పశ్చిమగోదావరి

ఆకివీడులో ఆక్వా వన్ సెంటర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూలై 15: ఆకివీడులో ఆక్వా వన్ సెంటర్‌ను ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఆదివారం ప్రారంభించారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు సహకారంతో రొయ్యల, చేపల రైతులకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందుబాటులోకి తేవడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం. దేశంలో 25 సెంటర్లను ప్రారంభిస్తున్నారు. వీటిలో మొట్ట మొదటిది ఉండిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ ఆక్వా రైతాంగానికి మరిన్ని సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోందన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో ఏపీ ఆక్వా రైతులు ఫార్మాలిన్ వాడుతున్నారంటూ దుష్ప్రచారాలు చేశారని, దీనివల్ల ఆక్వా రైతాంగం ఆందోళనలో పడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని ఈ తరహా విధానాన్ని తిప్పికొట్టేందుకు చర్యలు ప్రారంభించారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతున్నారన్నారు. ట్రేడర్లు మాత్రమే ఇటువంటి పనులు చేస్తున్నారేగాని రైతులు చేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న కాలంలో రైతులు మరిన్ని మెళకువలు సాధించి మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నారని చెప్పారు. ఆక్వా సెంటర్ నిర్వాహకులు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయటంతోపాటు రైతులు, కొత్త మెళకువలు నేర్చుకోవడానికి సైంటిస్టులతో మాట్లాడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా బృహస్పతి టెక్నాలజీస్ ద్వారా ఆక్వా వన్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హేచరీల నుంచి జయంతిరోహుతోపాటు ఇంప్రూవుడ్ సీడ్‌ను ఈ కేంద్రాల ద్వారా నేరుగా రైతులకు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎంపీపీ నౌకట్ల రామారావు, డీసీ ఛైర్మన్ తోట ఏడుకొండలు పాల్గొన్నారు.

ఎడతెరిపిలేని వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు
వేలేరుపాడు, జూలై 15: గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వేలేరుపాడు మండలంలోని అన్ని వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రైతుల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతోంది. ఈ విధంగా ఈ నెలలో సంతృప్తిగా వర్షాలు పడుతున్నాయంటే అన్ని పంటలకు శుభ సూచకమేనని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. గతంలో వర్షా కాలంలో కూడా వర్షాలు పడకుండా అనంతరం సెప్టెంబర్ నెలలో కురియటంతో పంటలకు ఇబ్బందికర వాతావరణం నెలకొనేదని, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ విధంగా జూన్, జూలై నెలలో సంతృప్తికరంగా వర్షాలు పడితేనే అన్ని రకాల పంటలు అనుకున్న రీతిలో దిగుబడి సాధించగలమనే భావన రైతాంగంలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తమ చెరువులు, గుంతలు నిండి ఎంతో ఆనందమేస్తోందని, ఇదిలా ఉంటే..వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు ఎన్నో గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్దవాగు, ఎత్తువాగు, టేకుపల్లి వాగు, నేళ్లవాగులు ఎడతెరిపిలేకుండా ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు తమ గ్రామం నుంచి మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే..అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా మంచి నీటి పథకాలు పనిచేయకపోవటంతో మంచినీటి కోసం మండలంలోని దరిదాపు అన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో బోర్లలోను, మంచినీటి బావుల్లో క్లోరినైజేషన్ చేయాల్సిన పంచాయతీ అధికారులు కనిపించటం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో మంచినీటి పథకాలను పునరుద్ధరించటం, క్లోరినైజేషన్ వంటి చర్యలు చేపట్టడంతోపాటు వీధి దీపాలను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.