్టర్ కూడా విచారణ వేశారని తెలిపి పై విధంగా స్పందించారు. దెబ్బతిన్న మినుము పంట నష్టపరిహారాలను అందించేందుకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివిధ శాఖల ప్రగతిపై ఆరా తీశారు. ఎంపిడివో, ఎంపిపి, జడ్పీటిసిలు మండలంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, నిర్మాణంలో వున్న వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర విషయాలపై మండలమంతా తిరిగి ఎప్పటికప్పుడు ప్రగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదవులు తీసుకోవడమే కాదని, పనులు కూడా చేయాలని ఎంపిపి, జడ్పీటిసిలకు చురక వేశారు. అదే ఎంపిడివోను ఉద్దేశించి కార్యాలయానికే పరిమితం కావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, మండల తహశీల్దార్ కెవి చంద్రశేఖరరావు, ఎంపిడివో డాక్టర్ ఎన్ ప్రకాశరావు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ కార్యదర్శులు హాజరయ్యారు.

గిరిజనుల చేపలవేటను అడ్డుకున్న గ్రామస్థులు

*ఇరు వర్గాల ఘర్షణ*పలువురికి గాయాలు:కేసు నమోదు
జంగారెడ్డిగూడెం, మార్చి 5: మండలంలోని తిరుమలాపురం తామర చెరువులో ‘పోటు’ పేరుతో ఏజన్సీ ప్రాంతం నుండి ఆదివారం గిరిజనులు గుంపులు గుంపులుగా చేపల వేటకు తరలిరావడంతో గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గిరిజనులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఏజెన్సీలో రవ్వారిగూడెం, ఇటికిలకోట, మడకంవారిగూడెం, కన్నాపురం తదితర గ్రామాల నుండి గిరిజనులు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ చెరువులో అక్రమంగా ప్రవేశించి చేపలు వేటాడి పట్టుకుపోయారు. గిరిజనులు చేపలు వేటాడుతుండగా మాజీ సర్పంచ్ మరీదు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో సుమారు పది మంది గ్రామస్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో గాడి శ్రీను మానుకొండ సుబ్బారావులను చికిత్సకై ఏరియా ఆసుపత్రికి తరలించారు. రవ్వావారిగూడెంనకు చెందిన గిరిజనుడు మడకం కృష్ణను కొద్దిసేపు గ్రామస్థులు నిర్బంధించారు. ఘర్షణపై చెరువుపాటదారు యాగంటి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై ఎం కేశవరావు రవ్వావారిగూడెంనకు చెందిన మడకం కృష్ణ, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఏజన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చెరువుల్లో పోటు పేరుతో గిరిజనులు గుంపులుగా వచ్చి చేపలు వేటాడి పట్టుకు పోవడం సర్వసాధారణం. తామర చెరువులో పాటదారు చేపలు పట్టుకోకుండానే గిరిజనులు పోటుకు వచ్చేసారు. దీనితో చెరువులో చేపలు ఖాళీ అయ్యాయి. ఇఒ పిఆర్‌డి ఆదేశాల మేరకు 2016-17 సంవత్సరానికి ఈ చెరువులో చేపలు పెంచేందుకు యాగంటి సుబ్రహ్మణ్యం పాడుకున్నారు. ఆయన అదే గ్రామానికి చెందిన వూటుకూరి సత్య వెంకట శ్రీనివాసరావుకు సబ్ లీజుకు ఇవ్వడంతో ఆయన పెట్టుబడి పెట్టి చేపలు పెంచారు. తాను ఏటాదికి 1.15 లక్షల రూపాయల చొప్పున మూడు సంవత్సరాలకు 4.5 లక్షలు పంచాయతికి చెల్లించే విధంగా పాడుకున్నట్టు యాగంటి సుబ్రహ్మణ్యం చెప్పారు. గిరిజనలు చేపలు వేటాడి పట్టుకు పోవడంతో తీరని నష్టం సంభవించిందని వాపోయారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్సై ఎం కేశవరావు తెలిపారు.
భూగర్భ జలాలను బలోపేతం చేసేందుకు
వినూత్న విధానాలు అమలుచేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మార్చి 5 : జిల్లాలో భూగర్భ జలాల అందుబాటు రానురాను తగ్గిపోతున్న నేపధ్యంలో వాటిని బలోపేతం చేసేందుకు వినూత్నమైన విధానాలను అమలుచేయాల్సిన అవసరం వుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామంలోని రైతు చిలకలపూడి నరేంద్ర పొలంలో వేసిన ఇంజక్షన్ బోర్‌వెల్‌ను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నానాటికి తగ్గిపోతున్న భూగర్భ జలాల మట్టాలను పెంచవలసిన అవసరం వుందని, దీనిలో భాగంగా పోలవరం కుడికాలువ వెంబడి ఇంజక్షన్ బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఆశాజనకమైన ఫలితాలను సాధించవచ్చునని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయో అంచనా వేసి జింక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో అధ్యయనం చేస్తే ఇలాంటి విధానాన్ని మిగిలిన ప్రదేశాల్లోని పెద్ద, చిన్న కెనాల్స్ వెంబడి కూడా అవకాశం ఉన్న ప్రాంతాలలో అమలులోనికి తీసుకురావచ్చునని చెప్పారు. ఇంజక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటుకు కేవలం ఒక సెంటు భూమి మాత్రమే అవసరం ఉంటుందని, భూసేకరణ సమస్య ఉండదని, ఈ బోర్‌వెల్ నిర్మాణానికి కేవలం 3.5లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. కాల్వల ద్వారా వరదలు వంటి సమయాల్లో మిగులు జలాలతో ఈ బోర్‌వెల్‌ను రీఛార్జి చేసుకోవచ్చునని, ఇంత తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ విధానం ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. ఇంజక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటుచేయటంలో పెదవేగి మండలాన్ని ఒక పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి మరిన్ని బోర్‌వెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు మంత్రి సూచించారు. త్వరలో ఈ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జలవనరులశాఖ ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్ తదితరులు ఉన్నారు.

