పశ్చిమగోదావరి

భూసేకరణలో రైతులకు మార్కెట్ ధర చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 6: జిల్లాలో వివిధ పథకాల కోసం చేసే భూసేకరణలో రైతులకు రిజిస్ట్రేషన్ ధరలు కాకుండా మార్కెట్ ధరలు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కారణంగా భూములు కోల్పోనున్న పంగిడిగూడెం, పేరంపేట గ్రామాల రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. శిబిరం ఏర్పాటుచేసి నష్టపరిహారం ఎంత చెల్లించేదీ తేల్చి చెప్పేవరకు హైవే సర్వే చేసేది లేదంటూ అధికారులను అడ్డుకుని రైతులు నిరసన తెలిపారు. ఈ శిబిరాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపిన మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో 74 కిలో మీటర్లు ఈ హైవే నిర్మాణం జరుగుతుందని తెలుస్తోందని, దీనితో వందలాది ఎకరాల భూమి రైతులు కోల్పోవలసి వస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు, పైపులైన్లు, విద్యుత్ లైన్ల కోసం రైతులు సాగుభూములు కోల్పోయారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యం పండించేందుకు భూములు మిగలవన్నారు. జిల్లాలో ఈ హైవే నిర్మాణానికి 3,700 ఎకరాల భూమి అవసరం కాగా, వందలాది మంది రైతులు నష్టపోతారన్నారు. మండలంలోని దేవులపల్లి, గురవాయిగూడెం, కేతవరం, తిరుమలాపురం, పంగిడిగూడెం, పేరంపేట రైతులు భూములు కోల్పోనున్నారని చెప్పారు. వీరికి న్యాయం జరిగే వరకు రైతులకు వెన్నంటి ఉంటానని, సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముళ్ళపూడి శ్రీనివాసరావు, పెసరగంటి జయరాజు, కె.నాగేంద్రప్రసాద్, జి.వెంకటేశ్వరరావు, కోన గంగరాజు, మురళి, రైతు నాయకులు గోలి శ్రీనివాస్, పర్రెడ్డి సోమిరెడ్డి, కారుమూరి పిచ్చిరెడ్డి, నంద్యాల కృష్ణారెడ్డి, యర్ర శ్రీనివాసరెడ్డి, సింహాద్రి యుగంధర్‌రెడ్డి, గోలి రవీంద్రప్రసాద్, తొండాపు సత్తిరెడ్డి, అందుగుల మోహన్ మాండ్రు సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

దళితులకోసం కష్టించిన వ్యక్తి అంబేద్కర్
*అడిషనల్ డీజీపీ సునీల్‌కుమార్
లింగపాలెం, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ దళితుల కోసం ఎంతో కష్టించి పనిచేసిన వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డీజీపీ సునీల్‌కుమార్ అన్నారు. గురువారం ధర్మాజీగూడెం గ్రామంలోని మాలపేటలో ఏర్పాటుచేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అడిషనల్ డీజీపీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో దళితులకంటూ ఒక చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ అంబేద్కర్‌ను కొనియాడటం గర్వనీయమన్నారు. భారతదేశంలోనే దళితుల కోసం శ్రమించిన వ్యక్తి అంబేద్కర్ అంటూ ఆయన కొనియాడారు. మన దేశంలో గాంధీజీ గానీ, ఏ ఒక్కరూ దళితుడు నాయకుడు అవ్వాలని కోరుకోలేదని, దళితులు నాయకుడవ్వాలని, దళిత రాజ్యాంగం రావాలని, దళితపేటలకు ఒక గ్రామపంచాయతీని ఏర్పాటుచేసి ఆ గ్రామానికి చెందిన దళితుడే సర్పంచ్ కావాలని, దళిత మహిళలు, దళితులే వార్డు సభ్యులు అయినప్పుడే అంబేద్కర్ కలలు నెరవేరుతాయన్నారు. ఇతర దేశాల్లో నల్లజాతికి చెందినవారు కులంపై పోరాడి రాజ్యాధికారం పొందినప్పటికీ మన దేశంలో పొందలేకపోయారన్నారు. ఇప్పటికైనా దళితులు అగ్రకులాలకు బానిసలు కాకుండా తమ భవిష్యత్తుపై నిలకడగా తమ రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం కావడంతో ఏ ఒక్కరికీ తొత్తులు కాకుండా నీతి, నిజాయితీలతో మెలగాలన్నారు. దళిత గ్రామాల్లో దళితులే సర్పంచ్‌లు, దళితులే కాంట్రాక్టర్లు, దళితులే పరిపాలకులుగా దళిత ఉపాధ్యాయులు, దళిత ఉద్యోగులు పనిచేసిననాడే ఆ గ్రామానికి మంచి పట్టు ఉంటుందన్నారు. తాను దళిత కులంలో పుట్టి ఉన్నత విద్యనభ్యసించడం వల్లే ఈస్థాయికి చేరుకున్నానని, తాను అడిషనల్ డీజీపీ అయిన తరువాత తొలిసారిగా ఈ గ్రామానికి రావడం పట్ల ఆనందదాయకంగా ఉందన్నారు. తనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలకడం పట్ల ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా తన గ్రామానికి చెందిన ప్రజలతో ఆయన గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మోరంపూడి జగన్మోహనరావు, మాజీ సర్పంచ్ ఉప్పలపాటి ప్రసాద్, ఎంపీటీసీ రాజు, రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నూతులపాటి శ్రీనివాసరావు సారధ్యం వహించారు.

