పశ్చిమగోదావరి

ఉద్రిక్తతకు దారితీసిన కలెక్టరేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 20 : విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని, హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్ ( ఎస్ ఎఫ్ ఐ) ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు, విద్యార్ధి బృందం కలెక్టరేట్‌కు నిరసన ప్రదర్శన చేస్తూ చేరుకున్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలుచేశారు. అక్కడ ఏర్పాటుచేసిన ఇనుప ముళ్ల కంచెలు, బారికెడ్లను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్ధులను పోలీసులు, సి ఆర్‌పి ఎఫ్ బృందం అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్దులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే అరెస్టు చేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లనీయకుండా 18 మంది విద్యార్ధి సంఘ నాయకులను అరెస్టు చేసి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళననుద్దేశించి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి వై రాము, జిల్లా కార్యదర్శులు ఎం శివరాజు, పి సాయికృష్ణ, జిల్లా అధ్యక్షులు మణికంఠ, అనిల్‌లు మాట్లాడుతూ రెసిడెన్షియల్‌గా మారుస్తామనే పేరుతో జిల్లాలో 56 బిసి హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్‌లో వున్న మెస్ బిల్లులు, కాస్మోటిక్స్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో మరమ్మత్తులు నిర్వహించాలన్నారు. విద్యార్ధుల డిమాండ్ వున్న నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో నూతనంగా కాలేజీ, సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరులో డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ హాస్టల్, బుట్టాయిగూడెం మండలంలో ప్రభుత్వ ఐటి ఐ కళాశాల నూతన భవనాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, మెనూ పెంచాలన్నారు. ఎయిడెడ్, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించాలని చెప్పారు. ఏలూరు సిటీ, బుట్టాయిగూడెం, కామవరపుకోట మండలాల్లో డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌చేశారు. తణుకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లీజు సమస్యను పరిష్కరించకపోవడం వలన ప్రతీ సంవత్సరం ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఫండ్స్ మంజూరు కావడం లేదన్నారు. వెంటనే లీజు సమస్య పరిష్కరించాలని, జీవో 35నురద్దు చేయాలని కోరారు. ఉండి, తాడేపల్లిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షల 60 వేల మంది విద్యార్ధులు లబ్ధిపొందుతున్న మధ్యాహ్న భోజన తయారీ పనిని ప్రైవేటుసంస్థలకు అప్పగించకుండా పాత పద్దతిలోనే కొనసాగించాలని, పది రూపాయల మధ్యాహ్న భోజనానికి మెస్ ఛార్జీ పెంచి నాణ్యమైన భోజనం అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఎస్ ఎఫ్ ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

హడలెత్తించిన కరెంటు తీగలు
కాళ్ల, సెప్టెంబర్ 20: కరెంటు వైర్లు ప్రజల్ని భయపెడుతున్నాయి. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలోని పెట్రోలు బంక్ సమీపాన రాష్ట్రీయ రహదారి పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లు ప్రజల్ని హడలెత్తించాయి. గురువారం రాత్రి ఒక్కసారిగా విద్యుత్ తీగలు చెట్టుకు తాకడంతో చెట్టు అంటుకుంది. దీంతో సమీప ప్రాంత ప్రజలు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక రహదారిపై వస్తున్న వాహనదారులు సైతం పరుగులు తీశారు. కరెంట్ తీగలు తగలబడిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందారు. అయితే విషయాన్ని అటుగా వెళ్తున్న ప్రజలు విద్యుత్ శాఖాధికారులకు తెలిపారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల కాలంలో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రజల్ని భయపెడుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు వేలాడుతున్న తీగలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

రైల్వే బోగీలను శుభ్రపర్చిన సిబ్బంది
ఏలూరు, సెప్టెంబర్ 20 : రైల్వే శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో గురువారం రైల్వేస్టేషన్ మాస్టర్ ఎవి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో పలు రైళ్లను నిలుపుదల చేసి శుభ్రత లేని బోగీలను పరిశుభ్రపరిచారు. టాయిలెట్లను పరిశీలించారు. నీటి సౌకర్యంపై ఆరా తీశారు. ప్రయాణీకులను అడిగి సౌకర్యాలపై వివరణ కోరారు. ఫిర్యాదులను నమోదు చేశారు. కార్యక్రమంలో రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ కె సురేష్‌కుమార్, చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం నానాజి, అధికారులు ఎవి రావు, ఎ జాన్ విజయ్, ఎస్‌కె హుస్సేన్, పి శ్రీరాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.