రోగ నిరోధకానికి మరిన్ని పరిశోధనలు
పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మార్చి 5: రోగుల సంఖ్య పెరుగుతోంది...దానికి అనుగుణంగానే రోగ నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనల సంఖ్య కూడా పెరిగిందని పద్మభూషణ్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. భీమవరం హాస్పిటల్ ఆవరణలో ఆదివారం గ్యాస్ట్రో ఎంట్రాలజీలో వస్తున్న మార్పులు అందుబాటులోకి వచ్చిన వైద్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వైద్యరంగంలో నిరంతరం శోధన ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు మెరుగైన వైద్యాన్ని రోగులకు అందించవచ్చని అన్నారు. 20 ఏళ్ల క్రితం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి ఆంత ప్రాముఖ్యత ఉండేది కాదని, ఇప్పడు వస్తున్న మార్పులు కారణంగా ఈ విభాగం చదివే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ఆహార అలవాట్లలో మార్పులు, పర్యావరణ కాలుష్యం వంటి వాటితో రోగాలు పెరుగుతున్నాయన్నారు. మెడిసిన్ అంటే సైన్సు కాదని స్పష్టం చేశారు. రోగిని అర్ధం చేసుకుని మాట్లాడటం ఒక కళ అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక వైద్యం దానికి సంబంధించిన అంశాలపై వైద్యులకు ఆయన ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ జివి రావు తెలిపారు. ఆపరేషన్‌లకు సంబంధించిన వాటిపై ఆయన ప్రజెంటేషన్ చేశారు. రోబోటిక్ వైద్యం కూడా అందుబాటులోకి వచ్చిందని, ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆపరేషన్‌ల ఫెయిల్యూర్ల సంఖ్య బాగా తగ్గిందని అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు కలుగుతుందన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్స్‌లోకూడా ఇటువంటి సదస్సును ఏర్పాటు చేస్తామని ఎంపి గోకరాజు గంగరాజు ప్రకటించారు. దీనివల్ల అక్కడ చదువుతున్న వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, జివి రావులు సహకరించాలని ఆయన కోరారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి, హాస్పటల్ ఎండి జి గోపాలరాజు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కెవి కృష్ణంరాజు తదితరులు మాట్లాడారు. అనంతరం పద్మభూషన్ అందుకున్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ జివి రావులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, ఐఎంఎ వైద్యులు పాల్గొన్నారు.