కాలువలోకి దూసుకెళ్లిన వ్యాన్
ఆకివీడు, డిసెంబర్ 6: అదుపుతప్పి వ్యాన్ కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన అజ్జమూరు-చెరుకువాడల మధ్య జరిగింది. భీమవరం నుండి కైకలూరు వెళ్తున్న ఆక్వా మందుల వ్యాన్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఉండి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు. సంఘటన జరిగిన సమయంలో జాతీయ రహదారి గుండా వెళ్తున్న వాహనదారులు అతన్ని కాపాడారు.

మద్దతు ధరకోసం రైతుల ఆందోళన
ద్వారకాతిరుమల, డిసెంబర్ 6: ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ప్రభుత్వ మద్దతు ధర సరిగా లభించడంలేదంటూ మండలంలోని జి కొత్తపల్లి కేంద్రం వద్ద గురువారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. అలాగే ఐకేపీ సిబ్బంది కమీషన్ల వ్యాపారం చేస్తున్నారని, పైగా గోనె సంచులను సక్రమంగా సరఫరా చేయడంలేదని, అరకొరగా ఇస్తున్న సంచులు చిల్లులతో అస్తవ్యస్తంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఐకేపీ సిబ్బంది స్పందిస్తూ అటు ప్రజాప్రతినిధులు, ఇటు రైతులతో మాటలు పడటం తమ వల్ల కావడం లేదన్నారు. ఇటీవల ఎంపీపీ వడ్లపూడి ప్రసాద్ తమను వేషాలేస్తున్నారా అంటూ పరుషంగా మాట్లాడారని, అలాగే రైతులు సైతం తమను కమీషన్ వ్యాపారులంటూ నిందలు వేయడం సబబుకాదని, తాము కూడా ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు. దీనితో రైతులకు, ఐకేపీ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల ప్రకారం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుకు క్వింటాలుకు రూ.1,750లు మద్దతు ధర ఇవ్వాల్సి ఉంది. అయితే జి కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుకు తాను అమ్మిన ధాన్యానికి సరిపడా మద్దతు ధర రాకపోవడంతో కేంద్రం సమీపంలో పలువురు రైతులు నిరాహార దీక్షకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ఐకేపీ సిబ్బంది రెడ్డి నాగదేవి, సాయిల మంగ, పొన్నపు జయలక్ష్మిలకు, రైతులకు మధ్య దీనిపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో ఏఎస్వో ప్రతాప్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ డీటీ పూర్ణ, ద్వారకాతిరుమల తహసీల్దార్ టీడీఎల్ సుజాత, వ్యవసాయాధికారి కె కమల్‌రాజ్ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని రైతులు, ఐకేపీ సిబ్బందితో చర్చించారు. దీనిపై ఐకేపీ సిబ్బంది రెడ్డి నాగదేవి మాట్లాడుతూ రైతులు తమకు అందిన ధాన్యానికి తేమ శాతం 17గా ఉండటంతోపాటు ధాన్యం ముక్క అవ్వకూడదని, ఇలా ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ మద్దతు ధరను పూర్తిస్థాయిలో ఇస్తున్నారన్నారు. అలాగే మిల్లర్లు తమకు సరఫరా చేసే గోనె సంచులు చిల్లులతో అస్తవ్యస్తంగా ఉండటం వల్ల రైతు పంటను మిల్లులకు తరలించే క్రమంలో తరుగు వస్తుందన్నారు. తమ కేంద్రంలో మిల్లర్లు వెనక్కి పంపిన ధాన్యం సుమారు 16 టన్నుల వరకు నిల్వ ఉందని, రవాణా ఖర్చులు సైతం తామే భరించాల్సి వస్తుందన్నారు. ఇదంతా విన్న అధికారులు గోనెసంచులను మిల్లర్లు సక్రమంగా సరఫరా చేయనప్పుడు తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు అందించిన సరుకుకు పూర్తిస్థాయిలో ధర చెల్లించాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రంపైనే ఉందన్నారు. మిల్లర్లు తిప్పి పంపిన ధాన్యాన్ని దెందులూరులోని బ్రాయిలర్ మిల్లుకు పంపించే ఏర్పాటుచేసి ఆ నగదును కూడా రైతుల అకౌంట్‌లో జమచేస్తామని హామీ ఇచ్చారు. దీనితో వివాదం సద్దుమణిగింది.