పశ్చిమగోదావరి

కొల్లేరులో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 16 : కొంతకాలంగా ప్రశాంతంగా వున్న కొల్లేరు గ్రామాన్ని ఏలూరు మండలం మొండికోడులో రగడ నెలకొంది. ఈ గ్రామంలో దాదాపు 700 ఎకరాలు ప్రభుత్వ భూమి పెద్దల స్వాధీనంలో వుంది. ఆ భూమిని పంచాలంటూ గత నెలలో ఎస్‌సి, బిసి, ఎస్‌టి పేదలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అయిదు రోజులపాటు ధర్నా నిర్వహించారు. ఆ తరుణంలో తహశీల్దార్ కెవి చంద్రశేఖరరావు పరిశీలిస్తామని, ఆందోళన విరమించాలని పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ఆ భూముల్లో పెద్దలు దున్నటానికి ప్రయత్నాలు జరిపారు. సాగు చేసుకునేందుకు పనులను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న పేదలు ఆ భూముల్లోకి వెళ్లి సాగును అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్యన వాదోపవాదాలు, ఘర్షణ నెలకొంది. ప్రభుత్వ భూములు కాబట్టి తమకు ఇవ్వాలంటూ పేదలు పెద్దలను నిలదీశారు. మాస్వాధీనంలో వున్న భూములను మీకెందుకు ఇస్తామంటూ వారు ఎదురు తిరిగారు. దీనితో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు పెద్దలతోను, ఇటు పేదలతోను చర్చలు జరిపి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేశారు. సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ఉన్నతాధికారులను కోరారు.
గ్యాస్ పైపులైన్ పనులు అడ్డుకున్న గిరిజనులు
జీలుగుమిల్లి, నవంబర్ 16: గ్యాస్ ఇండియా ట్రాన్స్‌పోర్టు లిమిటెడ్ ఆధ్వర్యంలో మండలంలో బర్రింకలపాడులో జరుగుతున్న గ్యాస్ పైపులైన్ పనులను కొందరు గిరిజనులు అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్యాస్ పైపులైన్ తాటియాకులగూడెం రెవెన్యూ పరిధిలోని 15/1 సర్వేనెంబరులోని కాకా లక్ష్మణరావు, తదితరులకు చెందిన వ్యవసాయ భూముల్లో నిర్మిస్తున్నట్టు తెలిపారు. పైపులైన్ నిర్మాణంలో భూముల్లో వేసిన పంటలను తొలగించి, సంబంధిత రైతులకు నష్టపరిహారం అందిస్తున్నారు. కానీ కాకా లక్ష్మణరావు తదితర రైతులకు ఎటువంటి నష్టపరిహారం అందించకుండా, పైపులైన్ నిర్మాణం చేస్తుండటంతో గిరిజన రైతులు పనులను అడ్డుకున్నారు. రైతులు గిరిజన నాయకుడు చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సమాచారం తెలుసుకున్న గ్యాస్‌లైన్ సంస్థ ప్రతినిధులు స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో రైతులతో చర్చించి, తమకు భూ యజమానుల వివరాలు సకాలంలో తెలియకపోవడంతో నష్టపరిహారం చెల్లించలేక పోయామని, భూముల యజమానులకు చెందిన ధ్రువపత్రాలను అందజేస్తే వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడంతో, వివాదం సద్దుమణిగింది.
ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ పైపులైన్ వెళ్లే భూముల రైతులకు ఇచ్చే నష్ట పరిహారం చాలా తక్కువగా ఉందని, నష్ట పరిహారాన్ని గణనీయంగా పెంచాలని కోరారు. దీనిపై సంస్థ అధికారి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ జీవోల ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని, పైపులైన్ నిర్మాణం జరిగే భూముల రైతులకు 2013లోనే నోటీసులు జారీచేశామని, సాంకేతిక కారణాల వలన కొందరు రైతులకు నోటీసులు అందించలేకపోయామని తెలిపారు. ఈకార్యక్రమంలో గిరిజనరైతులు చిర్రి నాగేశ్వరరావు, కాకా లక్ష్మణరావు, జాలా సీతారాముడు, మామిళ్ళ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.