పశ్చిమగోదావరి

ముంచుకొస్తున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 17: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాల ఫలితంగా ముంచుకొస్తున్న వరద భయం గుప్పెట్లో పశ్చిమ ఏజన్సీ చిక్కుకుపోయింది. శుక్రవారం కూడా వర్షాల జోరు సాగటంతో మధ్యాహ్నం నుంచి పరిస్ధితి కొంత అదుపుతప్పుతూ వస్తోంది. రాత్రి సమయానికి కూడా గోదావరి ఉధృతి అంతగా తగ్గకపోవటంతో జిల్లా అంతటా అప్రమత్తత ప్రకటించారు. గోదావరి పరివాహకప్రాంతాల్లో అధికారులంతా ఎప్పటికప్పుడు పరిస్ధితిని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగం ఆదేశాలు జారీచేశారు. మరోవైపు జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. కాగా పశ్చిమ ఏజన్సీ మాత్రం పూర్తిస్దాయిలో భయంగుప్పెట్లో చిక్కుకుపోయిందని చెప్పాలి. పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో దాదాపు 49 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల మరపడవలు ఏర్పాటుచేసి కొంతమేరకు రాకపోకలు సాగిస్తున్నా వరద తగ్గుముఖం పట్టకపోవటంతో ఈపరిస్దితి ఎంతవరకు కొనసాగుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఇక పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని నిత్యం సందర్శించేందుకు వస్తున్న సందర్శకులను శుక్రవారం వరద ప్రమాదం నేపధ్యంలో వారిని వెనక్కిపంపించివేశారు. ఏజన్సీ పరిధిలో వాగులు, వంకలు ఏనిముషంలో పొంగిపొర్లుతాయోనన్న ఆందోళన మాత్రం కొనసాగుతోంది. దాదాపుగా గత పుష్కరాల అనంతరం ఈస్ధాయిలో గోదావరి ఉగ్రరూపం దాల్చటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. వేలేరుపాడు నుంచి కొవ్వూరు వరకు తీరప్రాంతం అంతా భయంగుప్పెట్లోనే చిక్కుకుపోయింది. ఏనిముషంలో గోదావరి విరుచుకుపడుతుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. అయితే గోదావరి ఉధృతి శుక్రవారం ఉదయంతో పోలిస్తే కొంత నెమ్మదించినా శబరి వరదఉధృతి వచ్చి కలవటంతో ప్రమాదకర పరిస్దితులు కొనసాగుతున్నట్లే భావించాల్సి ఉంటుంది. ధవళేశ్వరం వద్ద ఉదయం 11.75 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 13.40 అడుగులకు చేరిపోవటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి సమయానికి నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం వద్దకు గోదావరి చేరిపోవటంతో ఎప్పటికప్పుడు పరిస్దితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ మట్టం మరింత పెరిగితే మాత్రం ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం మండలంలో కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో ఏజన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించేందుకు విజయవాడ నుండి బస్సుల్లో వచ్చినవారిని అధికారులు వెనక్కి పంపించివేశారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వారిని కూడా ప్రాజెక్టు ప్రాంతం వద్దకు వెళ్లకుండా నిలిపివేశారు. ఇక ఏజన్సీ ప్రాంతంలో రెండు లాంచీలు ఏర్పాటుచేసి రాకపోకలకు కొద్దిపాటి వెసులుబాటు కల్పించారు. మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. వీరితోపాటు వైద్యబృందాలు కూడా ఏజన్సీ గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు రంగంలోకి దిగాయి. ముందుజాగ్రత్త చర్యగా నిత్యావసర వస్తువులను పెద్దసంఖ్యలో గ్రామాలకు చేర్చారు. గురువారం సాయంత్రం నుంచే ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో కూడా పరిస్దితి ఆధ్వాన్నంగా మారిపోయింది. కోయిద-వేలేరుపాడు మధ్య ఎద్దువాగు, నేలవాగు పొంగిపొర్లుతూ రహదారులపైకి నీరు చేరిపోవటంతో అక్కడ ఉన్న కాజ్‌వే మునిగిపోయింది. దీంతో పోలీసుపికెట్ ఏర్పాటుచేశారు. రుద్రంకోట-వేలేరుపాడు మధ్య రహదారిపైకి కూడా వరదనీరు చేరిపోయింది. దీంతో అత్యవసర రాకపోకల కోసం నాటుపడవలను సిద్ధం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి వేలేరుపాడులో మకాం వేసి పరిస్దితిని సమీక్షిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందికలగకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మండల స్దాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని అన్నిగ్రామాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. మండల పరిధిలోని పంటపొలాలు నీటమునిగాయి. ప్రధానంగా ప్రత్తి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇక కుకునూరు మండలంలో కూడా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాచరం-కుకునూరు మధ్య గుండేటి వాగు పొంగిపొర్లుతుండటంతో అక్కడ ఉన్న కాజ్‌వే మునిగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముత్యాలంపాడు వద్ద ఉన్న బ్రిడ్జి కూడా మునిగిపోయింది. పంటపొలాల్లోకి వరదనీరు చేరిపోయింది. ఐటిడిఎ పిఓ హరీంధ్రప్రసాద్ కుకునూరులో మకాం వేసి పరిస్దితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇన్నాళ్లు కురిసిన వర్షాల ప్రభావం ఇప్పటికే ఏజన్సీపై ప్రమాదకరంగా మారిపోగా ప్రస్తుతానికి వర్షాల జోరు ఆగితే మేలని మన్యంవాసులు వేడుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
*అధికారులకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, ఆగస్టు 17: గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంతంలోని మండలాల గ్రామపంచాయితీ కార్యదర్శులు, ఇఓఆర్‌డిలు, ప్రత్యేకాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించి ఈగలు, దోమలు వ్యాపించకుండా ముందస్తు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, పెనుగొండ, యలమంచిలి, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర మండలాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో పందులు, కుక్కలు, చెత్తకుప్పలు, ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఈవిషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత గ్రామపంచాయితీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టరు హెచ్చరించారు. గ్రామాల్లో ఇంటింటనుండి చెత్తసేకరణకు 1604 గ్రీన్ వాహనాలను మంజూరు చేశామని, వాటిలో ఇంకా 434 అయా కంపెనీల నుండి సరఫరా కావాల్సి ఉందన్నారు. వచ్చేవారంనాటికి అందజేయాల్సిన 123 వాహనాలను అందించనిపక్షంలో సంబంధిత ఏజన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లు నిర్మాణంలో తీవ్రజాప్యం చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈవిషయంలో నిర్మాణాలకు గతవారంలో ఎటువంటి చెల్లింపులు చేయని 24 మండలాలకు చెందిన అధికారులకు షోకాజ్‌నోటీసులు జారీ చేయాలని డిపిఓను ఆదేశించారు. ఈనెలాఖరునాటికి ఈ షెడ్ల నిర్మాణం పూర్తిచేయటంతోపాటు చెత్తసేకరణ సమాచారం తెలుసుకునేందుకు ప్రతి ఇంటికి అమర్చిన ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్‌ల పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిపిఓ వి నాగార్జునసాగర్, డిఎల్‌పిఓలు, ఇఓపిఆర్‌డిలు పాల్గొన్నారు.