పశ్చిమగోదావరి

ఉద్యమానికి విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, ఏప్రిల్ 20: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకు తెలుగుదేశం పార్టి చిత్తశుద్ధితో చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండిలోని మహాత్మాగాంధీ ప్రసంగించిన చారిత్రాత్మక గాంధీ సెంటరులో గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే శివరామరాజు హోదా దీక్ష శుక్రవారం ఉదయం చేపట్టారు. ఆయనతో పాటు ఉండి ఏఎంసీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, వైస్ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, ఆకివీడు ఏఎంసీ ఛైర్మన్ మోటుపల్లి రామవరప్రసాద్, జడ్పీటీసీలు కరిమెరక వెంకట సత్యతులసి, వెంకటరమణ, కోఆప్షన్ సభ్యులు గేదల జాన్ దీక్షల్లో పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం సాయంత్రం 7.15 నిమషాలకు టీడీపీ నేత కాగిత మహాంకాళి నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే దీక్షను విరమింపజేశారు.

ఎమ్మెల్యే పులపర్తి దీక్ష
భీమవరం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా శుక్రవారం నాడు భీమవరంలోని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దీక్ష చేశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ఆర్టీసి రీజియన్ చైర్మన్ మెంటే పార్ధసారధి దీక్షలో పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, భీమవరం మాజీ ఎంపీపీ, పార్టీ అధ్యక్షులు బర్రె నెహ్రు, వీరవాసరం మండల అధ్యక్షులు సత్యనారాయణ హాజరయ్యారు. జడ్పీటీసీ బర్రె విజయ, మున్సిపల్ చైర్మన్ కోటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

హోరెత్తిన ‘ధర్మ పోరాటం’
ఏలూరు, ఏప్రిల్ 20 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వస్తున్న ప్రజానీకం హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్న నమ్మకంతో వెల్లువలా ముందుకు వస్తున్నారు. శుక్రవారం తన జన్మదినం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతూ స్థానిక వసంతమహల్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ఆధ్వర్యంలో భారీ ధర్మపోరాట దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనం నుంచి విశేష స్పందన రావడం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. శిబిరానికి వేలమంది తరలి వచ్చి తమ సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించారు. దీనిలో వివిధ పార్టీలు, పార్టీల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వుండటం విశేషం. మొత్తం మీద ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా నిర్వహించిన ఈ దీక్ష ఘనంగా విజయవంతమైందనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఎంపి ప్రభృతులు పాల్గొని తమ వంతు నిరసనను తెలిపారు. డప్పులు వాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శిబిరాన్ని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి పితాని సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కె ఎస్ జవహర్‌లు ప్రారంభించారు. అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ దీక్ష ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే మద్దతు పలికేందుకు వందలాది మంది తరలి రావడం తెలుగుజాతి ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. 2014లో రాష్ట్రాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు ముక్కలు చేసిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మొండిచేయి చూపుతోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంపై ధర్మపోరాటం సాగించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరతామని ఆయన చెప్పారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ తెలుగుజాతి జోలికి వస్తే ఎవరైనా మాడి మసైపోతారని చెప్పారు. ధర్మపోరాటం చేస్తున్న తెలుగుజాతికి అన్యాయం చేయాలని చూస్తే కేంద్రానికి తగిన రీతిలో బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శాంతియుత మార్గంలో రాష్ట్రానికి విభజన హామీలు అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాటానికి రాష్ట్ర ప్రజల మద్దతు కూడబెడతామని, అవసరమైతే ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఈ దీక్షను పల్లెపల్లెకు తీసుకువెళతామన్నారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ మంజూరు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి 2019 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలుగునాట ఉద్యమం రగిలిందంటే ఢిల్లీపీఠం కూడా కదలాల్సిందేనని, గతంలో ఆంధ్రులు చేసిన పోరాటం వృధాగా పోదని చెప్పారు. అయితే హింసాత్మక విధానాల ద్వారా కాకుండా శాంతియుత పద్దతిలో ధర్మపోరాటం సాగించి విభజన హామీలన్నీ అమలు చేసే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఢిల్లీలో పార్లమెంటు ముందు ఎన్నోసార్లు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదని, అందువల్లే నియోజకవర్గ స్థాయిలో ధర్మపోరాట దీక్షలను చేపట్టి చంద్రబాబు సాగించే పోరాటానికి ప్రజల మద్దతు కూడగడతామని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రులను అన్యాయం చేసిన ఏ నాయకుడు బాగుపడలేదని చెప్పారు. దీనికి చరిత్రలో ఎన్నో రుజువులు వున్నాయన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం దాన్ని నెరవేర్చుకోవాలన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ 16 వేల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని విభజించిన కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆధుకుంటుందని అనుకున్నామని, కానీ అడుగడుగునా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీయడం మరింత బాధ కలిగించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అప్పటి వరకు ధర్మపోరాటం ఆగదన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సమరశంఖాన్ని పూరించి గాంధీజీ అనుసరించిన శాంతియుత విధానంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. తమ నిరసన దీక్షలతో కేంద్రానికి కనువిప్పు కలిగిస్తామన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ మహిళా శక్తి కనె్నర్ర చేయకముందే కేంద్రం దిగి వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో మహిళా ఉద్యమాన్ని నిర్వహించి ప్రధాని మోదీ కళ్లు తెరిచేలా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్ కె జయరాజు, ఎ ఎంసి ఛైర్మన్ పూజారి నిరంజన్, డిప్యూటీ మేయర్ నాయుడు పోతురాజు, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ఛైర్మన్ శలా రాజాబాబు, మాగంటి రాంజీ, ఉపాధ్యాయుల సంఘ నాయకులు సుభాష్ చంద్రబోస్, పలువురు కార్పొరేటర్లు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు. కాగా ముస్లింలు అధిక సంఖ్యలో ప్రత్యేకంగా దీక్షకు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఉదయం నుంచి ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.