పశ్చిమగోదావరి

లంక గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, ఆగస్టు 17: గోదావరి నది ఉగ్ర రూపం దాలుస్తుండటంతో ఆచంట నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం వద్ద పుష్కర స్నాన ఘట్టాలు నీట మునిగాయి. దీంతో ఏటిగట్టుకు గోదావరి మధ్యన అనధికారికంగా వేసిన రొయ్యల చెరువులు నీట మునిగాయి. ఇప్పుడిప్పుడే గోదావరి లంక గ్రామాలైన అయోధ్యలంక, పుచ్చల్లంక, కరుగోరుమిల్లి లంక, పెదమల్లం లంక, ఆనగార్లంక, రావిలంక, మర్రిమూల, కోడేరుపల్లిపాలెంలో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. దీంతో అధికారులు ముందస్తుగా పడవలపై నిత్యావసర సరుకులైన బియ్యం, గ్యాస్ సిలెండర్లు, పంచదార, కందిపప్పులను తరలించారు. వరద ఉధృతి పెరిగితే లంక గ్రామాల ప్రజలకు వీటిని అందజేస్తారు. వరద పరిస్థితిని నర్సాపురం ఇన్‌ఛార్జి ఆర్డీవో వైవి సత్యనారాయణ పరిశీలించారు. కోడేరు రేవువద్ద పరిస్థితిని పరిశీలించిన ఆయన వరద ఉధృతి పెరుగుతున్నందున రెవెన్యూ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం వద్ద ఆర్‌ఐ, వీఆర్వోలు, పోలీసు కానిస్టేబుల్స్‌ను అందుబాటులో ఉంచారు. ఆచంట తహసీల్దార్ అయోధ్యలంక, పుచ్చలంక, మర్రిమూల గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. గోదావరి వరద వస్తే పాములు, విష కీటకాల ప్రమాదం ఉన్నందున వైద్యాధికారులు వెంటనే లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి పాముల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లంక గ్రామాల ప్రజలు కోరారు. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతున్నందున కిరోసిన్ కూడా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. కాగా శనివారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే లంక గ్రామాల నుంచి బయటకు, బయట గ్రామాల నుంచి లంక గ్రామాలకు వెళ్లే నాటు పడవలను నిషేధించారు. దీంతో లంక గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలో వారు ఉన్నారు.