పశ్చిమగోదావరి

లెక్క తేల్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 11: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని కుదిపేసి, వివిధ పార్టీల నాయకులను పోలవరం బాట పట్టించిన వివాదాల సుడికి పూర్తిస్దాయిలో తెరవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారు. విపక్షనేతల విమర్శలకు దీటుగా సమాధానం చెపుతూనే లెక్కాపద్దు తేల్చడం లేదన్న విమర్శలను కూడా లెక్కలతో తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన హామీ మేరకు సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనుల తీరును పరిశీలించి అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ప్రశ్నల సుడిలో చిక్కుకుపోయిన పోలవరం వ్యవహారాన్ని తన రాజకీయ అనుభవంతోను, సాంకేతిక అంశాలతోనూ జమాపద్దుల వివరాలతోను సరిచేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014నుంచి ఇంతవరకు జరిగిన ఖర్చుల వివరాలను వివరిస్తూనే కేంద్రం నుంచి అందిన నిధుల వివరాలను చెప్పారు. అదేవిధంగా అంచనా వ్యయం భారీగా ఎలా పెరిగిందన్న ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. 2013లో కేంద్రం చేసిన భూసేకరణ చట్టం వల్లే పునరావాసం విషయంలో అంచనా వ్యయం 11రెట్లు పెరిగిపోయిందని వివరించారు. మీరుచేసిన చట్టాన్ని అమలుచేయాలా, ఇంకేం చేయాలన్న విషయం మీరే తేల్చాలని బంతిని కేంద్రం కోర్టులోకి పంపించారు. ఇలాంటి భారీ బహుళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారికి తగిన విధంగా పరిహారం అందించినప్పుడే సార్ధకత ఉంటుందన్నారు. కేంద్ర చట్టం ప్రకారం ఇక్కడ నిర్వాసితులయ్యే 95వేల కుటుంబాలకు దాదాపుగా 16.50లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నామని వివరించారు. పునరావాసానికి అంతెందుకని ప్రశ్నించేవారు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న గిరిజన కుటుంబాలకు పరిహారం ఇవ్వటం తప్పా అన్న అంశాన్ని తేల్చుకోవాలన్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సాంకేతిక అంశాల విషయంలో విమర్శలను కూడా ఆయన దీటుగానే తిప్పికొట్టారు. ఇన్నిసార్లు పర్యటించినా తనకే కొన్ని సాంకేతిక అంశాల విషయంలో అవగాహన పూర్తిగా రాలేదని, జగన్మోహన్‌రెడ్డి వంటివారు కాంక్రీట్ అంటే ఏమిటో తెలియకుండా, డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో అర్ధం కాకుంఢా విమర్శలు చేయటం సరికాదన్నారు. ఇదే సమయంలో మీడియా కూడా వారు వ్యవహరించాల్సిన తీరుపై హితవు పలికారు. ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నవారిని మీరే నీలదీయాలని, ఇప్పుడు మీరు అలాకాకుండా ఫలానా అయన ఇలా అన్నారు, మీరు ఏమంటారంటూ ప్రశ్నలు అడుగుతున్నారని అలాకాకుండా వారినే నిలదీస్తే ఇలాంటి వాళ్లు తోక ముడుచుకుంటారని చెప్పారు. ఈప్రాజెక్టు అందరి కోసం నిర్మిస్తున్నదని, అంతా కలిసి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని మీరు కూడా రాష్ట్భ్రావృద్ధిలో ఈవిధంగా భాగస్వాములు కావాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరైనా అడ్డుపడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా సహకరిస్తే నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. కొంతమంది ప్రభుత్వానికి సహకరించకపోగా కేంద్ర ప్రభుత్వం వద్ద పలు ఆరోపణలు చేస్తున్నారని, దాని వలన రాష్ట్రానికే నష్టమన్న వాస్తవాన్ని గుర్తించాలని, ప్రతిదాన్ని రాజకీయం చేయవద్దని ఆయన హితవు పలికారు. కొంతమంది సన్నాయినొక్కులు నొక్కుతున్నారని, అటువంటి వారి బండారం కూడా బట్టబయలవుతుందని పేర్కొన్నారు. ఎంతమంది అడ్డుపడినా 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉడుంపట్టు పట్టానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల, రైతుల సెంటిమెంటుగా మారిన ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మరోసారి చర్చించి కేంద్ర సహకారాన్ని తీసుకుంటానని, కేంద్ర ప్రభుత్వం ఏ సలహా ఇచ్చినా దాన్ని అమలు చేసేందుకు తాను కట్టుబడి వున్నానని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో పునరావాసం, భూసేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, ఈ విషయంలో మాట నిలబెట్టుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ శే్వతపత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారని, అయితే ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడి చేస్తుండగా ఇంకా శే్వత పత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మూడు సంవత్సరాలుగా వారం వారం పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు పనులను సమీక్షించడంతోపాటు పర్యవేక్షణ జరుపుతున్నామని, ఇంతకన్నా ఇంకెవరైనా ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కాంక్రీటు వర్కు తప్ప మిగిలిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే సీజన్‌కు గ్రావిటీతో నీరు ఇచ్చేందుకు కృతనిశ్చయంతో వున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 12567 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని, దీనిలో 4329 కోట్లు కేంద్రం ఇప్పటికే చెల్లించిందని, ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వుందని చెప్పారు. తప్పుడు విధానాలతో ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించాలని, లేనిపోని ఆరోపణలు చేయాలని ప్రయత్నిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, అప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు భావితరాలకు ఆస్థిగాను, భద్రతగాను ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపిలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జడ్పీ మాజీ ఛైర్మన్ కె జయరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.