పశ్చిమగోదావరి

విధి నిర్వహణలో శ్రద్ధలేక కుంటుపడుతున్న పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 16 : విధి నిర్వహణలో శ్రద్ధ పెట్టిన చోట పనులు సంపూర్ణంగా జరుగుతున్నాయని అది కొరవడిన చోటే పనులు కుంటుపడుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ పంచాయితీల ప్రగతి తీరుపై డిఎల్‌పివోలు, ఇవోఆర్‌డిలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి నుండి చెత్త సేకరణకు నిర్ధేశించిన కార్యక్రమం కొన్ని గ్రామాల్లో నూరుశాతం జరుగుతున్నప్పుడు మిగిలిన గ్రామాల్లో ఎందుకు అమలు కావడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇంటింటి నుండి చెత్త సేకరించి ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్లను స్కాన్ చేయడంలో రాళ్ల్లకుంట, పొలసానపల్లి, వెంకట కృష్ణాపురం, రామశింగవరం, గంగన్నగూడెం, ముప్పవరం వంటి గ్రామాల్లో నూరుశాతం జరుగుతున్నప్పుడు కొవ్వలి, సోమవరప్పాడు, చాటపర్రు, మల్కాపురం, లక్ష్మీపురం, చెట్టున్నపాడు తదితర గ్రామాల్లో కేవలం 4 నుండి 10 శాతం లోపే జరుగుతున్నాయన్నారు. ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగింగ్ స్కానింగ్ చేయడంలో 50 శాతం కన్నా తక్కువ కనపడిన గ్రామాలకు చెందిన పంచాయితీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ఇవో ఆర్‌డిలకు పంచాయితీ కార్యదర్శులపై పట్టు లేదని, దీని మూలంగానే గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు ఇతర అభివృద్ధి పనులు ఆశించిన రీతిలో ముందుకు వెళ్లడం లేదన్నారు. జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసుల్లో 50 శాతం ఏలూరు రూరల్ మండలం నుండే నమోదయ్యాయన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో చెత్త సేకరణకు వినియోగిస్తున్న గ్రీన్ వెహికల్స్‌కు ఏర్పడే మరామ్మత్తులను తదితరాలను సరిచేసేందుకు నాలుగు రెవిన్యూ డివిజన్లలో సంబంధిత కంపెనీ నిర్వాహకులతో సర్వీసు సెంటరు ఏర్పాటు చేయాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. గ్రీన్ వెహికల్స్‌కు సంబంధించి బ్యాంకు రుణాల నెలవారీ చెల్లింపులో జాప్యం తగదని ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎల్ ఇడి బల్బుల ఏర్పాటుకు ఇంకా వేయవలసిన మూడోవైర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పాలకోడేరు మండలంలో మూడుపంచాయితీలకు సంబంధించి రూ.1.35 లక్షలు ఇ ఎం ఐ బకాయి వుందని, సంబందిత సొమ్మును ఆయా ఇవో ఆర్‌డి, పంచాయితీ కార్యదర్శి జీతాల నుండి చెరి సమానంగా చెల్లింపుచేసి తదుపరి విడతలో దానిని సరిచేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 590 గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ షెడ్ల నిర్మాణాలుపూర్తికాగా మరో 300 వరకూ పూర్తి చేయవల్సి వుందన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, డిఎల్‌పివోలు, ఇవోఆర్‌డిలు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్-165 బైపాస్‌కు గెజిట్ విడుదల
*దశాబ్ధాల సమస్య పరిష్కారం
*ఎంపీ గోకరాజు గంగరాజు
భీమవరం, నవంబర్ 16: జాతీయ రహదారి 165 ( పామర్రు-దిగుమర్రు) బైపాస్ రహదారికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ జాతీయ రహదారిని నాలుగులేన్ల రహదారిగా కేంద్రం అభివృద్ధి చేస్తుంది. ఎన్‌హెచ్ 165 బైపాస్‌కు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ప్రజలు పడుతున్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లావాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇప్పటి వరకు పట్టణాలు, గ్రామాల మధ్య నుంచి వెళ్లిన జాతీయ రహదారి-165కు బైపాస్‌ను పట్టణాలు, గ్రామాలకు శివారున భూమి సేకరణ చేసి అభివృద్ధి చేస్తారని నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. రహదారి విస్తరణతోపాటు ఆకివీడు, ఉండి, భీమవరం ప్రాంతాల్లో బైపాస్ ఏర్పాటుచేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయన్నారు. జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కారీతో మాట్లాడటం జరిగిందని, శంకుస్థాపనకు ఆయన్ని ఆహ్వానిస్తానని ఎంపీ చెప్పారు.
రాష్ట్రంపై దుష్టత్రయం చూపు పడకూడదని కోరుకున్నా
చినవెంకన్నను దర్శనం చేసుకున్న మంత్రి జవహర్
ద్వారకాతిరుమల, నవంబర్ 16: రాష్ట్రంపై దుష్టత్రయం చూపు పడకుండా ఉండాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని చినవెంకన్నను వేడుకున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి శుక్రవారం రాత్రి ఆయన పాదయాత్రగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, గంటా బాబ్జి తదితరులు ఆలయం వద్ద స్వాగతం పలికారు. అలాగే ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఈవో పెద్దిరాజు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. అనంతరం మంత్రి జవహర్ విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన, వైసీపీ, బీజేపీలు ముప్పేట దాడిచేస్తూ రాష్ట్రాన్ని అస్థిరపర్చాలని కుట్రలు పన్నుతున్నట్టు తెలిపారు. ఒకపక్క కోడికత్తి, మరో పక్క కుట్ర రాజకీయాలతో రాష్ట్రాన్ని విభజించి ఏదోవిధంగా గందరగోళ పరిస్థితులు కలగజేయాలని దుష్టత్రయం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆ చినవెంకన్న దీవెనల కోసం తాను పాదయాత్ర చేపట్టినట్టు ఆయన వివరించారు. చైతన్య యాత్రగా జరిగిన ఈ పాదయాత్రకు ప్రజలు పెద్దఎత్తున స్పందించారన్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.