పశ్చిమగోదావరి

పల్లపు ప్రాంతాలు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూలై15: గత పది రోజులుగా వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం కురిసింది. మండలంలో 61.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుండి కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో జన జీవనం స్తంభించి పోయింది. భారీ వర్షం కారణంగా మండలంలోని కేతవరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామంలో ఎస్సీ పేట ముంపునకు గురైంది. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరిపోయింది. పల్లపు ప్రాంతం కావడంతో పేట అంతా ముంపునకు గురికావడం, రహదార్లు సైతం నీట మునిగాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ జివివి సత్యనారాయణ హుటాహుటిన వీఆర్వో గఫూర్ తదితరులను అప్రమత్తం చేసి, గ్రామ పంచాయతి సహకారంతో జేసీబీ ఏర్పాటు చేసి ఎస్సీ పేటలో నిలచి పోయిన వర్షపునీటిని సాయంత్రానికి దగ్గరలోని కాలువలోకి మళ్లించడంతో దళితులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని ఎ పోలవరం పంచాయతీ శివారు చిన్నంవారిగూడెంలో గంగానమ్మ కొలువై ఉన్న భారీ వేప వృక్షం నేలకొరిగింది. పక్కనే ఉన్న మాదాసు సత్యనారాయణ ఇంటిపై చెట్టు కూలిపోవడంతో ఇంటి వరండా పందిరి రేకులు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చెట్టు కూలడంతో ఇంట్లో వారు ఎటువంటి ప్రమాదానికి గురి కాలేదు. తెల్లవారు ఝాము 5 గంటలకే ఇంటి యజమాని మాదాసు సత్యనారాయణ పాలుతీసేందుకు బయటకు వెళ్లడం, ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆరుబయట పనులు చేసుకోవడానికి ఉపక్రమించడంతో వారు చూస్తుండగానే చెట్టు కూలిపోయింది. దీనితో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ వేప చెట్టు వయస్సు 200 సంవత్సరాలు ఉంటుందని, చెట్టుకింద శ్రీ గంగానమ్మ అమ్మవారు కొలువై ఉండటంతో అమ్మవారికి భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారని గ్రామస్థులు చెప్పారు. కాగా వర్షాల కారణంగా మండలంలో జల్లేరు, బయనేరు, కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు గతంలో కొట్టుకు పోయిన డైవర్షన్ రోడ్డులో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డైవర్షన్ రోడ్డు గండి పూడ్చే అవకాశం ప్రవాహం ఇవ్వడం లేదు. మాతన్నగూడెం వద్ద జల్లేరు వంతెన వద్ద కూడా భారీ వరద నీరు జల్లేరులో ప్రవహిస్తోంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి తూర్పున బయనేరు వాగు కూడా ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా డెడ్ స్టోరేజ్‌లో ఉన్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చి చేరుతోంది. జల్లేరు వాగుతోపాటు ఎర్రకాలువ, సంఘం వాగుల్లో కూడా వరద నీరు వస్తుంటంతో ప్రాజెక్ట్‌లోకి 3,500 క్యూసెక్స్ వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇక జంగారెడ్డిగూడెం పట్టణంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. అశ్వారావుపేట రోడ్డు, కొవ్వూరు రోడ్డు, బుట్టాయగూడెం రోడ్డు, శ్రీనివాసపురం రోడ్డు, ఏలూరు రోడ్లపై వరద నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఎడతెరిపి లేని వాన కారణంగా ఆదివారం ప్రజల ఇళ్ళకే పరిమితమై పోయారు. ఈ వర్షం రైతులకు మేలు చేస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి నాట్లు వేసుకునేందుకు అదును చిక్కిందన్నారు. కూరగాయలు, అరటి, మొక్కజొన్న, చెరకు వంటి పంటలకు, పామాయిల్, జమాయిల్, కొబ్బరి వంటి తోటలకు కూడా ఈ వర్షం మేలు చేస్తుందన్నారు. అన్ని గ్రామాలలోను విఆర్‌ఒలను అప్రమత్తం చేసామని, చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రమాదం లేదని తహశీల్థార్ జివివి సత్యనారాయణ తెలిపారు.